దుబ్బాక (మెదక్ జిల్లా) : అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం శిలాజినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లాల్ సింగ్ తండాకు చెందిన బానోతు లింగం(36) తనకున్న నాలుగెకరాల్లో రూ. లక్షా 50 వేల అప్పు చేసి ఆరేళ్ల కింద నాలుగు బోర్లు వేశాడు. చుక్క నీరు రాలేదు. మరో రూ.లక్షా 50 వేలు అప్పు చేసి రెండు మార్లు దుబాయి దేశం వెళ్లాడు. అక్కడ కంపెనీ నష్టాల్లో ఉందని ఇంటికి పంపించారు.
ఏడాది కింద రూ. 2 లక్షలు పెట్టి మరో నాలుగు బోర్లు వేశాడు. రెండింట్లో చుక్క నీరు పడలేదు. అంతంత మాత్రానే నీరు పడ్డ మరో రెండు బోర్లతో నాలుగెకరాల్లో రూ. లక్ష వరకు అప్పు చేసి వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేశాడు. ఎంతో ఆశతో వేసిన పంటలు కళ్లముందే ఎండు ముఖం పట్టాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక ఉదయం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యువరైతు ఆత్మహత్య
Published Thu, Dec 3 2015 6:18 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement