మంచం పట్టిన తల్లి వద్ద పిల్లలు
ధర్మపురి: తల్లి మంచం పట్టింది. ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. గోరుముద్దలు తినిపించాల్సిన మాతృమూర్తి అచేతనావస్థలో పడి ఉంది. ‘అమ్మా..అమ్మా..’అంటూ ఆ పసిపిల్లలు పిలిస్తే చూడటంతప్ప దగ్గరకు తీసుకోలేని దైన్య పరిస్థితి. మరోపక్క చేతనైనంత వరకు వైద్యం చేయించిన భర్త.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కుటుంబం తమను ఆదుకునే దిక్కుకోసం ఎదురు చూస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బూర్గుపల్లెకి చెందిన సౌదాని రాజయ్య, కొమురమ్మ దంపతులు.
వీరికి కుమారుడు నాగేశ్ (6 సంవత్సరాలు), ఆల్య, అహల్య(6 నెలలు) కవలలు ఉన్నారు. రాజయ్య గొర్రెలు మేపుకుంటూ, కొమురమ్మ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 40 రోజుల క్రితం ఉదయం ఇంటి వద్ద ఇద్దరు పసికందులకు పాలు తాగిస్తుండగా... కొమురమ్మ ఒక్కసారి పక్కకు పడిపోయింది. ఒడిలో ఉన్న ఇద్దరు చిన్నారులు రోదిస్తుండగా.. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త రాజయ్య భార్యను లేపడానికి ప్రయత్నించాడు. కానీ, అచేతనావాస్థకు చేరింది. కాళ్లూచేతులు చచ్చుబడిపోయాయి. మాట్లాడటానికి ప్రయత్నించినా నోరు పెగలలేని పరిస్థితి. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనపై రాజయ్య షాక్‌కు గురయ్యాడు. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షించి ‘యూరో పెరాలసిస్’గా గుర్తించారు. ఈ జబ్బు వేలల్లో ఒకరికి వస్తుందన్నారు.
ఆస్పత్రిలో రూ. ఐదు లక్షలు ఖర్చు
కొమురమ్మ చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. ఆస్పత్రిలో చేరిన తొలినాళ్లలో ఒక్క ఇంజెక్షన్ రూ. 18,300 పెట్టి కొనుగోలు చేశాడు. ఇలా రోజుకు 4 ఇంజెక్షన్లు వేయాల్సి వచ్చింది. వరుసగా ఐదు రోజుల పాటు ఇలా ఇంజెక్షన్లు చేయించినా.. వ్యాధి నయం కాలేదు. 20 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించారు. పూర్తిగా నయం కావాలంటే మరో రూ. 5 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. అయితే, కొమురయ్య చేతిలో చిల్లిగవ్వలేదు. వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రినుంచి ఇంటికి తీసుకొచ్చారు. చెట్ల పసర్ల వైద్యం కోసం స్వగ్రామమైన నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దికుంటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
55 గొర్లెను అమ్మిన..
కొమురమ్మ వైద్యం కోసం చేతిలో డబ్బు లేకుండే. నా దగ్గరున్న 55 గొర్రెలు అమ్మగా.. రూ.2 లక్షల యాభై వేలు వచ్చినయి. మరో రూ.2.5 లక్షలు అప్పు చేసిన. మొత్తం రూ.5 లక్షలకు పైగా ఖర్చయింది. అయినా నయం కాలే. మరికొన్ని రోజులుంటే నయమైతదని డాక్టర్లు చెప్పారు. ఇక చేతిలో చిల్లిగవ్వ లేదు. కేసీఆర్ ఇచ్చిన 19 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. దిక్కులేక చెట్ల పసరు పోయిస్తున్న.
– రాజయ్య, భర్త
Comments
Please login to add a commentAdd a comment