Arjitha Sevas
-
శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఆర్జిత సేవ
-
తిరుమల: నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల
సాక్షి, తిరుపతి: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్టోబర్ కోటా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పాతిక వేల మంది భక్తులు తలనీలాలు, 71 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇదీ చదవండి: శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం -
టీటీడీ శుభవార్త.. 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం జూన్ 19న ఉదయం 10గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు -
22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ 22న ఉదయం 10 గంటల నుంచి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి సేవను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం అర్ధరాత్రి వరకు 61,374 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు ఉన్నవారికి సకాలంలో, దర్శనం టికెట్లు లేనివారికి 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారికి 2 గంటల్లో దర్శనమవుతోంది. కాగా, శ్రీవారిని మంగళవారం ఏపీ హోం మంత్రి తానేటి వనిత, ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు సూర్యకుమార్ యాదవ్, ఎంపీలు ప్రిన్సెస్ దియా కుమారి, శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అలాగే, మంత్రి తానేటి వనిత కుటుంబ సభ్యులతో తిరుచానూరుకు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. -
ద్వారకాతిరుమలలో చినవెంకన్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా రెండు సార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. క్షేత్ర చరిత్ర ద్వారకామహర్షి తపోఫలితంగా ఉద్భవించిన క్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయంభూ చినవెంకన్న పుట్టలో వెలిశారు. పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి స్వామిని తెచ్చి స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ, ఆశ్వయుజ మాసాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సంప్రదాయం ఉంది. అభివృద్ధి ఘనం భక్తుల సౌకర్యార్థం కొండపై రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన అధికారులు, మరికొన్ని నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపనలు చేశారు. కాటేజీల నిర్మాణం, డోనర్ స్కీమ్, నిత్యాన్నదాన ట్రస్టు, నిత్యకల్యాణం, గోసంరక్షణ, విమానగోపుర స్వర్ణమయ పథకం, ప్రాణదాన ట్రస్టులకు విరాళాలను సేక రిస్తూ క్షేత్రాభివృద్ధిలో భక్తులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. కొండపైన సన్డైల్, గార్డెన్లు, క్షేత్రంలో 40 అడుగుల గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు, శ్రీవారి ధర్మప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు ఇలా.. ► ఈనెల 5న ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం. ► 6న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం ధ్వజారోహణ. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై గ్రామోత్సవం ► 7న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం. ► 8న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై గ్రామోత్సవం. ► 9న రాత్రి 8 గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం. ► 10న రాత్రి 7 గంటల నుంచి రథోత్సవం. ► 11న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం. ► 12న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం–పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి . సేవలు రద్దు బ్రహోత్సవాలు జరిగే రోజుల్లో ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తాం. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
వారిని ఆర్జిత సేవలకు అనుమతించండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవ నిమిత్తం 14 ఏళ్ల క్రితమే ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకుని, కోవిడ్ వల్ల ఆ సేవలు పొందలేకపోయిన భక్తులకు మరో అవకాశం కల్పించకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉభయ పక్షాలకు అనువైన తేదీన భక్తులు ఎంచుకున్న ఆర్జిత సేవల భాగ్యాన్ని కల్పించాలని, ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖపట్నానికి చెందిన ఆర్.ప్రభాకరరావు శ్రీవారి ‘మేల్చాట్’ వస్త్రం సేవకు 2007లో టికెట్ బుక్ చేసుకున్నారు. ఆయనకు 2021 డిసెంబరు 17న ఈ సేవ పొందే అవకాశం దక్కింది. అయితే కోవిడ్ వల్ల ఈ సేవను టీటీడీ రద్దు చేసింది. దీని స్థానంలో బ్రేక్ దర్శనం కల్పిస్తామని లేదా డబ్బు వాపసు ఇస్తామని తెలిపింది. మరికొందరు భక్తులు కూడా పూరాభిషేకం, వస్త్రాలంకరణ తదితర సేవలకు టికెట్లు బుక్ చేసుకోగా, టీటీడీ వాటిని కోవిడ్ కారణంగా రద్దు చేసింది. దీంతో వారంతా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీహెచ్ ధనుంజయ్, ఎం.విద్యాసాగర్ తదితరులు వాదనలు వినిపించగా, టీటీడీ తరపున న్యాయవాది ఎ.సుమంత్ వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఉమ్మడిగా విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు వెలువరించారు. పిటిషనర్ల ఆర్జిత సేవల రద్దుకు టీటీడీ చెబుతున్న కారణాల్లో నిజాయితీ, సదుద్దేశం కనిపించడం లేదని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు. గతంలో బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసి వారికి ఆర్జిత సేవల అవకాశాన్ని తిరస్కరించిన టీటీడీ, మరోవైపు కొత్తగా భక్తులకు ఆర్జిత సేవా టికెట్లను విక్రయిస్తోందని, ఇది పిటిషనర్ల చట్టబద్ధమైన నిరీక్షణ హక్కును హరించడమే అవుతుందని తెలిపారు. పిటిషనర్ల ఆర్జిత సేవల టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. -
సామాన్యులకు అంతరాలయ దర్శనం
అరసవల్లి(శ్రీకాకుళం): అరసవల్లి ఆదిత్యుని క్షేత్రంలో కొత్త ఆర్జిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు దాతలు, ప్రముఖులకే దక్కిన అంతరాలయ దర్శ నం ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమోదాన్ని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి శనివారం వరకు ప్రత్యేక సమయాల్లో అంతరాలయ ద ర్శనానికి ప్రత్యేకంగా టిక్కెట్లను ప్రవేశపెడుతూ దే వదాయ శాఖ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ప్ర త్యేక సూర్యనమస్కారాల పూజలకు కూడా ప్రత్యేక టిక్కెట్లను నిర్ణయిస్తూనే.. అష్టోత్తర, సహస్ర నామార్చనలు, భోగ సమర్పణ టిక్కెట్ల ధరలను సైతం స్వ ల్పంగా పెంచుతూ నిర్ణయించింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచే ఈ కొత్త ధరల విధానాలను అమలు చేయనున్నట్లు ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ప్రకటించారు. అయితే ముఖ్యంగా అన్ని ఆదివారాలు, రథసప్తమి, క్షీరాబ్ధి ద్వాదశి, వార్షిక కల్యాణం, వైకుంఠ ఏ కాదశి తదితర పర్వదినాల్లో మాత్రం అంతరాలయ దర్శనం, అష్టోత్తర, సహస్ర నామార్చనలు వంటి ఆర్జిత సేవలకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్నవరంలో సత్యన్నారాయణ స్వామి వ్రతాల మాదిరిగా సూర్యనమస్కార పూజలను, సింహాచలంలో అప్పన్న స్వామి అంతరాలయ దర్శనాలు లాగానే అరసవల్లిలో కూడా కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. సూర్యనమస్కారాల పూజలకు.. సంపూర్ణ ఆరోగ్యం కోసం జరిపించుకునే సూర్యనమస్కారాల పూజలను రెండు స్థాయిల్లో జరగనున్నా యి. ఆలయ అనివెట్టి మండపానికి ఇరువైపులా ఉన్న మండపాల్లో సూర్యనమస్కార పూజలు నిర్వహిస్తే ఒక్కొక్కరికి రూ.300 చొప్పున టిక్కెట్టు ధర ను, అలాగే ఇంద్ర పుష్కరిణి మార్గంలో ఉన్న సూర్యనమస్కార మండపంలో చేయించుకుంటేæ ఒక్కొక్కరికి రూ.100 చొప్పున టిక్కెట్టు ధరగా నిర్ణయించా రు. ఈ పూజలు ఆదివారంతో సహా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్ర మే అనుమతి ఉంటుంది. ఒక్కో బ్యాచ్‌కు సుమారు 35 నిమిషాల వరకు పూజాసమయం ఉంటుంది. ఇంతవరకు ఈ సూర్య నమస్కార పూజల టిక్కెట్టు ధర రూ.50 ఉండేది. నామార్చనల పూజలు.. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అంతరాలయంలో అష్టోత్తర శతనామార్చనకు రూ.50 (పాత ధర రూ.20), సహస్రనామార్చనకు ఒక్కొక్కరికి రూ.100 (పాత ధర రూ.30)గా నిర్ణయించారు. క్షీరాన్న భోగం సమర్పణకు రూ.100 ఆదిత్యుని ఎంతో ఇష్టమైన క్షీరాన్న భోగ సమర్పణ పూజ ధరను రూ.50 నుంచి రూ.100కి పెంచుతూ నిర్ణయించారు. అయితే కేవలం ఆదివారం రోజునే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మాత్రమే ఈ భోగ సేవకు అనుమతి ఉంటుంది. అంతరాలయ దర్శన టిక్కెట్టు రూ.100 ఆదిత్యుని అంతరాలయ దర్శనానికి ఒక్కో భక్తునికి రూ.100 టిక్కెట్టుగా నిర్ణయించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు అలాగే సా యంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఈ అంతరాలయ దర్శనం ఉంటుంది. ఇక ఆదివారాల్లో యథావిధిగా విశిష్ట దర్శనం (రూ.500) టిక్కెట్టుకు ఇద్దరు చొప్పున, ప్రత్యేక దర్శన టిక్కెట్టు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున దర్శనాలకు అవకాశాలు ఉంటాయి. ఆదివారాల్లో ఈ దర్శనాల టిక్కెట్టు భక్తులకు అంతరాలయ దర్శనం ఉండదు. -
పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ
ఏడు కొండల శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజూ పండుగే. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలను విశిష్ట కైంకర్యంగా చేపడతారు. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసన ఆధారం. సోమవారం నుంచి పదో తేదీ వరకు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల చరిత్ర తెలుసుకుందాం.. తిరుమల : శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి దోషాల పరిహారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆలయ శాసనాలలో.. తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ క్రమం తప్పకుండా ఏటా శ్రావణమాసం శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. శాస్త్రోక్తంగా అంకురార్పణ పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామివారి సేనాపతి అయిన విష్వక్సేనుడు పల్లకీపై తిరువీధుల్లో విహరిస్తూ ఆలయ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడే భూమి పూజ, మృత్సంగ్రహణం (పుట్టమన్నును) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు. ఈమేరకు శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డెప్యూటీ ఈఓ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలిరోజు మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతో తయారు చేసిన పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగిస్తారు. మూడోరోజు – ముగింపు హోమాలు, అభిషేక పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగ మోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు. (చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు) మూడు రోజులు ఆర్జిత సేవల రద్దు పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 8న సహస్ర దీపాలంకరణ సేవ, 9న అష్టదళ పాద పద్మారాధన సేవ, 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కల్యోణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. రెండో రోజు – సమర్పణ తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారికి సమ ర్పిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని పరివార దేవతలకు పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక
తిరుమల: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్లైన్లో విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీ డిప్ సేవా టికెట్లు 8,070 ఉన్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు లక్కీ డిప్లో కేటాయించనుంది. దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 గంటల నుంచి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టికెట్ల నిర్థారణ చేస్తారు. కేటాయించిన టికెట్ల జాబితాను జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారు. టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. ఇది కూడా చదవండి: డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం -
31 నుంచి టీటీడీలో కరెంట్ బుకింగ్
తిరుమల: కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే కరెంట్ బుకింగ్ విధానం రెండేళ్ల విరామం తరువాత ఈ నెల 31న పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సీఆర్వో జనరల్ కౌంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. టికెట్ల కేటాయింపు ఇలా ► నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ► రెండు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌లు వస్తాయి. ఒక స్లిప్ యాత్రికునికి ఇస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి. మరో స్లిప్‌ను రిఫరెన్స్ కోసం కౌంటర్ సిబ్బంది ఉంచుకుంటారు. ► నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్ ర్యాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్ఈడీ స్క్రీన్లలో మొదటి డిప్ తీస్తారు. ► శుక్రవారం అడ్వాన్స్డ్ బుకింగ్ టికెట్లు కలిగి ఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జితం కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. ► లక్కీడిప్‌లో టికెట్లు పొందిన గృహస్తులు వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంటలలోపు మొబైల్ నంబర్లకు సమాచారం తెలియజేస్తారు. టికెట్లు పొందని వారికి కూడా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ► యాత్రికులు డిప్ విధానంలో అవకాశాన్ని పొందడం కోసం ఆటో ఎలిమినేషన్ ప్రక్రియ అమలవుతుంది. ► యాత్రికులు డిప్ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్నట్టయితే 6 నెలల వరకు తిరిగి వారు ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతించరు. ► సేవల నమోదు కోసం ఆధార్ తప్పనిసరి. ఎన్ఆర్ఐలైతే పాస్‌పోర్ట్ చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుతో స్వయంగా హాజరుకావాలి. ► కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల కేటాయింపు జరుగుతుంది. వివాహం జరిగి 7 రోజులు మించకుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు. 31 నుంచి అంగప్రదక్షిణం టోకెన్లు అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టీటీడీ పునరుద్ధరించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమలలోని పీఏసీ–1లోని రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేస్తారు. సాధారణంగా శుక్రవారాల్లో అభిషేకం కారణంగా భక్తులకు దర్శనం లేకుండా అంగప్రదక్షిణకు మాత్రమే అనుమతిస్తారు. ఈ కారణంగా ఏప్రిల్ 1న శుక్రవారం అభిషేకం కారణంగా అంగప్రదక్షిణ భక్తులకు దర్శనం ఉండదు. -
ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గతంలో ఇస్తున్న విధంగానే తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద ఉన్న కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది. ఇందుకోసం భక్తులు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదు చేసుకుంటే ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేసి టికెట్లు కేటాయిస్తారు. అలాగే, భక్తులకు ఏప్రిల్ 1 నుంచి పీఏసీ–1 వద్ద అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది -
20న ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
తిరుమల: ఏప్రిల్, మే, జూన్ లకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22న ఉదయం 10 గంటల తరువాత వెబ్సైట్లో పొందుపరుస్తారు. టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు వాటి ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణో త్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు. పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు.. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవ, వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, స హస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజ పాద దర్శనం సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు
-
తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం, రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని, పీఏసీ–4 (పాత అన్నప్రసాద భవనం)లోని లగేజి సెంటర్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత పదిరోజుల కిందట సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించటంతో రద్దీ పెరిగిందని చెప్పారు. అందుకు అనుగుణంగా ఇబ్బంది లేకుండా అల్పాహారం, అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తులకు భోజనంతో పాటు రొట్టెలు, చపాతీలు అందిస్తామన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలను ఏప్రిల్ నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు సామాన్య భక్తులకు అందించే ఆర్జితసేవలు, దర్శనాల ధరలను టీటీడీ పెంచలేదని, ఆ ఆలోచన ఇప్పట్లో లేదని పేర్కొన్నారు. ధరల పెంపుపై పాలకమండలిలో చర్చ మాత్రమే జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలను రద్దుచేశామని చెప్పారు. కొండమీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వీజీవో బాలిరెడ్డి తదితరులున్నారు. ఫిబ్రవరిలో 10,95,724 మంది భక్తులు తిరుమల శ్రీవారిని ఫిబ్రవరిలో 10,95,724 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.79.34 కోట్లు లభించాయి. 5.35 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 13.63 లక్షల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాలు స్వీకరించారు. దాదాపు 1.64 లక్షల గదులను భక్తులకు కేటాయించారు. 329.04 ఎంఎల్డి నీరు, 27.76 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. 64.90 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. 3,378 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. -
దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు: టీటీడీ
తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లు, సేవా టికెట్ల పేరుతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెలా 20వ తేదీ ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ ఆధార్ కార్డు నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని కోరింది. -
ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈనెల 14 నుంచి భక్తులను అనుమతించే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈనెల 13న శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 6వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 6 నుంచి 11గంటల వరకు ఆలయ శుద్ధి చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి సేవలో ప్రముఖులు ఎంపీ శ్రీధర్, సినీ నిర్మాత విశ్వప్రసాద్, సీఐడీ ఎస్పీ సరిత, అపోలో డైరెక్టర్ సునీత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. -
యాదాద్రిలో ఆర్జిత సేవలు ప్రారంభం
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఉదయం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 కారణంగా మార్చి 22 నుంచి రద్దు అయిన ఆర్జిత సేవలు 196 రోజుల తర్వాత పున:ప్రారంభమయ్యాయి. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. భక్తుల రద్దీ ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించే క్రమంలో థర్మల్ స్క్కీనింగ్,శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఆదివారం (నేటి) నుంచి శ్రీస్వామి వారి ఆర్జిత సేవలైన అభిషేకం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన పూజలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునేందుకు భక్తులను అనుమతించినట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా భక్తులు మొక్కులుగా సమర్పించే తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు. కొండ కింద గల తులసీ కాటేజీలో సైతం ఒక కుటుంబంలో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కుటుంబానికే గదులు కేటయిస్తామన్నారు. వీటన్నింటికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి, కోవిడ్–19 నిబంధనల ప్రకారం జరిపించనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా వేకువజామున 4గంటలకు తెరచి రాత్రి 9.45గంటల వరకు ఆలయంలో పూజలు జరిపించనున్నట్లు తెలిపారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఇక యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆర్జిత సేవలను ప్రారంభించనున్నట్లు ఈవో వెల్లడించారు. అంతే కాకుండా ఆలయ దర్శన వేళలను మార్పు చేసినట్లు తెలిపారు. వేకువ జామున 4 గంటల నుంచి రాత్రి 9.45గంటల వరకు నిత్య కైంకర్యాలను కొనసాగిస్తామన్నారు. ఇక శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి బాల ఆలయంలో నిత్య కైంకర్యములు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పూజలన్నీ కోవిడ్–19 నిబంధనల ప్రకారం జరిపిస్తామన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే ప్రతి భక్తుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు. ఆరు నెలల తరువాత ఆర్జీత సేవలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 6నెలల 11 రోజుల తరువాత ఆర్జిత సేవలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22వ తేదీన లాక్డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాదాద్రి ఆలయంలో భక్తులచే జరిపించే ఆర్జిత సేవలను దేవాదాయశాఖ ఆదేశాలతో రద్దు చేశారు. ఇక జూన్ 8వ తేదీ నుంచి భక్తులను శ్రీస్వామి వారి దర్శనానికి అనుమతిచ్చి, ఆన్లైన్లో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తుల పేరుతో పూజలు జరిపించారు. ఇక లాక్డౌన్లో వచ్చిన సడలింపులతో ఆదివారం కోవిడ్–19 నిబంధనలతో భక్తులకు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు అనుమతిచ్చారు. -
ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబర్ నెల కోటా కింద మొత్తం 69,254 టికెట్లను శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,904 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ఆయన మీడియాకు వివరించారు. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 58,350 సేవా టికెట్లు ఉన్నాయని.. వీటిలో విశేష పూజ 1,500, కల్యాణం 13,300, ఊంజల్ సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకార సేవ 16,800 టికెట్లు ఉన్నాయన్నారు. కాగా, ఈనెల 13, 27 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు.. 14, 28 తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు సింఘాల్ వివరించారు. కాగా, ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి తిరుమలలో అందరికీ జనప నార బ్యాగులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈవో చెప్పారు. టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శనాల కేటగిరీలను రద్దు చేశామని తెలిపారు. దీని వల్ల గంట సమయం ఆదా అవుతుందని, తద్వారా దాదాపు 5వేల మంది సామాన్య భక్తులకు అదనంగా దర్శనం చేయించేందుకు వీలవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈవో బసంత్‌కుమార్, సీవీఎస్ఓ గోపీనా«థ్ జెట్టి, ఇన్చార్జి సీఈ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 9 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’ ఈ నెల 9 నుంచి 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంలో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 9న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్న నేపథ్యంలో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేస్తామన్నారు. కాగా, తిరుమలలో 124 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అలాగే, గత ఏడాది జూలైలో హుండీల ద్వారా శ్రీవారికి రూ.102.88కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నెలలో రూ.109.60కోట్లు వచ్చిందని ఈవో వివరించారు. -
ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు
సాక్షి, తిరుపతి : 2019 అక్టోబరు నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. అక్టోబర్ నెలకు సంబంధించి మొత్తం 55,355 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఆన్లైన్ డిప్ విధానంలో 9,305 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళ పాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 46,050 సేవాటికెట్లు ఉండగా వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 10,450, ఊంజల్ సేవ 3,300, ఆర్జిత బ్రహ్మూత్సవం 6,050, వసంతోత్సవం11,550, సహస్ర దీపాలంకార సేవ 13,200 టికెట్లు ఉన్నాయి. -
టీటీడీ ఆర్జిత సేవా టికెట్ల విడుదల
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన బంగారం తరలింపుపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పాలకమండలి నిర్ణయిస్తుందని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో భక్తుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మే 13 నుంచి 15 వరకు తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వేసవిలో పెద్ద ఎత్తున తరలివచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వైకుంఠం క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకోని వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా నియంత్రించామని తెలిపారు. కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పిలిగ్రిమ్ వెల్ఫేర్ కమిటిని ఏర్పాటు చేసామని అన్నారు. ఏప్రిల్ మాసంలో 21.96 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 95 లక్షల లడ్డూలు విక్రయించామని వెల్లడించారు. హుండి ద్వారా 84.27 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందన్నారు. టీటీడీ ఆర్జిత సేవా టికెట్ల విడుదల ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. మొత్తం 67,737 టిక్కెట్లను విడుదల చేయగా వాటిలో జనరల్ క్యాటెగిరీ క్రింద 56,325 టిక్కెట్లు, ఆన్లైన్ ద్వారా 11,412 టిక్కెట్లు అందుబాటులో ఉంచనుంది. ఈ జనరల్ క్యాటెగిరీలో విశేషపూజ-1500, కళ్యాణం-13,300, ఉంజల్ సేవ-4200, ఆర్జిత బ్రహ్మోత్సవం-7425, వసంతోత్సవం-14,300, సహస్త్ర దీపాలంకారం15,600 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఆన్లైన్ క్యాటెగిరీ క్రింద మొత్తం 11,412 టిక్కెట్లు విక్రయించనుండగా వాటిలో సుప్రభాతం-8117, తోమాల-120, అర్చన-120, అష్టాదలం-180, నిజపాదం-2875 టిక్కెట్లు అందుబాటులోఉంటాయి. -
శ్రీవారి దర్శన సమాచారం ఇవ్వడానికి..
సాక్షి, తిరుమల : శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఏ సమాయానికి దర్శనమవుతుందో తెలియజేయడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు సమాచార ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించేందుకు చేపట్టామని అన్నారు. జూన్ మాసానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఆయన ఆన్లైన్లో విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో నిర్మించిన శ్రీవారి ఆలయంలో ఈ నెల 8న సాయంత్రం అంకురార్పణ, 13న విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 13 నుంచి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ‘మహసంప్రోక్షణ’పై పుస్తకం తెస్తాం.. తిరుమల శ్రీవారి ఆలయంలో గతేడాది నిర్వహించిన మహసంప్రోక్షణ, 2030లో నిర్వహించే మహసంప్రోక్షణ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకువస్తామని ఈవో వెల్లడించారు. ఆగమ సలహా మండలి సూచన మేరకు రూ.1.5 కోట్లతో రథ మండపం, రూ.23 కోట్లతో నారాయణ గిరి ఉద్యానవనంలో క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నామని తెలిపారు. రూ.4.5 కోట్లతో శ్రీవారి పుష్కరిణి ఆధునికీకరణపనులు చేస్తూన్నామని తెలిపారు. ఏఫ్రిల్ 24 నుంచి 27 వరకు వరహాస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ ఉంటుందని పేర్కొన్నారు. -
1,840 ఆలయాలకు ధూప దీప నైవేద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,840 దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పథకం అమల్లో ఉన్న 1,805 దేవాలయాలతోపాటు మరో 3 వేల ఆలయాల్లో అమలు చేయాల్సి ఉందని, తొలిదశలో భాగంగా 1,840 దేవాలయాలకు వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధూప, దీప, నైవేద్య పథకం కింద చేసే ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకోకపోతే ఆ గుడికి ఎప్పుడైనా సాయా న్ని నిలిపేస్తామన్నారు. ధూప దీప నైవేద్య పథకాన్ని సెప్టెంబర్ నుంచే వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే దేవాలయాలకు పునర్వైభవం వచ్చి ందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 66 బంజారా దేవాలయాల్లోని పూజారులు, బావోజీలు, సాధు సంతులకు చోటు కల్పించినట్లు వెల్లడించారు. విశ్వకర్మల, మార్కండేయ దేవాలయా ల్లోని అర్చకులకూ గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పా రు. కొత్తగా ఇచ్చిన 1,840 ఆలయాలకు ఏడాదికి రూ.14.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 3,645 ఆలయాల అర్చకులకు ఏడాదికి రూ.27.5 కోట్లను గౌరవవేతనం ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 కొత్త ఆలయాల నిర్మాణంతోపాటు జీర్ణోధరణకు సర్వ శ్రేయో నిధి నుంచి రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. -
తిరుమల: ‘ఆర్జిత’ టికెట్ల స్కాం వెనుక భారీ నెట్వర్క్
సాక్షి, తిరుపతి : తిరుమలలో వెలుగుచూసిన అక్రమ ఆర్జిత సేవల టికెట్ల బాగోతం వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆర్జిత టికెట్లను లక్కీ డిప్ ద్వారా టీటీడీ కేటాయిస్తుండటాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి వాటి ద్వారా టికెట్లు పొంది వాటిని వేల రూపాయలకు అమ్ముతున్నట్టు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా ఈ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంటి దొంగల హస్తం కూడా దీని వెనుక ఉందని అనుమానాలు కలుగుతున్నాయి. షోలాపూర్‌కు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఒకే మొబైల్ నంబర్‌తో 700లకు పైగా యూజర్ ఐడీలు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు అతని దగ్గర 1000కి పైగా నకిలీ ఆధార్ కార్డులు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. దీనికి గుంటూరు, చెన్నైకి చెందిన ఇద్దరు సహకరించినట్టు సమాచారం. -
ఆర్జిత సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దేవాలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేస్తామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ న్యూనల్లకుంటలోని రామాలయంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేవాలయాలు తెరిచే ఉంటాయని, నిత్యపూజలు, మహానైవేద్యం సమర్పిస్తామని, అయితే, భక్తులు ఫీజు చెల్లించి జరిపించుకునే అర్చనాభిషేకాలను మాత్రం నిలిపివేస్తామని చెప్పారు. తాము సీఎం కేసీఆర్‌కు, దేవాదాయ మంత్రి, కమిషనర్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం లేదని, కేవలం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగానే ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు. అర్చక, ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్‌లో జీవోనెం.577 విడుదల చేశారని, మళ్లీ సెప్టెంబర్ వస్తున్నా అధికారులు ఈ జీవోను అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే విడుదల చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలు సరిచేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఈ విషయమై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు భానుమూర్తి చెప్పారు. -
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబరు నెలకు సంబంధించి 49, 060 ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది. 49,060 టిక్కెట్లలో 8,235 సేవా టిక్కెట్లను ఆన్లైన్ లాటరీ విధానంలోను, 40,825 ఆర్జిత సేవా టిక్కెట్లను కరెంట్ బుకింగ్ సదుపాయం కింద టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్ల విడుదల సమయం నుంచి నాలుగు రోజుల పాటు నమోదు అవకాశం కల్పించింది. అనంతరం డిప్ విధానంలో టిక్కెట్ల కేటాయింపు, నగదు చెల్లింపునకు అవకాశం ఇస్తుంది. ఆన్లైన్ జనరల్ కేటగిరి కింద విడుదల చేసిన విశేష పూజ, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్ల వివరాలు: సుప్రభాతం 6,805 తోమాల 80 అర్చన 80 అష్టదళ పాదపద్మారాధన 120 నిజపాద దర్శనం 1,150 విశేష పూజ 1,500 కల్యాణోత్సవం 9,975 ఊంజల్ సేవ 3,150 ఆర్జిత బ్రహ్మోత్సవం 5,500 వసంతోత్సవం 9,900 సహస్ర దీపాలంకరణ 10,800