ఆసీస్‌తో సిరీస్: తొలి విజయం ఇండియాదే..
చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై వేదికగా ఆదివారం సాగిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడటంతో ఆసీస్ లక్ష్యాన్ని 164కు (21 ఓవర్లలో) కుదించారు.
ఓపెనర్ డేవిడ్ వార్నర్(25), థర్డ్ డౌన్ మ్యాక్స్‌వెల్(39), లోడౌన్ జేమ్స్ ఫల్కనర్(32) మినహా మిగతావాళ్లెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో ఆసీస్ 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సివచ్చింది. భారత బౌలర్లలో చాహల్ 3, పాండ్యా, కుల్‌దీప్‌లు చెరో 2, భువీ, భుమ్రా తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రతిభ కనబర్చిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 281 పరుగులు సాధించింది. టాప్‌ఆర్డర్ విఫలమైనా మిడిల్, లోయర్ ఆర్డర్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా(83), ధోనీ(79), జాదవ్(40), భువీ(32)లు సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో కుల్టర్‌నెయిల్ 3, స్టోనిస్ 2, ఫల్కనర్, జంపాలు చెరో వికెట్ పగడొట్టారు. ఇరుజట్ల మధ్య 21న కోల్‌కతాలో రెండో వన్డే జరగనుంది.