చైనా హ్యూనన్ ఫ్రావెన్స్లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 38 మంది మరణించగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వస్తున్న వాహనాన్ని ఎదురుగా అల్కహాల్ లోడ్తో వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. దాంతో ప్రయాణికుల వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, అగ్నిమాపక శకటాలతో సహా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించారు. దాదాపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి ఆ మంటలార్పారు. ఆ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3.00 గంటలకు ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.