మూడేళ్ల బాలుడిని కాల్చేసిన పదకొండేళ్ల కుర్రాడు
న్యూయార్క్: మూడేళ్ల బాలుడిని పదకొండేళ్ల కుర్రాడు కాల్చిచంపిన ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. డెట్రాయిట్‌లోని తన తండ్రి నివాసానికి పదకొండేళ్ల బాలుడు వచ్చాడు. సోమవారం తండ్రి ఇంట్లో లేని సమయంలో బెడ్‌రూమ్‌లో ఉన్న హ్యాండ్‌గన్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి వెనుక వైపు ఉన్న కారులో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు ఎలిజా వాకర్ వద్దకు వెళ్లి అతనిపై పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపాడు. దీంతో వాకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనపై వేన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కిమ్ వర్తి మాట్లాడుతూ.. ఎటువంటి కారణం లేకుండా నిందితుడు కాల్పులు జరిపాడని, ఇది కావాలని చేసిందేనని భావించి నిందితునిపై హత్య అభియోగాలు నమోదు చేసినట్టు చెప్పారు. అయితే 11 ఏళ్ల వయసులోనే ఇంత తీవ్రమైన నేరం ఎందుకు చేశాడన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడంలేదు. ఆడుకునే బొమ్మ తుపాకి అనుకుని కాల్చి ఉంటాడా అని భావిస్తున్నారు.