ఐఎస్ ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ
బాగ్దాద్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగింది. కిర్కుక్ నగరంలో ఇరాక్ భద్రత దళాలు చేసిన మెరుపు దాడిలో కనీసం 48 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఐఎస్ గ్రూపుతో పాటు కిర్కుక్ నగరం పోలీస్ చీఫ్ నిర్ధారించారు.
కిర్కుక్ నగరంలో ప్రజల ఇళ్లల్లోకి చొరబడ్డ ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రత్యేక కౌంటర్ టెర్రరిజం, ఇంటలిజెన్స్ దళాలు రంగంలోకి దిగి చుట్టుముట్టాయి. భద్రత దళాలు కొందరు ఉగ్రవాదులను కాల్చిచంపగా, మరికొందరు ఉగ్రవాదులు వారంతటవారే బాంబులతో పేల్చేసుకున్నట్టు బ్రిగేడియర్ జనరల్ ఖట్టబ్ ఒమర్ చెప్పారు.
బాగ్దాద్కు ఉత్తరాన 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిర్కుక్ నగరంలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ దాడుల్లో కనీసం 46 మంది మరణించినట్టు ఇరాక్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వీరిలో ఎక్కువగా భదత్ర సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో జిహాదీలు దాక్కున్నట్టు చెప్పారు.