BC bill
-
డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ
కాచిగూడ (హైదరాబాద్): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, అత్యధిక స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంతోనే సరిపోదని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్రప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తేలిందని వెల్లడించారు. బీసీ బిల్లు కోసం బీసీలు సంఘటితంగా పోరాటం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు ఎన్.మారేశ్, బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మహేందర్, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, జయంతి, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, సుధాకర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెలు, బర్రెలు కాదు.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి... చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఎస్పీ ఫ్లోర్ లీడర్ శ్యామ్ సింగ్, ఎంపీ బినోయ్ విశ్వమ్, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, మల్లు రవి మద్దతు తెలిపారు. వందలాది మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీసీ సంఘాల నాయకులు ఈ భారీ ప్రదర్శనలో పాల్గొ న్నారు. ‘ఓట్లు బీసీలవి– సీట్లు అగ్రకు లాలవా.. రాజ్యాధికారంలో వాటా కావాలి‘ అంటూ నినాదాలు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి నందగోపాల్ రాజ్ కుమార్, నేతలు గోవింద్, కర్రి వేణు మాధవ్, బాషయ్య, పరశురామ్ నాయకత్వం వహించారు. బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారు: కృష్ణయ్య ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అ గ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టా రని... కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు – బర్రెలు పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు. -
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ‘బీసీ బిల్లు’ పెట్టి బీసీలకు చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బీసీలకు గొర్రెలు–బర్రెలు కాదు, రాజ్యాధికారం కావాలంటూ నినాదాలు చేశారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్, గుజ్జ కృష్ణ, లాకా వెంగళ్ రావు, లాల్ కృష్ణ, గుజ్జ సత్యం తదితరులు ప్రసంగించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ బిల్లు పెట్టేందుకు వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే సహా 18 పార్టీలు మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయన్నారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే బిల్లు పాసవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణన డిమాండ్‌తో ఓబీసీ సెమినార్.. దేశంలో వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని ఏపీభవన్‌లో బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలిండియా ఓబీసీ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, తలారి రంగయ్య, డా.సంజీవ్, రెడ్డెప్ప, అనురాధ, అయోధ్య రామిరెడ్డి, వంగా గీత హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..సామాజిక న్యాయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సువర్ణాధ్యాయమన్నారు. బీసీల కోసం అనేక పథకాలు రూపొందించారని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎస్సీ–ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న తరహాలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 10 సీట్లు బీసీలకు ఇచ్చి పూర్తి ప్రాధాన్యత కల్పించారని వివరించారు. -
బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్సీపీదే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ రాజ్యసభలో బీసీ బిల్లును పెట్టిన ఘనత ఒక్క వైస్సార్సీపీకే దక్కు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. భారత దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని కితాబిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవగా, వచ్చే పార్లమెంట్ సమావేశా ల్లో సైతం బీసీ బిల్లు పెడతామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. కాగా, ఆదర్శ పాఠశాల ల్లో పనిచేసే 1,000 మంది టీచర్లకు వెంటనే 7 నెలల జీతాలు చెల్లించడంతో పాటు వీరిని రెన్యువల్ చేయాలని ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు
సాక్షి, అమరావతి : అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారని, తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే తమ పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ లీడర్లను సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక రిసార్ట్‌లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీని నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. తన సీట్లోనే ఉన్న అచ్చెన్నాయుడిని గొడవ చేస్తున్నారంటూ సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకే మైకు ఇవ్వడంలేదని అందుకే ప్రెస్మీట్లు పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సభలో సీఎం శాసిస్తుంటే స్పీకర్ పాటిస్తున్నారన్నారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని జగన్మోహన్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో, కదిరి బహిరంగ సభలో చెప్పారని.. రాష్ట్రమంతా ఈ విషయాన్ని చెప్పుకుంటూ తిరిగారని చంద్రబాబు తెలిపారు. ఆయన ప్రకటన చూసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆశపడి ఓట్లు వేశారన్నారు. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే, పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి 255 హామీలు ఇచ్చారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 67, ఇంకా అదనంగా ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 592 హామీలు ఇచ్చారన్నారని తెలిపారు. వాటిని నిలబెట్టుకోవాలని అడుగుతున్నామన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే వారికి బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు తగ్గించారో చెప్పాలన్నారు. బీసీ నాయకుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లు పెట్టారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయని, వారి వేధింపులు తట్టుకోలేక ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వేధింపులకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రబాబు చెప్పారు. సలహాలిచ్చేందుకు అవకాశం ఇవ్వడంలేదు అంతకుముందు.. అసెంబ్లీలో మీడియాతో చంద్రబాబు ముచ్చటిస్తూ.. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్పీకర్ కానీ, విప్‌లు కానీ ఎలాంటి ప్రయత్నం చేయట్లేదన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నామని, కానీ సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదన్నారు. -
బడుగులకు మేలు చేస్తే సహించరా?
మోసం చేయడం, అబద్ధాలాడటం మా ఇంటా వంటా లేదని మరోసారి చెబుతున్నా. ఎన్నికలకు వెళ్లే ముందు మా ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాం. దానికి ఓటేయమని అడిగాం. మా మేనిఫెస్టో చూశాకే ప్రజలు మాకు ఓటేశారని గర్వంగా తలెత్తుకుని చెబుతున్నాం. జగన్ అనే నేను ఎన్నికలప్పుడు ఏం మాట్లాడానో ఇక్కడ స్క్రీన్‌పై చూపిస్తాను. చూసిన తర్వాత మీకు (ప్రతిపక్షానికి) మనస్సాక్షి అనేది ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పండని అడుగుతున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతే ఎలా? అని ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గాలకు ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చీ రావడంతోనే వాళ్ల కోసం అనేక పనులు చేస్తుంటే భరించలేకపోతున్నారని మండిపడ్డారు. బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించిన చట్టాలు చేస్తుంటే దుర్బుద్ధితో సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారమే వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, అయినా రాద్ధాంతం చేయడంలో అర్థమేంటని నిలదీశారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు వేసిన ఓ ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి బదులిచ్చారు. అయినా ప్రతిపక్ష సభ్యులు శాంతించక.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్‌తో సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. ఈ దశలో సీఎం వైఎస్ జగన్ సభకు వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాల వీడియోలను సభలో ప్రదర్శించారు. పాదయాత్రలో అన్నది ఇదీ.. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు వద్ద 2018 సెప్టెంబర్ 3వ తేదీన వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను సభలో ప్రదర్శించారు. అందులో ‘ప్రతి అక్కా, చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. సంతోషంగా ఉండాలనేది నాన్నగారి స్వప్నం. వాళ్లు సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది.. రాష్ట్రం బాగుంటుందని నమ్మే వాళ్లల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. వాళ్ల కోసం నేను చేయబోయే కార్యక్రమం వైఎస్సార్ చేయూత. ఇంతకు ముందు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కల పరిస్థితి గురించి చెప్పాను. ఏదైనా జ్వరమొచ్చి ఒక్క వారం పనులకు పోలేకపోతే వాళ్లు పస్తులు పడుకునే దుస్థితి. ఇలాంటి వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని అప్పట్లో నేను చెబితే వెటకారం చేశారు. ఈ సూచనను కూడా పరిగణనలోనికి తీసుకుని వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలుకుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కల కుటుంబానికి అక్షరాల రూ.75 వేలు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం రెండో సంవత్సరం నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా, పూర్తి పారదర్శకతతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా, ప్రతీ అక్కకు అందేట్టుగా చేస్తామని హామీ ఇస్తున్నాను’ అని వైఎస్ జగన్ అన్నారు. దుర్బుద్ధితో వక్రీకరణ తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు దుర్బుద్ధితో వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘అర్థం చేసుకోవాలనే ఆలోచన లేనప్పుడు, ఒక విషయం స్పష్టంగా తెలిసినా వక్రీకరించాలనే దుర్బుద్ధి ఉన్నప్పుడు, సహజంగా వీళ్లకొచ్చే మాటలు మంచి మనసుతో రానప్పుడు వక్రీకరణే కనిపిస్తుంది. ద్వంద్వ విధానాలు, దుర్బుద్ధితో వీళ్లు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది’ అని అంతకు ముందు ప్రదర్శించిన వీడియోను మరోసారి సభలో ప్రదర్శించారు. ఎందుకు మార్చామో ప్రతీ సభలో చెప్పా రాజకీయ స్వార్థంతోనే టీడీపీ తన ప్రసంగాన్ని వక్రీకరిస్తోందని జగన్ అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నప్పుడు టీడీపీ ఏమన్నదో, దాంతో తాము ఎలాంటి మార్పు చేయాల్సి వచ్చిందో సభకు వివరించారు. ‘మేము ఇంత స్పష్టంగా చెప్పాం. ఎక్కడా వక్రీకరించడానికి కూడా తావులేదు. అయినా వక్రీకరించడం కోసం ఏకంగా సభా సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారు. ఎలాంటి చర్చకు తావు లేకుండా, రాజకీయ లబ్ధి కోసం స్వార్థంగా ఆలోచించే చంద్రబాబు సభలో ఉండటం బాధపడాల్సిన అంశం’ అన్నారు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని తప్పుబడుతూ చంద్రబాబు చూపిస్తున్న పేపర్ క్లిప్పింగ్‌ను జగన్ తన వద్దకు తెప్పించుకుని వివరణ ఇచ్చారు. ‘చంద్రబాబు ఇచ్చిన పేపర్ (చూపిస్తూ) 2017 అక్టోబర్ 18వ తేదీకి సంబంధించిన అంశం. ఆ తర్వాత 2018 సెప్టెంబర్ 3న మాడుగుల నియోజకవర్గం కె. కోటపాడు మండలంలో వైఎస్సార్ చేయూత అనే పథకాన్ని ప్రకటించాం. అది ఏ నేపథ్యంలో, ఎందుకు లాంచ్ చేశామనేది పాదయాత్ర జరుగుతుండగా, ప్రజల సమక్షంలోనే ఎలాంటి పరిస్థితుల్లో పథకాన్ని మారుస్తున్నామో వివరంగా చెప్పాం. ఈ ఒక్క మీటింగ్‌లోనే కాదు, ఆ తర్వాత దాదాపు పది మీటింగుల్లో ఈ పథకం ఎలా మార్చామన్నది చెప్పాను. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర జరుగుతుండగానే పదిసార్లు చెప్పి ఉంటా. రెండు నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారంలో పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా సార్లు చెప్పాం’ అని సభకు తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్రలో వైఎస్సార్ ఆసరాకు సంబంధించి తాను చేసిన ప్రసంగం వీడియోను మరోసారి సభలో ప్రదర్శించారు. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లడిగాం ‘ఇదిగో.. ఈ మేనిఫెస్టో (చూపిస్తూ) తీసుకెళ్లి ప్రజలను ఓట్లడిగాం. వాళ్లు ఓట్లేశారు. వాళ్లు (టీడీపీ) అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. వాళ్లకు మంచి చేయాలన్న ఆలోచన ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడుకు ఏనాడూ రాలేదు. మేం అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆలోచన చేశాం. మొట్టమొదటి శాసనసభలోనే చట్టాలను తీసుకొస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి చేసేందుకు అడుగులేస్తున్నాం. నామినేషన్ పదవుల్లోనే కాదు, నామినేషన్ పనుల్లో కూడా వాళ్లకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. నామినేట్ పదవుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టు వర్కుల్లో మహిళలకు సంబంధించి 50 శాతం రిజర్వేషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటుకు బిల్లు కూడా పెట్టాం. పిల్లలకు ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్నారు. అందుకే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాం. ఈ పెద్దమనిషి (చంద్రబాబు) ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడూ పిల్లల గురించి ఆలోచించలేదు. వాళ్ల ఉద్యోగావకాశాల గురించి, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పిల్లలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వచ్చిన వెంటనే బిల్లులు తీసుకొస్తే, వాటి ద్వారా ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దుర్బుద్దితో సభను అడ్డుకుంటున్నార’ని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ఒకే ఒక్కఅంశం మీద సభను గంటన్నర సేపు అడ్డుకున్నారని, ఇకనైనా సభను ముందుకు తీసుకెళ్లాలని స్పీకర్‌ను కోరారు. ప్రశ్నోత్తరాల సమయం దాటిపోవడంతో, బిల్లుల మీద చర్చ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. -
ఒకటి అడిగితే సీఎం జగన్ రెండు చేస్తున్నారు..
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టించారని బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీల పార్టీలుగా చెప్పుకునే వాళ్లంతా బీసీలను మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిపారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టారు. కేంద్రం ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టినా బీసీ బిల్లు కోసం పోరాడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: బీసీ బిల్లుకు కేంద్రం నో బడ్జెట్లో కూడా బీసీలకు అత్యధికంగా రూ.15వేల కోట్ల నిధులు కేటాయించారు. అమ్మ ఒడి, విద్యార్థులకు రూ.20వేల మెస్ ఛార్జీలు, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాగైతే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే వైఎస్ జగన్ ప్రతి పథకంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అత్యధికంగా లబ్ది చేకూరేలా చేశారు. మంత్రివర్గంలో 60శాతం పదవులే కాకుండా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చారు. బీసీల కోసం నేను ఒకటి అడిగితే రెండు చేస్తున్నారు. సీఎం జగన్ వల్ల నాకు పోరాటం చేయడానికి సబ్జెక్టే లేకుండా పోయింది’ అని అన్నారు. కాగా చట్టసభల్లో ఓబీసీల జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్’బిల్లుపై జూన్ 21న సభలో సుదీర్ఘ చర్చ జరిగిన విషయం తెలిసిందే. -
బీసీ బిల్లుకు కేంద్రం నో
సాక్షి, న్యూఢిల్లీ : జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తాను ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్‌కు రాకుండా కేంద్రం ప్రదర్శించిన వైఖరికి నిరసనగా రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి వాకౌట్ చేశారు. చట్టసభల్లో ఓబీసీల జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్’బిల్లుపై జూన్ 21న సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు చర్చ ముగియకుండానే సభ వాయిదా పడటంతో శుక్రవారం తిరిగి ఈ బిల్లుకు చర్చకు వచ్చింది. చర్చ ముగియడానికి ముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మాట్లాడుతూ.. ఓబీసీ వర్గాలకు చెందిన ముఖ్య నేతలు ఎందరో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని, ఓబీసీలకు రిజర్వేషన్లు అడిగి వారి సేవలను తక్కువ చేసి చూడరాదని పేర్కొంటూ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం.. 2026 వరకు లోక్‌సభ స్థానాలు గానీ, విధాన సభల స్థానాలు గానీ పెరగవన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వాదనను తిప్పికొట్టారు. బిల్లుపై 14 మంది సభ్యులు మాట్లాడగా ఒకరిద్దరు మినహా అందరూ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల అభ్యున్నతికి పాటుపడే పార్టీ అన్నారు. దేశంలో వారి జనాభా దామాషా ప్రకారం.. వారికి ప్రాతినిధ్యం ఉందా అని ప్రశ్నిం చారు. దాదాపు 29 రాష్ట్రాల్లోనూ ఓబీసీల జనాభా సగాని కంటే ఎక్కువగా ఉందన్నారు. అలాంటప్పు డు వారికి ప్రాతినిధ్యం ఎందుకు దక్కకూడదు అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలిచినట్టుగానే ఓబీసీలకు కూడా అండగా నిలవాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు సీట్లు పెరగవు కాబట్టి ఈ బిల్లు అమలు చేయలేమని మంత్రి పేర్కొన్నారని, ప్రస్తుతం ఉన్న సంఖ్యలోనే ఓబీసీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించవచ్చని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే ఓబీసీల ప్రయోజనాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న డాక్టర్ సత్యనారాయణ జతియా బిల్లును ఉపసంహరించుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీనికి విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఉపసంహరించుకోవడం లేదని, బిల్లుపై ఓటింగ్ జరగాలని పట్టుబట్టారు. ఉన్నవారిలో రెండొంతుల మంది చాలు.. రవిశంకర్ ప్రసాద్ తిరిగి జోక్యం చేసుకుంటూ బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించారు. ఓబీసీల కోసం రిజర్వేషన్లు కోరుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లు తేవాలని, అది ఇలా సాధ్యం కాదన్నారు. దీంతో బిల్లును ఉపసంహరించుకుంటున్నారా అని సభాపతి మరోసారి ప్రశ్నించారు. ఈ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సభలో సగం మంది ఉండాలని, అంటే కనీసం 123 మంది సభ్యులు ఉండాలని, మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదించాలని సభా నాయకుడు థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. ఇప్పుడు సభలో సభ్యులు లేనందున బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించారు. రవిశంకర్ ప్రసాద్ కూడా ఇదే సూచించారు. దీంతో న్యాయ మంత్రి చెబుతున్న అభ్యంతరం ఏంటో స్పష్టం చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ‘నేను మధ్యాహ్నం 3 గంటలకు న్యాయ మంత్రి వద్దకు వెళ్లి ప్రభుత్వం ఓబీసీల ప్రయోజనాల దృష్ట్యా ఒక సమగ్ర బిల్లును తెచ్చేందుకు హామీ ఇవ్వాలని కోరా. కానీ ఆయన స్పందించలేదు. అలాంటప్పుడు నా వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రయోజనాలు పరిరక్షిస్తుంది’అని పేర్కొన్నారు. ఆర్టికల్ 368 ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది ఆమోదించాల్సి ఉన్నందున దీనిపై ఓటింగ్ జరగదని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే విపక్షాల సభ్యులు లేచి సభకు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదిస్తే సరిపోతుందని, మొత్తం రాజ్యసభ సభ్యులు అవసరం లేదని పేర్కొన్నారు. కొద్దిసేపు సభలో వాగ్వాదం కొనసాగింది. విజయసాయి రెడ్డికి మద్దతుగా నిలిచిన సభ్యులంతా పెద్దెత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా మంత్రి తన వాదన నుంచి వెనక్కి తగ్గలేదు. దీంతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్రి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. మీరు రూలింగ్ ఇస్తారు. ఇది సరే. కానీ ఈ అభ్యంతరాన్ని ఆయన నేను బిల్లును ప్రతిపాదించినప్పుడే ఎందుకు చేయలేదు. రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళ్లినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. న్యాయమంత్రి బిల్లుపై చర్చ జరిగిన తరువాత ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమర్థనీయం కాదు. ప్రభుత్వం సహకరించనందున, సభా నిబంధనలు పాటించనందున, ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేస్తున్నా..’అని సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. -
బీసీ బిల్లు చరిత్రాత్మకం
పంజగుట్ట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మక ఘట్టమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీలం వెంకటేశం అధ్యక్షతన రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లుకు మద్దతుగా 93 బీసీ కులాలు, 30 సంఘాల విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య బీసీ బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రత్యేక శ్రద్ధ చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డిని అభినందించారు. పార్లమెంట్లో ఉన్న 92 మంది బీసీ సభ్యులు వారిని చూసి నేర్చుకోవాలని, ఇప్పటికైనా వారికి పూర్తి మద్దతు పలకాలని కోరారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని గతంలోనే కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసి కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బీజేపీ కూడా బిల్లుకు మద్దతు ఇస్తూ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లుకు తాము మద్దతివ్వకూడదనుకుంటే వారే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని సూచించారు. త్వరలోనే బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీల ప్రతినిధులను, పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. బీసీ బిల్లు పాసైతేనే ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వర్తిస్తాయన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, పార్లమెంట్‌వద్ద ఎన్నోసార్లు ధర్నాలు చేశామని, 40 సార్లు ప్రధానమంత్రిని కలిసి చర్చించినట్లు ఆయన గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించి బిల్లు పెట్టారని దీనిని ఆమోదింపజేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చొరవ తీసుకుని అన్ని పార్టీలను సమావేశపరిచి బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు రాజకీయాల్లో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదని, దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుండి ఒక్క బీసీ ఎంపీ కూడా లేకపోవడం దారుణమన్నారు. దేశంలో 2600 బీసీ కులాలు ఉండగా 2550 కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన పాలకులు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. ఇప్పటివరకు 121 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినా బీసీ బిల్లుపై ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట సభల్లో బిసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను 100 శాతానికి పెంచి ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్ గడప తొక్కని బిసీ కులాల వారికి నామినేషన్ పద్దతిలో నామినేట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ బీసీ సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయి రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయినా ఎంతో గొప్ప మనస్సుతో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశారన్నారు. సమావేశంలో నాయకులు గుజ్జ కృష్ణ, మల్లయ్య, వేముల వెంకటేష్, లాలు కొట వెంకటాచారి, లక్ష్మణ్ యాదవ్, విరోభ, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు పెట్టాలి
హైదరాబాద్ : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇంతవరకు అసెంబ్లీ, పార్లమెంటు గడప తొక్కని బీసీ కులాల వారికి నామినేటేడ్ పద్ధతిలో ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి, రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 50 శాతానికి పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్ర, ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, దాసు సురేశ్, సి.రాజేందర్, జి. అంజి, వేముల రామకృష్ణ, జి. కృష్ణ యాదవ్, నరేష్‌గౌడ్, బర్క కృష్ణ, మహేందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఆహ్వానించారు: ఆర్.కృష్ణయ్య
-
వైఎస్ జగన్ ఆహ్వానించారు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య శనివారం లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆర్. కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్‌పై చట్టసభల్లో చర్చ జరపాలని వైఎస్ జగన్‌ను కోరినట్టు తెలిపారు. 14 పేజీలతో కూడిన వినతిపత్రం ఆయనకు ఇచ్చినట్టు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ గురించి మొట్టమొదటిగా ప్రైవేట్ బిల్లు పెట్టినందుకు వైఎస్ జగన్‌ను అభినందించినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో తమ పార్టీ తరపున లేవనెత్తుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. బీసీల కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఎంతో కృషి చేశారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఈ నెల 17న ఏలూరులో నిర్వహించనున్న బీసీ గర్జన సభకు రమ్మని తనను వైఎస్ జగన్ ఆహ్వానించారని చెప్పారు. బీసీల కోసం ఎక్కడ సభ పెట్టినా, ఏ పార్టీ సభ నిర్వహించినా వెళ్తానని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. -
‘ఆ బిల్లుతో సామాజిక న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు (బీసీ) రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. దీనిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన వివిధ పార్టీల గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవనీయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ బీసీ ప్రజల తరుఫున, వైఎస్సార్సీపీ తరుఫున ధన్యావాదాలు. బీసీ మేధావులు, ప్రజాసంఘాల ఉద్యమ ఫలితమే ఈ బిల్లు. రాజ్యాంగంలోని 123వ సవరణ బిల్లును రాజ్యసభ ప్రతిపాదనలను త్రోసిపుచ్చుతూ సభకు హాజరైన 406 మంది లోక్‌సభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం హార్షనీయం. రాజ్యసభ సవరణలతో ఆమోదించిన బిల్లును లోక్‌సభ సవరించడం చరిత్రలోనే ప్రప్రధమం. ఇప్పటి వరకు పాలకవర్గాలు బీసీల సామాజిక ఆర్థిక గణనచేసి బహిర్గతం చేయలేదు. రాజ్యసభ సభ్యులు కూడా బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాము. బీసీ కమిషన్‌కు ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఈ బిల్లుతో బీసీ వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత కలుగుతాయి’ అని పేర్కొన్నారు. బీసీలకు చట్టసభలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించాలని, ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్స్ కొనసాగించాలని కోరుతూ.. వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లు త్వరలో చర్చకు రానుంది. దీనిపై కూడా జంగా హర్షం వ్యక్తం చేశారు. -
బీసీ బిల్లును పార్లమెంట్లో లేవనెత్తుతాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు అంశాన్ని తప్పకుండా లేవనెత్తుతామని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బృందం అఖిలేశ్‌ను కలిశారు. చట్టసభలు, ఉద్యోగ పదోన్నతులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలేశ్‌ను కోరారు. బీసీల వాదన సరైందని, వచ్చే సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. -
బీసీ బిల్లు, సబ్‌ప్లాన్ సాధించే దాకా పోరాటం చేస్తాం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు, రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టే వరకు పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. శుక్రవారం జరిగిన బీసీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..200లకు పైగా డిమాండ్లతో బీసీ డిక్లరేషన్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించామని, ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి బీసీకి రూ.రెండు లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనున్న బీసీ విస్తృత స్థాయి సమావేశానికి అన్ని జిల్లాల ముఖ్య నేతలు, వివిధ కుల సంఘాల రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్ట సభ ల్లో 50% రిజర్వే షన్లు కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీలకు మద్దతుగా ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టడం హర్షించదగిన విషయమన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండా చేశారన్నారు. బీసీ బిల్లుపై పలు మార్లు ప్రధాని, కేంద్ర మంత్రులను కలసినా నిరాశే మిగిలిందన్నారు. రిజర్వేషన్ల అమలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ల విడుదలపై మంగళవారం జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామ న్నారు. ఈ నెల 7న కరీంనగర్లో, 9న పరిగి, 21న తిరుపతి, 25న విజయవాడ, 29న కర్ణాటకలోని బీదర్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి
హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. సంఘం అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాలెండర్‌ను ఆవిష్కరించి న తర్వాత ఆయన ప్రసంగించారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రీమీలేయర్ నిబంధనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రా న్ని కోరారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాలరావు, ఉన్నతాధికారి జె. శ్రీనివాస్‌రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, నేతలు బ్రహ్మేంద్రరావు, శేఖర్‌బాబు, జి. స్వామి, కె. సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించండి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మంగళవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ బృందం వినతి పత్రం సమర్పించింది. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపింది. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆర్టికల్ 340 ప్రకారం చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరింది. వినతి పత్రంలోని అంశాలు.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్‌ను తొలగించాలి. బీసీల జనాభా ప్రకారం కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలి. బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ/ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజుల రీయింబర్స్మెంట్ విధానాన్ని సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. కేంద్ర స్థాయిలో రూ.60 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ కింద ఏటా రూ.50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదు. మెరిట్లో వచ్చిన వారిని ఓపెన్ కంపిటీషన్లో భర్తీ చేయాలి. ఈ సమావేశంలో నందగోపాల్, భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించండి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మంగళవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ బృందం వినతి పత్రం సమర్పించింది. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపింది. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొంది. ఆర్టికల్ 340 ప్రకారం చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరింది. వినతి పత్రంలోని అంశాలు.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్‌ను తొలగించాలి. బీసీల జనాభా ప్రకారం కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలి. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలి. బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ/ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజుల రీయింబర్స్మెంట్ విధానాన్ని సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. కేంద్ర స్థాయిలో రూ.60 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ కింద ఏటా రూ.50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదు. మెరిట్లో వచ్చిన వారిని ఓపెన్ కంపిటీషన్లో భర్తీ చేయాలి. ఈ సమావేశంలో నందగోపాల్, భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి: జాజుల
హైదరాబాద్: రాబో యే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. 30న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే బీసీ విద్యార్థి మహా గర్జనకు మద్దతు తెలపాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కోరారు. ఈ సందర్భం గా బీసీ బిల్లును ఆమోదింపజేసి బీసీల పక్షాన నిలబడతామని దత్తాత్రేయ అన్నారు. అనంతరం బీసీ విద్యార్థి గర్జన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
ప్రస్తుత పార్లమెంట్ సెషన్స్‌లోనే బీసీ బిల్లు
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టా లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బంద్‌లు, రాస్తారోకోలు, మిలిటెంట్ పోరాటాలు చేస్తామన్నారు. బీసీ భవన్లో సోమవారం జరిగిన సంఘం విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్లో 36 రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్నా ఒక్కటి కూడా బీసీల పక్షాన మాట్లాడట్లేదని విమర్శించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. -
10 ఎకరాల స్థలం.. రూ.10 కోట్ల బడ్జెట్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇతర కులాలకు స్థలం, నిధులు కేటాయించిన విధంగా బీసీల్లోని 70 కుల సంఘాలకు హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్ల బడ్జెట్ కేటా యించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో శుక్రవారం పలు కుల సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై త్వరలో ప్రధానమంత్రిని కలవనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, సమన్వయకర్త నీల వెంకటేష్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల వెంకటేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, గౌడ జేఏసీ కన్వీనర్ అంబలి నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి. హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ రాజ్ సంస్థలో బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 50 శాతానికి పెంచాలని సూచించారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలన్నారు. బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించాలని ఈ నెల 21న హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. -
బీసీ బిల్లుపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
సీఎం కేసీఆర్‌కు ఆర్.కృష్ణయ్య వినతి సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలన్న ప్రధాన డిమాండ్ సాధనకు అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ను ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో డా.ర్యాగ అరుణ్, గుజ్జకృష్ణ, ఎర్రసత్యనారాయణ, నీల వెంకటేష్, కృష్ణుడు, నర్సింహాగౌడ్, భార్గవ్, తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మెస్ చార్జీలు, స్కాలర్షిప్లను పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి
మిర్యాలగూడ : దేశ జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు పార్లమెంట్లో ప్రత్యేకంగా బీసీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. బీసీ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కమిషన్‌కు జాతీయ హోదా కల్పించాలన్నారు. రూ.10వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, కుల వృత్తులకు రూ.రెండు వేల కోట్లతో బడ్జెట్ కేటాయించాలన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గాదగోని మహేష్‌గౌడ్, నాయకులు నాగరాజుగౌడ్, లక్ష్మణ్‌యాదవ్, కృష్ణబాబు, నాగరాజు, గురవయ్య, సురేష్, రమేష్, అనిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.