న్యూఢిల్లీ: ఓ వైపు దేశ రాజధాని ప్రజలను చికున్ గున్యా, డెంగ్యూ జ్వరాలు వణికిస్తుండగా మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తమాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర మంత్రుల్లో ఎక్కువమంది పర్యటనలకు వెళ్లడంతో.. ఇదే అదనుగా చూసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. అవసరం మీది అవకాశం మాది అన్న తంతులో రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓ జాతీయ మీడియా సంస్ధ రిపోర్టర్లు (రక్తం అక్రమ అమ్మకాలపై) తెచ్చిన సమాచారం ఇప్పుడు సంచనాలు సృష్టిస్తోంది.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి(ఎల్ఎన్జేపీ)
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద ఆసుపత్రి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి(ఎల్ఎన్జేపీ). ఈ దావాఖానలోని ఓ ఉద్యోగిని కలిసిన రిపోర్టర్లు తమకు అర్జెంటుగా రక్తం కావాలని కోరారు. దీంతో ఆ ఉద్యోగి అందుకు బాగా ఖర్చవుతుందని చెప్పారు.
ఎంతైనా పర్లేదని చెప్పడంతో.. సదరు ఉద్యోగి తన నెట్ వర్క్ ని లైన్లోకి తీసుకున్నారు. బ్రోకర్లను రిపోర్టర్లకు పరిచయం చేస్తూ డీల్ కుదుర్చుకున్నారు. రక్తం ఇక్కడికే తెచ్చిస్తానని చెప్పారు. అయితే, ఒక్కసారి తెచ్చి ఇచ్చిన బ్లడ్ ను వెనక్కు తీసుకోనని పేర్కొన్నారు. రక్తం ప్యాకెట్(ఒకదానికి) రూ.మూడు వేలు, ప్లేట్లెట్ల ప్యాకెట్(ఒకదానికి) రూ.12వేలు ఖర్చవుతుందని తెలిపారు. కానీ తమ వద్ద డోనర్లు ఎవరూ లేరని రిపోర్టర్లు చెప్పడంతో.. వారి అవసరం లేకుండా బ్లడ్ ప్యాకెట్లు ఇస్తానని సదరు ఉద్యోగి చెప్పారు.
గురు తెగ్ బహదూర్ ఆసుపత్రి(జీటీబీ)
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మరో పెద్ద ఆసుపత్రి గురు తెగ్ బహదూర్ ఆసుపత్రి(జీటీబీ). ఈ ఆసుపత్రిలో రక్తం ప్యాకెట్ ల అందుబాటు గురించి విచారించడానికి వెళ్లిన జర్నలిస్టుకు మామూలుగా రక్తం అందుబాటులో లేదని అక్కడి సిబ్బంది చెప్పారు. 'బీ-నెగటివ్' రక్తం అర్జెంటుగా కావాలని ఆసుపత్రి సిబ్బందిలో ఒకరిని సంప్రదించగా.. డోనర్ల అవసరం లేకుండానే ఇప్పిస్తానని చెప్పారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచే రక్తం ఇప్పిస్తానని ప్యాకెట్ కు రూ.3,500/-లని , బేరం లేదని పేర్కొన్నారు.
ఆల్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)
ఎయిమ్స్ ఢిల్లీ కూడా రక్త మాఫియా గుప్పిట్లోకి చేరిపోయింది. విద్యార్ధుల నుంచి రక్తం ఇప్పిస్తానని ఎయిమ్స్ లో మహేష్ అనే ఓ పంజాబీ చెబుతున్నాడు. ప్యాకెట్ కు రూ.2,800లు, ప్లేట్ లెట్స్ కు అదనంగా మరో రూ.6,000లు ఖర్చవుతుందని రిపోర్టర్లతో పేర్కొన్నాడు.
మనోహర్ లోహియా ఆసుపత్రి(ఆర్ఎమ్ఎల్)
ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి రన్ చేస్తున్న బ్లడ్ బ్యాంకులోని రక్తాన్నే బ్లాక్ లో అమ్ముతోంది. బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న సచిన్ అనే ఉద్యోగి ఒక రక్తం ప్యాకెట్ కు రూ.10వేలు డిమాండ్ చేస్తున్నారు. తనకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుతో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతూ అవసరమైతే ప్లేట్ లెట్స్ కూడా ఏర్పాటుచేస్తానని పేర్కొన్నారు. రెండు ప్యాకెట్ల ప్లేట్లెట్లు కావాలని రిపోర్టర్ సచిన్ ను కోరగా.. రూ.30వేలు ఖర్చవుతుందని చెప్పారు. అది చాలా పెద్ద మొత్తం కదా.. అని రిపోర్టర్ ప్రశ్నించగా.. పెద్ద మొత్తమా? ఎందుకు? మీకు అత్యవసరమైతేనే తీసుకెళ్లండి. డబ్బు గురించి మాట్లాడొద్దని అన్నాడు.