రాష్ట్రంలో కీలకశక్తిగా వైఎస్సార్‌సీపీ | Telangana YSRCP Plenary at LB Nagar | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కీలకశక్తిగా వైఎస్సార్‌సీపీ

Published Fri, Jun 23 2017 1:04 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

Telangana YSRCP Plenary at LB Nagar

రాజీ పడిపోయిన ఇద్దరు సీఎంలు
ఓటుకు కోట్లు కేసే నిదర్శనం.. తెలంగాణ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో సజ్జల, గట్టు
మాటలతో బురిడీ కొట్టిస్తున్న కేసీఆర్‌ రైతులకు బేడీలు వేసిన ఘనత ఆయనదే
కార్యకర్తలను వైఎస్‌ కుటుంబం మరవదు ప్రజలతో మమేకమవుదాం  
2024లో తెలంగాణలో అధికారం మనదే ఆ దిశగా కార్యాచరణకు తీర్మానం


సాక్షి, హైదరాబాద్‌:
‘‘ప్రజలంతా తన కుటుంబమని నమ్మి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడ్డ ఒకే ఒక నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన చనిపోతే గుండెపగిలి మరణించిన వారిలో అత్యధికం తెలంగాణ బిడ్డలే. తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కేసీఆర్, చంద్రబాబు ప్రజా అజెండాను పక్కన పెట్టి సొంత ఎజెండాలతో వెళ్తున్నారు. ఓటుకు కోట్లు కేసును సైతం పక్కన పెట్టి వారిద్దరూ రాజీపడ్డారు. ఇద్దరు చంద్రుల వైఫల్యాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పోరాటం చేసి నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.

2019లో తెలంగాణలో వైఎస్సార్‌సీపీ కీలక శక్తిగా మారబోతోంది’ ’అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్లీనరీ గురు వారం హైదరాబాద్‌లో జరిగింది. అన్ని జిల్లాల ప్రతి నిధులు భారీ ఎత్తున పాల్గొ న్నారు. వైఎస్‌ కుటుంబానికి అండగా ఉం టామని, తెలంగాణలో కీలకశక్తిగా అవతరించే దిశగా కృషి చేస్తామని ప్రతినబూనారు. పార్టీ పతా కాన్ని ఆవిష్కరించి, దివంగత వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం పలు అంశాలపై చర్చలు, ప్రసంగాలు, తీర్మానాలు చేశారు.

ప్రతి కార్యకర్తకూ అండగా వైఎస్‌ కుటుంబం: సజ్జల
పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్త, ప్రతి అభి మాని కుటుంబానికీ వైఎస్‌ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. తన తండ్రి మరణాంతరం చనిపోయిన కుటుంబాల కోసం అనేక త్యాగాలకు సిద్ధపడ్డ వైఎస్‌ జగన్, రాబోయే రోజుల్లోనూ ప్రతి కుటుంబానికీ అండగా నిలుస్తారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎంలు కేసీఆర్, చంద్రబాబు రాజీపడ్డారని ఆయన విమర్శించారు. ఓటుకు కోట్లు కేసే అందుకు నిదర్శనమన్నారు. రాజకీయాన్ని ఓ క్రీడగా మార్చారంటూ ఆవేదన వెలిబుచ్చారు. సీఎం కేసీఆర్‌ మాటలతో కాలం గడుపుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు బేడీలు వేసిన ఘనత ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు. ‘‘ప్రజలతో మమేకమవుదాం. వారి సమస్యలపై పోరాడదాం.

 2019 ఎన్నికల్లో తెలం గాణలో ప్రధాన పోటీదారుగా వైఎస్సార్‌సీపీ నిలు స్తుంది. 2024లో తెలంగాణలో అధికారం సాధించే దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిం చుకుని ప్రజల్లోకి వెళ్దాం. ఇందుకు అందరూ కంకణ బద్ధులు కావాలి. తెలంగాణలో పార్టీని బూత్‌ స్థాయిలో బలోపేతం చేసేలా అంతా కృషి చేయాలి’’ అని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పిలు పునిచ్చారు. జాతీయ స్థాయిలో అత్యంత బలమైన వ్యక్తులను ఎదిరించి, పార్టీని స్థాపించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ స్థాయికి ఎదగటం ప్రజలకు గర్వకారణమని సజ్జల అన్నారు. గత ఎన్నికల్లో ఏపీలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికా రానికి దూరమయ్యామనే విషయాన్ని గుర్తుం చుకోవాలన్నారు. 2019లో ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలీయమైన శక్తిగా తయారుచేసే అవకాశం ఉంటుందన్నారు.

వైఎస్సార్‌ ముద్ర చెరపలేనిది: గట్టు
తెలంగాణను ఎన్ని పార్టీలు పాలించినా, ఎందరు వెన్నుపోటుదారులు వచ్చిపోయినా ప్రజల గుం డెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని గట్టు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ప్రతి ఒక్కరి హృదయంలోనూ వైఎస్‌ బతికే ఉంటారన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే ప్రత్యేక స్థానముందంటే అది వైఎస్‌ ఘనతే. ప్రతి పేదవాడి గుండెచప్పుడు వైఎస్‌. ఆయన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కార్మికుడు, కర్షకుడు, అక్కాచెల్లెళ్లు, కూలీ నాలీ వంటి అన్ని వర్గాల ప్రజలకూ లబ్ధి చేకూర్చిన నాయకుడాయన.

 రైతు, మహిళ, విద్యార్థి, వృద్ధుడు... ఇలా అందరికీ ఆసరాగా నిలిచి సమాజాన్ని బలోపేతం చేశారు. వైఎస్‌ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల అత్యధిక లబ్ధి చేకూరింది తెలంగాణకే’’ అని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లు వైఎస్సార్‌సీపీని బూత్‌ స్థాయి నుండి పటిష్టం చేసి కీలక శక్తిగా ఎదుగుతామని గట్టు ధీమా వెలిబుచ్చారు. వైఎస్‌ ఆశయ సాధనకు జగనన్న నాయకత్వంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు.

జాతీయ అధ్యక్షునిగా వైఎస్‌ జగన్‌
వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షునిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలన్న ప్రతి పాదనను ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు గట్టు ప్రతిపాదిం చగా అన్ని జిల్లాల నుండి వచ్చిన పార్టీ ప్రతినిధులు చేతులెత్తి, ‘జై జగన్‌’ అంటూ ఆమోదం తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు కె.శివకుమార్, మతీన్‌ ముజాదుద్దీన్, జె.మహేందర్‌రెడ్డి ప్లీనరీలో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాసరావు, జి.రాంభూపాల్‌ రెడ్డి, ప్లీనరీ కో ఆర్డినేటర్‌ మాదిరెడ్డి భగవంతరెడ్డి, సీఈసీ సభ్యుడు సి.భాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు కేసరి అమృతసాగర్‌ (మహిళ), వెల్లాల రామ్మోహన్‌ (యువజన), కె. విశ్వనాథాచారి (విద్యార్థి), గంది హనుమంతు (రైతు విభాగం), ప్రఫుల్లారెడ్డి (డాక్టర్లు), ఎన్‌.రవికుమార్‌ (ఎస్సీ), శ్రీవర్ధన్‌ రెడ్డి(ఐటీ), బి.వెంకటరమణ (సేవాదళ్‌), ఎం.సరోజ్‌ రెడ్డి (లీగల్‌), పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డి (టీచర్స్‌), జిల్లా అధ్యక్షులు బొడ్డు సాయినాథ్‌ రెడ్డి (గ్రేటర్‌ హైదరాబాద్‌), బొబ్బిలి సుధాకర్‌రెడ్డి (రంగారెడ్డి), బెంబడి శ్రీనివాస్‌రెడ్డి (మేడ్చల్‌), జి.శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), బి.సంజీవ్‌రావు (మెదక్‌), కె.యాదయ్య (వికారాబాద్‌), బి.అనిల్‌కుమార్‌ (ఆదిలాబాద్‌), వి.సతీశ్‌ (మంచిర్యాల), డాక్టర్‌ కె.నగేశ్‌ (కరీంనగర్‌), ఎస్‌.రాజేశ్‌ (పెద్దపల్లి), సి.రాము (సిరిసిల్ల), ఎస్‌.ఇర్మియ (వరంగల్‌ అర్బన్‌), ఎన్‌.శాంతికుమార్‌ (వరంగల్‌ రూరల్‌), అప్పం కిషన్‌ (భూపాలపల్లి), ఎం.కల్యాణ్‌రాజ్‌ (జనగాం), కె.అచ్చిరెడ్డి (మహబూబాబాద్‌), లక్కినేని సుధీర్‌ బాబు (ఖమ్మం), కె.వెంకట్‌రెడ్డి (భద్రాద్రి కొత్తగూడెం), టి.భాస్కర్‌రావు (సూర్యాపేట), వి.వెంకటేశ్‌ (యాదాద్రి భువనగిరి), ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి (వనపర్తి), బీస మరియమ్మ (మహబూబ్‌నగర్‌) తదితరులు ప్లీనరీలో పాల్గొన్నారు.

తీర్మానాలివే...
సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పలు ముఖ్య తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆయా సమస్యలపై పోరాటాలు చేయాలని సూచిస్తూ వాటికి నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తీర్మానాలివే...

1. ‘‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు, తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిలను కఠినంగా శిక్షించాలి. ఈ ఉదంతంలో వారు అడ్డంగా దొరికినా కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
బ్రహ్మదేవుడే దిగొచ్చినా ఈ కేసు నుంచి బాబును కాపాడలేడని కేసీఆర్‌ స్వయంగా అన్నారు. కానీ ఆ తర్వాత సీఎంలిద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా, ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారు. 2019 ప్రజలు కేసీఆర్‌ను క్షమించరు. ఓటుకు కోట్లు కేసుపై సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి’’ అని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.

 2. విశ్వనగరమా వింత నగరమా! అంటూ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

3. లక్ష ఉద్యోగాలకు ఇచ్చింది 25 వేలేనంటూ యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్‌ తీర్మానం పెట్టారు

4. రాష్ట్రంలో సామాజిక న్యాయం, ఎస్సీ–ఎస్టీల సంక్షేమం కొరవడ్డాయంటూ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎన్‌.రవికుమార్‌ తీర్మానం ప్రవేశపెట్టారు

5. ‘అందని ద్రాక్షలా కార్పొరేట్‌ వైద్యం’ అంటూ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు ప్రఫుల్లారెడ్డి తీర్మానం పెట్టారు

6. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందంటూ ‘మహిళా భద్రత–సాధికారత’పై మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.

7. మైనారిటీలకు జరుగుతున్న అన్యాయంపై ‘సంక్షోభంలో మైనార్టీ సంక్షేమం, రిజర్వేషన్లు’ పేరిట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మతీన్‌ ముజాదుద్దీన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు

8. ‘మసకబారిన సింగరేణి కార్మికుల సంక్షేమం’ అంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.మహేందర్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు

9. ‘కలగా మిగిలిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు’ పేరిట పార్టీ సీఈసీ సభ్యుడు జి.రాంభూపాల్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు

10. ‘టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో అమలు–వైఫల్యాల’పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement