బ్యాంకు షేర్ల జోరు..లాభాల్లో మార్కెట్లు
Published Tue, Oct 18 2016 9:47 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
ముంబై : ఆసియన్ మార్కెట్లు, బ్యాంకింగ్ స్టాక్స్ మద్దతుతో మంగళవారం నాటి దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 189.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51.40 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, టాటా స్టీల్ సెన్సెక్స్లో లాభాల్లో నడుస్తున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. అలాగే 11 కంపెనీల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ర్యాలీ జరుపుతుండటంతో మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
నేటి నుంచి జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో జీఎస్టీ ప్రామాణిక రేటును, రాష్ట్రాల పరిహారాలను నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఓవైపు అమెరికా ఆర్థికవ్యవస్థ స్థిరత్వం తక్కువ వడ్డీరేట్లకు ఆటంకంగా నిలుస్తుందంటూ పేర్కొన్న ఫెడ్ వైస్ చైర్మన్ ఫిషర్ వడ్డీరేట్లను పెంచడం అమెరికన్ సెంట్రల్ బ్యాంకుకు అంత సులభతరం కాదంటూ మిశ్రమ సంకేతాలు ఇవ్వడంతో డాలర్ విలువ కొంత బలహీనపడింది. ఏడు నెలల గరిష్ట స్థాయిలో నడిచిన డాలర్ పడిపోవడంతో, ఆసియన్ మార్కెట్లు, ఇతర కరెన్సీలు పుంజుకున్నాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా 10 పైసలు లాభంతో 66.76గా ప్రారంభమైంది. డాలర్ పడిపోవడం పసిడికి కొంత కలిసివచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 64 రూపాయల లాభంతో 29,720గా నమోదవుతోంది.
Advertisement
Advertisement