దంపతుల ప్రాణం తీసిన వ్యసనం
కేకేనగర్: ఇంటి యజమాని వ్యసనం ముగ్గురు పిల్లల్ని వీధినపడేలా చేసింది. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా సెయ్యారు సమీప కీళపుదుపాక్కంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
స్థానిక పశుంపొన్ నగర్‌కు చెందిన రజని (35) దినసరి కూలీ. ఇతని భార్య సంగీత (31). వీరికి శాంతిని (7), జమునాదేవి (5), అస్వతి (3) అనే కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లుగా రజని మద్యానికి బానిసగా మారాడు. ప్రతి రోజు పీకల దాకా తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలను చితకబాదేవాడు. ఈ విషయమై భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వచ్చిన రజని.. భార్యతో రాత్రి 2 గంటల దాకా తగాదా పెట్టుకున్నాడు. భర్త తాగుడుపై విరక్తి చెందిన సంగీత ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. శరీరమంతా మంటలు వ్యాపించడంతో సంగీత పెద్దగా కేకలు పెట్టింది. నేను కూడా నీతోనే చనిపోతానంటూ రజని.. భార్యను ఆలింగనం చేసుకున్నాడు. ఈ సంఘటనలో భార్య భర్త ఇద్దరూ కాలిపోయారు. చుట్టుపక్కలవారు గమనించి వారిని సెయ్యారు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో రజనీ-సంగీతలను చెన్నై కీళ్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.