ప్రభుత్వ వ్యవహారాలపై విచారణ జరిపించాలి
* హైకోర్టు న్యాయమూర్తి లేదా సీబీఐతో దర్యాప్తు చేయించండి
* తునిలో విధ్వంసం టీడీపీ ప్రభుత్వ వైఫల్యమే
* దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా నేతలపై తప్పుడు కేసులు
* ప్రత్యేక హోదా సహా అన్ని హామీలు నెరవేర్చండి
* గిరిజన సలహా మండలి ఏర్పాటుకు ఆదేశించండి
* హోంమంత్రితో భేటీలో వై.ఎస్.జగన్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, కనీసంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నవించారు.
ఆయన బుధవారం మధ్యాహ్నం పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డిలతో పాటుగా ఇక్కడ పార్లమెంటులో హోంమంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేసేలా ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కోరారు. వివిధ అంశాలపై ఆయన వినతిపత్రం ఇచ్చారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వివరించిన విషయాలన్నీ హోం మంత్రికీ వివరించానని, న్యాయం చేయాలని కోరామని పేర్కొన్నారు. వినతి పత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ.
* ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో, రాష్ట్ర విభజన రోజున రాజ్యసభలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసేలా నీతి ఆయోగ్‌కు సూచించగలరు. కోరాపుట్-బొలంగిర్-కలహండి స్పెషల్ ప్లాన్, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయండి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 90 టీఎంసీల ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణం ఆపేయాలి. గిరిజన సలహా మండలిని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాం.
* కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తునిలో 31 జనవరి 2016న నిర్వహించిన భారీ బహిరంగ సభ సందర్భంగా జరిగిన విధ్వంసానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. గతంలోనూ చిత్తూరు మేయర్ హత్యకు గురైతే దానిని వైఎస్సార్‌సీపీకి ఆపాదించారు. అసలు ప్రతిపక్షాలపై, కాపులపై, వారి ఆందోళనపై బురదజల్లేందుకు వీలుగా చంద్రబాబే తునిలో విధ్వంసానికి కుట్ర పన్నారేమోననిపిస్తోంది.
* టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అధికార పార్టీ నేతలు నేరాలకు పాల్పడితే ఎలాంటి కేసులు ఉండవు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన ఉన్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ గానీ, అక్రమ ఇసుక తవ్వకాలు గానీ, ప్రభుత్వ అధికారులపై దాడి సంఘటనల్లో గానీ వారిపై కేసులు పెట్టలేదు. శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ ఆరోపణలపై కూలీలను కాల్చి చంపినా.. పుష్కరాల్లో తొలిరోజే 29 మంది చనిపోయినా వాటిపై విచారణలు జరపలేదు. అందువల్ల అన్ని వ్యవహారాలపై హైకోర్టు సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని, కనీసం సీబీఐతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని విన్నవిస్తున్నాం.