బ్రాంచిలొద్దు! బ్యాంకులు పెట్టండి!! | RBI allows expanded foreign bank presence in new rules | Sakshi
Sakshi News home page

బ్రాంచిలొద్దు! బ్యాంకులు పెట్టండి!!

Published Thu, Nov 7 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

బ్రాంచిలొద్దు! బ్యాంకులు పెట్టండి!!

బ్రాంచిలొద్దు! బ్యాంకులు పెట్టండి!!

 ముంబై: విదేశీ బ్యాంకులకు కళ్లెం వేస్తూనే... నిబంధనలు పాటిస్తే గనక దేశమంతా స్వారీ చేయొచ్చునంటూ రిజర్వు బ్యాంకు బుధవారం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. పారదర్శకత లేకుండా గజిబిజి నిర్మాణంతో ఉండే విదేశీ బ్యాంకులు దేశంలో పూర్తిస్థాయి అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, వాటి ద్వారానే కార్యకలాపాలు జరపాలని స్పష్టం చేసింది. అయితే అలా ఏర్పాటు చేసే అనుబంధ సంస్థల ద్వారా మన ప్రైవేటు బ్యాంకుల్ని ఎడాపెడా కొనుగోలు చేయడానికి కూడా ఆర్‌బీఐ పచ్చజెండా ఊపేసింది.

అలా కొనుగోలు చేయటంతో పాటు... సదరు అనుబంధ సంస్థ మన దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావచ్చు. అయితే అది కొనుగోలు చేసే ప్రైవేటు బ్యాంకుల్లో దాని వాటా 74 శాతానికి మించకూడదు. ఇలా తయారైన ‘వి’దేశీ బ్యాంకులు... ఇతర జాతీయ బ్యాంకుల్లా దేశ వ్యాప్తంగా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే... విదేశీ బ్యాంకులు ఇప్పటిదాకా ఇక్కడ బ్రాంచిల ద్వారా వ్యాపారం చేసేవి. ఇకపై నేరుగా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తాయి. మన చిన్నాచితకా ప్రైవేటు బ్యాంకుల్ని వాటి ఖాతాల్లో కలిపేసుకుంటాయి. ఇలా దేశంలో ఏర్పాటు చేసే అనుబంధ సంస్థల కనీస ఈక్విటీ మూలధనం లేదా నెట్‌వర్త్ కనీసం రూ.500 కోట్లుండాలనేది ప్రధాన నిబంధన.
 
 దేశంలో పూర్తిస్థాయి అనుబంధ సంస్థల ద్వారా మాత్రమే కార్యకలాపాలు చేయాల్సిన బ్యాంకుల గురించి ఆర్‌బీఐ తెలియజేసింది. అవి...

  •      క్లిష్టమైన గజిబిజి వ్యవస్థాగత నిర్మాణం ఉన్న బ్యాంకులు..
  •      మాతృ దేశంలో పారదర్శకంగా పూర్తిస్థాయి వివరాలు వెల్లడించనివి విదేశీ బ్యాంకులు
  •      అతి తక్కువ మంది వాటాదారులు లేదా భాగస్వామ్య సంస్థలు ఉన్నవి..
  •      మూసేసేటపుడు మాతృదేశ డిపాజిటర్లకు ప్రిఫరెన్షియల్ క్లెయిమ్‌కు అవకాశమివ్వాలని అక్కడి దేశ చట్టాల్లో పేర్కొన్న బ్యాంకులు.
  •  అయితే 2010 ఆగస్టుకన్నా ముందు నుంచీ మన దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ బ్యాంకులకు మాత్రం... ఇప్పట్లాగే కొనసాగాలా లేక పూర్తిస్థాయి అనుబంధ సంస్థల ద్వారా కార్యకలాపాలు సాగించాలా అనేది నిర్ణయించుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 43 విదేశీ బ్యాంకులు, 333 బ్రాంచిల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

  ఈ మార్గదర్శకాలు ఎందుకంటే..
 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సంక్షోభం ద్వారా ఆర్థిక సంస్థల మధ్యనున్న అనుబంధం బయటపడిందని, ఈ అనుబంధం కొన్ని పెద్ద బ్యాంకుల వైఫల్యాల విషయంలో స్థానిక అధికార యంత్రాంగం రాజీ పడేలా చేసిందని ఆర్‌బీఐ చెబుతోంది. ఇది నేర్పిన పాఠాలతోనే దేశీయ బ్యాంకుల ఏర్పాటు అవసరం కనిపించిందని తెలిపింది. ‘‘దీనివల్ల సొంత మూలధనం, డెరైక్టర్ల బోర్డు ఉండే ప్రత్యేక చట్టబద్ధ సంస్థలు ఏర్పడతాయి. నియంత్రణ సంస్థల పని సులభమవుతుంది. ఆస్తి అప్పుల విషయంలో విదేశీ బ్యాంకులకు, ఇక్కడి వాటి అనుబంధ సంస్థలకు మధ్య స్పష్టమైన విభజన ఉంటుంది’’ అని ఆర్‌బీఐ వివరించింది. పెపైచ్చు బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడటానికి కీలక చర్యల్ని కూడా ఆర్‌బీఐ ప్రకటించింది. దానిప్రకారం... మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోని మూలధన, రిజర్వుల్లో విదేశీ బ్యాంకుల మూలధన, రిజర్వులు గనక 20 శాతం దాటితే వెంటనే ఆర్‌బీఐ రంగంలోకి దిగి తదుపరి విదేశీ బ్యాంకుల ప్రవేశాన్ని లేక వాటి పెట్టుబడుల్ని నిలిపివేస్తుంది.
 
 కొన్ని వాస్తవాలు...

  •      దేశంలో ఏడీఆర్‌లను లిస్ట్ చేసిన స్టాన్ చార్ట్ బ్యాంకు కూడా బ్రాంచిల ద్వారానే కార్యకలాపాలు సాగిస్తోంది తప్ప అనుబంధ సంస్థను ఏర్పాటు చేయలేదు.
  •      స్టాన్‌చార్ట్, సిటీ, హెచ్‌ఎస్‌బీసీలకు మాత్రమే దేశంలో 30కన్నా ఎక్కువ బ్రాంచీలున్నాయి.
  •      రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్‌కు 31 బ్రాంచీలున్నా... ఇక్కడి రిటైల్ కార్యకలాపాలను మూసేస్తోంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement