టీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత పేరుతో రిలీవ్ చేసిన ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ట్రాన్స్‌కో, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్థానికత పేరుతో రిలీవ్ చేసిన తమకు జూన్ 10 నుంచి టీ ట్రాన్స్‌కో, పంపిణీ సంస్థలు జీతాలు చెల్లించలేదంటూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై జస్టిస్ రెడ్డి కాంతారావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున డాక్టర్ లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ జీతాలు అందకపోవడంతో పిటిషనర్లు రోడ్డనపడే పరిస్థితి వచ్చిందన్నారు.
దీనిపై తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ తుది జాబితా అమలు నిలిపివేత ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఏపీ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కాగా, తుది జాబితా అమలు నిలిపివేతపై టీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ బుధవారానికి వాయిదా పడింది.
ఏపీ ఉద్యోగులకు వెంటనే జీతాలివ్వండి
Published Tue, Jul 14 2015 12:29 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement