గంగూలీపై సీనియర్ క్రికెటర్ సెటైర్లు!
న్యూఢిల్లీ: మాజీ సీనియర్ క్రికెటర్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మధ్య బద్ధ శత్రుత్వమున్న సంగతి తెలిసిందే. గతంలో పరస్పర విమర్శలు సంధించుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండటంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించింది. కానీ తాజాగా రవిశాస్త్రి మరోసారి గంగూలీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇందుకు విశాఖపట్నంలో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టు వేదిక అయ్యింది. మూడో రోజు ఫస్ట్ సెషన్‌లో కామెంటరీ చేస్తూ ప్రస్తుత భారత బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీతో బెస్ట్ ఆటాక్ చేస్తున్నదని రవిశాస్త్రి ప్రశంసించారు.
ఉమేశ్‌ను ‘విదర్భ ఎక్స్‌ప్రెస్’అనీ, షమీని ‘బెంగాల్ సుల్తాన్’ అని కొనియాడారు. దీంతో మరో కామెంటెటర్ ఇయాం బోథం స్పందిస్తూ బెంగాల్ ప్రిన్స్ ఇప్పటికే ఉన్నాడు కదా బెంగాల్ నుంచి మరో ఐకాన్ వచ్చాడా? అని ఆరా తీశాడు. గంగూలీకి బెంగాల్ ప్రిన్స్ అన్న ప్రశంస ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రవిశాస్త్రి స్పందిస్తూ బెంగాల్ ఏ ఒక్క ప్రిన్స్‌కు చెందినది కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. పరోక్షంగా గంగూలీపై రవిశాస్త్రి వేసిన సెటైర్ ఇదని పరిశీలకులు భావిస్తున్నారు.