Bhongiri
-
అరుదైన మానవాకృతి స్మారకశిల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: చేతులు చాచిన మానవరూపం మాదిరిగా కనిపిస్తున్న రాయి ఇది. పంటపొలాల్లో ఏర్పాటు చేసే దిష్టిబొమ్మలాంటిది కాదు, ఏ దేవతా శిల్పమో కూడా కాదు. ఇది పాతరాతి యుగం నాటి మానవ స్మారకశిల. ఆదిమానవులు తమ సమాధుల వద్ద నిలువురాళ్లు పాతే పద్ధతి పాటించేవారు. స్థానిక సమూహంలో ముఖ్యులుగా భావించేవారి సమాధుల వద్ద పాతే అలాంటి రాళ్లను మెన్హిర్లు అంటారు. తెలంగాణలో అలాంటి నిలువురాళ్లు చాలాప్రాంతాల్లో ఇప్పటికీ ‘సజీవం’గా ఉన్నాయి. కానీ, వాటికి మానవాకృతి అద్దిన మెన్హిర్లు మాత్రం చాలా అరుదు. ఆంత్రోపో మార్ఫిక్ ఫిగర్స్‌గా పేర్కొనే ఈ రాళ్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిమితంగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన స్మారక శిల ఇది. ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పు.. భువనగిరి పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉన్న కేసారం గ్రామ శివారులో దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ గుర్తించినట్టు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. భూమిలోకి లోతుగా పాతి ఉన్న ఈ శిల భూమి ఉపరితలంలో ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఉందని, గుండ్రని తల, దీర్ఘచతురస్రాకారపు ఛాతీభాగం, భుజాలు, కిందికి నడుముభాగం పోల్చుకునేలా చెక్కి ఉందన్నారు. గతంలో ఈ తరహా స్మారక శిలను జనగామ జిల్లా కొడకండ్లలో ఔత్సాహిక పరిశోధకులు గుర్తించారు. క్రీ.పూ.1,800 నుంచి క్రీ.శ.300 వరకు ఉన్న ఇనుపయుగంలో మానవ వికాసదశ అత్యున్నతస్థితికి చేరుకుందన్నది చరిత్రకారుల మాట. వ్యవసాయం బాగా నేర్చుకుని స్థిరనివాసానికి అలవాటుపడ్డ మానవుడు ఇలాంటి స్మారక శిలల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారన్నది వారి అంచనా. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి మానవరూప స్మారకశిలలు లభించాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ శిలకు పురుష, మహిళ రూపాన్ని కూడా చెక్కిన దాఖలాలున్నాయి. కొడకండ్లలో లభించిన ఇలాంటి శిలను బయ్యన్న దేవుడుగా స్థానికులు పూజిస్తుండటాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. -
జగదీశ్‌రెడ్డి వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకుంది. చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారికి పోటీగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు సమాచారం ఇచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. 2014కు ముందు సిగ్గులేని పాలన చేశారని, అప్పటి చీకటి ఇంకా ఉంటే బాగుండని భ్రమపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాను టీఆర్ఎస్ గురించి మాట్లాడలేదని, మంత్రి కాంగ్రెస్ ప్రస్తావన తేవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, తాను ప్రసంగిస్తున్న సమయంలో తన చేతిలోని మైకు లాక్కోవడం ఏంటని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ చిల్లర చేష్టలని, మీడియాలో ప్రచారం కోసం ఆడుతున్న నాటకాలంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఎమ్మెల్యేకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. రాత్రి ఓ మాట, పొద్దున మరో మాట మాట్లాడే అన్నదమ్ముల విషయం అందరికీ తెలుసని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి అన్నారు. తాము తలుచుకుంటే ఒక్క నిమిషంలో లోపల వేయిస్తామని, ఇకపై మునుగోడులో ప్రతి ఊరిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తానే స్వయంగా హాజరవుతానని, ఎవరు అడ్డువస్తారో చూస్తానని మంత్రి అన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై లక్కారం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రాజగోపాల్‌రెడ్డి రాస్తారోకో చేశారు. -
వైఎస్సార్ లాంటి నేతలు లేరు: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం ఇందుకు సంబంధించిన లేఖను న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో కొత్త విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యక్తిగా కిషన్‌రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసని, ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని తెలిపారు. నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో కలిసిపోయాయని అన్నారు. ఇప్పటికైనా పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని తెలిపారు. కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ కిషన్‌రెడ్డిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులను వెంటనే మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘‘ పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి. రేవంత్‌రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడవద్దు. మల్కాజ్‌గిరిలో 40 డివిజన్లలో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో నియోజకవర్గ స్థాయి నేతలు తప్ప.. వైఎస్సార్ లాంటి నేతలు లేరు. కాంగ్రెస్‌లోనే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపై సమర్ధవంతమైన నాయకుడు లేడు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతా’’నని కోమటిరెడ్డి అన్నారు. -
24 గంటల్లోనే కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, యాదాద్రి భువనగిరి: భర్తను వెతుక్కుంటూ వెళ్లిన ఓ మహిళకు మాయమాటలు చెప్పిన దుండగులు ఆమె మూడేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారు. భువనగిరి పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. నాలుగు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని వెంటబెట్టుకుని భార్య మహేశ్వరి హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌లో చిన్నారితో కలిసి బస్ దిగిన మహేశ్వరిని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి నమ్మించారు. ఆమె భర్త రాజు దగ్గరకు తీసుకెళ్తామని చెప్పి భువనగిరికి తీసుకొచ్చారు. మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. మహేశ్వరి స్పృహ తప్పగానే బాలికను అపహరించుకుపోయారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన 24 గంటల్లో కేసును ఛేదించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. చిన్నారి క్షేమంగా ఉందని పేర్కొన్నారు. (చదవండి: మానుకోటలో బాలుడి కిడ్నాప్) -
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం
-
ఎంపీ కోమటిరెడ్డి కుమార్తె నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. కర్నూలుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (మర్డర్’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు..) -
చిన్నారి ఆద్య మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
-
రీచ్ ఇండియా ఫార్మా అరుదైన ఘనత
సాక్షి, హైదరాబాద్ : భువనగిరి పారిశ్రామిక ప్రాంతంలోని రీచ్ ఇండియా ఫార్మాకు ఆస్ట్రేలియా ప్రభుత్వ వైద్య విభాగం థెరఫాటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (టీజీఏ) అందించే గుడ్ మాన్యుఫాక్చరింగ్ లైసెన్స్ (జీఎంపీ) సర్టిఫికేట్ లభించింది. ఈ సర్టిఫికేట్ ద్వారా తమ సంస్థ ఆస్ట్రేలియా సహా 50కి పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుందని రీచ్ ఇండియా ఫార్మా సంస్థ ఎండీ శ్యాంసుందర్ చెప్పారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) రంగంలో ఈ సర్టిఫికేషన్ కేవలం తమ సంస్థకే దక్కిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టే చర్యలతోనే ఈ ప్రగతి సాధ్యమైందని, రాబోయే రోజుల్లో స్ధానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఫార్మా రంగంలో ప్రత్యేకమైన స్ధానాన్ని పొందడానికి తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. చదవండి : ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష కోట్ల నిధి -
నేడు ‘యాదాద్రి’కి గవర్నర్ రాక
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ సోమవారం యాదాద్రికి రానున్నారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు స్వామి సన్నిధిలో గడపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అనంతరం వరంగల్‌కు బయలుదేరి వెళ్తారు. –యాదగిరిగుట్ట సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : రాష్ట్ర గవర్నర్‌గా నూతనంగా నియామకమైన తమిళసై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి సోమవారం రానున్నారు. ఉదయం 9.30గంటలకు రాజ్‌భవన్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు 10.55గంటలకు చేరుకుంటారు. 11గంటలకు ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం 20 నిమిషాల పాటు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీ లిస్తారు. 11.30 నుంచి 11.40గంటల వరకు కొండపై గల హరితప్లాజా హోటల్లో విశ్రాంతి తీసుకుంటారు. 11.40కి హరిత హోటల్ నుంచి బయల్దేరి యాదగిరిగుట్ట పట్టణం, యాదగిరిపల్లి, వంగపల్లి, ఆలేరు మీదుగా వరంగల్‌కు వెళ్తారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తమిళ సై సుందర్ రాజన్ యాదాద్రి క్షేత్ర సన్నిధిలో గడపనున్నారు. తొలిసారి యాదాద్రి ఆలయానికి వస్తున్న గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌కు స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి యాదాద్రి అభివృద్ధి పనులను వివరించనున్నారు. -
భువనగిరిలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, భువనగిరి అర్బన్ : కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులోని పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక పారిశ్రామిక వాడలోని మహాసాయి ఫైర్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెయింటింగ్, నెయిల్ పాలీష్, వార్నిష్‌లలో ఉపయోగించే లిక్విడ్‌ను తయారు చేస్తారు. రోజు మాదిరిగా ఆదివారం రాత్రి లిక్విడ్‌ను తయారు చేసే ప్రక్రియను కొనసాగించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక 2.15 గంటల సమయంలో కంపెనీలో లిక్విడ్ కోసం ఉపయోగించే రామెటిరియల్లో ఇథైన్, టోలిన్, మిథైల్ పంపింగ్ చేస్తున్న క్రమంలో మోటారు యంత్రంలో ఏర్పడిన విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు లేచి మంటలుగా వ్యాపించాయి. సమీపంలో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటన సమాచారం అందుకున్న భువనగిరి ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రామన్నపేట నుంచి అగ్ని మాపక యంత్రాలను రప్పించారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో 22 మంది సిబ్బంది కలిసి ఉదయం 7.30 గంటల వరకు మంటలను ఆర్పే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రూ.9 నుంచి రూ.10 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలు పారిశ్రామిక వాడలో పక్కపక్కనే పరిశ్రమలు ఉండడంతో కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాద ప్రభావం సమీపంలోని పరిశ్రమలపై పడింది. కంపెనీలో కెమికల్, ప్లాస్టిక్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఈ క్రమంలో మంటల పక్కనే ఉన్న మ్యాట్రిసెస్ కంపెనీలోకి వ్యాపించాయి. దీంతో మ్యాట్రిస్ కంపెనీ రేకులు, మ్యాట్రిసెస్‌లో వాడే కాయర్, ఫోం పూర్తిగా దగ్ధమైంది. దీంతో కొన్ని రూ.లక్షల వరకు ఆ కంపెనీలో నష్టం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని ఉమ్మడి జిల్లా అ గ్నిమాపక అధికారి వై.నారాయణ, భువనగిరి అర్డీ ఓ వెంకటేశ్వర్లు, ఏఓ మందడి ఉపేందర్‌రెడ్డి, భు వనగిరి అగ్నిమాపక కేంద్రం అధికారి అశోక్, చౌ టుప్పల్ ఫైర్‌స్టేషన్ అధికారి శ్రీశైలం, యాదగిరి గుట్ట సీఐ అంజనేయులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
‘భువనగిరి’ బరిలో దిగేదెవరో..?
సాక్షి, యాదాద్రి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన పార్టీలు రేపోమాపో తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అందుకోసం అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి సారించాయి. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన భువనగిరి స్థానంలో రెండుసార్లు 2009, 2014లో ఎన్నికలు జరగగా కాంగ్రెస్, టీఆర్ఎస్ చేరోసారి విజయం సాధించాయి. భువనగిరి ఎంపీ స్థానంనుంచి 2009లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అప్పటి మహాకూటమి అభ్యర్థి నోముల నర్సింహయ్యపై విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై గెలుపొందారు. వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఐ ప్రధానంగా బరిలో నిలవనున్నాయి. ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సీటు తనకే ఖరారవుతుందన్న ధీమాతో ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనప్పటికీ సీఎం కేసీఆర్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించే బాధ్యతను వారికి అప్పగించారు. ఈనెల 7న భువనగిరిలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశంలో కూడా బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిగానే వక్తల ప్రసంగాలు కొనసాగాయి. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. భువనగిరి టికెట్ కోసం సుమారు 30మంది అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అధిష్టానం ముగ్గురు పేర్లు పరిశీ లిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ నుంచి ఏఐసీసీకి చేరిన జాబితాలో మధుయాష్కీగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్రెడ్డిపేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభ్యర్థి ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌ల పేర్లను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆపార్టీ యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మోదీ చరిష్మాతో పాటు, జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి తమకు అనుకూలమైన పవనాలు వీస్తాయని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఆపార్టీ అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టిన సీపీఐ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే యోచనలో ఉంది. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆపార్టీ సమాయత్తమవుతోంది. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో గెలుపొందిన ఎమ్మెల్యేలు... భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. శాసనసభకు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో భువనగరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే నకిరేకల్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. -
పారాణి ఆరకముందే..
సాక్షి,భువనగిరిఅర్బన్ : అగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై ఉన్న నవ దంపతులు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని కూనూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బేజాడి కుమారస్వామి కుమారుడు బేజాడి నరేష్(29) సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 108 వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బేజాడి నరేష్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన భువనగిరి మండలంలోని కేసారం గ్రామానికి చెందిన బాల్ద మల్లేష్ కుమార్తె దివ్య(21)తో వివాహమైంది. కాగా బ్రహ్మణపల్లి గ్రామం నుంచి బేజాడి నరేష్ తన బైక్‌పై భార్య దివ్యతో కేసారం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మోత్కూర్ వైపు నుంచి రాయగిరి వైపునకు వస్తుండగా మండలంలోని కూనూరు గ్రామ శివారులోని యాదాద్రి ఫంక్షన్‌హాల్ వద్ద అగి ఉన్న ఓ ట్రాన్స్‌ఫోర్టు లారీని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు రోడ్డుపై ఎగిరిపడటంతో వారి తలలకు తీవ్ర గాయాలై అక్కడిక్కక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీస్‌లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో నవదంపతులు నరేష్, దివ్య మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఇరు కుటుంబాల బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు. -
భువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు..
సాక్షి, యాదాద్రి : యాదాద్రిభువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు ఎగిరింది. ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండాకు వందనం చేస్తున్న భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మరోసారి జెండాను రెపరెపలాడించారు. ప్రజాకూటమికి ప్రజల అంగీకారం లభించలేదు. నిశ్శబ్ద విప్లవంలా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వ పథకాలకు ఆమోదం తెలుపుతూ కారు గుర్తుకు ఓట్లు వేశారు. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఆపార్టీ అభ్యర్థులు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విజయం సాధించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదముద్ర వేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సాగు, తాగునీటితోపాటు రైతుబంధు, ఆసరా పింఛన్లు, 24గంటల విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, గొర్రెల, చేపల పంపిణీ వంటి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక దిశలో తీవ్ర పోటీ ఇస్తుందనుకున్న ప్రజాకూటమి భారీ ఓటమి మూటగట్టుకుంది. తొలిరౌండ్ నుంచే ఆధిక్యత భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తొలిరౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోయారు. భువనగిరిలో 18రౌండ్లు, ఆలేరులో 22రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. భువనగిరి లో టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిపై 24,063ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే లెక్కింపులో భువనగిరి, భువనగిరిపట్టణం, బీబీ నగర్, పోచంపల్లి మండలాల్లో టీఆర్ఎస్కు సం పూర్ణ ఆధిక్యత లభించింది. పోచంపల్లి మండలం లో 16రౌండ్లలో ఆధిక్యత నిలుపుకోగా 17, 18 రౌండ్లలో వలిగొండ మండలంలో కాంగ్రెస్‌కు ఆధిక్యత లభించింది. ప్రజాకూటమి అభ్యర్థిగా పో టీ చేసిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి 61413 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు 33,560 ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్‌కు టీడీపీ, సీపీ ఐ, టీజేఎస్ పొత్తుతో పోటీలో నిలిచింది. అయితే ఆపార్టీకి గణనీయంగా 27, 853 ఓట్లు పెరిగాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన యువతెలంగాణ అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డికి 13,427ఓట్లు లభిం చాయి.గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 39,179ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలి చిన ఆయన ఈఎన్నికల్లో మూడోస్థానంతో సరిపె ట్టుకున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పోచంపల్లి రమణరావుకు 3,613 ఓట్లు రాగా, సీపీఎం తరపున పోటీ చేసిన కల్లూరి మల్లేశంకు 1856 ఓట్లు వచ్చాయి. ఆతర్వాత స్థానాల్లో ఆలకుంట్ల ఎల్లయ్య 1758, దేవరకొండ హన్మంతు 1305 ఓట్లు లభించాయి. నోటాకు 1347 వచ్చాయి. ఇం డిపెండెంట్ అభ్యర్థులు 1000లోపు ఓట్లు సాధించారు. ‘గొంగిడి’ రెండోసారి ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి రెండోసారి విజయాన్ని సాధించారు. ఆమెకు 94, 870ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌కు 61,784 ఓట్లు రావడంతో గొంగిడి సునీత కాంగ్రెస్ అభ్యర్థిపై 33, 086 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో 31,389ఓట్లతో గొంగిడి సునీత కాంగ్రెస్ అభ్యర్థి భిక్షమయ్యగౌడ్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భిక్షమయ్యగౌడ్‌కు 60,150ఓట్లు వచ్చాయి. గొంగిడి సునీతకు 91,539ఓట్లు వచ్చాయి. 31389మెజార్టీతో గెలి చారు. అయితే ఈఎన్నికల్లో బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు 10,473ఓట్లతో తృతీయ స్థానంలో నిలి చారు. బీఎస్పీ తరఫున పోటీ చేసిన కల్లూరి రామచంద్రారెడ్డి 11,921ఓట్లను, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి 4,967ఓట్లను సాధించారు. పోటీలో ఉన్న మరో 9మంది ఇండిపెండెంట్లకు 5999 ఓట్లు లభించాయి. కాగా నోటాకు 1465మంది ఓటు వేసి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరినీ అంగీకరించలేదు. ఫలించని కూటమి ప్రయత్నాలు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కూటమి ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ల కూటమిలో కాంగ్రెస్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయింది. అయితే కూటమి ఓటు బదిలీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడంతో అధికార పార్టీకి లబ్ధి చేకూరగా, కూటమికి ఓటమి తప్పలేదు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌కు 2014 ఎన్నికల్లో 60,150 ఓట్లు రాగా ఇప్పుడు కూటమి అభ్యర్థిగా 61,784 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 1634 ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. కచ్చితమైన ఓటు బ్యాంకు కలిగిన కూట మిలోని పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు ఏమైయ్యాయన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకీ చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఎల్ఎఫ్ తరఫున ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగడంతో టీడీపీకి చెందిన ఓట్లు ఆయనకు బదిలీ అయ్యాయని ఆ పార్టీ నేతలు అంతర్మథనంలో ఉన్నారు. మోత్కుపల్లితో పాటు బీఎస్పీ అభ్యర్థి కల్లూరి రామచంద్రారెడ్డి, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి 27,361 ఓట్లను, ఇండిపెండెంట్లు 5999 ఓట్లు పొందారు. దీంతో వీరందరికీ 33,360 ఓట్లు వచ్చాయి. కూటమి అభ్యర్థి, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్లన్ని కలిపితే టీఆర్ఎస్ మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గం : ఆలేరు 2018లో విజేత : గొంగిడి సునీత (టీఆర్ఎస్) వచ్చిన ఓట్లు: 94870 ప్రత్యర్థి: బూడిద భిక్షమయ్యగౌడ్ (కాంగ్రెస్) వచ్చిన ఓట్లు: 61784 మెజార్టీ: 33086 2014 ఎన్నికల్లో : విజేత గొంగిడి సునీతకు వచ్చిన ఓట్లు : 91,539 ప్రత్యర్థి: బూడిద భిక్షమయ్యగౌడ్‌కు వచ్చిన ఓట్లు : 60150 మెజార్టీ : 31389 నియోజకవర్గం: భువనగిరి 2018లో విజేత: పైళ్ల శేఖర్‌రెడ్డి(టీఆర్ఎస్) వచ్చిన ఓట్లు: 85,476 ప్రత్యర్థి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి వచ్చిన ఓట్లు:61413 మెజార్టీ: 24,063 2014 ఎన్నికల్లో విజేత :పైళ్ల శేఖర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 54,347 ప్రత్యర్థి :జిట్టా బాలకృష్ణారెడ్డి(స్వతంత్ర) వచ్చిన ఓట్లు: 39,179 మెజార్టీ: 15,168 -
పోచంపల్లిలో విదేశీయుల సందడి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : పోచంపల్లిలో విదేశీయులు సందడి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల సంస్థ(నిమిస్మే) ఆధ్వర్యంలో సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా, ఘనా, సౌత్ ఆఫ్రికా, అఫ్ఘనిస్తాన్, టాంజానియా, జిం బాబ్వే, కజకిస్తాన్, ఈజిప్ట్, జోర్ధాన్, కాంగో దేశాలకు చెందిన 25 మంది పోచంపల్లిని సందర్శించారు. స్థాని క గ్రామీణ వికాసబ్యాంకు సందర్శించి బ్యాంకు అంది స్తున్న సేవలు, స్వయం సహాయక గ్రూప్‌లు, రైతులు, చిరువ్యాపారులకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నారని, రుణాల చెల్లింపు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆర్థిక వికాసానికి బ్యాంకులు ఏ మేరకు పనిచేస్తున్నాయో ఆరా తీశారు. అనంతరం టూరిజం పార్క్‌ను సందర్శించారు. అక్కడ చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలైన నూలు వడకడం, చిటికి కట్టడం, మగ్గాలను పరిశీలించారు. ప్రాచీన చేనేత కళ, కార్మికుల నైపుణ్యాలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొగ్రామ్ డైరెక్టర్లు జి. సుదర్శన్, డాక్టర్ ఇ. విజయ మాట్లాడుతూ నిమిస్మేలో ‘సూక్ష్మ వ్యాపార విస్తరణ, అభివృద్ధి అనే అంశంపై అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. వీరికి స్థానిక టూరిజం మేనేజర్ జితేందర్ మార్గదర్శకం చేశారు. -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం : కుంభం
సాక్షి,భువనగిరిటౌన్ : కాంగ్రెస్ పార్టీతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని నియోజకవర్గ మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలో ప్రిన్స్‌కార్నర్ వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం సమస్యలకు నిలయంగా మారిందన్నారు. ఎక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్పా టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్య ప్రజలు అభివృద్ధి సాధిస్తారన్నారు. మహాకూటమి నియోకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, వాటిని అనుబంధ సంఘాలు, మహాకూటమి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో పలు వార్డుల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహాగీర్, బీసుకుంట్ల సత్యనారాయణ, బుద్దుల సత్యనారాయణ, ముచ్యాల మనోజ్, పున్న కైలాష్, మహ్మద్ మజహర్, కొల్లోజు సతీష్‌కుమార్, దం డు నరేష్, ఎజాజ్, ఎడమ పవన్, గిరిశ్, ఇమ్రాన్, అ చ్చాలు, శోభన్‌బాబు, అ ఫ్రోజ్, సమీర్, కళ్యాణ్, అజర్‌లు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో.. మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ పట్టణంలో 22, 23, 24, 25 వార్డుల్లో టీడీపీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శ్రీనివాస్, బచ్చు శ్రీనివాస్‌గుప్తా, తాడూరి భిక్షపతి, దూసరి చంద్రశేఖర్‌గౌడ్, రవిలు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ పట్టణంలో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎర్ర రమేష్, మారగోని నాగరాజు, నాగరాజు, శ్రీకాంత్, పసుపూరి శ్రీహరిలు పాల్గొన్నారు. వలిగొండ : భువనగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు సోమవారం యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో రోడ్‌షోతో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, మహాకూటమి నాయకులు గరిసె రవి, కుంభం విద్యాసాగర్‌రెడ్డి, వెంకట్‌పాపిరెడ్డి, కొండూరు వెంకటేశం, బోడ సుదర్శన్, గూడూరు జంగారెడ్డి, సయిద్, కాసుల వెంకన్న, కొండూరు సాయి, బోళ్ల శ్రీనివాస్, పబ్బు సురేందర్, బత్తిని లింగయ్య, పుల్లగూర్ల జంగారెడ్డి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు తెలంగాణకు అవసరమా..? : పైళ్ల శేఖర్ రెడ్డి
సాక్షి, వలిగొండ (భువనగిరి) : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రబాబు తెలంగాణకు అవసరమా అని టీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పహిల్వాన్‌పురం, రెడ్లరేపాక, కంచనపల్లి, పులిగిల్ల, కేర్చుపల్లి, మొగిలిపాక, తుర్కపల్లి, గోపరాజుపల్లి, చిత్తాపురం, ముద్దాపురం, వెంకటాపురం, గుర్నాథ్‌పల్లి, అరూరు, జంగారెడ్డిపల్లి, నర్సాయిగూడెం గ్రామాల్లో తనను గెలిపిం చాలని ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు బతుకమ్మలు, పీర్లతో ప్రజ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో బతుకులు ఆగమయ్యాయని అన్నారు. మహాకూటమికి ఓటేస్తే అమరావతికి వేసినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడైనా 24 గంటల విద్యుత్ ఇచ్చిందా అని ప్రశ్నించా రు. బస్వాపురం రిజర్వాయర్‌తో సాగు నీటి కష్టాలు దూరంకానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎలిమి నేటి సందీప్‌రెడ్డి, పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, అందెల లింగంయాదవ్, ఎంపీ పీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీని వాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్ధం భాస్కర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పనుమటి మమతనరేందర్‌రెడ్డి, మార్కెట్, ఆత్మ చైర్మన్లు మారగోని జంగాలుగౌడ్, గంగధారి రాములు, నాయకులు పబ్బు ఉపేందర్, కొమిరెల్లి సంజీరెడ్డి, గూడూరు యాదిరెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, మాద శంకర్, కొనపూరి కవిత, వనగంటి మాధవి, రఘునాథం, గూడూరు నర్సింహారెడ్డి, గంగినేని హరినాథ్, డేగల పాండరి, కిరణ్‌రెడ్డి, చిట్టెడి జనార్దన్‌రెడ్డి, వెంకన్న, శ్రీధర్‌రెడ్డి, శివశాంతరెడ్డి, సంగిశెట్టి క్రిష్టఫర్ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
20వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నా
సాక్షి, యాదాద్రి : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా 20వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నాను. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఈసారి ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మహాకూటమి వాగ్దానాలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది : అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపిస్తామని చెబుతున్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తన పనితీరు ఉంటుంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరుతున్నారని మహాకూటమి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలం బండసోమారంలో ప్రచారం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి : మహాకూటమి తరఫున పోటీలో ఉన్న తన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు వివిధ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గ్రామగ్రామాన ప్రజలు తనకు మద్దతు ప్రకటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కోసం తాను చేసిన కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. రెండు నెలల క్రితం నుంచే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రచారంలో ఈమార్పు క్రమంగా కనిపిస్తోంది. సాక్షి: మీ విజయానికి కలిసొచ్చే అంశాలు ఏమిటి? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. రైతులకు రుణమాఫీ మూడేళ్లు చేశారు. అది వడ్డీలకే సరిపోయింది. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ తెచ్చుకుంది బాగుపడటానికా, ఆంధ్రా కాంట్రాక్టర్లను బతికించడానికా అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. సాక్షి: మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారు? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తోంది. ప్రతి పేద కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తుంది. ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల మంజూరు చేస్తుంది. హైదరాబాద్ మురికి, కంపెనీల కాలుష్యంతో నిండిన మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన జలాలను అందించడానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తాం. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తాం. సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేమి? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: వైద్యం, సాగు, తాగునీరు, ఉపాధి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. వీటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కృషి చేయలేదు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తా. ఇప్పటి వరకు ఉన్న సీఎం నిమ్స్‌కు వంద కోట్లు ఇవ్వడానికి కనికరం లేదు. 5 వేల మందితో నిమ్స్‌కు నిధులు కేటాయించాలని పాదయాత్ర చేశాను. అయినా స్పందన లేదు. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వల ఆధునీకరణ కోసం నిధులు కేటాయించాలని పాదయాత్ర చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బిల్లులో భాగంగానే ఎయిమ్స్ మంజూరైంది. సాక్షి: మహాకూటమి మీతో కలిసి వస్తుందా? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: మహాకూటమితో కాంగ్రెస్ పార్టీకి భారీ చేకూరుతుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కలిసికట్టుగా పని చేస్తుంది. ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి నేతను కలిగిన టీడీపీ మాతో కలిసి రావడం లాభిస్తుంది. రావి నారాయణరెడ్డి మహానేతను కలిగిన సీపీఐతోపాటు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వాన గల టీజేఎస్ మాకు అండగా ఉంది. మహాకూటమి సహకారంతో 20వేల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నాను. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. -
భారీ సభకు గులాబీ ప్లాన్
సాక్షి, యాదాద్రి : శాసనసభ ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గులాబీ పార్టీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ తన శైలీలో వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలతో క్యాడర్లో మరింత జోష్ పెంచడానికి సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి అసెంబ్లీతోపాటు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సభకు హాజరయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దీంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు కేసీఆర్ హాజరయ్యే సభలను భారీగా నిర్వహించాలనే తలంపుతో పక్కా ప్లాన్ చేసుకుంటున్నాయి. పక్కా వ్యూహంతో.. భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్, మహాకూటమి, యువతెలంగాణ, సీపీఎం, సమాజ్ వాది, ఆప్, బీఎస్పీ వంటి పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుంచే ప్రధాన పార్టీలు తమ బల ప్రదర్శనతో సత్తాను చాటుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూడా 19వ తేదీన నామినేషన్ వేసే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీలు కూడా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. నేడు పైళ్ల నామినేషన్.. భువనగిరి పట్టణం, భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాలతో కూడిన ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికలు పోటా పోటీగా జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 6 శాసన సభ రద్దు చేసిన సీఎం కేసీఆర్ ఆరోజే తమ పార్టీ అభ్య ర్థులను ప్రకటించడంతో తాజా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నా రు. ముందుగా అనుకున్న ప్రకారం నామినేషన్ దాఖలు చేసే చివరి రోజున భారీ జనసమీకరణ తో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభకు సైతం టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఊపుమీదున్న శ్రేణులకు మరింత ఊపు తీసుకురా వడానికి సీఎం సభ ఉపయోగపడుతుందని అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నమ్మకంతో ఉన్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నెల 21, 23 తేదీల్లో నిర్వహించనున్న ఎన్నికల సభల్లో భువనగిరి నియోజకవర్గం ఉంది. 21న దేవరకొండ, నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాల్లో, 23న తుంగతుర్తి, సూర్యాపేటల్లో కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభలు జరుగుతాయి. నామినేషన్ కార్యక్రమంతోపాటు, బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేస్తామని టీఆర్ఎస్ నాయకుడొకరు సాక్షితో చెప్పారు. జనసమీకరణపై ప్రత్యేక దృష్టి.. 19న నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతోనే ఎన్నికల సభలకు ప్రణాళికను సిద్ధం చేసిన కేసీఆర్ ఈనెల 21న భువనగిరిలో బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న శేఖర్‌రెడ్డి తన క్యాడర్‌ను కార్యక్రమం సక్సెస్ కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు తిరిగి అధికారంలోకి వస్తే చేపట్టే మేనిపెస్టోను ఈ బహిరంగ సభద్వారా గులాబీ దళపతి ప్రజలకు వివరించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం మరింత క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రతి గ్రామం నుంచి క్యాడర్‌ను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే కొంగర కలాన్ ప్రజా ఆశీర్వాద సభ, నల్లగొండలో కేసీఆర్ సభలకు జనం భారీగా తరలివచ్చారు. ఈ అనుభవాలతో భువనగిరిలో జరగబోయే సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు సన్నాహాల్లో తలమునకలయ్యారు. దీంట్లోభాగంగా టీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభ జరిగే జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. వీరితోపాటు హెలిపాడ్ స్థలాన్ని డీసీపీతోపాటు సీఎం సెక్యూటిటీ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. కళాశాల మైదానం పరిశీలన.. భువనగిరిలో సీఎం కేసీఆర్ ఎన్నికల సభ నిర్వహించే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఆదివారం పోలీసులు పరిశీలించారు. సీఎం భద్రతా అధికారులు, స్థానిక పోలీసులు, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం హాజరవుతారని, ఇందుకోసం జిన్నింగ్ మిల్ వద్ద హెలిపాడ్, కళాశాల గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందని భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి సాక్షితో చెప్పారు. భద్రతా పరమైన ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ సభస్థలాన్ని పరిశీలించిన అధికారులు భువనగిరిఅర్బన్ : ఈ నెల 21న భువనగిరిలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌ను భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు, ఫైర్‌స్టేషన్ అధికారులు పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి పట్టణ శివారులో ఉన్న భువనగిరి శివారులోని జిన్నింగ్ మిల్లు సమీపంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలా న్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ డబ్ల్యూ వెంకటేశ్వర్లు, ఫైర్‌స్టేషన్ జిల్లా అధికారి అశోక్, పట్టణ సీఐ వెంకన్న, ట్రాఫిక్ సీఐ ఈర్ల శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జనార్దన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సేకరణ.. సవాల్..!
సాక్షి,భువనగిరిఅర్బన్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌కు భూ సేకరణ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. భూ సేకరణ కోసం వస్తున్న అధికారులను నిర్వాసితులు అడ్డుకుంటుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. బస్వాపురం మినహా మరెక్కడా భూ సేకరణ పూర్తి కాలేదు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లిం చాలని, దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.సేకరించిన భూ మిలో చేపట్టిన పనులను ఇటీవల బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన నిర్వాసితులు అడ్డుకున్నారు. అంతేకాకుండా గ్రామస్తులు పరిహారంపై తేల్చాలంటూ దీక్షలకు దిగారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం : 33.39 టీఎంసీలు కావాల్సిన భూమి : 3,970 భువనగిరి మండలంలో... బీఎన్ తిమ్మాపురంలో 1,490 ఎకరాలు బస్వాపురంలో 1,100 ఎకరాలు వడపర్తిలో 430 ఎకరాలు యాదగిరిగుట్ట మండలంలో... లప్పనాయక్‌తండాలో 500 ఎకరాలు తుర్కపల్లి మండలంలో.. విర్యతండా, చౌక్లతండా, కొక్యతండాల్లో 450 ఎకరాలు ఇదీ పరిస్థితి.. బస్వాపురంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 3,970 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణంలో భువనగిరి మండలంలోని బస్వాపురం, బీఎన్ తిమ్మాపురం, యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్‌తండా, తుర్కపల్లి మండలంలోని పిర్యాతండా, చౌక్లతండా, కొక్యతండా గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు కొల్పోతున్నారు. కాగా భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలో కొన్ని గ్రామాల్లో అధికారులు భూసేకరణ కోసం సర్వే చేశారు. సర్వే చేసిన అనంతరం రెవెన్యూ అధికారులకు నివేదికలు అందజేశారు. రైతులు ఏమంటున్నారంటే.. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను రిజర్వాయర్ కోసం వదులుకోవాల్సి వస్తుందని బీఎన్ తిమ్మాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కోరిన విధంగా పరిహారం ఇప్పించాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని బీఎన్ తిమ్మాపురం ముంపు బాధితులు దీక్షలు చేపట్టారు. అంతేకాకుండా రిజర్వాయర్ పనులను ఇటీవల అడ్డుకున్నారు. తల్లిదండ్రుల నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నాం.. భూములు కోల్పోతే తాము జీవనాధారం ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం ఎకరానికి రూ.50లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల 300మంది రైతులు రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. బస్వాపురంలో సర్వే పూర్తి.. బస్వాపురం గ్రామానికి చెందిన 520 మంది రైతులకు సంబంధించిన 1,100 ఎకరాల భూమిలో రిజర్వాయర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 123 ర్టో ప్రకారం ఎకరానికి నష్ట పరిహారం రూ. 13.90లక్షలు ఇస్తుంది. దీనికి రైతులు అంగీకరించడంతో పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రూ. 50కోట్లు బ్యాంకులో ఉన్నాయి.మిగిలిన వడపర్తి, విర్యతండా, చౌక్లతండా, కొక్యతండాలో, లప్పనాయక్‌తండాలో భూ సేకరణకోసం సర్వే చేయాల్సి ఉంది. బీఎన్ తిమ్మాపురం గ్రామస్తుల డిమాండ్లు ఇవీ.. ఎకరానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలి ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి చదువుకున్న వ్యక్తులు ఉంటే ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం కల్పించాలి చదువుకోని వారికి ఉపాధిహామీ అవకాశం కల్పించాలి ముంపునకు గురవుతున్న రైతులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి హామీ ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలి. దీక్ష చేస్తున్న బీఎన్ తిమ్మాపురం ముంపు బాధితులు పరిహారంపై స్పష్టత ఇవ్వాలి భువనగిరిఅర్బన్ :బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని ముంపు బాధితులు డిమాండ్ చేశారు. పరిహారం కోసం బీఎన్‌తిమ్మాపురం బాధితులు చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం నా టికి 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్ష ల నిర్వాహకుడు వల్దాస్ రాజు మాట్లాడుతూ.. భూములు కొల్పోయే రైతులకు నష్ట పరిహారం గురించి తెలియజేయాలన్నారు. మాకు న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. దీక్షలో రాములు, రాజిరెడ్డి, చిక్కుడు బాలకృష్ణ, నర్సింహ్మ, భాస్కర్, ఈశ్వరమ్మ, కమలమ్మ, మం గమ్మ, వెంకటేష్ పాల్గొన్నారు. స్పష్టమైన హామీ ఇస్తలేరు ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఎకరానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలి. స్పష్టమైన హామీని అధికారులు ఇవ్వడం లేదు. –రావుల నందు, రైతు బీఎన్‌తిమ్మాపురం జీవనాధారం చూపించాలి మాకు జీవనా ధారం చూపిం చాలి. సర్వే చేసిన భూమికి ఎంత రేటును కట్టిస్తారో చెప్పాలి. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. నా కుటుంబం దీనిపైనే ఆధారపడి బతుకుతున్నం. – భూక్య పిక్లానాయక్, పిర్యాతండా, తుర్కపల్లి మండలం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చదువుకున్న ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. కుటుంబసభ్యులకు ఉపాధిహామీ పనులు కల్పించాలి. కోత్పోతున్న భూములకు మళ్లీ ఎక్కడ ఇస్తారో చెప్పాలి. నష్టపోకుండా చూడాలి. –దిరవాత్ నరేష్‌నాయక్, లప్పనాయక్‌తండా, యాదగిరిగుట్ట మండలం -
‘పైళ్ల’ను అధిక మెజార్టీతో గెలిపించాలి
సాక్షి,భువనగిరిటౌన్ : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని 28వ వార్డులో కిసాన్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైళ్ల శేఖర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరోసారి పట్టణ అభివృద్ధిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, అమ్జద్అలీ, పద్మ, జైయిని రవిందర్‌గుప్తా, సరగడ కరణ్, రవి, స్వప్న, బ్రహ్మచారి, రమేష్‌పాల్గొన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో.. టీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్ఎస్ కోకన్వీనర్ ఆకుల జయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మ, కె.యాదమ్మ, శిరీష, నర్మద, జయలక్ష్మి, పద్మ, రాధిక, శ్యామల, జ్యోతి, ఉమా, ఇందిరలు పాల్గొన్నారు. ‘పైళ్ల గెలుపు ఖాయం’: భూదాన్‌పోచంపల్లి : వచ్చే ఎన్నికల్లో పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఖాయమని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శివారెడ్డిగూడెంలో వారాల రాంచంద్రారెడ్డి, బొక్క ధర్మారెడ్డి ఆధ్వర్యంలో హామాలీసంఘం సభ్యులు 35 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మరోసారి టీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వారాల అంజిరెడ్డి, వంగాల ధనుంజయ్య, బొడిగె మల్లయ్య, వెంపాల సంజీవరెడ్డి, నారి శ్రీశైలం, పెద్దిరెడ్డి శ్రీను, సంజీవరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేకల దేవేందర్‌రెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, బొక్క మల్లారెడ్డి, ఏర్పుల రమేశ్, మేకల ప్రభాకర్‌రెడ్డి, సరసాని నర్సిరెడ్డి, వారాల వెంకట్‌రెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
గెలిపిస్తే రైతులకు సాగునీరు అందిస్తాం
సాక్షి,భువనగిరి అర్బన్ : బీఎల్ఎఫ్ పార్టీని గెలుపిస్తే రైతులకు సాగునీరు అందిస్తామని బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి మల్లేషం అన్నారు. గురువారం బీఎల్ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తుక్కాపురం, గౌస్‌నగర్, ఎర్రంబెల్లి, నందనం, నమాత్‌పల్లి, బొల్లేపల్లి, అనాజిపురం గ్రామాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వారిని అధిక మెజార్టీతో గెలుపించాలన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రధానంగా బీటీ రోడ్డు లేని గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. స్థానికంగా వివిధ పరిశ్రమాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఆవకాశాలు కల్చించేలా కృషిచేస్తామన్నారు. ఆడపిల్లల చదువుకోసం చదువుల సావిత్రి పథకం, 2 లక్షల ఉద్యోగాల భర్తి, నిరుద్యోగబృతిని వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. బీఎల్ఎఫ్ పార్టీని ప్రజలు అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ్మ, జంగయ్యయాదవ్, అంజిరెడ్డి, వెంకటేష్, దానయ్య, గునుగుంట్ల శ్రీనివాస్‌గౌడ్,మల్లేషం, వైకుంఠం, అయిలయ్య, ఇస్తారి, యాదయ్య, పాక జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
లావణ్య పదవి ఊడింది!
సాక్షి, భువనగిరి : రెండు నెలలుగా అనేక మలుపులు తిరుగుతున్న భువనగిరి మున్సిపల్ రాజకీయానికి తెరపడింది. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ అయిన భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సుర్వి లావణ్య కోల్పోయింది. మంగళవారం ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మొత్తం 30 మంది సభ్యుల్లో.. ఆమెకు వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్లు ఓటేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తొలుత బీజేపీ నుంచి గెలిచిన లావణ్య అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి 4 ఏళ్లు చైర్‌పర్సన్‌గా పాలన కొనసాగించారు. అయితే ఇటీవల ఆమె అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎమ్మేల్యే పైల్ల శేఖర్ రెడ్డి ఆమె పదవి కోల్పోయేలా చేశారు. అవిశ్వాసం సందర్భంగా ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అక్రమంగా కౌన్సిలర్లు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. చిచ్చు ఇలా మొదలైంది.. మే30వ తేదీన 14ఎజెండా అంశాలతో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్ పర్సన్, అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు మొదలైంది. ఇది కాస్త తారస్థాయికి చేరింది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లలో కొందరు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చారు. అనంతరం వీరి మధ్య సయోధ్య కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు అనుకూలంగా లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ జూన్ 28న సొంతగూటి(బీజేపీ)లో చేరారు. ఈనెల 4వ తేదీ నాటికి పాలకవర్గానికి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులతో సహా మొత్తం 24మంది సంతకాలతో చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. అవిశ్వాసానికి తమ మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంతకాలు చేసినప్పటికీ తమ ఇద్దరు కౌన్సిలర్లను టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. -
భువనగిరిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: భువనగిరిలోని సంజీవనగర్‌లో పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి జోన్ డీసీపీ రాంచందర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సోదాలు చేశారు. ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 2 కార్లు, 40 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశారు. ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలో గుట్కాలు విక్రయిస్తున్న వ్యక్తి సహా మద్యం అమ్ముతున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
బాలకార్మికుల కేసులో ముగ్గురి అరెస్ట్
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : బాలకార్మికులతో పనిచేయించుకుంటున్న ఓ కంపెనీ మేనేజర్‌తో సహా ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేసినట్టు భువనగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్ర పరిధిలోని ఎస్పీఎస్ యార్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ(జిప్స్)లో మంగళవారం రాచకొండ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రఫీక్, ఆపరేషన్ స్మైల్ సంయుక్త ఆధ్వర్యంలో అకస్మిక దాడులు నిర్వహించారని తెలిపారు. కంపనీలో 18 ఏళ్ల లోపు ఉన్న 11 మంది బీహార్ రాష్ట్రానికి చెందిన బాలలతో పని చేయించుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. అంతేకాక తక్కువ వేతనంతో వారిచే వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విచారణలో తెలిసిందని తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకొన్న మేనేజర్ ఉరిమింది వెంకటేశ్వరప్ప, బీహార్‌కు చెందిన లేబర్ కాంట్రాక్టర్ సంతోష్‌యాదవ్, లేబర్‌ను సరఫరా చేస్తున్న రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు చెందిన పల్లె బాబురావును బుధవారం అరెస్ట్ చేసి భువనగిరి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న ఎస్పీఎస్ యార్న్ కంపనీ ఎండీ నరేశ్ తాపర్ను త్వరలో అరెస్ట్‌చేస్తామన్నారు. నిందితులపై బాలకార్మికచట్టం, వెట్టిచాకిరి చట్టం, జెవైనల్ జస్టిస్ చట్టం, ఉమన్ ట్రాక్ రూల్ మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు. అలాగే హోటళ్లు, షాపుల్లో పనిచేస్తున్న భువనగిరిలో ఆరుగురు, చౌటుప్పల్ నలుగురు చొప్పున బాలకార్మికులకు విముక్తి కల్పించామని అన్నారు. మూడు కేసులలో మొత్తం 21 మంది బాలకార్మికులను చైల్ట్ వేల్ఫేర్ కమిటీకి అప్పగించామని తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకొన్న షాపు యజమానులకు నోటీసులు ఇచ్చామని, విచారణ అనంతరం తగిన జరిమానా విధించనున్నట్లు చెప్పారు. రాచకొండ పోలీసుల తరుపున ఆపరేషన్ స్మైల్ టీమ్‌లు ఇకపై ఇటుక బట్టీలు, ఫౌల్ట్రి, స్పిన్నింగ్ మిల్లు, కెమికల్ కంపనీలు, లాడ్జ్రీలు, షాపులలో తరచు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటులో యాదాద్రి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే సీసీ కెమెరా ఏర్పాటులో యాదాద్రిభువనగిరి జిల్లా మొదటి స్థానంలో ఉందని డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలో నేను సైతం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగానే 10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగ, ఇప్పటి వరకు 936 ఏర్పా టు చేశామని వివరించారు. ఆలేరు మండలంలో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామం, షాపు, ఇంటింటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని పోలీ సులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రఫీక్, చౌటుప్పల్ ఏసీపీ రమేశ్‌జాదవ్, ఎస్ఓటీ ఎస్ఐ సురేశ్, ఆపరేషన్ స్మైల్ ఎస్ఐ సాయిలు, స్థానిక ఎస్ఐలు రాఘవేంద్రగౌడ్, వెంకట య్య, లేబర్ ఆఫీసర్ మహ్మద్ అహ్మ ద్, చైల్డ్‌లైన్ టీమ్ జిల్లా సభ్యుడు యాదయ్య, సిబ్బంది ప్రతాప్, కరుణాకర్, సుధాకర్, శంకర్, జనార్దన్, ధనుంజయ్య, యాదయ్య తదితరులు ఉన్నారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
భువనగిరి : అంతరాయం లేకుండా జిల్లా వ్యాప్తం గా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో ఎస్ఈ పి.వెంకన్న అన్నారు. శుక్రవారం భువనగిరిలో వి ద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదా రులు సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు వి ద్యుత్ అధికారులకు సహకరించి ప్రతి నెలా బిల్లును నిర్ణీత గడువు లోపు చెల్లించి నాణ్యమైన విద్యుత్‌ను పొందాలన్నారు. రైతులు అసెంబుల్డ్ మోటార్లు, వై ర్లు, ఐఎస్ఐ గుర్తు లేనివి వాడొద్దన్నారు. దీంతో బిల్లు అధికంగా వస్తుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫీజులు పోయినప్పుడు మీరు వాటిని సరి చేయడం, ముట్టుకోవడం చేయొద్దని విద్యు త్ డివిజన్ కేంద్రలో 24 గంటలు అందుబాటులో ఫోన్ ఏర్పాటు చేశామని చెప్పారు. 9491065945 నంబర్‌కు సంప్రదించవ చ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐపీడీఎస్ స్కీం భువనగిరి డివి జన్‌కు వచ్చిందన్నారు. దీనిలో భాగంగా పాత విద్యుత్ వైర్లు, స్తంభాలు, విద్యుత్ పరికాలను తొలగించడం జరుగుతుందన్నారు. అనంతరం వినియోగదారులు చెప్పిన సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎస్ఏఓ రమణారెడ్డి, డీఈ దుర్గారావు, ఏడీఈ రవీందర్‌రెడ్డి, ఏఈ భిక్షపతి, నాయకులు, వినియోగదారులు పాల్గొన్నారు.