రంజాన్ సంబరాలు పాకిస్థాన్లో రక్తం చిందాయి. పాక్ నైరుతి భాగంలోని క్వెట్టా రాష్ట్ర రాజధాని నగరంలో ఓ మసీదు నుంచి బయటకు వస్తున్నవారిపై ఉగ్రవాదులు విచ్చలవిడిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో 9 మంది మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. ఉదయం 7.20 గంటల ప్రాంతంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని బయటకు వస్తుండగా ముష్కరులు విరుచుకుపడినట్లు పోలీసు సూపరింటెండెంట్ సర్యాబ్ బషీర్ తెలిపారు. దాదాపు ఎనిమిది మంది ఉగ్రవాదులు మసీదుకు ఉన్న రెండు మార్గాల వద్ద వేచి ఉండి, ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపినట్లు బషీర్ వివరించారు.
దివంగత పోలీసు అధికారి అంత్యక్రియలపై ఆత్మాహుతి దాడి జరిగి 38 మంది మరణించిన ఒక్కరోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. సంఘటన స్థలంలోనే నలుగురు మరణించగా, ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం మాజీ మంత్రి అలీ మదద్ జతాక్ అని, అయితే ఆయన మాత్రం ఈ దాడిలో ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారని స్థానిక మీడియా తెలిపింది.
రంజాన్ సంబరాలపై ఉగ్రదాడి; 9 మంది మృతి
Published Fri, Aug 9 2013 1:01 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement