- రూ.26 కోట్లకు ఉత్తర్వులు
- హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు నిధులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రక్రియ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ మినహా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రతిపాదించిన 26 జిల్లాలకు కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసే ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ప్రస్తుత వరంగల్ జిల్లాకు రూ.4 కోట్లు, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఫర్నిచర్, ఫైళ్లు రవాణా తదితర అవసరాలకు ఈ నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కలెక్టరేట్లకు రూ.కోటి, పోలీసు కార్యాలయాలకు రూ.50 లక్షల చొప్పున వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ.26 కోట్లను మంజూరు చేయటంతో పాటు వెంటనే విడుదల చేస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. వీటిని ఖర్చు చేసే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. రెవెన్యూ విభాగం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ నిధులను ఖర్చు చేసే వెసులుబాటు కల్పించింది.