‘ఆ ఉపగ్రహంతో రైతులకు ఎంతో మేలు’
న్యూఢిల్లీ: అన్నదాతల కష్టం ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 2,700 లక్షల టన్నులకు పైగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల ప్రోత్సహంతో నగదు రహిత లావాదేవిలు పెరుగుతున్నాయని చెప్పారు. భీమ్ యాప్ పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. నరేంద్ర మోదీ యాప్ ద్వారా లక్షల మంది సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిపారు.
మంగళ్ యాన్ విజయవంతం తర్వాత అంతరిక్షంలో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. అంతరిక్షంలోకి ఒకేసారి 104 ఉప గ్రహాలను పంపిన మొదటి దేశంగా నిలిచిందని అన్నారు. 2డీ కార్టోశాట్ ఉపగ్రహంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దేశానికి మరింత మంది శాస్త్రవేత్తలు అవసరమన్నారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెరగాలని ఆకాంక్షించారు. ఆసియా రగ్బీ సెవన్స్ ట్రోఫిలో వెండి పతకం సాధించిన మహిళల జట్టును ప్రధాని అభినందించారు. అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్‌కు అభినందలు తెలిపారు.