లండన్: స్మార్ట్‌ఫోన్లకు అలవాటైన వారు ఒక్కరోజు కూడా వాటిని విడిచి ఉండలేరన్న విషయం తెల్సిందే. అయితే స్మార్ట్‌ఫోన్లను దగ్గరుంచుకున్న వారి జ్ఞానశక్తి కూడా అవిలేని వారితో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందట. ఫోన్ ఆన్‌లో ఉందా, ఆఫ్‌లో ఉందా? అన్న అంశంతో సంబంధం లేకుండా వారి జ్ఞానశక్తి తగ్గుతుందని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లోని మ్యాక్‌కోంబ్స్ బిజినెస్ స్కూల్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రియన్ వార్డు తెలిపారు. ఆయన తన శిష్యులతో కలసి రెండు బృందాలపై వేర్వేరుగా జరిపిన పరీక్షల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు.
మొదటి బృందంగా ఆయన 800 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఎంపిక చేసుకున్నారు. వారిని మూడు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ ఫోన్లను పక్క రూములో, రెండో గ్రూపు ఫోన్లను టేబుల్‌పైనా, మూడో గ్రూపు ఫోన్లను జేబుల్లోగానీ, తమ బ్యాగుల్లోగాని పెట్టుకోమని చెప్పారు. అన్ని ఫోన్లను సైలెన్స్ మోడ్‌లో ఉంచాల్సిందిగా కోరారు. వారందరికి మనసును బాగా లగ్నం చేయాల్సిన పరీక్షను కంప్యూటర్ ద్వారా నిర్వహించారు. పక్క రూములో ఫోన్లను భద్రపర్చినవారు, టేబుళ్లపై ఫోన్లను పెట్టుకున్న వారికన్నా బాగా ఫలితాలు సాధించారు. ఇక టేబుళ్లపై ఫోన్లు పెట్టుకున్నవారు జేబుల్లో ఫోన్లు పెట్టుకున్నవారికన్నా బాగా రాణించారు.
ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్లను బాగా ఉపయోగించేవారిని ఎంపిక చేసి వారికి కూడా ఇదే సరళిలో పరీక్ష నిర్వహించారు. కొందరిని ఫోన్లను పక్కరూములో పెట్టించారు, కొందరి ఫోన్లను టేబుల్‌పై పెట్టించారు. మరి కొందరి ఫోన్లను స్విచాఫ్ చేయించారు. ఫోన్లు ఆఫ్ ఉందా, ఆన్‌లో ఉందా ? అన్న సంబంధం లేకుండా ఎక్కువగా ఫోన్ ఉపయోగించేవాకి చాలా తక్కువ మార్కులు, తక్కువగా ఫోన్ ఉపయోగించేవారికి ఎక్కువ మార్కులు వచ్చాయి.
ఫోన్ ఆఫ్‌లో ఉందా, ఆన్‌లో ఉందా ? అన్న అంశంతో సంబంధం లేకుండా ఫోన్‌లు దగ్గరుంటే చాలు జ్ఞానశక్తి తగ్గుతుందని పరిశోధక బృందం తేల్చింది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య 2014 సంవత్సరంలో 157 కోట్ల మంది ఉండగా, 2017 సంవత్సరానికి వారి సంఖ్య 232 కోట్లకు చేరుకుంది. 2020 నాటికి 287 కోట్లకు చేరుకుంటుందన్నది ఒక అంచనా.