40ఏళ్ల తర్వాత ఫేస్బుక్ వారిని కలిపింది..! | Thanks to Facebook appeal, the pair finally met again today | Sakshi
Sakshi News home page

40ఏళ్ల తర్వాత ఫేస్బుక్ వారిని కలిపింది..!

Published Wed, Sep 30 2015 5:04 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

40ఏళ్ల తర్వాత  ఫేస్బుక్ వారిని కలిపింది..! - Sakshi

40ఏళ్ల తర్వాత ఫేస్బుక్ వారిని కలిపింది..!

నాలుగు దశాబ్దాల తర్వాత ఆమె స్వప్నం సాకారమైంది. ఓ నర్సు ఒడిలో తాను హాయిగా ఒదిగి పోయిన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను చూసి... మైమరచిపోయేది. కాలిన గాయాలతో బాధపడుతున్నపుడు అక్కున చేర్చుకున్న ఆ మహిళను చూడాలన్నదే ఆమె తపన.. . అమండా స్కార్పినాటీ ఇరవై ఏళ్ళపాటు ఎలాంటి ఆధారం లేకుండా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది.  తాను ఎలాగైనా ఆ నర్సును కలవాలన్నదే ఆశ.  అమండాకు ఇప్పుడు 38 సంవత్సరాల వయసు.. ఫేస్ బుక్.. ఆమె లక్ష్య సాధనకు సహకరించింది. ఇరవై ఏళ్ళ స్వప్నాన్ని ఒక్కరోజులో సాకారం చేసింది.

న్యూయార్క్ లోని అథెన్స్ లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్ గా పనిచేస్తున్న అమండా స్కార్పినాటి ఇరవై ఏళ్ళుగా తన శోధన కొనసాగిస్తూనే ఉంది. కేవలం మూడు నెలల పసిపాపగా ఉన్నపుడు  మరుగుతున్న నీళ్లు పడటంతో ఆమెకు  తీవ్ర గాయాలయ్యాయి. గాయాలకు మందురాసి తలకు, చేతికి, తెల్లని గుడ్డతో కట్లు కట్టారు. పలు సర్జరీలు కూడ చేసి చివరికి గాయాలు తగ్గేలా చికిత్స అందించారు. ఎట్టకేలకు తాను బతికి బయట పడింది. అయితే తనను అంతలా లాలిత్యంతో సాకిన ఆ నర్సు ఎవరు? ఆమెను జీవితంలో ఎలాగైనా కలవాలి అన్నదే అమండా ఆశ...  

1997 సంవత్సరంలో అమండాకు ఓ చిన్నపాటి క్లూ దొరికింది. అల్బానీ మెడికల్ సెంటర్ ప్రచురించిన వార్షిక నివేదికలో కార్ల్ హోవార్డ్ తీసిన చిత్రాల్లో ఆ నర్స్ ఫొటో కనిపించడంతో అమండా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ శీర్షికలో నర్స్  పేరు మాత్రం ప్రస్తావించలేదు. దాంతో అమండాకు దొరికిన చిన్నఆశ.. నీరుగారిపోయింది. అయినా ఆమె పట్టు వీడలేదు.  

ఈ నెల మొదట్లో అమండా తన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.  ఆల్బనీ మెడికల్ సెంటర్ వార్షిక నివేదికలోని ఫొటోలను కూడ వరుసగా పోస్ట్ చేసింది. పై ఫోటోల్లోని నర్స్ పేరును గుర్తు పట్టేందుకు ట్రై చేయమని రిక్వస్ట్ కూడా పెట్టింది. తన ప్రయత్నంపై ఓ పక్క అనుమానం కలుగుతూనే ఉంది. ఆమె పోస్ట్ చేసిన పన్నెండు గంటల్లోపే ఆ ఫోటోలు ఐదు వేలసార్లు షేర్ అయ్యాయి. అంతేకాదు ఒక్క రోజులోనే ఆమెకు ఫలితం  లభించింది. మెడికల్ సెంటర్ లో ఫెలోగా ఉన్న యాంజెలా ల్యూరీ ఫొటోలోని బెర్గర్ ను గుర్తు పట్టింది. అమండాకు ఆమె  సుశాన్ బెర్గర్ అని చెప్తూ మెసేజ్ చేసింది.

''ఆమె ఎవరో నాకు తెలియదు.. నేను తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నపుడు నన్ను అక్కున చేర్చుకొని చికిత్స అందించింది. ఆమె ఒడిలో నేను సేద తీరానని నా ఫొటోలు చూస్తే నాకు తెలుస్తోంది. అంతేకాదు ఆమె నాపై ఎంతో శ్రద్ధ చూపించినట్లు కూడ అనిపించింది. నేనిప్పుడు ఆమెను కలుస్తున్నాను. ఈరోజు వస్తుందని నేనుకోలేదు'' అంటూ ఎంతో ఆనందంలో తేలిపోయింది అమండా స్కార్పినాటి.

అమండాను కలిసే ముందు బెర్గర్ కూడ అప్పటి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంది. సాధారణంగా పిల్లలు సర్జరీ తర్వాత నిద్ర పోతుంటారు. లేదా ఏడుస్తారు. కానీ అప్పట్లో ఈ పాప చాలా ప్రశాంతంగా ఉండేది... అంటూ జరిగిన విషయాన్ని నెమరువేసుకుంది. మనను జీవితాంతం గుర్తుకు తెచ్చుకునే అదృష్టం ఎంతమందికి కలుగుతుందో నాకు తెలియదు. నిజంగా నేను అటువంటి అదృష్టాన్ని పొందడం నాకు ఆనందంగా ఉంది అంటూ బెర్గర్ తన మనసులోని ఆనందాన్ని పంచుకుంది.

ఓ లోకల్ టీవీ రిపోర్టర్... బెర్గర్ ను కలిసే ముందు అమండాతో ఫోన్లో మాట్లాడించాడు. పన్నెండేళ్ళ అమండా కుమారుడు కూడా... ఇది ఎంతో ఆనందకరమైన సందర్శమని, బెర్గర్ మాటలు వింటేనే ఆమె ఎంతటి సౌమ్యురాలో అర్థమైందని అన్నాడు. వారిద్దరి మీటింగ్ ప్రారంభమైన తర్వాత అమండా తన ఫీలింగ్ ను అందరితో పంచుకుంది. నిజంగా తాను బెర్గర్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని, తమ స్నేహం ఇప్పుడు మొదలయ్యేది కాదని, పరిచయం లేకపోయినా  ఇది జీవిత కాల స్నేహమేనని తెలిపింది.   

సుమారు నలభై ఏళ్ళ తర్వాత వారి కలయిక ఇప్పుడు మెడికల్ సెంటర్ కాన్ఫరెన్స్ రూమ్ లో అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఉద్వేగ క్షణాలను ఎన్నో కెమెరాలు క్లిక్ మనిపించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement