విచిత్ర కొలువులు!
‘కూటి కోసం కోటి’ విద్యలు అన్నారు పెద్దలు.. అదే సూత్రం ఆధారంగా ఈ ప్రపంచంలోని ఉన్న అందరూ ఏదో ఒక పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరూ ఒకే రకమైన ఉద్యోగం చెయ్యరు, చెయ్యలేరు. కానీ, అన్ని రకాల పనులు జరిగితేనే ఈ ప్రపంచం మనుగడ సాధిస్తుంది. కొందరికి సులభమైన ఉద్యోగం దొరుకుతుంది. మరికొందరికి చాలా కష్టపడాల్సిన ఉద్యోగం రావచ్చు. మరికొందరు మీరు ఇంతకముందెప్పుడూ వినని ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. అలాంటి భిన్నమైన ఉద్యోగాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!
వాసనను గుర్తు పట్టడం
రుచికరమైన భోజనం వండుతున్నా.. కుళ్లిన దుర్గంధం వెలువడ్డా..మన ముక్కు వెంటనే గుర్తిస్తుంది. ఇలాంటి వాసనలను కూడా గుర్తుపట్టే ఉద్యోగం కూడా ఉంటుందని మీకు తెలుసా? ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువే. కంపెనీలు అధిక మొత్తంలో వేతనాలు ఇచ్చి మరీ వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటాయి. కంపెనీల ఉత్పత్తులను వాసనలు చూసి వాటిపై అభిప్రాయాన్ని చెప్పడం వీరి ప్రధాన విధి. టూత్‌పేస్ట్, ఔషధాలు, షాంపులు తదితర ఉత్పత్తుల్లో సువాసనలు కంపెనీలు జోడిస్తాయి. ఈ ఉద్యోగులు వాటి వాసన చూసి తగు మోతాదులో ఉందా? లేదా? అన్నది కంపెనీలకు వివరించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం చేయ్యాలంటే రసాయనిక శాస్త్రంపై తగిన పట్టు ఉండాలి. కంపెనీ దీర్ఘకాల ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకోని వీరు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది.
క్రైం జరిగిన ప్రదేశాన్ని శుభ్రపరిచడం
హత్య జరిగిన ప్రదేశాలను చూస్తేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. కానీ అలాంటి ప్రదేశాలను శుభ్రపరిచే ఉద్యోగులు కూడా ఉంటారు. హత్యా ప్రదేశాలు, పరిశ్రమలలో ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలలో వాటిని శుభ్రపర్చడం వీరి ప్రధాన విధి. వీరంతా ఆ స్థలంలో ఉన్న రక్తం ఆనవాళ్లు, శవాలను తొలగిస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో హత్య జరిగి రోజులు లేదా నెలలు గడిచి శరీరం కుళ్లిపోయినా కూడా శవాలను తొలగించి ఆ ప్రదేశాలను శుభ్రపర్చాల్సి ఉంటుంది. తీవ్రమైన దుర్వాసన వస్తున్నా కూడా వీరు తమ విధిని నిర్వర్తిస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఉద్యోగులు ఇనెఫెక్షన్ల బారిన పడి అనారోగ్యానికి గురౌతుంటారు. తీవ్ర భయానక పరిస్థితులు ఉండే క్రైం జరిగిన ప్రదేశాలను శుభ్రపర్చాలంటే మానసిక స్థైర్యం, రసాయన శాస్త్రంలో తగినంత జ్ఞానం కలిగి ఉండాలి.
వోల్కనాలజిస్ట్
అగ్నిపర్వతాల మీద పరిశోధనలు చేసేవారిని వోల్కనాలజిస్టులు అంటారు. భయంకరమైన అగ్నిపర్వతాల వద్ద వీరు పనిచేయాల్సి ఉంటుంది. చల్లారిపోయిన అగ్నిపర్వతాలను వీరు పరిశోధిస్తారు. అందులో నుంచి వెలువడిన వివిధ వాయు, ఘన పదార్థాలను వీరు శోధిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఉద్యోగం. అగ్నిపర్వతాల నుంచి ఆకస్మికంగా విషవాయువులు వెలువడుతుంటాయి. వాటిని పొరబాటున పీల్చినా క్షణాల్లో ప్రాణాలు పోతాయి. కానీ, సవాళ్లంటే ఇష్టపడే వ్యక్తులు ఈ ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావడం విశేషం. ఇక్కడ వచ్చే ధ్వనులు, వెలువడే వివిధ వాయువులు, అగ్నిపర్వతం పేలడానికి గల కారణాలను తెలుసుకొనేందుకు వీరు పరిశోధన జరుపుతారు.
సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్
ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ నిండితే క్లీనర్స్ ద్వారా దాన్ని శుభ్రపరుస్తాం. అన్ని ఉద్యోగాల్లా దీన్ని కూడా తమ వృత్తిగా భావించి ఉద్యోగాలు చేస్తుంటారు. తీవ్రమైన దుర్గంధంతో కూడిన చెత్తను సెప్టిక్ ట్యాంక్‌నుంచి వీరు తొలగిస్తారు. అవసరమైతే వీరు సెప్టిక్ ట్యాంకులోకి దిగి పనిచేయాల్సి ఉంటుంది.ఈ పనిచేస్తున్నప్పుడు అనేక ఇ¯ŒSఫెక్షన్లు వచ్చి అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో సెప్టిక్ ట్యాంక్‌లో విడుదలయ్యే వివిధ రకాల గ్యాస్‌ల వల్ల అందులోకి దిగినవారు మరణించే పరిస్థితులు కూడా నెలకొంటాయి. ( సాక్షి స్కూల్ ఎడిషన్)