వెంకన్న లడ్డూకు 75 ఏళ్లు | Venkanna brownies to 75 years | Sakshi
Sakshi News home page

వెంకన్న లడ్డూకు 75 ఏళ్లు

Published Thu, Aug 13 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

వెంకన్న లడ్డూకు 75 ఏళ్లు

వెంకన్న లడ్డూకు 75 ఏళ్లు

1803లో బూందీగా పరిచయమై, 1940లో లడ్డూగా స్థిరపడింది
శ్రీవారి లడ్డూకు మేథో సంపత్తి హక్కులు
రోజుకు 3 లక్షల లడ్డూల తయారీ,
ఏటా సరుకుల కోసం రూ.200 కోట్ల ఖర్చు

 
తిరుమల: తిరుమలేశునికి లడ్డూ నైవేద్యం అంటే మహాఇష్టం. భక్తులకూ ప్రీతిపాత్రమైంది. కొండ లడ్డూ మాధుర్యం 1940లో పరిచయమై 2015 నాటికి 75 ఏళ్లు పూర్తిచేసుకుంది. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహర పడి(క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాలు విక్రయించడంలో భాగంగా బూందీ తీపి ప్రసాదంగా ప్రారంభించింది. అది చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ ధర్మకర్తలమండలి 1950లో నిర్ణయించింది. అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5,100 లడ్డూల తయారీకోసం ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, జీడిపప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకలు 4 కిలోలు.. మొత్తంగా 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.

1940 తొలి రోజుల్లో కొండ లడ్డూ (అప్పట్లో  కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది) రేటు ఎనిమిదణాలే. ఆ తర్వాత రూ.రెండు, రూ.ఐదు, రూ.10, రూ.15, ప్రస్తుతం రూ.25 కు చేరింది. ప్రస్తుతం రోజూ మూడులక్షల వరకు లడ్డూలు తయారు చేస్తూ భక్తులకు అందజేస్తోంది. అయినా డిమాండ్ రెట్టింపు స్థాయిలోఉండటం గమనార్హం. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథులకోసం ఆస్థానం లడ్డూ (750 గ్రాములు), కల్యాణోత్సవం గృహస్తుల కోసం కల్యాణోత్సవం లడ్డూ (ధర రూ.100), భక్తులకు ఇచ్చే సాధారణ ప్రోక్తం లడ్డూ (175 గ్రాములు, ధర రూ.25) తయారు చేస్తారు. ప్రోక్తం లడ్డూకు రూ.100 ధర చెల్లించినా దొరకని సందర్భాలు ఉన్నాయంటే లడ్డూ డిమాండ్ ఏపాటిదో చెప్పనక్కరలేదు. దిట్టాన్ని టీటీడీ పక్కాగా అమలు చేయడం, లడ్డూ తయారు చేసే పద్ధతుల్లో శాస్త్రీయతల వల్లే తిరుమల లడ్డూ రుచి ఏమాత్రం తగ్గడంలేదు.
 
ప్రసాదాల తయారీకి రూ.200 కోట్ల ఖర్చు
తిరుమలేశుని లడ్డూ, ప్రసాదాల తయారీకి అవసరమైన 16 వేల మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా రూ.200  కోట్ల రూపాయలకుపైగా  ఖర్చు చేస్తోంది. ఇందులో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. పెరిగిన ధరలు, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉండడంతో లడ్డూ ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. కొండలడ్డూకు  చెన్నయ్‌లోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం ద్వారా ఆరేళ్లకు ముందు టీటీడీ మేథోసంపత్తి హక్కులు మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement