దుబాయ్: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ పతనం ప్రభావం పవిత్ర హజ్ యాత్రపైనా పడింది. దీనికితోడు మక్కాలో ఈ ఏడాది హజ్ యాత్రికులకు మౌలిక వసతుల ఏర్పాట్ల ఖర్చు కూడా పెరగడంతో యాత్ర వ్యయం భారీగా పెరిగింది. ఈ కారణంగా ఈ ఏడాది ఇప్పటికే వందలాది మంది భారత ముస్లింలు హజ్‌ను రద్దు చేసుకున్నట్లు దుబాయ్‌కు చెందిన అరబ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్ హజ్ కమిటీ (సీహెచ్‌సీ) ద్వారా యాత్రకు ఎంపికైన 400 మంది యాత్రికులు యాత్రను రద్దు చేసుకున్నట్లు చెప్పింది.
భారత్ నుంచి ఈ ఏడాది మొత్తం 1,36,020 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లాల్సి ఉంది. యాత్రికులకు మక్కాలో రెండు రకాల వసతి సౌకర్యం ఉంది. చవకైన అజీజియా ఒకటికాగా ఖరీదైన గ్రీన్ కేటగిరీ మరొకటి. అజీజియా విభాగం కింద గత ఏడాది యాత్రికులు ఒక్కొక్కరూ రూ. 1,36,264 చెల్లించగా ఈసారి ఆ ఖర్చు 1,49,450కి పెరిగింది. అలాగే గ్రీన్ కేటగిరీలో గత ఏడాది రూ. 1,64,905 ఉండగా ఈసారి అది రూ.1,79,800కు పెరిగింది. మరోవైపు సబ్సిడీ విమాన ప్రయాణ చార్జీలు కూడా భారీగా పెరిగాయి. గత ఏడాది ఎయిర్ ఇండియా రూ. 20 వేలు వసూలు చేయగా ఈ ఏడాది ఆ చార్జీ రూ. 28 వేలకు పెరిగింది.
హజ్ యాత్రకు ‘రూపాయి’ దెబ్బ!
Published Thu, Sep 5 2013 7:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement