ఆప్‌కు భారీ షాక్!
- రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఐటీ నివేదన
పంజాబ్, గోవాలో శనివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆదాయపన్నుశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆప్‌కు ఉన్న రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రూ. 27 కోట్ల విరాళాల గురించి ఆప్ తప్పడు, కల్పిత ఆడిట్ నివేదికలను సమర్పించిందని, కాబట్టి దాని రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని ఈసీకి ఐటీ నివేదించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గుజరాత్, గోవాలో తొలిసారి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన గోవా, పంజాబ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు నివేదిక అందడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2013-14లో, 2014-15లో తప్పుడు, కల్పిత ఆడిట్ నివేదికలను ఆప్ సమర్పించిందని, కాబట్టి ట్రస్టుగా, రాజకీయ పార్టీగా ఆప్ హోదాను పునఃసమీక్షించి.. రద్దు చేయాలని సిఫారసు చేస్తూ ఐటీ ఈసీకి ఆరుపేజీల నివేదిక సమర్పించిందని ‘హిందుస్తాన్ టైమ్స్’ ఒక కథనంలో పేర్కొంది.