గడప గడపకూ సర్కారు మందులు | The state government's drugs | Sakshi
Sakshi News home page

గడప గడపకూ సర్కారు మందులు

Published Wed, Jun 25 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

The state government's drugs

తెలంగాణ రాష్ట్రంలోని గడప గడపకు సర్కారు మందులు అందేవిధంగా కృషిచేస్తాం. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ని ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మారుస్తాం. ప్రతీమండలంలో నలుగురు వైద్యులతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటాం. వైద్యరంగాన్ని అభివృద్ధి చేసి హైదారాబాద్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతాం..                   
 - షాద్‌నగర్‌లో డిప్యూటీ సీఎం
 డాక్టర్ రాజయ్య
 
 షాద్‌నగర్ రూరల్ : తెలంగాణలోని ప్రతి మండలంలో నలుగురు డాక్టర్‌లతో నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అన్నారు. గురువారం రాత్రి 10:15గంటలకు ఆయన షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయని, ఆ సమావేశాలలో ప్రణాళికను సిద్ధంచేసి ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని ఆస్పత్రిని అభివృద్ధి చేసి ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని, గడప గడపకూ సర్కాలు మందులు అందేలా చూస్తామని అన్నారు. వైద్యరంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
 
 అదేవిధంగా అవుటర్ రింగురోడ్‌కు 10కిలోమీటర్ల పరిధిలో బీబీనగర్ వద్ద అన్ని హంగులతో నిమ్స్ ఆస్పత్రిని అభివృద్ధి చేశామని, త్వరలోనే అక్కడ వైద్యసేవలు మొదలవుతాయని తెలిపారు. నిమ్స్‌భీమిడి యూనివర్సిటీలో ఆరోగ్య కళాశాలను ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి హెల్త్ టూరిజంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంత్రి రాజయ్యకు వినతిపత్రం అందజేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.
 
 బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా రానున్న 5సంవత్సరాల కాలంలో రూ.లక్ష కోట్లు ఖర్చుచేస్తామన్నారు. ప్రతిపైసా క్షేత్రస్థాయిలో అందరికీ చేరేవిధంగా కృషిచేస్తామని చెప్పారు. రూ.50వేల కోట్లతో రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేయనున్నారని వెల్లడించారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామని చెప్పారు.
 
 హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుకు అన్ని వనరులను సమకూర్చి, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. పోలవరంలోని 7 మండలాలోని ముంపుగ్రామాలను రాజ్యాంగానికి విరుద్దంగా ఆర్డినెన్స్‌ను జారీచేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఆర్టికల్-3 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సిన కేంద్రం చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడుల ఒత్తిడితో జారీ చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వీర్లపల్లిశంకర్, వెంకట్రాంరెడ్డి, అందెబాబయ్య, రాంబల్‌నాయక్, ఎంఎస్ నటరాజన్, సలీం, ఆర్లయాదయ్యయాదవ్, మన్నెనారాయణయాదవ్, పరంధాములుయాదవ్, సుధాకర్, తుమ్మలపల్లికృష్ణయ్య, లింగారంపెంటయ్య, సిద్దలశ్రీనాధ్, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement