'వాటర్ గ్రిడ్ కు ఎన్ని నిధులైనా ఇస్తాం'
హైదరాబాద్ : వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు ఎన్ని కోట్ల నిధులైనా సమకూర్చేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమని సీఎం కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఆయన సోమవారం అధికారులతో వాటర్ గ్రిడ్ అంశంపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ పథకం వైపు దేశమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు.
ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 26 ప్యాకేజీలకు గాను 17 ప్యాకేజీలకు టెండర్ల ప్రక్రియ ముగిసిందని చెప్పారు. వాటర్ గ్రిడ్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ సంస్థలన్నీ వాటర్ గ్రిడ్ టెండర్లలో పాల్గొనేలా వెసులుబాటు కల్పిస్తామన్నారు. వాటర్ గ్రిడ్ సమగ్ర రిపోర్ట్పై నిపుణుల కమిటీ అభిప్రాయం కూడా తీసుకునే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.