సచివాలయం అచ్చిరాలేదా!
* సెక్రటేరియట్‌కు దూరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల రోజుల్లో వచ్చింది మూడుసార్లే..
* అధికారిక సమీక్షలన్నీ ఎంసీహెచ్‌ఆర్‌డీలోనే అత్యవసర ఫైళ్లపై నివాసంలోనే సంతకాలు..
* పెద్ద సంఖ్యలో పేరుకుపోతున్న ఫైళ్లు వరుసగా రద్దవుతున్న సీఎం కార్యక్రమాలు..
* చివరి నిమిషంలో ఖమ్మం, వరంగల్ పర్యటనలు రద్దు..
* శనివారం నాటి కేబినెట్ భేటీ ఆకస్మికంగా వాయిదా
సాక్షి, హైదరాబాద్: నిత్యం రాష్ట్ర పాలనా వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సచివాలయానికి చుట్టపు చూపుగా వస్తున్నారా..? వివిధ పథకాల కోసం జిల్లాల్లో పర్యటనలు, తీరికలేకపోవడమే ఇందుకు కారణమా? లేదా మరేవైనా కారణాలున్నాయా? ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ సచివాలయానికి అప్పుడప్పుడు వస్తుండడం అటు రాజకీయ, ఇటు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆషాఢ మాసం ప్రభావమో.. మరేదేమోగానీ గడచిన నెలరోజుల్లో ముఖ్యమంత్రి మూడుసార్లు మాత్రమే సచివాలయానికి వచ్చారు. సచివాలయానికి వాస్తుదోషం ఉందన్న కొందరు పండితుల సూచనల మేరకే ఆయన పెద్దగా వెళ్లడం లేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
దానికి అనుగుణంగానే సచివాలయాన్ని మరోచోటుకు తరలించే ప్రయత్నాలకు సీఎం కేసీఆర్ అధికారికంగానే ఫైళ్లు కదిపారు కూడా. అంతేకాదు తన పాలన అంతా బేగంపేటలోని అధికారిక నివాసం నుంచే సాగిస్తున్నారు. గత సీఎంలు ఉపయోగించిన అక్కడి క్యాంపు కార్యాలయానికి తాళం వేసేశారు. ఇక అధికారులతో సమీక్ష సమావేశాలను సచివాలయంలో కాకుండా.. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సంతోష్ కుమార్ అనారోగ్యంతో చనిపోయారు. తర్వాత సీఎం కార్యాలయంలో పీఆర్వోగా ఉన్న విజయ్‌కుమార్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. సీఎంవోలో అదనపు కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై ఇటీవల ఔట్‌లుక్ పత్రికలో వచ్చిన అనుచిత కథనం ముఖ్యమంత్రిని మనస్తాపానికి గురిచేసిందని అధికార వర్గాల్లో చర్చ జరిగింది.
ఇక గత పది రోజుల్లో జ్వరం కారణంగా మూడ్రోజులపాటు సీఎం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. నూతన పారిశ్రామిక విధానం అమల్లో భాగంగా తొలి దరఖాస్తు చేసుకున్న 17 పరిశ్రమలకు అనుమతి పత్రాలను జారీ చేసేందుకు గతనెల 23న సీఎం సచివాలయానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అప్పట్నుంచీ ఇప్పటివరకు అటువైపు రాలేదు. దీంతో సీఎం పేషీలో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. అత్యవసర ఫైళ్లను క్యాంపు కార్యాలయానికి తెప్పించుకొని సంతకాలు చేస్తున్నారు. మిగతా ఫైళ్లు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.
రద్దవుతున్న కార్యక్రమాలు..
తొలుత అడపాదడపా సచివాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ రెండు నెలలుగా ఏదో ఒక కారణంతో దూరంగా ఉంటున్నారు. రాష్ట్రపతి పర్యటన, హరితహారం జిల్లాల పర్యటనలకు కొంత సమయం వెచ్చించినప్పటికీ.. రాష్ట్రపతికి గవర్నర్ రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందుకు హాజరు కాలేదు. అస్వస్థత కారణంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల హరితహారం పర్యటనలను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. శనివారం తలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్నీ అదే తీరులో వాయిదా వేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన కేబినెట్ భేటీ రద్దయినట్లు మధ్యాహ్నం ప్రకటించడంతో కారణమేమిటో తెలియక మంత్రులు సైతం విస్తుపోయారు.
మంత్రులదీ అదే దారి!
మంత్రులు కూడా సచివాలయానికి రావడం తగ్గించారు. అధికారులు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సమయ పాలన పాటించాలంటూ అప్పట్లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేసినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. అధికారులు, ఉద్యోగులు పనివేళలు పాటించడం లేదంటూ ఇటీవల ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సచివాలయంలోని అన్ని విభాగాలకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
ఊసులేని ప్రజా దర్బార్..
సీఎం అయ్యాక ప్రతి రోజూ సామాన్యుల బాధలు తీర్చేందుకు గంట సమయం కేటాయిస్తానన్న కేసీఆర్... సంవత్సరం దాటినా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. సీఎం అయిన కొత్తలో కేసీఆర్ సచివాలయంలో కాన్వాయ్ ఆపి మరీ ప్రజలను కలసి, మాట్లాడి, విజ్ఞాపన పత్రాలు తీసుకునేవారు. కానీ క్రమంగా దాన్ని తగ్గించి సచివాలయానికి సామాన్యులు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. విజిటర్ పాస్‌లను సైతం భారీగా తగ్గించారు. మంత్రుల పేషీలకు తప్ప సీఎం పేషీ కోసం పాసులు ఇవ్వటం లేదు.
ఆగమేఘాలపై రోడ్డు నిర్మాణం
ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు నిర్వహించే సమతా బ్లాక్ (సీ బ్లాక్) నుంచి బయటకు వెళ్లే దారిలో ఎడమ వైపు మళ్లడం సరికాదని, నేరుగా వెళ్లాలని వాస్తు నిపుణులు సూచించిన నేపథ్యంలో ఐలాండ్‌ను కుదించారు. పచ్చిక బయళ్లతో ఉన్న ప్రాంతాన్ని తగ్గించి రహదారిని వెడల్పు చేసే పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాతే సచివాలయానికి రావాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగమేఘాలపై రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు.