Gautam savang
-
వారి కుట్రలను భగ్నం చేయండి : డీజీపీ
అమరావతి : దేవాలయాలపై దాడులు, కేసుల ఛేదన, అరెస్టులు వంటి అంశాలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి కుట్రలు భగ్నం చేయాలన, ఇందుకు ఏపీ డీజీపీ విలేజ్ కమిటీల సేవలను వినియోగించుకుని మందుకు సాగాలని పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణకు ప్రజల సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే మీడియా, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్దేశాలు బయట పడుతున్నాయని, దానిపై ప్రత్యేక దృష్టిపెట్టి తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదలొద్దని తెలిపారు. ఆధారాలతో సహా నిందితులను పట్టుకోవాలని, దాడులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పేర్కొన్నారు. -
సలామ్ అత్తకు రూ.25 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి/నంద్యాల: నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యతో ఆసరా కోల్పోయిన అతని అత్త మాబున్నీసాను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తో కలిసి సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సలామ్ కుటుంబం ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని, దీనికి పోలీసుల వేధింపులే కారణమంటూ సలామ్ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన వెంటనే సీఎం జగన్ తనతోను, డీజీపీ సవాంగ్‌తోను మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. తప్పు చేస్తే పోలీసులనూ ఉపేక్షించేది లేదన్నారు. తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, అణగారిన వర్గాలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా పోలీసులు వేధింపులకు పాల్పడితే బాధితులెవరూ ప్రాణాలు తీసుకోవద్దని, తక్షణం ఏపీ పోలీస్ సేవా యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైతే బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేలా త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ముస్లింలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు చంద్రబాబు యత్నం హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుడైన అచ్చెన్నాయుడిను అరెస్ట్ చేస్తే బీసీలపై కక్ష సాధింపు అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ముస్లిం, మైనార్టీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. టీడీపీ నేతల అవకాశవాద విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పోలీసులనూ ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సలాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవి, హఫీజ్‌ఖాన్ బాధ్యులందరిపైనా చర్యలు అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అందరిపైనా ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. సోమవారం ఆయన నంద్యాలలోని అబ్దుల్సలామ్ ఇంటికి వెళ్లి అతని అత్త, బంధువులను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌తో కలిసి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన నంద్యాల సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లకు నంద్యాల ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రసన్నలత బెయిల్ మంజూరు చేశారు. వారిద్దరిపైనా పోలీసులు ఐపీసీ 323, 324, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, న్యాయమూర్తి దీనిని సెక్షన్ 506 (మాటలతో వేధించడం) పరిధిలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేశారు. నిందితుల తరఫున కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది వి.రామచంద్రరావు వాదనలు వినిపించారు. న్యాయం జరుగుతుందనుకోలేదు నా అల్లుడు, కుమార్తె, వారి పిల్లల ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తారని అనుకోలేదు. ఈ కేసులో విచారణ కమిటీ ఏర్పాటు చేసి.. సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడం సంతోషంగా ఉంది. నా కుటుంబానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నా వాళ్ల చావుకు కారణమైన ఎవరినీ వదిలిపెట్ట వద్దని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. – మాబున్నిసా, అబ్దుల్ సలామ్ అత్త సీఎం స్పందించిన తీరు మనోధైర్యం నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు ముస్లింలలో మనోధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం విచారణ కమిటీ వేయడమే కాకుండా ఆత్మహత్యకు కారణమైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లను సస్పెండ్ చేయడం, వారిని అరెస్ట్ చేయడం అభినందించదగ్గ విషయం. – అబ్దుల్‌ఖాదిర్, మతపెద్ద, నంద్యాల -
ఏడేళ్ల బిందును అక్కున చేర్చుకున్న డీజీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన ఏడేళ్ల బిందును డీజీపీ గౌతమ్ సవాంగ్ అక్కున చేర్చుకున్నారు. నూతన వస్త్రాలు, టెడ్డీబేర్ ఇచ్చి చిన్నారి ముఖంలో సంతోషం నింపారు. తన యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయి వచ్చేంత వరకు బిందును అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా గుర్తించిన పిల్లలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం కాసేపు ముచ్చటించారు. అదే విధంగా రెస్క్యూ చేసిన బాల బాలికలతో పాటు తాడేపల్లి గుడ్ షప్పర్డ్ కరుణామయి హోమ్‌లోని పిల్లలకు స్టడీ కిట్ అందజేశారు. (చదవండి: ఉత్తరాంధ్ర, సీమ వాసుల అభ్యర్థన తిరస్కృతి ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు వేల మంది బాల బాలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ చేసిన వీధి బాలలు, బాల కార్మికులను చైల్డ్ వెల్ఫేర్ హోమ్ లకు తరలించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పజెపుతామని అన్నారు. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు పెట్టిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్.. వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలను బడులకు పంపాలని విజ్ఞప్తి చేశారు. -
ఏపీకి ఎలాంటి ముప్పు లేదు: డీజీపీ
సాక్షి, గుంటూరు: బీరూట్‌లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ఎలాంటి ముప్పు లేదని డీజీపీ తెలిపారు. శుక్రవారం మంగళగిరి కార్యాలయం నుంచి జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. బీరూట్ లోని అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో పోలీస్ శాఖ అప్రమత్తమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం, వినియోగంపై ప్రత్యేక ద్రుష్టి సారించామని తెలిపారు. అమ్మోనియం నైట్రేట్ వినియోగం పై ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని కంపెనీలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని గౌతం సవాంగ్ సూచించారు. కాగా అమ్మోనియం నైట్రేట్ పై 2012 సంవత్సరంలో రూపొందించిన నిబంధనలు : ►లైసెన్సు లేకుండా ఎక్కడ కూడా తయారీకి అనుమతి లేదు. ►అనుమతి లేకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించకూడదు. ►లైసెన్స్ కలిగిన గిడ్డంగులలో మాత్రమే నిల్వ ఉంచాలి. ►నిబంధనలకు లోబడి ఎగుమతులు, దిగుమతులు నిర్వహించాలి. ►ఎంపిక చేసిన లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే సరఫరా చేయాలి. ►పేలుడు పదార్ధాలతో కలిపి అమ్మోనియం నైట్రేట్‌ను రవాణా చేయరాదు. ►కొనుగోలు చేసిన అమ్మోనియం నైట్రేట్ కు అదనంగా రవాణాకు అనుమతి లేదు. ►18 ఏళ్ల లోపు వారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించకూడదు. ►అనుమతి లేకుండా ఎక్కడ కూడా బ్లాస్టింగ్‌లకు ఉపయోగించరాదు. ►అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. -
పాస్ ఉంటే పగటి పూటే అనుమతిస్తాం
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. డీజీపీ ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని సూచించారు. పాస్ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. -
నేడు రాష్ట్రానికి చంద్రబాబు
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి రావడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతినిచ్చారు. రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన డీజీపీ.. ప్రత్యేక పరిస్థితి(స్పెషల్ కేస్)గా పేర్కొంటూ ఈ–పాస్‌కు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో రెండు నెలల తర్వాత చంద్రబాబు సోమవారం రాష్ట్రానికి రానున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో నేరుగా విశాఖకు వెళ్లి ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించాల్సి ఉంది. అక్కడికి విమాన సర్వీసులు రద్దు కావడంతో చంద్రబాబు పర్యటన కూడా రద్దయిందని విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరి చంద్రబాబు రోడ్డు మార్గంలో ఉండవల్లి చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ–పాస్‌తో పాటు లాక్డౌన్ మార్గదర్శకాలను కూడా డీజీపీ రాతపూర్వకంగా జత చేసి చంద్రబాబుకు పంపించారు. ఆ మార్గదర్శకాల్లో డీజీపీ సవాంగ్ ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి.. ► లాక్డౌన్ నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు (మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు), గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి. ► రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అత్యవసర సర్వీసులు మినహా ఎటువంటి ప్రజారవాణాకు, ప్రజలు తిరగడానికి అనుమతిలేదు. ► ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వ్యక్తులు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం విధిగా వైద్య పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్లో ఉండాలి. ► ఈ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పర్యటించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతిస్తున్నాం. లాక్డౌన్ మార్గదర్శకాలకు సహకరించాలి. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకునే కుట్ర చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దీని వెనుక వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్ర ఉందని ఒక ప్రకటనలో ఆరోపించారు. సోమవారం ఒక్క రోజే ఏపీకి విమాన సర్వీసులను బంద్ చేయడం కుట్రలో భాగమేనని తెలిపారు. -
రాష్ట్రానికి వస్తా.. అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న తాను రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ మేరకు డీజీపీకి శనివారం లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానంలో సోమవారం ఉదయం 10.35 గంటలకు ప్రయాణించాలనుకుంటున్నానని అందులో తెలిపారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను కలిశాక అదేరోజు అక్కడినుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నట్టు వివరించారు. విజయనగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మకమైన మూడు లాంతర్ల పిల్లర్‌ను కూల్చివేయడం తనను షాక్‌కు గురి చేసిందని అన్నారు. ఆ ప్రాంతంలో అశోక్‌గజపతిరాజు కుటుంబం గుర్తులను లేకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్యల్లో ఇదొకటని ట్విట్టర్లో శనివారం విమర్శించారు. కాగా, అంగన్వాడీ వర్కర్లు కరోనా సమయంలోనూ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడారని, వారికి రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. -
అంతా అప్రమత్తం
విశాఖలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ సీఎం సూచన మేరకు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులందరూ అక్కడే ఉన్నారు. స్వయంగా అన్ని విషయాలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వైద్య సేవల్లో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితుల్లో కొండంత ధైర్యం నింపుతున్నారు. వివిధ కమిటీల ద్వారా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ శనివారం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు అన్వేషించడంలో భాగంగా ఈ బృందం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో అణువణువూ పరిశీలించింది. గాలిలో స్టైరీన్ మోనోమర్ శాతం కూడా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కంపెనీ పరిసరాల్లో 1.9 పీపీఎంగా నమోదవుతోంది. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు కరికాల వలవన్ తెలిపారు. గంటగంటకూ రీడింగ్ నమోదు చేసి, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు గుర్తిస్తున్నామన్నారు. పశువులకూ వైద్యం ► సీఎం ఆదేశాల మేరకు ప్రమాద ప్రాంతంలో పశువులకూ వైద్యం కొనసాగుతోంది. పలు గ్రామాల్లో పశువులకు సెలైన్ ఎక్కిస్తున్నారు. 13 వెటర్నరీ బృందాలు పని చేస్తున్నాయి. ► బాధిత గ్రామాల్లో వైద్య సదస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పారు. మృతుల బంధువులను వారు పరామర్శించారు. ► ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లోని ప్రజల భద్రత తమ బాధ్యత అని డీజీపీ గౌతమ్ సవాంగ్ భరోసా కల్పించారు. శనివారం ఆయన ప్లాంట్‌ను సందర్శించారు. ఇప్పుడే కంపెనీని తెరవం ► ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితులపై వివిధ కమిటీల అధ్యయనం తర్వాత ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని, అంతవరకు కంపెనీ తెరిచే ప్రసక్తే లేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వైద్యానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం సీఎం ప్రకటించారన్నారు. లీగల్ హెయిర్ రిపోర్టు ఆదివారం తెప్పిస్తారని చెప్పారు. ► విశాఖ జిల్లాలో ఉన్న అన్ని రసాయనిక కర్మాగారాల పరిస్థితిని నిపుణుల బృందంతో తనిఖీ చేయిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభావిత గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లను వాడవద్దని నిపుణులు చెప్పారని, బోర్‌వెల్స్‌నూ పరిశీలిస్తారన్నారు. ► బాధితులకు సత్వర వైద్యం, పరిహారం, వసతి, నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా వ్యవహరిస్తోంది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ నీలం సాహ్ని మూడు రోజులుగా విశాఖలోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ► గ్యాస్ ప్రభావం అత్యల్ప స్థాయికి తీసుకొస్తున్న తీరుతెన్నులు, బాధిత ప్రజలకు అందుతున్న వైద్యం, షెల్టర్లలో సౌకర్యాలపై మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షించారు. వేగంగా కోలుకుంటున్న బాధితులు ► గ్యాస్ లీకేజీతో తీవ్రంగా, స్వల్పంగా అస్వస్థతకు గురైన 585 మంది కేజీహెచ్‌తో పాటు విశాఖ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన సంగతి తెలిసిందే. ► కేజీహెచ్‌లో చేరిన 418 మందిలో 111 మంది పూర్తిగా కోలుకోవడంతో శనివారం డిశ్చార్జి చేశారు. మిగతా 307 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన 167 మందిలో 62 మంది డిశ్చార్జి అయ్యారు. పరిహారం అందజేతకు ఏర్పాట్లు ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వడం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ పరిహారాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందించేందుకు అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా గుర్తింపు పత్రాలను సేకరిస్తున్నారు. ఆదివారం ఈ ప్రక్రియ కొలిక్కిరానుంది. గ్యాస్ ప్రభావంపై అధ్యయనానికి కమిటీలు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గురువారం లీకైన స్టైరీన్ గ్యాస్ ప్రభావంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సాంకేతిక నిపుణుల కమిటీలు రంగంలోకి దిగాయి. విష వాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ కమిటీలు ప్రభుత్వానికి అవసరమైన సూచనలిస్తాయి. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీలోని ఇద్దరు సభ్యులు శనివారం విశాఖకు వచ్చారు. ముంబైలోని సుప్రీం పెట్రోకెమికల్స్ సంస్థ నుంచి ప్రముఖ స్టైరీన్ నిపుణుడు శంతను గీటె, ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) డైరెక్టర్ అంజన్ రే ఇక్కడకు చేరుకున్నారు. ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, తదుపరి చర్యలను సూచించేందుకు ఇంటర్నల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► లీక్ లీకేజీ అనంతర పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు ప్రొఫెసర్లతో మరో కమిటీని నియమించారు.ప్రొఫెసర్ ఎస్.బాలప్రసాద్ , ప్రొఫెసర్ ఎస్వీ నాయుడు, ప్రొఫెసర్ జె.బాబూరావు, డాక్టర్ భానుకుమార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ► ప్రస్తుత పరిస్థితిపై ఆయా కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, గ్యాస్ లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు తెలిపేందుకు తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) సంస్థ నుంచి నిపుణులు విశాఖకు రానున్నారు. -
సరైన పత్రాలుంటేనే ప్రవేశం
సాక్షి, గుంటూరు/అమరావతి, జగ్గయ్యపేట: అధికారిక అనుమతి(పాస్‌లు) లేకుండా ఏపీ సరిహద్దులు దాటి వచ్చేందుకు జరుగుతున్న యత్నాలు చెక్‌పోస్టుల వద్ద ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని గరికపాడు, పొందుగల, కొవ్వూరు ప్రాంతాల్లో సోమవారం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సరైన అనుమతులు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని పట్టుబట్టడం సమస్యకు దారితీసింది. గరికపాడు చెక్‌పోస్టు వద్ద సీఐ నాగేంద్రకుమార్ పాసులను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్న వారిని మాత్రమే ఏపీలోకి అనుమతించారు. వివరాలలోకి వెళితే.. ► కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించిన కేంద్రం వలస కూలీలతోపాటు యాత్రికులు, సొంత ఊర్లకు వెళ్లేవారి ప్రయాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉంటున్న ఏపీకి చెందినవారు స్వస్థలాలకు బయలుదేరారు. వారికి తెలంగాణ పోలీసులు ఈ–పాస్‌లు జారీ చేశారు. అయితే ఈ–పాస్‌ల ప్రక్రియలో గందరగోళం నెలకొనడంతో సమస్య ఏర్పడింది. ► సాధారణంగా రాష్ట్రం లోపల వేరే జిల్లాలకు వెళ్లడానికి ఆయా జిల్లాల ఎస్పీలు ఈ–పాస్‌లు జారీ చేస్తున్నారు. వేరే రాష్ట్రంలోకి వెళ్లాల్సి ఉంటే డీజీపీ కార్యాలయం నుంచి ఈ–పాస్‌లు మంజూరు చేస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా తెలంగాణ నుంచి ఏపీ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(సీఐ), డీఎస్పీ, ఏసీపీ, జిల్లా ఎస్పీలు ఇబ్బడిముబ్బడిగా ఈ–పాస్‌లు జారీ చేశారు. ఇలా గత రెండు రోజుల్లో తెలంగాణలో ఎనిమిది వేలకుపైగా పాస్‌లు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఏపీకి చెందినవారే ఐదువేల మంది వరకు ఉంటారని అంచనా. ఈ పాస్‌లతో ఏపీకి బయలుదేరిన వారికి చెక్‌పోస్టుల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డీజీపీ కార్యాలయం నుంచి కాకుండా దిగువస్థాయి అధికారులు జారీ చేసిన పాస్‌లు కావడంతో రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్ పోస్టుల్లో ఏపీ పోలీసులు వారిని అనుమతించడం లేదు. ► డీజీపీ కార్యాలయం కాకుండా ఇతరులు మంజూరు చేసిన పాస్‌లతో వచ్చిన సుమారు వెయ్యి మందిని గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. కొవ్వూరు, నాగార్జునసాగర్, గరికపాడు ప్రాంతాల్లోనూ అడ్డుకుని వెనక్కి పంపించారు. నిరాకరణకు కారణాలివే.. ► ఎక్కడివారు అక్కడే ఉండటం, వ్యక్తిగత దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా ఆటకట్టించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. గత 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా లాక్డౌన్ అమలు చేయడం, వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు విస్తృతంగా చేపట్టడం వల్ల పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఇటువంటి సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడం మంచిది కాదు. ► ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి పాజిటివ్ అయితే ఆసుపత్రికి, నెగిటివ్ అయితే 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉంచాలన్నది నిబంధన. స్థానిక అధికారులు మంజూరు చేసిన పాస్‌లు తీసుకుని రాష్ట్రంలోకి అనుమతిస్తే క్వారంటైన్ కేంద్రాల్లో వసతుల కల్పన కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని ఏపీలోకి నేరుగా అనుమతించకుండా, హెల్త్ ప్రొటోకాల్ మేరకు మాత్రమే అనుమతిస్తున్నారు. అర్ధం చేసుకుని సహకరించండి కరోనా విపత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలి. అధికారిక అనుమతులు లేకుండా రాష్ట్రంలోకి రావద్దు. దయచేసి అర్థం చేసుకుని పోలీసులకు సహకరించండి. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వారికి డీజీపీ కార్యాలయం జారీ చేసే ఈ–పాస్‌లు కచ్చితంగా ఉండాలి. రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఏపీకి చెందిన వారు ఎక్కడ ఉన్నా అందర్నీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు దశలవారీగా చర్యలు చేపట్టాం. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
ఏఎస్ఐ కుటుంబానికి రూ. 50 లక్షలు
అనంతపురం క్రైం/అమరావతి: కోవిడ్–19 బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ హబీబుల్లా కుటుంబానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం గొప్ప విషయమని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా భారీ మొత్తంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారన్నారు. అందుకు ఏపీ పోలీసుల తరఫున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సీఎం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తికి మించి పని చేసి కోవిడ్ నివారణకు కృషి చేస్తామని చెప్పారు. స్వయంగా వెళ్లి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆ కుటుంబానికి అందజేయాలని సీఎం ఆదేశించడంతో డీజీపీ శనివారం అనంతపురంలో పర్యటించారు. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్ఐ కుటుంబ సభ్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కును ఏఎస్ఐ సోదరుడు కానిస్టేబుల్ రహంతుల్లాకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ యుద్ధంలో పాల్గొంటున్న పోలీసులకు రక్షణగా ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ), ఎన్ 95 మాస్క్‌లు అందించడం కోసం రూ. 2.89 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. అంతకుముందు డీజీపీ సవాంగ్.. వైరస్ నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై కోవిడ్–19 ప్రత్యేకాధికారి, కలెక్టర్, ఐజీ, డీఐజీ, ఎస్పీ తదితరులతో సమీక్ష నిర్వహించారు. కాగా, అనంతపురం పర్యటన వివరాలను డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది. -
రెడ్ జోన్లలో యాప్‌తో నిఘా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంద ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖను నిరంతరం అప్రమత్తం చేసేలా ప్రత్యేక యాప్‌లు తెస్తున్న రాష్ట్ర పోలీస్ శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ అభినందించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రెడ్ జోన్లలో నిఘా కోసం త్వరలోనే ప్రత్యేక యాప్‌ను తెస్తున్నట్టు వెల్లడించారు. రెడ్‌జోన్ ప్రాంతాలలో ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా నిబంధనలు అమలు చేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► రెడ్ జోన్లలో ప్రజల కదలికలను గుర్తించి అప్రమత్తం చేసేందుకు, వైరస్ తీవ్రతను తెలిపేందుకు మరో మొౖబైల్ యాప్ సిద్ధం చేస్తున్నాం. ► ఇప్పటికే హౌస్ క్వారంటైన్ యాప్‌ను విజయవంతంగా వినియోగించాం. జియో ఫెన్సింగ్ టెక్నాలజీలో ఇలాంటి యాప్ వినియోగంలో దేశంలోనే మన రాష్ట్రానికి మొదటిస్థానం. ► పలు దేశాల నుండి ఏపీకి వచ్చిన వారిపై నిఘాకు హౌస్ క్వారంటైన్ యాప్ వినియోగించాం. ► హౌస్ క్వారంటైన్ యాప్ ద్వారా 22,478 మందిపై 28 రోజులపాటు నిఘా ఏర్పాటు చేశాం. ► నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై ఆ యాప్ సహాయంతో కేసులు నమోదు. ► 28రోజుల హోం క్వారంటైన్ పూర్తయిన వారిపై ఉన్న ప్రత్యేక ఆంక్షల తొలగింపు. నిబంధనల మేరకు బయట తిరిగేందుకు వెసులుబాటు. -
కరెన్సీ మార్పిడితో కరోనా వ్యాప్తి నిర్ధారణ కాలేదు
సాక్షి, అమరావతి: కరెన్సీ మార్పిడి వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా 2 వారాల పాటు కరెన్సీ వాడకాన్ని తగ్గించాలంటూ పోలీసు శాఖ ప్రకటన జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. -
విదేశాల నుంచి వచ్చిన వారికి జియోఫెన్సింగ్
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని ఇంటిలో, ప్రభుత్వ క్వారంటైన్లో కట్టడి చేయడం క్లిష్టంగా మారిన తరుణంలో రాష్ట్ర పోలీసులు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులను వారి వివరాలతో జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం ద్వారా నియంత్రించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సాంకేతిక నిపుణులైన పోలీసుల అధికారుల బందం హౌస్ క్వారంటైన్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను శుక్రవారం ఒక్క రోజే క్వారంటైన్లో ఉన్న ఐదు వేల మంది ఇన్స్టాల్ చేసుకోవడం విశేషం. - వాస్తవానికి.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కలవరం మొదలైన నాటి నుంచి దాదాపు 28 వేల మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో 20 వేల మందిని రానున్న 24 గంటల్లో యాప్ పరిధిలోకి తెస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలోనూ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ఏపీ పోలీసులు దేశానికి మరోసారి ఆదర్శంగా నిలుస్తున్నారు. - హౌస్ క్వారంటైన్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే జియోఫెన్సింగ్ అనుసంధానమై ఉంటుంది. - హౌస్ క్వారంటైన్లో ఉంటున్న వారందరూ ఈ యాప్‌లో మొబైల్ నంబర్, ఆరోగ్యపరమైన వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తారు. దీంతో ఈ యాప్ ద్వారా వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుంది. - కోవిడ్ బాధితుల కదలికలతోపాటు అవసరమైన వైద్య సేవలు, స్వీయ నియంత్రణకు సూచనలు పోలీసుల పర్యవేక్షణలో జరుగుతాయి. - కోవిడ్ బాధితులు ఇంటి నుంచి 50 మీటర్లు దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లిపోతుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. లక్ష్మణ రేఖలా పనిచేస్తుంది డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఓవెపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూనే మరోవైపు వైరస్ విస్తరించ కుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ వైరస్ ఇతరులకు వేగంగా విస్తరించే ప్రమాదం ఉండటంతో వారిపై మరింత నిఘా పెట్టాం. అందుకే హౌస్ క్వారంటైన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. జియోఫెన్సింగ్‌తో వారి కదలికలపై నిఘా ఉంచేందుకు ఇది నిజంగా లక్ష్మణ రేఖలా ఉపయోగపడుతుంది. -
మేం సిద్ధం
సాక్షి, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం మార్చి 31వ తేదీలోగా ‘స్థానిక’ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ కుమార్ చెప్పారు. తాము కూడా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలియజేశామని వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఎంత మేర పోలీస్ బలగాలను రప్పించగలరో.. వివరాలు అందించాలని డీజీపీ సవాంగ్‌ను కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసిన తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని.. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందన్నారు. అంతకుముందు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా డీజీపీ వివరించినట్టు తెలిసింది. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్‌లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ అయ్యారు. త్వరితగతిన ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని వారు తెలియజేశారు. -
రాష్ట్రంలో ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమల్లో భాగంగా ఏపీలో ప్రత్యేక పోలీస్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) భర్తీ పరీక్షా ఫలితాలను హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్‌కుమార్, డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఏపీఎస్ఎల్పీఆర్) చైర్మన్ అమిత్ గార్గ్‌తో కలిసి హోంమంత్రి మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో విడుదల చేశారు. పోలీస్ శిక్షణా సంస్థ ఏపీకి చాలా అవసరమనే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకెళ్లారని సుచరిత వెల్లడించారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చే ప్రక్రియ ఆగలేదని పేర్కొన్నారు. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశామని తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగులను వెయిటింగ్లో(వీఆర్) పెడుతున్నారని, జీతాలు ఇవ్వడం లేదంటూ కొన్ని మీడియా సంస్థలు, కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ విమర్శించారు. అందరికీ పోస్టింగ్లిస్తున్నామని గుర్తు చేశారు. 50 శాతానికి పైగా మహిళలే.. రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 50 ఏపీపీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను హోం మంత్రి విడుదల చేశారు. మొత్తం 50 పోస్టులకుగాను 49 మందిని ఎంపిక చేశారు. జోన్–4లో ఆర్థోపెడికల్లీ హ్యాండీకాప్డ్(మహిళ) కేటగిరీ కింద కేటాయించిన పోస్టుకు అర్హతలు గల అభ్యర్థి లేకపోవడంతో దానిని భర్తీ చేయలేదు. మొత్తం పోస్టుల్లో 50 శాతానికి మహిళలే ఎంపికవడం విశేషం. ఎం.లావణ్య 281.50 మార్కులు, సీహెచ్ చంద్రకిషోర్ 277.3 శాతం మార్కులు, తేజశేఖర్ 251 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
మహిళల రక్షణ చేతల్లో చూపించిన సీఎం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : ఎన్నో సంవత్సరాలుగా మహిళ రక్షణ, భద్రత కోసం నేతలు చెబుతున్న మాటలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతల ద్వారా నిజం చేశారని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రశంసించారు. ఒక దళిత మహిళను హోం మంత్రి చేయడం ద్వారా సీఎం మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం దిశ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు అండగా ఉండేలా దిశ చట్టాన్ని కానుకగా తీసుకువచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందని చెప్పారు. మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో జరిగింది తమకెందుకులే.. అని అనుకోకుండా రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అటువంటి అన్యాయం జరగకుండా ఉండాలని ఈæ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాలను ఆరికట్టడానికి సీఎం దిశ చట్టాన్ని తీసుకువచ్చారని, రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక ప«థకాలకు మంచి స్పందన లభించిందన్నారు. చరిత్రగా నిలిచిపోతుంది.. ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం తీసుకురావడం ఒక చరిత్రగా నిలిచిపోతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 1349 పోలీసుస్టేషన్లు ఒక యూనిట్‌గా పని చేస్తాయన్నారు. అంతర్జాతీయంగా కూడా చాలా అరుదైన చట్టంగా నిలుస్తుందన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకు వచ్చిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టెక్నికల్ సర్వీస్) జి.పాలరాజ్ పేర్కొన్నారు. ఐపీసీలో 354(ఇ) సెక్షన్‌ను చేర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు సుభాష్‌చంద్రబోస్, పుష్ప శ్రీవాణి, మంత్రులు మోపిదేవి, పినిపే విశ్వరూప్, కన్నబాబు, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, నందిగం సురేష్, చింతా అనురాధ, వంగా గీత, గొడ్డేటి మాధవి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, కంగాటి శ్రీదేవి, రజిని, పద్మావతి, ఉషా శ్రీచరణ్, జక్కంపూడి రాజా, సీఎం ప్రోగ్రామ్స్ సమన్వయ కర్త తలశిల రఘురాం, మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, దిశ ప్రత్యేకాధికారులు దీపికా పటేల్, కృతికా శుక్లా, నన్నయ వీసీ జగన్నాథరావు, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బాధ విన్నారు.. భరోసా కలిగించారు
సాక్షి, అమరావతి/అత్తిలి : ‘జగనన్నా, మమ్మల్ని మీరే కాపాడాలి’.. అంటూ నలుగురు మహిళలు కువైట్ నుంచి పంపిన వీడియో వైరల్ కావడం.. అది సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడం.. వెంటనే ఆయన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో సీఎం కార్యాలయం హుటాహుటిన స్పందించింది. సదరు వీడియోను డీజీపీ డి. గౌతమ్ సవాంగ్‌కు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఆయన ‘దిశ’ చట్టం ప్రత్యేక అధికారి దీపికా పాటిల్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్‌ను అప్రమత్తం చేశారు.తమను ఏజెంట్ మోసం చేశాడని, కువైట్‌లో పనిలేకుండా ఉన్నామని.. తమను ఆదుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామానికి చెందిన కరెం వసుంధర కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ ఓ వీడియోను వాట్సాప్ ద్వారా తన వాళ్లకు పంపించింది. ఆ వీడియో వైరల్ కావడంతో.. ‘జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి’ అంటూ ఈ నెల 25న ‘సాక్షి’ ఆమె ఆవేదనను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాధితురాలు వసుంధరకు సంబంధించిన వివరాలు సేకరించారు. పేదరికం కారణంగా కుటుంబ పోషణ కోసం ఆర్నెల్ల క్రితం వసుంధర కువైట్ వెళ్లినట్లు.. అలాగే, వారం రోజుల క్రితం కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలుసుకున్నారు. కాగా, కడపకు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఆమె క్షేమ సమాచారాలు కూడా తెలుసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ ‘సాక్షి’కి తెలిపారు. వసుంధర పాస్‌పోర్టు అక్కడి యజమాని వద్ద ఉండిపోయినందున దానిని తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కువైట్‌లోని భారతీయ ఎంబసీకి బాధితురాలి తల్లి శాంతకుమారి రాసిన లేఖను మెయిల్ చేశామని.. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్‌కు కూడా శాంతకుమారి లేఖను మెయిల్ చేశామని ఆయన వివరించారు. అలాగే, కువైట్‌లోని కాన్సులేట్ కార్యాలయాన్ని కూడా సంప్రదించామని గ్రేవల్ చెప్పారు. వసుంధరతోపాటు మిగిలిన మహిళలను కూడా రప్పించేందుకు దిశ చట్టం ప్రత్యేక అధికారి దీపిక ఆధ్వర్యంలో తణుకు సీఐ, అత్తిలి ఎస్సై మరికొందరితో పోలీస్ ప్రత్యేక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. కాగా, ఇదే విషయాన్ని కువైట్‌లోని బాధితులు కూడా ధృవీకరించారు. ఏపీ నుంచి పోలీసులు తమతో మాట్లాడారని వారు మరో వీడియోను పంపించారు. ఇందులో, ‘జగనన్నా.. కొద్దిరోజుల్లోనే మమ్మల్ని ఆదుకున్నందుకు ధన్యవాదాలన్నా.. మీ మేలు మరువలేం.. ఇక్కడ అందరూ బాగా సహకరిస్తున్నారు.. ధైర్యం చెబుతున్నారు.. థ్యాంక్స్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తె క్షేమంగా వస్తుందని జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వసుంధర తల్లి శాంతకుమారి విశ్వాసం వ్యక్తంచేసింది. ఇదిలా ఉంటే.. మహిళలను కువైట్ పంపిన ఇరగవరం మండలం పొదలాడకు చెందిన సబ్‌ఏజెంట్ లక్ష్మణరావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారం రోజుల్లోపు తీసుకొస్తాం కరెం వసుంధర, మరో ముగ్గురు మహిళలు కువైట్‌లోని పునరావాస శిబిరంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నాం. వారిని సొంతూళ్లకు తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇప్పటికే కువైట్ ఎంబసీ అధికారులు, అక్కడి లేబర్ కమిషనర్‌ను ‘పశ్చిమ’ పోలీసులు సంప్రదించారు. బాధితులు ఏ తప్పూ చేయలేదని నిర్ధారణ అయ్యింది. దీనివల్ల చట్టపరమైన చిక్కులు ఉత్పన్నం కావు. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, సంప్రదింపులు సానుకూలంగా ఉన్నాయి. నాలుగు నుంచి వారం రోజుల్లో వారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – గౌతమ్ సవాంగ్, రాష్ట్ర డీజీపీ -
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ నలుగురి నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ చదివి వినిపించారు. అనంతరం వీరిచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, తడకమళ్ల వినోద్‌కుమార్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.జగన్నాథరావు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ప్రమాణం చేసిన నలుగురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్ జనరల్, ఇతర రిజిస్ట్రార్లు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నలుగురుని న్యాయవాదులు అభినందించారు. ఆ తరువాత సీజే జస్టిస్ జేకే మహేశ్వరితో కలిసి జస్టిస్ జయసూర్య కేసులను విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ జడ్జిలుగా కేసులు విచారించారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
మీ తీరు సరికాదు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతీసారి పోలీసు శాఖను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన తీరు పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆక్షేపించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. చంద్రబాబు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని డీజీపీకి, పోలీసు శాఖకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్‌ఖాన్, కోశాధికారి ఎం.సోమశేఖర్లు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే విషయం గత ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీతినిజాయతీగా పనిచేసే అధికారిగా పేరుందని, అలాంటివ్యక్తిపై చంద్రబాబు విమర్శలు చేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అఖిల భారత సర్వీసు అధికారుల సేవల్ని ఉపయోగించుకుని ఇప్పుడిలా వేరు చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన డీజీపీకి ప్రాంతీయభేదం ఆపాదించి దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటూ చంద్రబాబు మాట్లాడటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని తప్పుపట్టారు. పోలీసు శాఖలో చంద్రబాబు చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని, మాలో మాకు విద్వేషాలు సృష్టించి దాని ద్వారా లాభాన్ని ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని వారు ఆక్షేపించారు. మీ భద్రతకోసం ఉన్న పోలీసులకు మంచినీళ్లూ ఇవ్వని ఘనత మీది.. మీ భద్రతకోసం విధుల్లో ఉన్న పోలీసులకు కనీసం మంచినీళ్లు ఇవ్వని ఘనత మీదని, మీకు పోలీసులను విమర్శించే నైతిక అర్హత లేదని వారు వ్యాఖ్యానించారు. పోలీస్ అధినేతనే టార్గెట్ చేసి విమర్శలు చేయడం ద్వారా యావత్తు పోలీసు వ్యవస్థను నిర్వీర్యంచేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న చంద్రబాబు ఆలోచన రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఎక్కడ శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పదేపదే చెప్పే మీరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు చెప్పారు. టీడీపీ మహిళా కార్యకర్త సినీనటి దివ్యవాణి మహిళలు సిగ్గుపడేలా పోలీసు శాఖపై చేసిన తీవ్ర పదజాలాన్ని చంద్రబాబు ఖండించకపోవడం బాధాకరమన్నారు. 34 ఏళ్లపాటు పోలీసు సర్వీసులో అవిరళ కృషి చేసిన డీజీపీ సవాంగ్‌పై దివ్యవాణి అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామని, ఆమె తక్షణం పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా పోలీసులపై కొందరు అరాచక శక్తులు చేస్తున్న వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. -
ఆపరేషన్ ముస్కాన్‌లో 3,636 మంది బాలల గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు శనివారం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి 3,636 మంది బాలబాలికలను రక్షించారు. వీరిలో బాలురు 3,039 మంది, బాలికలు 597 మంది ఉన్నారు. రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు రెండురోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం ఈ ఆపరేషన్‌లో పోలీసులతోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, క్రీడా శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కమిటీలు కూడా భాగస్వాములయ్యాయి. ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జనసామర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను తనిఖీ చేసి చిన్నారులను గుర్తించాయి. ఆపరేషన్ ముస్కాన్ అంటే.. తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చినవారు మరికొందరు అనాథల్లా జీవితం గడుపుతుంటారు. ఇలాంటివారిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో బహిరంగ ప్రదేశాల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాన్నే ఆపరేషన్ ముస్కాన్ అంటారు. ఆపరేషన్ ముస్కాన్ ఇలా.. - ఈ కార్యక్రమం కోసం ప్రతి సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ఒక మహిళ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టారు. - బృంద సభ్యులు పోలీస్ యూనిఫాం ధరించకుండా సివిల్ డ్రస్‌లో ఉంటారు. - తనిఖీల సందర్భంగా గుర్తించిన పిల్లల ఫొటోలతో కూడిన సమాచారాన్ని చైల్డ్ ట్రాక్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. - గుర్తించిన పిల్లలను 24 గంటల్లోపు ఆయా జిల్లాల్లోని శిశు సంరక్షణ కమిటీలకు అప్పగిస్తారు. - సరైన చిరునామా లభించని పిల్లలను షెల్టర్ హోమ్‌లలో ఉంచుతారు. - హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో బాల కార్మికులు దొరికినట్లైతే యజమానులపై బాలకార్మిక నిషేధ చట్టం, వెట్టిచాకిరి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. -
ఏపీలో నేరాల సంఖ్య తగ్గింది
-
నేరాలు 6% తగ్గాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరు శాతం నేరాలు తగ్గాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ‘2019 వార్షిక నేర నివేదిక’ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గత ఆరు నెలల్లో రాష్ట్ర పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో అనేక రాష్ట్రాలు మనరాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామని, పోలీసులతోపాటు హోంగార్డులకు కూడా బీమా వర్తింపజేశామని చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం, పోలీసుల సంక్షేమం కోసం వీక్లీఆఫ్, బాధితులకు న్యాయం చేసేలా ‘స్పందన’, జీరో ఎఫ్ఐఆర్ మొదట మన రాష్ట్రంలోనే అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్ర పోలీసులకు తొమ్మిది విభాగాల్లో స్కోచ్ అవార్డులు, డీఎస్‌సీఐ, జీఫైల్స్ వంటి జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ప్రధాని మోదీ మొదలుకొని పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖుల నుంచి అభినందనలు అందుకోవడం గర్వకారణమన్నారు. నేరాల సంఖ్య తగ్గింది రాష్ట్రంలో 2018లో 1,19,541 కేసులు నమోదు కాగా, 2019లో 1,12,697 (వీటిలో 5,080 కేసులు ఎన్నికల సమయంలో నమోదు చేసినవే) కేసులు నమోదయ్యాయని డీజీపీ సవాంగ్ చెప్పారు. ఈ ఏడాది హత్యలు, అత్యాచారాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఎన్నికల వల్ల కేసుల నమోదు ఎక్కువైందని.. లేదంటే నేరాలు పది శాతం వరకు తగ్గేవన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు కేవలం రెండు జిల్లాలు (విశాఖ, తూర్పు)కే పరిమితమయ్యాయని తెలిపారు. మద్యం బెల్ట్ షాపులు, గుట్కా, అక్రమంగా ఇసుక తరలింపు, గంజాయిలపై ఉక్కుపాదం మోపామన్నారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్‌లను మూసివేశామని వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్‌తో 5,739 మంది బాలబాలికలను గుర్తించి వారిలో 5,208 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు. ‘ట్వంటీ ట్వంటీ(2020) ఉమెన్ సేఫ్టీ’ అనే నినాదంతో పనిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మహిళల భద్రతపై మరింత దృష్టి సారిస్తామన్నారు. దిశ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. దిశ ఘటన నేపథ్యంలో డిసెంబర్లో జీరో ఎఫ్ఐఆర్ కింద 49 కేసులు నమోదు చేశామన్నారు. -
రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారు
సాక్షి, అమరావతి/తెనాలి రూరల్: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాజధానిలో తనపై దాడి అనంతరం కొందరు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ టీవీ జర్నలిస్ట్ నల్లమోతు దీప్తి డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం దీప్తి, మరో మహిళా జర్నలిస్టు హసీనా, పలువురు మీడియా ప్రతినిధులు డీజీపీ సవాంగ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచి్చందన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. కానీ ఆ నిరసనలు హింసకు దారితీసేలా ఉండకూడదని అన్నారు. రాజధాని రైతుల ఆందోళనను సున్నితంగానే చూశామన్నారు. అయితే ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కల్గించేలా వ్యవహరించడం, శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇప్పటి వరకు రాజధానిలో ఆందోళనలపై 12 కేసులు నమోదు చేశామన్నారు. జర్నలిస్టులపై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు, రక్షణ అంశాలకు సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి రాజధాని హైపవర్ కమిటీలో తన పేరు పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. డీజీపీ ఆఫీసు ఎక్కడ ఉండాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు అందించే సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బలగాలను సమన్వయం చేయడానికి డీజీపీ కార్యాలయం దోహదం చేస్తుందన్నారు. పాలనాపరమైన పోలీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నిందితులకు జనవరి 10 వరకు రిమాండ్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో జర్నలిస్టులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం, మల్కాపురం, వెలగపూడి, నెక్కల్లు గ్రామాలకు చెందిన శివబాబు, నరేష్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, లోకనాయక్, వెంకటస్వామిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీరిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే నిందితులను విడిచిపెట్టాలని టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద హడావుడి చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్టేషన్‌కు వచ్చి నిందితులను విడిచిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం రాత్రి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్వీవీఎన్ లక్షి్మ.. నిందితులకు జనవరి 10 వరకూ రిమాండ్ విధించారు. -
నేరం చేస్తే ఇట్టే పట్టేస్తారు
సాక్షి, అమరావతి: ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు ఇట్టే పట్టేస్తారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నేర సమాచారం పోలీస్ అధికారుల చుట్టూ వైఫై మాదిరిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని ఏం జరిగినా.. నేర స్వభావం బట్టి పోలీస్ రికార్డుల ద్వారా ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు గట్టి కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నేర చరిత్ర మొత్తం పోలీస్ చేతిలో ఉండేలా సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటున్నారు. పోలీస్ రికార్డులకు ఎక్కిన, జైళ్లలో ఉన్న వారి వివరాలు ఇప్పటికే ప్రతి పోలీస్ అధికారికి అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయ స్థానాలను ఆశ్రయించిన వారి వివరాలను ఈ కోర్ట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సేకరించారు. వీటితోపాటు రాష్ట్రంలో గల దాదాపు 21 వేల మంది రౌడీ షీటర్లు, 28 వేల మంది హిస్టరీ షీట్లు కూడా ఆన్లైన్ చేయడంతో అన్ని పోలీస్ స్టేషన్లకు అందుబాటులోకి వచ్చాయి. పోలీస్, జైల్స్, ఈ–కోర్ట్స్, రౌడీ షీటర్స్, హిస్టరీ షీట్స్ ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వాటిని సైతం పోలీసులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇది అనేక నేరాల్లో ప్రాథమిక దర్యాప్తునకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు తమ వద్ద ఉన్న ఆన్లైన్ రికార్డుల్లోని సమాచారాన్ని చూసుకుని నేర స్వభావాన్ని బట్టి నేరస్తులను గుర్తు పట్టే ప్రయత్నం జరుగుతుంది. కీలక అంశాలేమిటంటే.. ►ఎవరైనా.. ఏదైనా కేసులో నేరస్తుడు, బాధితుడు, ఫిర్యాదుదారు, సాక్షిగా ఉంటే ఆ వివరాలన్నీ పోలీస్ స్టేషన్, జైలు, కోర్టు రికార్డుల ద్వారా పోలీసులకు ఇట్టే తెలుస్తాయి. ►సంబంధిత రికార్డులన్నిటినీ పోలీస్ రికార్డులకు అనుసంధానం చేసి ప్రతి పోలీస్ స్టేషన్, పోలీస్ అధికారులకు అందుబాటులోకి తెస్తున్నారు. ►ఈ వివరాలను కంప్యూటర్, మొబైల్ ద్వారా చూసుకుని నేర పరిశోధనలో ముందడుగు వేసే అవకాశం పోలీసులకు కలుగుతోంది. ►ఓ వ్యక్తి రాష్ట్రంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒక్కసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే ఆ వివరాలు నేర చరిత్రలో నమోదై రాష్ట్రంలోని పోలీసులందరికీ చేరతాయి. ►పోలీస్ శాఖ చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో నమోదైన వివరాలను సైతం ఆన్లైన్ చేసి అందుబాటులోకి తెస్తున్నారు. ►రెండు కేసుల్లో నేరస్తునిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కితే అతనిని జీవితాంతం పోలీసుల నిఘా వెంటాడుతుంది. ►రౌడీషీట్, హిస్టరీ షీట్ ఉన్న వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వారి కదలికలపై దృష్టి పెట్టడంతోపాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసేలా చర్యలు తీసుకుంటారు. నేర పరిశోధనలో కీలకం నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా ఉపయోగపడుతోంది. అనేక కేసుల్లో పోలీసుల వద్ద ఉండే ప్రాథమిక సమాచారం దర్యాప్తులో ఉపయోగపడుతుంటుంది. నేర స్వభావం కలిగిన వ్యక్తులు, ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు చేస్తుంటారు.. ఎవరు ఎక్కువగా చేస్తుంటారు అనే కీలక వివరాలను పోలీసులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతోనే ఈ ప్రక్రియను చేపట్టాం. సాధ్యమైనన్ని వివరాలు పోలీసులకు అందుబాటులో ఉంచాలనే పోలీస్ రికార్డులు, ఈ–ప్రిజన్స్, ఈ కోర్ట్స్ విభాగాల సమాచారాన్ని ఒక అప్లికేషన్ (యాప్) ద్వారా నిక్షిప్తం చేసి రాష్ట్రంలోని పోలీసులకు అందిస్తున్నాం. నేరస్తుల ఫొటోలు, వేలి ముద్రలు, చిరునామా తదితర పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వల్ల దర్యాప్తు సులభతరం అవుతోంది. దీనిని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి పోలీసులకు అందిస్తాం. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
టోల్‌ఫ్రీకి ఫేక్ బెడద
దిశ ఘటన అనంతరం పెరిగిన కాల్స్ దిశ ఘటన తరువాత డయల్ 100, 112లకు కాల్స్ గణనీయంగా పెరిగాయి. వాటిలో ఫేక్ కాల్స్ ఎక్కువగా ఉండడంతో నిజమైన బాధితులకు ఫోన్లైన్లు బిజీ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. డయల్ 112కు ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) రెండు లైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో లైను ద్వారా సెకనుకు 30 కాల్స్ చొప్పున రెండు లైన్లకు మొత్తం 60 కాల్స్ మాట్లాడవచ్చు. అంతకు మించి వచ్చే కాల్స్‌తో లైన్స్ బిజీ అని వస్తోంది. పెరిగిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సమస్యను అధిగమించేలా మరో రెండు పీఆర్ఐ లైన్లు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్లలో కొత్త ఫీచర్ వల్ల ఫోన్ నుంచి నేరుగా డయల్ 112కు ఎమర్జన్సీ కాల్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం లేని వారు ఫోన్లోని పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే నేరుగా 112కు కాల్ వెళ్లి కట్ అవుతుంది. అనంతరం వారిలొకేషన్ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంది. వారు తిరిగి కాల్ చేసి సమస్య కనుక్కుంటారు. బేసిక్ మోడల్ ఫోన్ కీ ప్యాడ్‌లో 2 లేదా 9 అంకెను నొక్కి పెడితే డయల్ 112కు కాల్ వెళ్లిపోతోంది. ►టోల్ ఫ్రీ నెంబర్లు 100, 112లు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ఎక్కువగా కాల్ చేస్తున్నారు. ►కొందరు ఆకతాయిలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో టోల్‌ఫ్రీ నెంబర్లకు పెద్దఎత్తున వస్తున్న ఫోన్‌కాల్స్‌తో పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100, 112 నెంబర్లకు రోజూ లెక్కకు మిక్కిలి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటిలో పోలీసులు పరిష్కరించదగ్గ అంశాలకు సంబంధించి కాల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగిలిన ఫిర్యాదులన్నీ టోల్‌ఫ్రీ నెంబర్ పనిచేస్తుందా? ఫిర్యాదులు తీసుకుంటున్నారా? సమాచారం కోసం, అవినీతిపై ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ వివరాలు అందించాలి? అనే వివరాలు తెలుసుకునేందుకే చేయడం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫేక్ కాల్స్ బెడద పెరగడంతో అసలు ఆపదలో ఉన్నవారికి లైన్ కలవక ఇబ్బంది పడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. –సాక్షి, అమరావతి సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళలు, ప్రజలు తమ సమస్యలను ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పిన అతి తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలను సది్వనియోగం చేసుకోవాలి. టోల్‌ఫ్రీ నెంబర్లపై అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాం. –గౌతమ్ సవాంగ్, డీజీపీ అసలైన బాధితులు నష్టపోతారు టోల్ ఫ్రీ నెంబర్లు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసు సేవలు పొందే అవకాశం ఉంది. డయల్ 100, 112ను సద్వినియోగం చేసుకుంటేనే వాటి ఏర్పాటుకు సార్ధకత ఉంటుంది. దుర్వినియోగం చేస్తే నిజమైన బాధితులకు అన్యాయం చేసినవారవుతాం. –ఝాన్సీ గెడ్డం, దళిత స్త్రీ శక్తి జాతీయ కమిషనర్ డిసెంబర్ 12న టోల్‌ఫ్రీ నెంబర్లకు నమోదైన ఫోన్కాల్స్విశ్లేషిస్తే ►16,207డయల్ 100కు వచ్చిన కాల్స్ ►533 వాటిలోపోలీసులు స్పందించదగినవి ►516 కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించినవి ►17 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులు 3.50లక్షలుడయల్ 112కు వచ్చిన కాల్స్ ►వాటిలో పోలీసులు స్పందించదగ్గవి1,779 ►కేసులు నమోదు చేసినవి2 ►రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు గత నెల 25న డయల్ 14400 నెంబర్‌ను ప్రారంభించారు ►డయల్ 14400కు తొలి రోజు వచి్చన కాల్స్ 5100 ►వాటిలో ఏసీబీకి వచి్చన ఫిర్యాదులు కేవలం 283 మాత్రమే -
ఒక్క 'యాప్' 89 పోలీస్ సేవలు
ఒకే ఒక్క యాప్‌తో 89 సేవలు... మీ ఫోన్లో ‘స్పందన సురక్ష’ ఉంటే చాలు..! ఇప్పుడన్నీ యాప్‌లే.. తినడానికైనా, కొనడానికైనా! పోలీస్‌శాఖ కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పోలీస్ స్టేషన్లు, మీ–సేవా కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా, చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు కూర్చున్న చోటు నుంచే పోలీసు సేవలు పొందే యాప్ సిద్ధమైంది. దీని ద్వారా 15 ప్రధాన విభాగాల్లో పలు రకాల సేవలను అందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఈ యాప్ సేవలను ప్రారంభించేందుకు పోలీస్‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, అమరావతి ‘స్పందన సురక్ష’తో అందే ప్రధాన సేవలు – అత్యవసర సమయాల్లో పోలీసు శాఖ పరిధిలోని డయల్ 112, ఈ మెయిల్స్, వెబ్ సెర్చింగ్, ఎస్ఎంఎస్ లాంటి అన్ని కీలక లింక్‌లు ఈ యాప్‌తో అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి ఉపయోగించినా అత్యవసర సిగ్నల్ ద్వారా పోలీసులను అప్రమత్తం చేస్తుంది. – ఈ యాప్ ద్వారా ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని పోలీస్ స్టేషన్ అధికారి(ఎస్‌హెచ్‌వో)కి అందిన ఫిర్యాదు రశీదు కూడా యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు ఏ చర్యలు తీసుకున్నారో తెలుసుకోవచ్చు. – ఈ యాప్‌తో పౌర (కమ్యూనిటీ) పోలీసింగ్ నిర్వహించవచ్చు. అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక శక్తుల ఆగడాలను ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తేవచ్చు. – సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు యాప్ ద్వారా సమాచారం అందిస్తే పోలీసులు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్), ప్రత్యేక పోలీస్ బీట్ ద్వారా రక్షణ కల్పిస్తారు. – ఈ చలానా ద్వారా వాహనాలకు విధించే అపరాధ రుసుము, ఎప్పుడు ఫైన్ పడింది? ఎంత చెల్లించాలి? తదితర వివరాలను యాప్ ద్వారా తెలుసుకుని చెల్లింపులు జరపవచ్చు. – సొత్తు రికవరీ ఆప్షన్లో చోరీకి గురైన నగదు, బంగారం, వాహనాలు, మొబైల్ ఫోన్లు తదితరాలకు సంబంధించి పోలీస్ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. – కేసు స్టేటస్ ఆప్షన్లో జిల్లా, మండలం, పోలీస్ స్టేషన్, ఎఫ్ఐఆర్ వారీగా వివరాలను స్వయంగా చూసుకోవచ్చు. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పౌరులు స్వయంగా చూడవచ్చు. ఫిర్యాదు రశీదు, ఎఫ్ఐఆర్ పత్రాలను పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. – సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. లొకేట్ పోలీస్ స్టేషన్ ఆప్షన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజనల్ ఆఫీస్‌లు(ఎస్డీపీఓ), జిల్లా ఎస్పీ కార్యాలయాలు, అధికారుల మొబైల్, ల్యాండ్ ఫోన్ నెంబర్లతో సహా తెలుసుకోవచ్చు. – పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ ఈ యాప్ ఉన్న పౌరుడు ఏ ప్రాంతానికి వెళ్లినా సమీపంలోని పోలీస్ స్టేషన్, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, ఎక్కువ నేరాలు జరిగే ప్రదేశాలు, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమాచారాన్ని చూపిస్తుంది. చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వెబ్సైట్ లింక్‌లు కూడా ఉంటాయి. – అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ల వివరాలు కూడా ఈ యాప్‌లో ఉంటాయి. పోలీస్ సేవల కోసం డయల్ 100, అత్యవసర సేవలకు 112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, టూరిస్ట్ హెల్ప్‌లైన్ 1363, ఉమెన్ హెల్ప్‌లైన్ 181, అంబులెన్స్ సేవలకు 108, ఫైర్ సర్వీస్‌కు 101, రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర సేవలకు 1073, సైబర్ మిత్ర సేవల కోసం 9121211100కి డయల్ చేయవచ్చు. ఏపీ పోలీసు శాఖ రూపొందించిన యాప్‌లో అందించే సేవలు యాప్ ద్వారా లభించే మరికొన్ని సేవలు - కేసు పురోగతి వివరాలు - కిడ్నాప్‌నకు గురైన వ్యక్తుల గాలింపు వివరాలు - గుర్తు తెలియని మృతదేహాల వివరాలు - అరెస్టు అయిన నిందితుల వివరాలు - పాస్‌పోర్ట్ తనిఖీ స్టేటస్ ఉన్న చోటు నుంచే పోలీస్ సేవలు మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ యాప్‌ను రూపొందించాం. పోలీసుశాఖ టెక్ విభాగం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను తెస్తున్నాం. ఇప్పటికే దాదాపు 60 సేవలను మీ–సేవ ద్వారా పౌరులకు అందిస్తున్నాం. వీటికి మరిన్ని సేవలు జోడించి ‘స్పందన సురక్ష’ యాప్ తెస్తున్నాం. 89 రకాల పోలీసు సేవలను మొబైల్ ఫోన్ ద్వారా పౌరులు తాము ఉన్న చోటు నుంచే పొందవచ్చు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
టెక్నాలజీని అవసరానికే వినియోగించాలి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సమాజం పురోగతి సాధిస్తుండగా.. మహిళలు, యువత అదే టెక్నాలజీ బారినపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. టెక్నాలజీని అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏపీ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. మహిళలు, యువత రక్షణ కోసం ఉద్దేశించిన ‘బీ సేఫ్’ యాప్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేకతోటి సుచరిత మాట్లాడుతూ... అత్యవసర ఫోన్ నంబర్లు 100, 181, 112, వాట్సాప్ నంబరు 9121211100పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, మహిళామిత్ర, సైబర్‌మిత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉంటే పోలీసులను సంప్రదించాలి సైబర్ నేరాలకు గురయ్యే వారిలో మహిళలు, యువతులు, ఉద్యోగినులు ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. ఇబ్బందికర పరిస్థితుల్లో అధైర్య పడకుండా అత్యవసర నంబర్ల ద్వారా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... సైబర్ నేరాలు జరిగితే ఎలా స్పందించాలి, సమాజంలో ఎవరితో ఎలా మెలగాలనే దానిపై యువతులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఆపద సమయంలో అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదిస్తే పోలీస్ శాఖ వెంటనే స్పందిస్తుందన్నారు. కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పాల్గొన్నారు. -
జీరో ఎఫ్ఐఆర్ అమలుచేస్తాం
సాక్షి, అమరావతి: పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు అన్ని రేంజీల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు మెమో జారీ చేశామన్నారు. ప్రజలు తమ సమస్యలపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు నేరం లేదా ఘటన జరిగిన చోటు తమ పరిధిలో లేదని వెనక్కి పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇది సరికాదని పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమ పరిధిలో లేని చోట నేరం జరిగినా దానిపై ఫిర్యాదు వస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆ తర్వాత దాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ166–ఏ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశిస్తామని, శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని యూనిట్ల అధికారులు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లు, అధికారులకు ఈ మార్పును తెలిపి అమలయ్యేలా చూడాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంలో ఇప్పటికే 11 వేల కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 18 శాతం మహిళలపై వేధింపులవేనని, ఫిర్యాదుదారుల్లో 52 శాతం మహిళలేనని వెల్లడించారు. అన్ని సేవలు ఒకే చోట పొందేలా యాప్.. మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 తదితర టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఈ నంబర్లన్నింటినీ ఏకీకృతం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని, అప్పుడు దేనికి ఫోన్ చేయాలనే సందిగ్ధం బాధితులకు ఉండదన్నారు. అన్ని సేవలు ఒకే చోట పొందేలా ఒక యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ సవాల్‌గా మారిందని, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. గ్రామ సచివాలయంలోనూ మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌స్టేషన్‌కు పంపుతారని వివరించారు. పరిపాలన వ్యవస్థను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లే గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక విప్లవమని పేర్కొన్నారు. మహిళల భద్రత, రక్షణ, రూల్ ఆఫ్ లా, పోలీసు సమస్యలు, శాంతిభద్రతలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై మహిళా సంరక్షణ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తామన్నారు. 14,967 మంది గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు రెండు వారాలపాటు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు అర్జునరావు పేరు విజయవాడలో బందరు కాలువలో కొట్టుకుపోతున్న మహిళను ప్రాణాలకు తెగించి రక్షించిన ఆర్ఎస్ఐ అర్జునరావును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు ప్రతిపాదిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అతడి ధైర్యసాహసాలను అభినందిస్తున్నట్లు చెప్పారు. -
తప్పుడు ప్రచారం నమ్మొద్దు
ఆపదలో ఉన్న మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుండగా... మరోవైపు కొందరు ఆకతాయిలు, సంఘ వ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా పోలీసుల పేరుతోనే తప్పుడు సందేశాలు, ఫేక్ నంబర్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకొస్తుండడం గందరగోళానికి గురిచేస్తోంది. దీన్ని గుర్తించిన పోలీసు అధికారులు తక్షణమే స్పందించారు. తమ పేరిట ప్రచారంలోకి వస్తున్న తప్పుడు ప్రకటనలు, సందేశాలు, నంబర్ల వ్యవహారానికి తెరదించుతూ... ఆపదలో ఉన్న మహిళలు పోలీసులను సంప్రదించే విధానాన్ని మరోసారి ప్రకటించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – సాక్షి, అమరావతి ఆ నంబర్ పోలీసులది కాదు ‘‘మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంచి సర్వీసు ప్రారంభించారు. మీరు ప్రయాణించే కారు, క్యాబ్ లేదా ఆటో నంబర్‌ను 9969777888కు ఎస్సెమ్మెస్ చేయండి. మీకు ఒక ఎస్సెమ్మెస్ వస్తుంది. మీరు ప్రయాణించే వాహనం జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానం అవుతుంది. మరికొంతమంది ఆడపడుచులకు ఈ సందేశాన్ని పంపండి’’ ఇదీ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి తెచ్చిన మెసేజ్. నిజానికి అది పోలీసులు ఇచ్చింది కాదు. 9969777888 నంబరు అసలు పోలీసులదే కాదు. అది ఫేక్ నంబర్ అని డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పోలీసు శాఖ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇందుకు కారకులైన వ్యక్తులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం పేర్కొంది. పోలీసు శాఖ విడుదల చేసిన నంబర్లు మినహా ఇతర నంబర్లకు ఫోన్ చేయడం లేదా ఎస్సెమ్మెస్ పంపడం వంటివి చేయొద్దని పోలీసులు కోరుతున్నారు. ఫోన్ చేయగానే పోలీసులు స్పందిస్తున్నారు హైదరాబాద్‌లో యువ డాక్టర్ హత్యోదంతం తరువాత పోలీసు నంబర్లపై చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ నంబర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? పోలీసులు తక్షణం స్పందిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ప్రజలు ఉత్సుకత చూపారు. రాష్ట్రంలో ఒక్క ఆదివారం రోజే 112 నంబరుకు 40 వేల మంది ఫోన్ చేయడం గమనార్హం. ఫోన్ చేయగానే పోలీసులు స్పందిస్తున్నారని నిర్ధారించుకున్నారు. ఆపదలో పోలీసుల సహాయం పొందడానికి ఉద్దేశించిన పోలీసు మొబైల్ యాప్‌ను ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 30 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే పోలీసుల పేరిట తప్పుడు మెసేజ్‌లు వైరల్ చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు అధికారికంగా వెల్లడించిన 100, 112, 181 నంబర్లకు మాత్రమే మహిళలు ఫోన్ చేయాలి. మహిళల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. – గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ మహిళల రక్షణకు టోల్ ఫ్రీ నంబర్లు ఆపదలో ఉన్న మహిళలు తక్షణ సహాయం కోసం తమను సంప్రదించాల్సిన నంబర్లను డీజీపీ కార్యాలయం మరోసారి ప్రకటించింది. - 100కు ఫోన్ చేస్తే కాల్ సెంటర్లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వారి నుండి తక్షణమే సహాయం పొందవచ్చు. - 112కు ఫోన్ చేస్తే బాధితులు ఉన్న లొకేషన్‌తో పాటు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పిస్తారు. - 181కు ఫోన్ చేస్తే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కాల్ సెంటర్‌కు వెళ్తుంది. మహిళలు తమ సమస్యను చెబితే పోలీసులకు సమాచారం పంపి వెంటనే అప్రమత్తం చేస్తారు. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మహిళల రక్షణ కోసం పోలీసులు ‘సైబర్–మహిళామిత్ర’ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. వాట్సాప్ నంబర్ 9121211100 అందుబాటులో ఉంచారు. ఈ నంబరుకు వాట్సాప్ చేస్తే, బాధితులు ఉన్న ప్రదేశానికి పోలీసులు వెంటనే చేరుకుంటారు. రక్షణ కల్పిస్తారు. దుండగుల ఆటకట్టిస్తారు. -
చిన్నారి హత్య కేసు నిందితుడిని పట్టిచ్చిన ‘ఫేస్బుక్’
సాగర తీరంలోని విశాఖలో అందమైన అమ్మాయిలను ఎరవేసి సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్న నైజీరియా గ్యాంగ్‌ను ఈనెల 20న పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా అందమైన యువతుల ఫొటోలు పంపించి గిఫ్ట్‌లు, ఫ్రెండ్షిప్, ఫేక్ ఫోన్‌కాల్స్‌తో డబ్బులు కాజేస్తున్న ముఠా బారిన పడిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అదే సోషల్ మీడియా ద్వారా నైజీరియా ముఠా ఫోన్ నెంబర్లు, ఆచూకీ కనిపెట్టి వారి ఆట కట్టించడం విశేషం. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఈనెల 7వ తేదీన అపహరణకు గురైన చిన్నారి వర్షిత హత్య కేసులో నిందితుడు పఠాన్ మహ్మద్రఫీని సోషల్ మీడియా వారం రోజుల్లోనే పట్టిచ్చింది. చిన్నారిపై అకృత్యానికి పాల్పడిన నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విడుదల చేశారు. రఫీ ఫొటోను పలువురు డ్రైవర్లు సామాజిక మాధ్యమాల్లో గుర్తించి టమోటా లారీ క్లీనర్‌గా ఛత్తీస్గడ్ వెళ్లాడని సమాచారం అందించడంతో ఈనెల 16న అరెస్టు చేశారు. నిందితుడు గడ్డం తొలగించి గుండుతో పారిపోయినప్పటికీ సోషల్ మీడియా కళ్లుకప్పలేకపోయాడు. సాక్షి, అమరావతి: కీలక కేసుల్లో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడం ద్వారా నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చేపట్టిన సాంకేతిక ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలో 258 కేసుల్లో సోషల్ మీడియా ద్వారా నిందితులను అరెస్టు చేశారు. పదేళ్లుగా పరారీలో ఉన్న వారిని కూడా సోషల్ మీడియా సాయంతో గుర్తించి అరెస్టు చేయడం గమనార్హం. కృష్ణా, విజయనగరం, విశాఖ, చిత్తూరు, అనంతపురం తదితర చోట్ల పలు కేసుల్లో సామాజిక మాధ్యమాల సాయంతోనే క్లూస్ (ఆధారాలు) సేకరించాగలిగారు. ‘సోషల్’ జల్లెడ! కేసుల దర్యాప్తుల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండటంతో మారుమూల ప్రాంతాలకు కూడా సమాచారం చేరుతోంది. నిందితుల ఉహాచిత్రాలు, పాత నేరస్తుల ఫొటోలను ఆప్‌లోడ్ చేస్తున్నారు. పలు కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న వారి పేరుతో ఏమైనా ఫేస్బుక్ ఖాతాలున్నాయా? ఫ్రొఫైల్లో చిరునామా, ఫోన్ నెంబర్లు, వాట్సాప్ వివరాలు తదితర కోణాల్లో కూపీ లాగి సోషల్ మీడియాలో జల్లెడ పడుతుండటంతో అన్వేషణ ఫలిస్తోంది. జటిలమైన కేసుల్లోను సామాజిక మాధ్యమాలు దారి చూపుతున్నాయని సీనీయర్ ఐపీఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటం విశేషం. ఐదు సైబర్ ల్యాబ్స్ సహకారం.. సామాజిక మాధ్యమాలపై నిఘా, సమాచారాన్ని క్రోడీకరించేందుకు పలు కేసుల్లో పోలీసులు ప్రత్యేక వ్యవస్థను వినియోగించుకుంటున్నారు. తిరుపతి, కర్నూలు, విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరంలోని సైబర్ ల్యాబ్స్ సహకారంతో కేసులను చేధిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్, గూగుల్ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. వేగంగా దర్యాప్తు.. ‘కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. డ్రగ్స్ మాఫియా, సెక్స్ రాకెట్, ఆన్లైన్ జూదం తదితరాల్లో సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం నేరస్తుల ఆట కట్టించేందుకు దోహదపడుతోంది. సోషల్ మీడియాను వినియోగించుకుని కేసులు చేధించేలా డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు’ –పాల్రాజు, టెక్ సర్వీసెస్ డీఐజీ -
రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బుధవారం ఆపరేషన్ ముస్కాన్ (ఆకస్మిక తనిఖీలు) నిర్వహించారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు 794 బృందాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి తనిఖీలు చేపట్టాయి. పోలీసులు, చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సినిమా హాళ్లు, పార్కుల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపారు. బాలబాలికల అదృశ్య ఘటనలు, చట్ట విరుద్ధంగా బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఘటనలపై పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 2,774 మంది పిల్లలను గుర్తించగా వారిలో బాలురు 2,378, బాలికలు 396 మంది ఉన్నారు. వారిలో చిరునామా ఉన్న వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. చిరునామా దొరకని వారిని చైల్డ్‌లైన్‌కు అప్పగించినట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఇసుక అక్రమాలపై నిఘా పెంపు
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇసుక అక్రమంగా తవ్వినా, రవాణా చేసినా, పరిమితికి మించి నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన శిక్షలు అమలు చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజాగా ఇలాంటి అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నంబర్‌కు కాల్చేసి కాల్ సెంటర్ ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేసేవారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలన్న అంశంపై కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం కొన్ని సూచనలు చేశారు. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, టాస్‌్కఫోర్స్ చీఫ్ సురేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని టాస్క్‌ఫోర్స్ చీఫ్ సురేంద్రబాబును సీఎం ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. వారోత్సవాలు విజయవంతం వరద తగ్గడంతో అవసరాల మేరకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు సక్సెస్ అవుతున్నాయి. రోజువారీ ఉత్పత్తిని లక్ష టన్నుల నుంచి 2 లక్షల టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని వారోత్సవాలు ప్రారంభమైన 48 గంటల్లోనే అధికారులు అధిగమించారు. వరదలు తగ్గుముఖం పట్టడం, ఉత్పత్తికి అనుగుణంగా రవాణాకు తగినన్ని వాహనాలను అందుబాటులోకి తేవడంతో ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. శనివారం ఒక్కరోజే 2,03,387 టన్నుల ఇసుకను అందుబాటులోకి తేగా కేవలం 50,086 టన్నుల మేరకు మాత్రమే బుకింగ్‌లు వచ్చాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఆదివారం డిమాండ్ సగానికి తగ్గిపోయిందని వివరించారు. ఇక నుంచి రోజుకు సగటున 40వేల టన్నుల మేరకు ఇసుక డిమాండు ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. -
పోలీసులకు సొంత ‘గూడు’!
సాక్షి, అమరావతి: పదవీ విరమణ చేసే నాటికి పోలీసులకు సొంత గూడు కోసం కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నడుంబిగించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. డీజీపీ చొరవతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పీవీ సునీల్‌కుమార్ నేతృత్వంలో 15 మంది పోలీసు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లి అక్కడ పోలీస్ హౌసింగ్ స్కీమ్ అమలవుతున్న తీరును అధ్యయనం చేసింది. ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 65 వేల పోలీస్ కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. తమిళనాడునే ఎందుకు ఎంచుకున్నారంటే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో ప్రత్యేకంగా పోలీస్ హౌసింగ్ స్కీమ్ అమలవుతోంది. ‘వోన్ యువర్ హౌస్’ అనే పేరుతో ఈ పథకాన్ని జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అమల్లోకి తెచ్చారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వమే నేరుగా స్థల సేకరణ చేసి పోలీసులకు ఇల్లు కట్టిస్తోంది. ఇందుకు ప్రభుత్వ నిధులను వినియోగించడంతోపాటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. పోలీసులకు ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను మినహాయించి ఈ మొత్తానికి ప్రభుత్వం కొంత కలిపి నెలవారీ వాయిదాలు చెల్లిస్తోంది. పోలీసులు ఇలా నెలవారీ వాయిదాలు చెల్లించిన అనంతరం పదవీ విరమణ నాటికి ఆ ఇల్లు వారి సొంతమవుతుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే నివేదిక ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పీవీ సునీల్‌కుమార్ తమిళనాడు స్కీమ్ రాష్ట్రానికి ఎంత వరకు సరిపోతుందనే దానిపై నివేదిక రూపొందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అంశాలను అధ్యయనం చేస్తున్నాం. అన్ని జిల్లాలు, అన్ని నగరాల్లో ప్రస్తుతం భూముల ధరలు ఎలా ఉన్నాయి? ఎంత భూమి అవసరమవుతుంది? హౌసింగ్ స్కీమ్‌లో ఎంత మంది చేరడానికి మక్కువ చూపుతారు? వంటి అనేక విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే పోలీసులకు ఇల్లు కట్టించి నెలవారీ వాయిదాలు వారి వేతనాల్లోంచి తీసుకోవడమా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అనే వాటిపై కూడా దృష్టిపెట్టాం. పోలీసుల గృహవసతి కోసం ఇచ్చే స్థలం, నిర్మాణ వ్యయంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఏ మేరకు ఉండాలి.. ఇలా అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తున్నాం. అన్ని విభాగాల్లోని పోలీసులకు ఆప్షన్స్ ఇచ్చి ఎక్కువ మంది ఏ పద్ధతికి మొగ్గుచూపుతారో తెలుసుకుంటాం. అందులో సాధ్యాసాధ్యాలు తెలుసుకున్నాకే ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. చిన్నపాటి అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోకుండా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయన శనివారం మంగళగిరిలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా వేడుకలు ప్రశాంతంగా, అత్యంత వైభవోపేతంగా జరిగాయని అన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన అంత పెద్ద వేడుకల్లో చిన్నపాటి ఘటన కూడా జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అందుకోసం ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు. సైబర్ సెక్యూరిటీపై పోలీసులకు శిక్షణ రాష్ట్రంలోని మొత్తం పోలీస్ బృందం బాగా పని చేస్తోందని డీజీపీ కితాబిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లపై దృష్టి పెట్టామని చెప్పారు. దాదాపు రూ.42 కోట్లతో గతంలో కొనుగోలు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలు సరైన నిపుణులు లేని కారణంగా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సైబర్ క్రైమ్ విషయంలో పోలీసులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు బ్యాచ్‌లకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇచ్చామన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయని, వాటికి కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు గౌతమ్ సవాంగ్ తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీల పాసింగ్ఔట్ పెరేడ్‌కు సీఎం రాక శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది డీఎస్పీల పాసింగ్ఔట్ పెరేడ్ నిర్వహిస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 8 గంటలకు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో డీఎస్పీల పాసింగ్ఔట్ పెరేడ్ నిర్వహిస్తుండడం విశేషమని చెప్పారు. 25 మంది కొత్త డీఎస్పీల్లో 11 మంది మహిళలు ఉండటం మరో విశేషమని అన్నారు. -
నెల్లూరు ఘటనపై సీఎం సీరియస్
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తగిన ఆధారాలుంటే చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనుకాడవద్దని ఆదేశించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయిన ముఖ్యమంత్రి రాత్రికి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఈ ఘటన వివరాలు డీజీపీ నుంచి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. చట్టం ఎదుట అందరూ సమానమేనని, చట్టం అమలు విషయంలో స్వేచ్ఛగా పని చేసుకోవాలని, ఈ అంశంలో ఎవరికీ మినహాయింపులు ఉండబోవని సీఎం హెచ్చరించారు. -
కానిస్టేబుల్ ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి ఎం సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన వారి జాబితాను ట pటb. ్చp. జౌఠి. జీn వెబ్సైట్లో ఉంచారు. అనంతరం సచివాలయంలో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియ ద్వారా 2,623 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని వెల్లడించారు. 2,723 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 3,94,384 మంది దరఖాస్తు చేశారని, వారిలో 65,575 మంది రాత పరీక్షకు అర్హత సాధించారని చెప్పారు. వారిలో 2,623 మంది ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారని తెలిపారు. మిగిలిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రాత పరీక్షల్లో పురుషుల విభాగంలో జింకా శశికుమార్ (వైఎస్సార్ జిల్లా), చల్లా సత్యనారాయణ (గుంటూరు జిల్లా), సిద్ధారెడ్డి చెన్నారెడ్డి (ప్రకాశం జిల్లా), వాడపల్లి కోటేశ్వరరావు (విజయనగరం జిల్లా) 145 మార్కులకు పైగా సాధించి ఉత్తమంగా నిలిచారని మంత్రి తెలిపారు. మహిళా విభాగంలో లక్ష్మీ ప్రియాంక (విజయనగరం జిల్లా) 138 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారని చెప్పారు. ఎంపికైన వారి సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం శిక్షణకు పంపుతామని ఆమె చెప్పారు. భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. -
‘సచివాలయ’ రాత పరీక్షలకు 4,478 కేంద్రాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు. రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. -
43 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్లలో పనిచేస్తున్న ఎస్డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన 30 మందిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీఎస్పీల బదిలీలు చేపట్టినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ముందు బాబు సర్కారు అడ్డగోలు పోస్టింగ్‌లు.. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత మనుషులకు, సొంత సామాజికవర్గానికి చెందినవారికి సూపర్ న్యూమరీ పేరుతో కీలక పోస్టులు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి రెండు నెలల ముందే దాదాపు 60 మంది డీఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసింది. పోలీసుల్లో ఎక్కువ శాతం ఉన్న ఎస్సీ, బీసీ, కాపు, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారికి అప్రధాన (నాన్ ఫోకల్) పోస్టులు, అతి తక్కువగా ఉన్న చంద్రబాబు సామాజికవర్గం అధికారులకు కీలక పోస్టులు అప్పగించారు. వాస్తవానికి.. సీనియారిటీ ప్రకారం పోస్టులు కేటాయిస్తే అన్ని సామాజికవర్గాలకు అవకాశం వస్తుంది. దీనికి విరుద్ధంగా చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందినవారికి మేలు చేకూర్చేలా కొందరు సీఐలకు డీఎస్పీ క్యాడర్ ఇస్తూ సూపర్ న్యూమరీ అవకాశాన్ని వాడుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సూపర్ న్యూమరీ పేరుతో ఫిబ్రవరిలో 18 మందిని డీఎస్పీలుగా అప్‌గ్రేడ్ చేసి శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటివాటిలో కీలక పోస్టుల్లో నియమించారు. వీరిలో ఏకంగా 14 మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇంటెలిజెన్స్‌కు ఏడుగురు.. ఇంటెలిజెన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుతోపాటు మరో ఆరు జిల్లాలకు డీఎస్పీలను బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆ స్థానాల్లో ఇంటెలిజెన్స్ డీఎస్పీలుగా కొనసాగిన ఆరుగురిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు పంపారు. ఎం.భక్తవత్సలం (కర్నూలు), వై.గోవిందరావు (విశాఖ అర్బన్ జోన్), కె.విజయపౌల్ (పశ్చిమ గోదావరి), ఏవీ సుబ్బరాజు (విజయనగరం), ఆర్.శ్రీనివాసరావు (గుంటూరు), పి.శ్రీనివాసరావు (విశాఖపట్నం రూరల్)లను తదుపరి పోస్టింగ్ ఇచ్చే వరకు పోలీస్ హెడ్‌క్వార్టర్ (డీజీపీ ఆఫీసు)కు రిపోర్టు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. -
డీజీపీ నియామకంపై సవాంగ్ అసంతృప్తి
-
అంబరాన్నంటిన ‘సాక్షి’ ఎరీనా వన్
ఉత్సాహంగా సాగిన అవార్డుల ప్రదానోత్సవం విజయవాడ స్పోర్ట్స్: స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు.. సాంస్కృతిక కార్యక్రమాల హోరుతో ‘సాక్షి’ ఎరీనా వన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాలలో నిర్వహించిన ‘సాక్షి’ ఎరీనా వన్(స్కూల్, యూత్) గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. స్కూల్ ఫెస్ట్ విభాగానికి విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, యూత్ ఫెస్ట్ విభాగానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు (ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ) రీజియన్లలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు పతకాలతో పాటు ‘సాక్షి’ ఎరీనా వన్ ఫెస్ట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రావీణ్యం సాధించాలని సూచించారు. ప్రతిభను వెలికితీయడంలో ‘సాక్షి’ది విశేష కృషి.. శాప్ ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ మాట్లాడుతూ.. మరుగునపడిపోయిన క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో ‘సాక్షి’ విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు. ‘సాక్షి’ మీడియా నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడిసిన్ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం మంచిపరిణామమన్నారు. సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ‘సాక్షి’ ఎరీనా ఉత్తమ వేదికని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత ప్రమాణాలతో నడిచే పాఠశాలు, కళాశాలల వివరాలతో సాక్షి మీడియా తీసుకొచ్చిన కాఫీ టేబుల్ బుక్‌ను సీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రా హాస్పిటల్స్ అధినేత రమణ మూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ, ఎఫ్ట్రానిక్స్ ఎండీ రామకృష్ణ, ట్రిట్స్ ఇంటర్నేషనల్ స్కూల్(రాజమండ్రి) ప్రిన్సిపాల్ బాల త్రిపుర సుందరి, ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టర్, నేషనల్ గేమ్స్ సిల్వర్ మెడలిస్టు కె.శిరోమణి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తదితరులు ఆవిష్కరించారు. టీవీ జర్నలిస్టు స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘సాక్షి’ పత్రిక మఫిసిల్ ఎడిటర్ రాఘవరెడ్డి పాల్గొన్నారు. సాక్షి ఎరీనా విజేతలు వీరే.. సాక్షి ఎరీనా వన్ స్కూల్, యూత్‌ఫెస్ట్ క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, క్యారమ్స్, చెస్ పోటీలతో పాటు డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. జూనియర్ రాష్ట్రస్థాయి క్రికెట్లో విశాఖపట్నం చైతన్య పాలిటెక్నిక్ కళాశాల జట్టు విన్నర్‌గా, తిరుపతి ఎస్.వి.జూనియర్ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. సీనియర్ విభాగంలో విన్నర్‌గా కంచికచర్ల మిక్ ఇంజినీరింగ్ కళాశాల, రన్నరప్‌గా విశాఖపట్నం చైతన్య ఇంజినీరింగ్ కళాశాల జట్టు నిలిచాయి. వాలీబాల్ ఉత్తరాంధ్రలో శ్రీ సూర్య జూనియర్ కళాశాల, విశాఖపట్నం విన్నర్‌గా, విశాఖపట్నం ప్రభుత్వ ఐటీఐ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. సోలో డ్యాన్స్‌లో విన్నర్‌గా ఎస్ఎస్ఎన్ కళాశాల నరసారావుపేట విద్యార్థి గణేష్ నాయక్, రన్నరప్‌గా సీహెచ్ తేజస్వీ (నలంద డిగ్రీ కళాశాల), తృతీయ స్థానాన్ని డి.గణేష్ (టీజేపీఎస్ కళాశాల, గుంటూరు) పొందారు. కబడ్డీ యూత్ విభాగం కోస్తాంధ్ర సీనియర్స్‌లో విన్నర్‌గా ఆంధ్ర లయోల కళాశాల విజయవాడ, రన్నరప్‌గా మంగళగిరి వీటీజేఎస్ కళాశాల నిలిచాయి. -
రాజధాని నిర్మాణంలో యువశక్తి కీలకం
‘లయోలా రన్ ఫర్ అమరావతి’ని ప్రారంభించిన గౌతమ్ సవాంగ్ విజయవాడ (మొగల్రాజపురం) రాజధాని అమరావతి నిర్మాణంలో యువశక్తి కీలకమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆంధ్రా లయోలా కళాశాల, ఆంధ్రా లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన ‘లయోలా రన్ ఫర్ అమరావతి’ కార్యక్రమాన్ని గౌతమ్‌సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలన్నారు. నా ఇటుక-నా అమరావతిలో భాగంగా కళాశాల యాజమాన్యం విద్యార్థుల తరపున నాలుగు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలను ఆన్లైన్ ద్వారా రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నామని కళాశాల డెరైక్టర్ రవిశేఖర్ తెలిపారు. మైదానంలో రాష్ట్ర మ్యాప్ ఆకారంలో విద్యార్థులు కూర్చుని అలరించారు. పద మూడు జిల్లాల పేర్లు తెలిసేలా జెండాలు పట్టుకోవడంతో పాటుగా జిల్లాకు ఒక రంగు వంతున 13 రంగుల టోపీలను ధరించారు. అనంతరం జరిగిన రన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
బెజవాడలో నేరచరిత్ర మారాలి: సవాంగ్
ఇప్పటి వరకూ 600 కు పైగా కాల్ మనీ ఫిర్యాదులు అందాయని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన శనివారమిక్కడ వివరించారు. ఈ వ్యవహారంలో వ్యాపారుల ఆర్థిక మూలాలపై ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి దర్యాప్తు చేస్తామని సీపీ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ తరహా నేరగాళ్లపై చర్యలు సాధ్యమని అన్నారు. కాగా..విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా విజయవాడపై మరింత నిఘా ఉంటుందని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. బెజవాడలో నేర చరిత్ర మారాలని ఆయన అన్నారు. నేరాలను నివారించేందుకు టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్నారు. మరో వైపు.. గుడివాడలో కాల్ మనీ వ్యాపారి కొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. 59 పాస్ బుక్కులు, 83 ఏటీఎం కార్డులు, 6 స్టాంపు పేపర్లు సీజ్ చేశారు. రైల్వే ఉద్యోగులకు అప్పులు ఇచ్చిన సుబ్బారెడ్డి.. వారికి ఫోన్ చేసి వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సవాంగ్‌ను సాగనంపారు
♦ ‘మనీ-సెక్స్’ కేసు కీలక దశలో సర్కారు నిర్ణయం.. బాధితుల్లో ఆందోళన ♦ విజయవాడ ఇన్చార్జి పోలీస్ కమిషనర్‌గా సురేంద్రబాబు నియామకం ♦ కాల్‌మనీ ముఠా ఆగడాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ♦ టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలపై ఆరోపణలు.. పెద్దల్లో గుబులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లారు. ఇన్చార్జి కమిషనర్‌గా గౌతమ్ సవాం గ్ కంటే సమర్థుడైన ఎన్వీ సురేంద్రబాబును నియమించామని డీజీపీ జె.వి.రాముడు చెప్పా రు. ఈ నెల 27 వరకు ఆయనకు సెలవు మంజూరు చేసినట్లు మంగళవారం విలేకరులకు తెలిపారు. సవాంగ్ బదిలీపై వెళ్లడంతో కాల్‌మనీ బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాల్‌మనీ వ్యవహారంలో తప్పు చేసిన ఎంత గొప్పవారైనా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సదస్సు సందర్భంగా చెప్పారు. కానీ మరుసటి రోజే సీపీ సెలవుపై వెళ్లడం.. బాబుగారి మా టలకు అర్థాలే వేరా? అనే సందేహం కలిగిస్తోంది. కాల్‌మనీ, ముఖ్యంగా మహిళలపై లై ంగిక వేధింపులకు సంబంధించిన కీలక దర్యాప్తు కొనసాగుతుండగా, కాల్‌మనీ ముఠా ఆగడాలపై ఫిర్యాదులు, మనీ-సెక్స్ దందాలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న దశలో.. కమిషనర్ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. తమపై ఎక్కడ కేసులు నమోదు అవుతాయోనన్న భయంతో వణికిపోతున్న అధికార పార్టీ నేతలు సీఎంపైనా, టీడీపీకి చెం దిన కేంద్రమంత్రిపైనా సవాంగ్‌ను బదిలీ చే యాలనే ఒత్తిడి తెచ్చినట్లు పోలీసువర్గాల సమాచారం. అయితే ఈ దశలో, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో సవాంగ్‌ను బదిలీ చేసినా, దీర్ఘకాలం సెలవుపై పంపినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిం చినట్లు తెలిసింది. దీంతో కొద్దికాలం సెలవుపై పంపితే ఈలోగా అంతా సద్దుమణుగుతుందనే ఉద్దేశంతో.. సవాంగ్‌ను పది రోజుల పాటు సె లవుపై పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. కమిషనర్ వైఖరి నేపథ్యంలోనే..? మహిళల విషయంలో పశువుల్లా వ్యవహరించి న వారిని వదిలేది లేదని సీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేయిం చారు. పటమటలో కాల్‌మనీ సెంటర్ నిర్వహిస్తున్న కార్యాలయంపై దాడిచేసి అందులో ఉ న్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ అడ్డగోలు దందాలో అధికార పార్టీ నేతల పెట్టుబడులు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక కీలక మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, విజయవాడలోని డివిజన్ స్థాయి నేత ల పేర్లు బహిర్గతమయ్యాయి. ఈ రాకెట్లో అధికార పక్ష ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వెంకన్న తదితర నేతల పాత్ర ఉందని తేలిపోయింది. మరోవైపు బాధితులందరూ ఫిర్యాదు చేస్తే కేసు మరింత బలపడుతుందని సవాంగ్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తితో పెద్ద సం ఖ్యలో మహిళా బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కమిషనర్ సూచనతో ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు ము మ్మరం చేశారు. తాజాగా మంగళవారం నగరంలోని 92 ప్రాంతాల్లో దాడులు చేశారు. అధికార పార్టీకి చెందిన మరింతమంది పట్టుబడ్డారు. వీరిలో ఎమ్మెల్సీ వెంకన్న బంధువు లు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు ఉన్నారు. దీంతో తమ డొంక కదులుతోందని భావించిన ప్రభుత్వం.. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదంటూ ఒత్తి డి పెంచినట్లు సమాచారం. తాము చెప్పినట్టు విననిపక్షంలో సెలవుపై వెళ్లాలని కూడా మౌఖి కంగా ఆదేశాలు జారీ చేసినట్టు అధికారవర్గా లు తెలిపాయి. అయితే ఇందులో ప్రభుత్వ ఒత్తిడి ఏమీ లేదని, సవాంగ్ రెండు నెలల కిందటే సెలవు కోరారని డీజీపీ వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశామని చెప్పారు. పలు కేసులు దర్యాప్తులో ఉండగా సీపీని సెలవుపై పంపడం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా వచ్చే సీపీ.. సవాంగ్ కన్నా సమర్థుడని డీజీపీ అన్నారు. తాను ముందుగానే సెలవు కోసం దరఖాస్తు చేశానని ఇప్పుడు శాంక్షన్ అయిందని సీపీ సవాంగ్ చెప్పారు. ఇదే నిజమైతే.. నిన్నగాక మొన్న కాల్‌మనీ కేసు దర్యాప్తు వేగంగా జరిపిస్తామని, మహిళల విషయంలో పశువుల్లా వ్యవహరించిన వారిని వదిలేది లేదని ఎందుకంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, డీజీపీ ఒత్తిడి మేరకే ఆయనలా చెప్పి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాల్‌మనీ కేసులో ఒత్తిళ్లు లేవు: సవాంగ్ కాల్‌మనీ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, తన వ్యక్తిగత పనిమీదే సెలవుపై వెళ్తున్నానని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. గేట్‌వే హోటల్లో మంగళవారం సీఎం నిర్వహిం చిన శాంతిభద్రతల సమీక్ష మధ్యలో బయటకు వచ్చిన సవాంగ్‌ను మీడియా పలుకరించడంతో కాల్‌మనీ రాకెట్‌పై అనుమానాలకు తావులేకుండా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో ఎంతటి వారున్నా చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటివరకు కాల్‌మనీ రాకెట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉన్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు సాగుతోందని, బాధితుల ఫిర్యాదుల మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2 నెలల క్రితమే సెలవుకు దరఖాస్తు చేశానని, నెలరోజుల క్రితం సెలవు మంజూరైందని, పది రోజుల తరువాత విధుల్లో చేరతానని చెప్పారు. -
సీపీ బదిలీ
కొత్త కమిషనర్‌గా గౌతమ్ సవాంగ్ బెజవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సీపీ బదిలీ విషయాన్ని గతనెల 12నే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంటెలిజెన్స్‌కు సీపీ బదిలీ విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. కొత్త పోలీసు కమిషనర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్ రానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసులో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎ.బి.వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించినట్లు చెపుతున్నారు. గత నెల రోజులుగా ఆయన బదిలీపై ప్రచారం జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఈ నెల మూడో తేదీతో కోడ్ ముగియడంతో సోమవారం సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగానే ఎ.బి.వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. గత ఏడాది ఆగస్టు ఎనిమిదిన పోలీసు కమిషనర్‌గా అదనపు డీజీ హోదాలో ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. 11 నెలల వ్యవధిలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలను ప్రజలు ప్రశంసించగా, మరికొన్ని నిర్ణయాలు ప్రజలు, పొలిటికల్ వర్గాల్లో అసంతృప్తికి దారితీశాయి. ఆటంకాలను అధిగమిస్తూ ప్రభుత్వం వద్దనున్న పలుకుబడి ఉపయోగించి కమిషనరేట్‌లో పలు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నిధుల లేమిని దృష్టిలో ఉంచుకొని నగర ప్రముఖులను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సోమవారం పటమట టీచర్స్ కాలనీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. దేశంలోనే అతిపెద్ద అమరావతి పోలీసు కమిషనరేట్‌కు ఎ.బి.వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. సంపూర్ణ సహకారం : సీపీ నగర పోలీసు వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ సహకారం లభించిందని సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. అందరి సహకారంతో చేయాలనుకున్న అన్నింటిని అమలు చేసినట్లు చెప్పారు. మరికొన్ని మధ్యలో ఉంటే, కొన్ని పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
జాగా కావలెను
సాక్షి, విజయవాడ : అధికారిక అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని వచ్చేనెల 21వ తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలో నిర్వహించనున్నారు. అయితే, నగరంలో ఎక్కడా పోలీస్ అమరవీరుల స్తూపం లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న అధికారులు తాత్కాలిక స్తూపం ఏర్పాటుపై మొగ్గుచూపి ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. దీంతోపాటు పోలీస్ బాస్ రంగంలోకి దిగి శాశ్వతంగా అమరవీరుల స్తూపం నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ బాధ్యతలను బెటాలియన్స్ అదనపు డీజీ గౌతమ్ సవాంగ్‌కు అప్పగించారు. దీంతో సవాంగ్ రెండు రోజుల క్రితం విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో పర్యటించారు. శాశ్వత స్తూపం ఏర్పాటుపై కసరత్తు సాగిస్తూనే విజయవాడలో తాత్కాలిక స్తూపం ఏర్పాటు చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. మరోవారం రోజుల వ్యవధిలో విజయవాడలో తాత్కాలిక స్తూపం నిర్మించే ప్రాంతాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్ర పోలీస్ అమరవీరుల స్తూపం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉండేది. దీంతో ప్రభుత్వం ఏటా అక్కడే అధికారిక కార్యక్రమాలు నిర్వహించేది. ఆ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. నూతన ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడను రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. విభజన క్రమంలో గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్తూపం తెలంగాణ రాష్ట్ర కేటగిరీలోకి చేరిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అమరవీరులకు అసలు ప్రస్తుతానికి స్తూపమే లేదు. ఇప్పటివరకు అంత సీరియస్‌గా పట్టించుకోని పోలీస్ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తేదీ దగ్గర పడటంతో అధికారుల్లో పూర్తిస్థాయి కదలిక మొదలైంది. మంగళగిరి బెటాలియన్‌లో తొలుత శాశ్వత అమరవీరుల సంస్మరణ స్తూపం ఏర్పాటు, స్టేడియం నిర్మాణానికి స్థల లభ్యత ఉందని గుర్తించారు. అయితే, అక్కడ బెటాలియన్ అమరవీరుల స్తూపం ఉండటంతో రాష్ట్ర స్తూపం అక్కడ పెట్టడం సాధ్యంకాదని నిర్ణయించి విజయవాడ నగరంపై దృష్టి సారించారు. విజయవాడను ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు కాబట్టి రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా విజయవాడ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించిన క్రమంలో విజయవాడలో శాశ్వత స్తూపం, స్టేడియం ఏర్పాటు కోసం స్థల సేకరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బెటాలియన్స్ డీజీ గౌతమ్ సవాంగ్ విజయవాడలోని ఆంధ్రలయోల కళాశాల ప్రాంగణం, సిదార్థ కళాశాల సెంటర్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు.