క్రేజీవాల్ ఆహ్వానానికి షీలా దీక్షిత్ వెనుకంజ!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత క్రేజీవాల్ ఆహ్వానానికి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వెనుకంజ వేస్తున్నారు. తనతో బహిరంగ చర్చకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రజలు కూడా ఆ చర్చలో పాల్గొని నేరుగా ప్రశ్నలు అడిగేలా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కూడా బహిరంగ చర్చకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరానని, అయితే ఆమె తన ప్రతిపాదనను తోసిపుచ్చారన్నారు. కొందరు పత్రికా సంపాదకుల సలహా మేరకే మరోమారు షీలాదీక్షిత్‌ను బహిరంగ చర్చలో తనతోపాటు పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పత్రికా సంపాదకుల సలహా మేరకే చర్చకు ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తెలిపారు.
తన ప్రతిపాదనను షీలాదీక్షిత్ అంగీకరించినట్లయితే భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌ను కూడా ఆహ్వానిస్తానన్నారు. ఎన్నికల్లో పాల్గొనే ప్రధాన అభ్యర్థులు ప్రజల మధ్య జరిగే చర్చలో పాల్గొనే సంప్రదాయం రావాలని, ఈ చర్చ ఏ టీవీ స్టూడియోలోనో కాకుండా ప్రజల మధ్యే జరగాలన్నారు. ప్రజలందరూ ఈ చర్చలో నేరుగా పాల్గొని, నేతలను ప్రశ్నించేలా చర్చ జరగాలన్నారు. అందుకే తాను పదే పదే ముఖ్యమంత్రిని బహిరంగ చర్చకు రావాల్సిందిగా కోరినట్లు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అయినప్పటికీ కనీసం ఒక్కసారి కూడా ఆమె చర్చలో పాల్గొనేందుకు అంగీకరించలేదన్నారు. ఒకవేళ ఈసారి అంగీకరిస్తే చర్చ ఏ రూపంలో జరగాలి? దానిని ఎవరు నిర్వహించాలి? తదితర విషయాలను కూర్చొని మాట్లాడుకోవచ్చన్నారు. రాంలీలా మైదాన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో చర్చ జరగాలని తాను కోరుకుంటున్నానని, అయితే ఇది కేవలం సలహా మాత్రమేనన్నారు.