ఇక పక్కాగా భూముల లెక్క
► రాష్ట్రంలోని భూములన్నీ రీసర్వే.. రెవెన్యూ శాఖ కసరత్తు
► కొత్త ఏడాదికల్లా ప్రతి కమతానికి కొత్త సర్వే నంబర్
► బై నంబర్లు, సబ్‌డివిజన్లకు చెల్లు
► డీజీపీఎస్ పద్ధతిలో సర్వే చేపట్టే యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములన్నిం టినీ రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం సమాయ త్తమవుతోంది. ఆధునిక సాంకేతిక పద్ధతులతో అత్యంత పకడ్బందీగా ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి కమతానికి కొత్త సర్వే నంబర్ ఇస్తూ, ఎలాంటి కంగాళీ లేకుండా సర్వే చేపట్టేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు ప్రారం భించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం అందు బాటులో ఉన్న డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిష నింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో సర్వే చేయనున్నారు. ఇందుకు రూ.500 కోట్ల ఖర్చ యినా వెనుకాడబోమని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో రెవెన్యూ శాఖ కసరత్తు ఊపందుకుంది.
ఎలాంటి కంగాళీ లేకుండా..
తెలంగాణలో నిజాం హయాంలో భూముల సర్వే జరిగింది. 1936లో జరిగిన ఈ సర్వే ఆధా రంగానే లావాదేవీలు నడుస్తున్నాయి. దాదాపు 80 ఏళ్ల పాటు జరిగిన అనేక లావాదేవీల కారణంగా సర్వే నంబర్లు కంగాళీగా మారాయి. బై నంబర్లు, సబ్‌డివిజన్ల పేరుతో ఉన్న ఈ నంబర్ల ద్వారా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అసలు ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉందన్నది కూడా ఇదమిత్థంగా తెలియ డం లేదు. కొన్ని సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కన్నా ఎక్కువగా, కొన్నిచోట్ల తక్కువగా ఉంటోంది.
డివిజన్ల విషయంలోనూ పట్టాదారుల రికార్డులకు, క్షేత్రస్థాయిలోని భూమికి పొంతన లేకుండా పోయింది. దీంతో ఈ గందరగోళానికి స్వస్తి పలికి ప్రతి భూకమ తానికి ఓ సమగ్ర సర్వే నంబర్, పాస్‌పుస్తకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సర్వే ఆఫ్ ఇండియాతోపాటు దేశంలోని దాదాపు 25 అధీకృత సర్వే ఏజెన్సీలను కూడా వినియోగించుకోనుంది. సర్వే కోసం రాష్ట్రం లోని 20 వేల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల సహకారం కూడా తీసుకోనుంది. రాష్ట్రంలోని 10 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలుండగా, ప్రతి గ్రామంలో ఈ సర్వే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది.
ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డీజీపీఎస్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలోనే భూముల రీసర్వే చేయాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్న డిజిటల్ మ్యాప్‌లతో కూడిన లైడార్ సర్వే, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే (ఈటీఎస్) విధానం వంటి వాటిపై చర్చ జరిగినా డీజీపీఎస్ విధానమే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ డీజీపీఎస్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి మండలానికి 3–4 రోవర్లు పెట్టి సర్వే చేయాలని యోచిస్తున్నారు. ఈ యంత్రాల ఏర్పాటు కోసం రూ.40 కోట్లకు పైగా అవసరం అవుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేస్తోంది. దీంతోపాటు మానవ వనరుల నిర్వహణ కోసం, సర్వే ఏజెన్సీల సహకారం కోసం రూ.వందల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది.
మార్గదర్శకాలకు కమిటీ..
భూముల రీసర్వేకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఇందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. రంగారెడ్డి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు రఘునందన్, లోకేశ్‌కుమార్, వెంకట్రామిరెడ్డిలతోపాటు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, ముగ్గురు ఆర్డీవోలు, సర్వే, అటవీ శాఖల జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రీ సర్వేలో ఎదురయ్యే ఇబ్బందులు, కావాల్సిన మానవ వనరులు, యంత్రాలు, వాటి కొనుగోళ్లు, డీజీపీఎస్ కన్నా ఆధునిక పద్ధతి ఏదైనా ఉందా అనే దానిపై అధ్యయనం చేసి మార్గదర్శ కాలను ఖరారు చేస్తుంది.