మతశక్తులతో మీరు ఒంటరిగా పోరాడలేరు!
- లాలూకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సూచన
- ‘సీమాంచల్’ ఇస్తే కలిసి పోరాడతామని ప్రకటన
హైదరాబాద్: మతశక్తులను దెబ్బతీయాలంటే ఉమ్మడి పోరాటాలు అవసరమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ అంతుచూసేదాకా నిద్రపోనన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఒంటరిగా ఆ పని చేయలేరని, సీమాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తే ఎంఐఎం కూడా లాలూతో కలిసి పోరాడుతుందని చెప్పారు. బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘లాలూజీ, మతశక్తులతో మీరు ఒంటరిగా పోరాడలేరు. నిజంగా వాళ్లను అడ్డుకోవాలనుకుంటే ఆ పనిని మరింత బలంగా చేయాలి’అని అసద్.. లాలూకు సూచించారు. సీమాంచల్ రాష్ట్ర ఏర్పాటుకు గనుక లాలూ యాదవ్ సహకరిస్తే.. ఆర్జేడీతో కలిసి పనిచేసేందుకు ఐంఐఎం సిద్ధంగా ఉంటుందని అసద్ అన్నారు. బిహార్ నుంచి సీమాంచల్‌ను వేరుచేస్తే అక్కడి ముస్లింల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. సీమాంచల్ ప్రాంతం నుంచి ఎంఐఎం పెద్ద సంఖ్యలో అభ్యర్థులను పోటీకి దింపింది. నాటి ఎన్నికల్లో విజయం సాధించిన మహాఘట్బంధన్(ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమి) ఇటీవలే కూలిపోయిన దరిమిలా.. అందుకు కారణమైన బీజేపీపై పోరాటాన్ని ఉధృతం చేస్తానని లాలూ యాదవ్ శపథం చేసిన సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ప్రకటనపై లాలూ యాదవ్ స్పందించాల్సిఉంది.