శ్రీవారి లడ్డూ టోకెన్లపై బార్ కోడ్
అక్రమ అమ్మకాలు అరికట్టేందుకు అమలు
తిరుమల: తిరుమలలో లడ్డూ అక్రమాలు అరికట్టేందుకు టోకెన్లపై బార్‌కోడ్ విధానం బుధవారం అమల్లోకి వచ్చింది. ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్‌లో ఈ విధానం అమలుచేశారు. లోటుపాట్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. దీనివల్ల నకిలీ టోకెన్లను అరికట్టడంతోపాటు రోజుకు ఎన్ని టికెట్లకు, ఎన్ని లడ్డూలు కేటాయించారో సులభంగా తెలుసుకోవచ్చు. బుధవారం తొలిరోజు కావడంతో బార్‌కోడ్‌లో కొన్ని సాంకేతిక ఇబ్బందులను గుర్తించారు. టోకెన్ల జారీ కూడా ఆలస్యమైంది. క్యూలో ఉండే భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో టోకెన్లపై బార్‌కోడ్ ప్రవేశ పెట్టామని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అమలుచేస్తామని జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు.
ముందస్తు డీడీలతో డైరీలు, కేలండర్లు: ఈవో సాంబశివరావు
టీటీడీ ముద్రిస్తున్న శ్రీవారి డైరీలు, కేలండర్లకు స్పందన విశేషంగా ఉందని ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. 2016 డైరీలు, కేలండ ర్లకు ఈనెల 31వ తేదీలోపు ముందస్తుగా డీడీలు పంపితే వాటిని సిద్ధం చేస్తామని బుధవారం తెలిపారు. డైరీ రూ. 100, 12 పేజీల కేలండర్ రూ. 75, శ్రీవేంకటేశ్వర స్వామి పెద్ద కేలండర్ రూ. 10, శ్రీవేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు కలిగిన చిన్న కేలండర్ రూ. 5, తెలుగు పంచాంగం కేలండర్ రూ. 15 ధరగా నిర్ణయించామన్నారు. వెయ్యికి పైగా డైరీలు, కేలండర్లు అవసరమున్న సంస్థలు మాత్రమే మొత్తం సొమ్ములో 25శాతం వరకు డీడీలు పంపాలని, ఆర్డరు నిర్ధారణ తర్వాత మిగిలిన 75 శాతం పంపవచ్చన్నారు. ‘‘సహాయ కార్యనిర్వహణాధికారి, ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీ రోడ్డు, తిరుపతి-517 501’’ చిరునామాకు డీడీలు పంపాలని ఈవో విజ్ఞప్తి చేశారు. ఇతరులకు విక్రయించబోమని ముందుగా రాతపూర్వకంగా సమర్పించాకే డైరీలు, కేలండర్లు అందజేస్తామన్నారు.