ఆప్కోలో తవ్వినకొద్దీ అక్రమాలు | Apco in irregularities | Sakshi
Sakshi News home page

ఆప్కోలో తవ్వినకొద్దీ అక్రమాలు

Published Sun, Mar 6 2016 3:15 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

ఆప్కోలో తవ్వినకొద్దీ అక్రమాలు - Sakshi

ఆప్కోలో తవ్వినకొద్దీ అక్రమాలు

* వేరుపడినా ఉమ్మడిగానే వస్త్రాల కొనుగోలు
* క్లోజింగ్ స్టాక్ వివరాలు వెల్లడించని అధికారులు
* మంత్రి ఆదేశించినా జరగని విచారణ.. రాజకీయ జోక్యమే కారణం!

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థ (ఆప్కో)లో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఆప్కోలో గోల్‌మాల్ రూ.600 కోట్లు..’ శీర్షికన ఆప్కోలో అవకతవకలను ‘సాక్షి’ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. సొసైటీల నుంచి వస్త్రాల కొనుగోలు మొదలుకుని ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేసేదాకా కాగితాలపై లెక్కలు చూపుతున్న అధికారులు... వాటికి సంబంధించిన అసలు అంశాలను తొక్కిపెడుతున్నారు.

అసలు ఆప్కో అక్రమాలపై విచారణ జరపాలని మంత్రి జూపల్లి కృష్ణారావు గతేడాది ఏప్రిల్‌లోనే ఆదేశించినా... రాజకీయ జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడాది కాలంగా విచారణ జరగకపోవడానికి కారణమేంటి, ఈ వ్యవహారంలో బాధ్యులెవరనేదానిపై మంత్రి కార్యాలయం ఇప్పటికీ వివరణ కోరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

మరెన్నో అక్రమాలు
అసలు 2010 నుంచి ప్రారంభమైన ఆప్కో అక్రమాల పర్వం రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగింది. 2015 అక్టోబర్31 నాటికి ఆప్కో గోదాముల్లో ఉన్న వస్త్ర నిల్వలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 42:58 నిష్పత్తిలో పంచుకోవాలని... ఎవరికి వారు సొంతంగా కార్యకలాపాలు నిర్వహించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. అయితే సొసైటీల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాల నిల్వలకు సంబంధించి ఆప్కో అధికారులు నేటికీ లెక్కలు చూపడం లేదు. 2015 అక్టోబర్31 నాటికి ఉన్న క్లోజింగ్ స్టాక్ వివరాలు ఇవ్వాల్సిందిగా చేనేత, జౌళిశాఖ నుంచి తాఖీదులు వెళ్లినా స్పందన లేదు.

ఇలా తెలంగాణ వాటాకు సంబంధించిన లెక్కలు చూపలేకపోతున్న అధికారులు... 2015 అక్టోబర్31 తర్వాత కూడా ఉమ్మడిగానే లావాదేవీలు నిర్వహించారు. ఉమ్మడిగా వస్త్రాల కొనుగోలుతో తెలంగాణ సొసైటీలకు నష్టం వాటిల్లుతుందని, ఉమ్మడి లావాదేవీలు నిలిపివేయాలని ఉన్నతాధికారులకు సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదు. మరోవైపు 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు కొనుగోలు చేసిన వస్త్రం విలువకు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల నుంచి వచ్చినట్లుగా చెప్తున్న ఆర్డర్ ఇండెంట్ లెక్కలకు పొంతన కుదరకపోవడం గమనార్హం.
 
ఉత్పత్తి సామర్థ్యంపై తప్పుడు లెక్కలు
రాష్ట్రంలో ఉన్న చేనేత సొసైటీలు, వాటి ఉత్పత్తి సామర్థ్యం, పనిచేస్తున్న కార్మికులు తదితర అంశాలపై ఆప్కో వద్ద సమగ్ర సమాచారం లేదు. అయినా సొసైటీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 90 లక్షల మీటర్ల మేర ఉందని లెక్కలు చూపుతూ... పొరుగు రాష్ట్రాల నుంచి యంత్రాలపై తయారైన వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు.  గోల్‌మాల్ వ్యవహారంపై వార్తలు రావడంతో... హడావుడిగా ముంబైకి చెందిన ఓ వస్త్ర పరిశ్రమ నుంచి నాణ్యత లేని వస్త్రాన్ని కొనుగోలు చేసి, లెక్కలు చూపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తాము ఉత్పత్తి చేసిన వస్త్రాల నాణ్యతను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ సొసైటీల్లో తయారైన చేనేత వస్త్రం శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నారు. ప్రభుత్వ విభాగాలకు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన నాణ్యత లేని వస్త్రాన్ని సరఫరా చేస్తున్నారు. ఉన్ని సంఘాల పేరిట ప్రభుత్వ విభాగాలకు బ్లాంకెట్ల సరఫరాలోనూ కొందరు సొసైటీ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారు. హర్యానాలోని పానిపట్ నుంచి బ్లాంకెట్లు కొనుగోలు చేస్తూ సొసైటీల పేరిట రికార్డులు సృష్టిస్తున్నారు.
 
తక్షణమే విచారణ జరపండి
ఉన్నతాధికారులకు జూపల్లి ఆదేశం

సాక్షి, హైదరాబాద్: ‘ఆప్కో’లో అవతవకలపై వార్తల నేపథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న మగ్గాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యంపై తక్షణమే విచారణ జరపాలని... అవకతవకలు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని చేనేత విభాగం డెరైక్టర్ ప్రీతి మీనాను ఆదేశించారు. లావాదేవీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్పత్తి సామర్థ్యం లేని సొసైటీల నుంచి వస్త్రాల కొనుగోలుకు సంబంధించి త నిఖీలు చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

విభాగం పనితీరుపై ప్రభావం చూపుతున్నందున ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిప్యుటేషన్‌ను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో 412 చేనేత సొసైటీలు ఉండగా.. అందులో 200 వరకు చురుగ్గా పనిచేస్తున్నాయని ఆప్కో జేఎండీ సైదా వివరించారు. మూడు వేల మగ్గాలకు 90 వేల మీటర్ల వస్త్ర ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా 2104 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రూ.92 కోట్లు విలువ చేసే వస్త్రాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement