మరుగుదొడ్ల అవినీతిపై విచారణ జరిపించాలి
డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం
కరీంనగర్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిర్మాణంలోభారీ అవినీతి చోటుచేసుకుందని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని ఒక్క గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీలోనే సుమారు రూ.40లక్షల మేర అవినీతి జరిగిందని, దీనిని తాము నిరూపిస్తామన్నారు. 834 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, వాటిలో నిర్మించుకున్నవి 400 ఉండగా, వీటిపై బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. 23 మరుగుదొడ్లకు ఒకే ఇంట్లో రెండేసి పేర్లు వేసి నిధులు కాజేశారని, మరో తొమ్మిది ఈజీఎస్‌లో నిర్మించారని దొంగలెక్కలు చూపారని అన్నారు.
మంత్రి ఓఎస్డీ శ్రీనివాస్, సర్పంచ్, ఇంజినీరింగ్ అధికారులు కుమ్మకై ప్రభుత్వ ధనం కాజేశారని ఆరోపించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఉపసర్పంచ్‌తో పాటు 12 మంది వార్డు సభ్యులు వస్తే సమయం కేటాయించకపోవడం విచారకరమన్నారు. కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపట్టకపోతే లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో గంభీరావుపేట ఉపసర్పంచ్‌తోపాటు 12 మంది వార్డు సభ్యులు పాల్గొన్నారు.