భూమి చదును పనులు ప్రారంభిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు అంకురార్పణ జరిగింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 25 లక్షల మంది జన సమీకరణతో సెప్టెంబర్ 2న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, నేతలు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, సామ రంగారెడ్డి తదితరులు బహిరంగ సభాస్థలి వద్ద భూమి పూజ నిర్వహించారు.
వీరి వెంట కలెక్టర్ రఘునందన్‌రావు, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఉన్నారు. సుమారు 1,600 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలిరానున్న కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్, ఇతర సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. బుధవారం మంత్రివర్గ సహచరులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సభ నిర్వహణ ఏర్పాట్లను తక్షణమే మొదలు పెట్టాలని అన్నారు. దీంతో గురువారం ఆగమేఘాల మీద తరలివచ్చిన అధికార యంత్రాంగం, గులాబీ శ్రేణులు సభ ఏర్పాట్లను ప్రారంభించాయి.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభ సాక్షిగా కార్యకర్తల ముందుంచనున్నారు. ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో ఈ సభ నిర్వహణను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సభను విజయవంతం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధాన వేదిక, పార్కింగ్, మీడియా, మహిళలకు ప్రత్యేక గ్యాలరీ, బారికేడ్లు తదితర ఏర్పాట్ల గురించి కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీవోలు రవీందర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డిలు మంత్రుల బృందానికి వివరించారు. ఈ మేరకు రూపొందించిన మ్యాప్‌లను మంత్రులు పరిశీలించి పలు సూచనలు చేశారు. సభా వేదిక వెనుక భాగంలో ముఖ్యమంత్రి కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జన సమీకరణకు అనుగుణంగా..
సభాస్థలిని పరిశీలించిన మంత్రులు జన సమీకరణకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని నిర్దేశించారు. సభకు సులువుగా చేరుకునేలా నలుదిశలా రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రింగ్‌రోడ్డు నుంచి కొత్త కలెక్టరేట్‌కు వచ్చే ప్రధాన మార్గానికి మరమ్మతులు చేయాలని సూచించారు. ఔటర్ రింగ్‌రోడ్డు చేరువలోనే వాహనాలను పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment