పదేళ్లు దాటితే స్క్రాప్‌కే...
వాణిజ్య వాహనాలపై త్వరలో కొత్త చట్టం: గడ్కారీ
న్యూఢిల్లీ: ఇకపై పదేళ్లు దాటిన వాణిజ్య వాహనాలు స్క్రాప్‌కు తరలాల్సిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం తీసుకురానున్నట్లు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. అయితే 15 ఏళ్లు దాటిన ట్రక్కులు, బస్సులపై నిషేధం విధించే ఆలోచన ప్రస్తుతం లేదని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత వాహనాలను తిరిగిచ్చి.. కొత్తది కొనుగోలు చేసే వారికి పన్ను మినహాయింపు, రాయితీలు కలిపి రూ.2.5 లక్షల వరకూ తగ్గింపు పొందవచ్చని చెప్పారు. కొత్త వాహనానికి ఉన్న ధర ఆధారంగా 10 నుంచి 15 శాతం రాయితీ లభించేలా చట్టం రూపకల్పన చేయనున్నామన్నారు.
పాత సాంకేతిక ఆధారంగా తయారైన వాహనాలు పదేళ్లకు మించి వాడితే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, దీనిని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని గడ్కారీ చెప్పారు. తొలుత 15 ఏళ్లు దాటిన వాహనాలకు చట్టం వర్తింపజేసి తరువాత 10 ఏళ్లకు తగ్గిస్తామని వివరించారు. పాత వాహనాన్ని తిరిగిచ్చే వారికి ప్రభుత్వం నుంచి రూ.50 నుంచి రూ.60 వేలు, కంపెనీల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కొత్త వాహనం కొనుగోలుపై రాయితీ లభించేలా చర్చలు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ఆటోమోబైల్ రంగం కూడా అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారీగా పేరుకుపోయే స్క్రాప్‌ను రిసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం పారిశ్రామిక జోన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఓడరేవులున్న చోట్ల రిసైక్లింగ్ పరిశ్రమల ఏర్పాటును పరిశీలించనున్నట్లు, దీంతో చాలా మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు యూరో-5, యూరో-6 యంత్రాలతో కూడిన వాహనాలను రూపొందించాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు.