ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు , చమురు ధరల పతనం, ప్రభుత్వ డిమానిటేజేషన్ పై పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో లాభనష్టాల మధ్య మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురి అయ్యాయి. ఒక దశలో 138 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 71 పాయింట్ల నష్టంతో 26,240 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 8079 వద్ద ముగిశాయి. మరోవైపు వరుసగా నాలుగవ సెషన్లో కూడా అమ్మకాలు జోరు కొనసాగడంతో నిఫ్టీ 8100 స్థాయికి కిందికి పడిపోయింది. దీంతోపాటు అయిదునెలల కనిష్టానికి దిగజారింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లోని నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసింది.
మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతూ చివరికి నష్టాలనే నమోదు చేశాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు లాభపడగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ , పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ షేర్లలో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. ప్రారంభంనుంచీ మీడియా , ఐటీ రంగం నష్టాల్లోనే కొనసాగింది. కోల్ ఇండియా అంబుజా, భారతీ, ఏసీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టపోగా టాటా మోటార్స్, హిందాల్కో, బీవోబీ, సిప్లా, గెయిల్, లుపిన్, యాక్సిస్, సన్ ఫార్మా లాభపడ్డాయి.
అటు డాలర్ తో పోలిస్తే 13 పైసలు నష్టపోయి 67.82 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 53 నష్టంతో రూ.29,330 వద్ద ఉంది.