ట్రంప్ నోట భారత్ ప్రస్తావన.. పాక్‌కు చురకలు!
రియాద్: సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ప్రస్తావన తెచ్చారు. భారత్ కూడా ఉగ్రవాద బాధిత దేశమని ఆయన గుర్తుచేశారు. ఏ దేశం కూడా తమ భూభాగంలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన పేర్కొన్నారు. రియాద్‌లోని అరబ్ ఇస్లామిక్-యూఎస్ సదస్సులో ట్రంప్ ప్రసంగించారు.
దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద భావజాలాన్ని అణిచేందుకు ఆయా దేశాలతో కలిసి పనిచేస్తామని, అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు అన్ని దేశాలు ఉగ్రవాద బాధితులేనని, పలుసార్లు అనాగరిక ఉగ్రవాద దాడుల బారిన పడ్డాయని ట్రంప్ అన్నారు. పాకిస్థాన్ పేరును ట్రంప్ నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఏ దేశం కూడా తమ భూభాగాల్లో ఉగ్రవాదుల ఆశ్రయం ఇవ్వరాదంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు.