‘సంపూర్ణ ఆరోగ్యం’పై దృష్టి పెట్టండి!
- పీజీఐఎంఈఆర్ స్నాతకోత్సవంలో వైద్యులకు మోదీ పిలుపు
చండీగఢ్: సంపూర్ణ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనారోగ్యం గురించి కాకుండా, వ్యాధి నివారణ, సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించే ధోరణి ప్రారంభమైందన్నారు. ఆరోగ్య రంగ విధానాలు, వ్యూహాలూ ఈ దిశగానే సాగుతున్నాయన్నారు. వైద్యులు కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ఔషధాలపై ఆధారపడని మంచి ఆరోగ్యం కావాలని ఇప్పడు ప్రజలు కోరుకుంటున్నారన్న మోదీ.. యోగా అందుకు సరైన సాధనమన్నారు. ప్రజలను అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యం వైపు తీసుకెళ్లే సామర్థ్యం యోగాకుందని, అందుకే ప్రపంచం యోగా వైపు ఆకర్షితమైందని వివరించారు. ‘192 దేశాల మద్దతుతో,177 దేశాలు సహ స్పాన్సర్స్‌గా, కేవలం 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ తీర్మానం ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందింది’ అని గుర్తు చేశారు.
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) 34వ స్నాతకోత్సవంలో శుక్రవారం మోదీ పాల్గొన్నారు. వైద్యులుగా సమాజంలో నిర్వర్తించాల్సిన బాధ్యతలపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు, ముఖ్యంగా పేదలకు సేవ చేసే గొప్ప బాధ్యత వైద్యులపై ఉందన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- ‘ఏ విషయంలోనైనా అనిశ్చితి ఏర్పడినప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు.. దేశంలోని అత్యంత పేదవాడి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు తీసుకునే ఏ నిర్ణయం ఆ పేదవాడికి ఉపయోగపడ్తుందో ఆ నిర్ణయంతీసుకోండి’ అంటూ మహాత్మాగాంధీ బోధించారు. విధుల్లో భాగంగా మీకలాంటి పరిస్థితి వస్తే, మీరూ మహాత్ముడి ఆ సూచనను గుర్తు తెచ్చుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలో ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతుంది.
- మీరు తీసుకునే నిర్ణయాల్తో ఇతరులు, మొత్తం సమాజం ప్రభావితమవుతుంది.
- వైద్యుడంటే సామాన్యుడికి దైవం తరువాత దైవం అంతటివాడు. ఆ గౌరవాన్ని డాక్టర్లు కాపాడుకోవాలి.
- మీలో కొందరు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు కావచ్చు. కానీ ఇది మీ దేశం. మీరీ స్థాయికి రావడానికి పరోక్షంగా ఈ దేశంలోని ‘చాయ్‌వాలా’ సహా ఎందరో పేదల కృషి కూడా ఉంది. వారి రుణం తీర్చుకునే దిశగా కూడా మీరు ఆలోచించాలి.
- సెప్టెంబర్ 11 అంటే ఏమీ గుర్తురాదు. కానీ 9/11 అనగానే అమెరికాలో ఉగ్రదాడి జరిగిన రోజు గుర్తొస్తుంది. మానవత్వం మంట గలిసిన రోజు, వేలాదిమంది చనిపోయిన రోజు అది. ఈ రోజు కూడా సెప్టెంబర్ 11నే. అయితే ఇది ప్రజల ప్రాణాలను కాపాడడానికి యువ వైద్యులు సమాయత్తమవుతున్న రోజు. అందుకే ఈ రోజు మీ జీవితాల్లో చాలా ముఖ్యమైంది.
- సెప్టెంబర్ 11కు మరో చరిత్రాత్మక ప్రత్యేకత కూడా ఉంది. 1893లో ఇదే రోజు అమెరికాలోని షికాగోలో సర్వ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగించారు. అమెరికన్లకు మానవత్వంలోని ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. ఫీజు ఇచ్చుకోలేని ఒక పేద రోగికి ఒక వైద్యుడు చికిత్స చేస్తే, 20 ఏళ్ల తరువాతైనా ఆ రోగి ఫీజు చెల్లించి, రుణం తీర్చుకుంటాడు. తన పేదరికాన్ని ఆమోదించిన వైద్యడిని అలా గుర్తు పెట్టుకుంటారు.