యెమెన్ రాజధాని సనాలోని అల్ రాబట్ విధిలో నిన్న సంభవించిన వరుస జంట బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. క్షతగాత్రులను సనాలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పింది. అయితే నగరంలోని రాబర్ట్ వీధిలో చెత్త ఉంచిన ప్రదేశంలో మొదటి బాంబు పేలింది. ఆ ఘటనలో ఎవరు గాయపడలేదు.
ఆ శబ్దానికి అటువైపుగా వెళ్తున్న పాదచారులు అందరు గుమ్మిగూడారు. మరి కొన్ని నిముషాల వ్యవధిలో మరో బాంబు పేలింది. దాంతో అక్కడ ఉన్నవారందరు తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడు ధాటికి సమీపంలోని కార్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో భద్రత సిబ్బంది రంగంలోని దిగారు. సమీపంలోని దుకాణాలను మూసివేయించారు.
అనంతరం స్థానికంగా తనిఖీలు చేపట్టారు. భద్రత దళాలను హతమార్చేందుకు ఆ బాంబులు పెట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దేశంలో బలంగా విస్తరించిన అల్ ఖైదా అనుబంధ సంస్థలే ఆ బాంబు పేలుళ్లకు కారణమని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే యెమెన్ దక్షణ భాగంలోని సాబ్వా రాజధాని అతక్లో నిన్న ఆత్మాహుతి దాడిలో ఆర్మీ నిఘా అధికారి మరణించాడు.