బాబ్లీ గేట్లు ఎత్తడంతో దిగువకు ప్రవహిస్తోన్న నీరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కారు నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 1వ తేదీన దిగువకు 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఈ మేరకు గురువారం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏటా జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్సారెస్పీకి నీటిని విడుదల చేయాలి. అనంతరం అక్టోబర్ 28న బాబ్లీ గేట్లు మూసివేస్తారు.
అయితే గేట్లు మూసివేసిన తరువాత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ, బాబ్లీ ప్రాజెక్ట్ దిగువ పరీవాహక ప్రాంతాల్లో నీరు నిలవడం, ఆ నీరు ఎస్సారెస్పీకి చేరకపోవడాన్ని భర్తీ చేసేందుకుగాను, మార్చి 1వ తేదీన 0.6టీఎంసీల నీటిని బాబ్లీ నుంచి విడుదల చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో భాగంగా గురువారం నీటి విడుదల చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాజెక్ట్ ఈఈ రామారావు, సీడబ్ల్యూసీ నుంచి ఈఈ శ్రీనివాస్, మహారాష్ట్ర నుంచి నాందేడ్ ఈఈ సెటే, తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠకు తెర..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 1న 0.6 టీఎంసీల నీటి విడుదల చేపట్టాలి. అయితే బాబ్లీ ప్రాజెక్ట్‌లో నీరు లేదని ప్రస్తుతం నీటి విడుదల చేపట్టలేమని మహారాష్ట్ర అధికారులు ఎస్సారెస్పీ అధికారులకు లేఖ రాయడంతో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నీటి విడుదల చేపట్టాలని ఎస్సారెస్పీ అధికారులు ప్రతి లేఖ రాశారు. దీంతో బాబ్లీ నుంచి నీటి విడుదల చేపడుతారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సుప్రీం తీర్పు మేరకు త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నీటి విడుదల చేపట్టడంతో ఉత్కంఠకు తెర పడింది.
0.3 టీఎంసీల నీరు చేరే అవకాశం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువప్రాంతం నుంచి 0.3 టీఎంసీల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని గోదావరి పరీవాహక çప్రాంతాలను దాటుతూ నీరు రావాల్సి ఉండడంతో ఎస్సారెస్పీలోకి కనీసం సగం నీరు అయినా చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment