ఉసూరుమన్న యాపిల్
ఉసూరుమన్న యాపిల్
Published Sat, Aug 6 2016 2:53 PM | Last Updated on Mon, Oct 1 2018 6:22 PM
న్యూఢిల్లీ: మొబైల్ మార్కెట్ లో ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ మరోసారి ఉసూరుమంది. భారత్ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో అగ్రభాగాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న సంస్థకు ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. 2016 రెండో త్రైమాసికంలో భారతదేశం లో ఐ ఫోన్ ఎగుమతుల్లో క్షీణతను నమోదు చేసింది. స్ట్రాటజీ అనలిటిక్స్ అందించిన నివేదిక ప్రకారం ఐఫోన్ల అమ్మకాలు 35శాతం తగ్గాయి. ఈ ఏడాదిలో కేవలం 8లక్షల ఫోన్లు (0.8 మిలియన్ల) మాత్రమే విక్రయించింది. అయితే 2015లో ఇదే సమయంలో 12లక్షల ఫోన్లను పంపించింది. ఐఫోన్ల మార్కెట్ 4.5 శాతం నుంచి 2.4 శాతానికి పడిపోయిందని రిపోర్టు చేసింది. గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ మార్కెట్ మాత్రం 97 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 29.8 మిలియన్ యూనిట్లను ఎగుమతిచేసి తన స్థానాన్ని నిలుపుకుంది. క్రితం త్రైమాసికంలో 23.2 మిలియన్ యూనిట్ల ఎగుమతితో ఇది90 శాతంగా ఉంది.
అయితే ఐఫోన్ల ధరల కారణంగా మార్కెట్ తగ్గుతోందని, ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని నివేదించింది. వినియోగ దారులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరల్లో ఫోన్లను విడుదల చేస్తే భవిష్యత్తులో భారత్‌లో మార్కెట్ గణనీయంగా పెరిగే అవకాశముంటుందని స్ట్రాటజీ ఎనలిటిక్స్ వద్ద డైరెక్టర్ వుడీ ఓహ్ అభిప్రాయపడ్డారు. మొబైల్ వినియోగంలో ప్రపంచంలో చైనా, అమెరికా తరువాత భారత్ మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉందని స్ట్రాటజీ ఎనలిటిక్స్ సీనియర్ విశ్లేషకుడు రాజీవ్ నాయర్ తెలిపారు.
Advertisement
Advertisement