Boxing Tournament
-
Strandja Memorial Boxing Tournament 2023: భారత బాక్సర్లకు రజతాలు
సోపియా: స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అనామిక, అనుపమ, గోవింద్ కుమార్ సహాని రజత పతకాలు సాధించారు. మహిళల 50 కేజీల ఫైనల్లో జాతీయ చాంపియన్ అనామిక 1–4తో చైనాకు చెందిన హు మెయి చేతిలో ఓడింది. పురుషుల 48 కేజీల తుదిపోరులో గోవింద్ కుమార్ 1–4తో షోదియోర్జన్ మెలికుజీవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల 81 కేజీల ఫైనల్లో అనుపమ 0–5తో ఆస్ట్రేలియన్ బాక్సర్ ఎమ్మా సూ గ్రీన్ట్రి చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్ మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. ఇందులో మూడు రజతాలు కాగా... ఐదు కాంస్య పతకాలున్నాయి. పురుషుల కేటగిరీలో బిశ్వామిత్ర చొంగ్తమ్ (51 కేజీలు), సచిన్ (54 కేజీలు), మహిళల విభాగంలో కలైవాణి (48 కేజీలు), శ్రుతి యాదవ్ (70 కేజీలు), మోనిక (ప్లస్ 81 కేజీలు) కాంస్యాలు గెలిచారు. -
Boxing Tourney: ‘పసిడి’కి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు పసిడి పతకానికి పంచ్ దూరంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆశిష్ (75 కేజీలు), గోవింద్ (48 కేజీలు), వరీందర్ సింగ్ (60 కేజీలు)... మహిళల విభాగంలో మోనిక (48 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై, గోవింద్ 4–1తో ఎన్గుయెన్ లిన్ ఫుంగ్ (వియ త్నాం)పై నెగ్గగా... వరీందర్‌కు తన ప్రత్యర్థి అబ్దుల్ (పాలస్తీనా) నుంచి ‘వాకోవర్’ లభించింది. మోనిక 5–0తో ట్రాన్ థి డియెక్ కియు (వియత్నాం)పై గెలిచింది. భారత్‌కే చెందిన అమిత్ (52 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
నిఖత్ ‘పసిడి’ పంచ్
సాక్షి, హైదరాబాద్: స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకంతో అదరగొట్టింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో నిఖత్ 4–1తో తెతియానా కోబ్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. తద్వారా 73 ఏళ్ల చరిత్ర కలిగిన స్ట్రాండ్జా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్ గుర్తింపు పొందింది. 2019లోనూ నిఖత్ బంగారు పతకం సాధించింది. ఇదే టోర్నీలో మహిళల 48 కేజీల విభాగంలోనూ భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. హరియాణాకు చెందిన నీతూ ఫైనల్లో 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై గెలిచింది. పసిడి పతకాలు నెగ్గిన నిఖత్, నీతూలకు 4 వేల డాలర్ల (రూ. 3 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. స్వర్ణం నెగ్గిన నిఖత్‌ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. నన్ను స్ట్రాండ్జా టోర్నీ రాణి అని పిలవచ్చు. రెండోసారి స్వర్ణం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఈసారి పసిడి పతకం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బుసెనాజ్ సాకిరోగ్లు (టర్కీ)ను ఓడించాను. ఈ ఏడాది మూడు ప్రముఖ ఈవెంట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు ఉన్నాయి. తాజా విజయం ఈ మెగా ఈవెంట్స్‌కు ముందు నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహంలేదు. –నిఖత్ జరీన్ -
భారత్ పంచ్ అదిరింది
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో వచ్చిన విరామం తర్వాత పాల్గొన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. జర్మనీలోని కొలోన్ పట్టణంలో ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అమిత్‌కు ఫైనల్లో తన ప్రత్యర్థి బిలాల్ బెన్నమ్ (ఫ్రాన్స్) నుంచి వాకోవర్ లభించగా... సిమ్రన్‌జిత్ కౌర్ 4–1తో మాయా క్లీన్హాన్స్ (జర్మనీ)పై, మనీషా 3–2తో భారత్‌కే చెందిన సాక్షిపై గెలుపొందారు. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఫైనల్లో సతీశ్ తన ప్రత్యర్థి నెల్వీ టియాఫాక్ (జర్మనీ)కి వాకోవర్ ఇచ్చాడు. సెమీఫైనల్లో ఓడిన సోనియా (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), గౌరవ్ (57 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జర్మనీ, బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, మాల్డోవా, నెదర్లాండ్స్, పోలాండ్, ఉక్రెయిన్ దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొన్నారు. -
హుసాముద్దీన్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. జర్మనీలోని కొలోన్‌లో శనివారం జరిగిన పురుషుల 57 కేజీల సెమీస్‌లో నిజామాబాద్ జిల్లా బాక్సర్ హుసాముద్దీన్ జర్మనీకి చెందిన హమ్‌సత్ షడలోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ పసిడి పతకం నెగ్గాడు. ఫైనల్లో అతని ప్రత్యర్థి అర్గిష్టి టెట్రెర్యాన్ (జర్మనీ) వాకోవర్ ఇవ్వడంతో అమిత్ రింగ్‌లోకి అడుగు పెట్టకుండానే స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ రజతంతో సంతృప్తి చెందాడు. గాయం కారణంగా సతీశ్ ఫైనల్లో పోటీపడలేదు. మహిళల 57 కేజీల విభాగంలో సాక్షి, మనీషా ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీస్‌లో సాక్షి 4–1తో రమోనా గ్రాఫ్ (జర్మనీ)పై, మనీషా 5–0తో సోనియా (భారత్)పై నెగ్గారు. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత పూజా రాణి, గౌరవ్ సోలంకీ సెమీస్‌లో ఓటమి పాలై కాంస్యాలను గెలుచుకున్నారు. -
నిఖత్‌కు పతకం ఖాయం
టోక్యో: రింగ్‌లోకి అడుగు పెట్టకుండానే ఆరుగురు భారత బాక్సర్లకు... క్వార్టర్ ఫైనల్లో విజయంతో మరో భారత బాక్సర్‌కు టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ టెస్ట్ ఈవెంట్లో పతకాలు ఖాయమయ్యాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల 63 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో శివ థాపా 5–0తో యుకీ హిరకావ (జపాన్)పై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. తక్కువ ఎంట్రీల కారణంగా మరో ఆరుగురు భారత బాక్సర్లకు నేరుగా సెమీఫైనల్లో చోటు లభించడంతో వారి ఖాతాలో పతకాలు చేరనున్నాయి. మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), పూజా రాణి (75 కేజీలు)... పురుషుల విభాగంలో సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), వన్‌హిలిమ్‌పుయా (75 కేజీలు) నేరుగా సెమీఫైనల్ బౌట్లు ఆడనున్నారు. -
సెమీస్‌లో ప్రసాద్
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌కు చెందిన తేజ్ బహదూర్ దేబాపై ప్రసాద్ విజయం సాధించాడు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ఆసియా చాంపియన్ అమిత్ ఫంగల్, సచిన్ సివాచ్, గౌరవ్ సోలంకి కూడా సెమీఫైనల్‌కు చేరారు. దాంతో ఈ విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత్ ఖాతాలోకే చేరనున్నాయి. -
ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీకి నిఖత్, హుసాముద్దీన్, ప్రసాద్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగే ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మొహమ్మద్ హుసాముద్దీన్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్ ఎంపికయ్యారు. మే 20 నుంచి 24 వరకు గువాహటిలో ఈ టోర్నీ జరుగుతుంది. ఒలింపిక్ కేటగిరీ అయిన 51 కేజీల విభాగంలో నిఖత్ బరిలోకి దిగుతుంది. ఇదే విభాగంలో భారత మేటి బాక్సర్ మేరీకోమ్ కూడా పాల్గొంటుంది. హుసాముద్దీన్ 54 కేజీల విభాగంలో, ప్రసాద్ 52 కేజీల విభాగంలో ఉన్నారు. 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్ తరఫున పురుషుల విభాగంలో 35 మంది... మహిళల విభాగంలో 37 మంది పోటీపడతారు. ఈ టోర్నీలో 16 దేశాల నుంచి సుమారు 200 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
మీనా పసిడి పంచ్
న్యూఢిల్లీ: కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మైస్నమ్ మీనా కుమారి (54 కేజీలు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జర్మనీలోని కొలోన్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 5 (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలను సాధించింది. ఫైనల్లో మచాయ్ బున్‌యానట్(థాయ్‌లాండ్)పై మీనా గెలిచింది. భారత్‌కే చెందిన సాక్షి (57 కేజీలు), పిలావో బాసుమతారి (64 కేజీలు) రజతాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో మికేలా వాల్ (ఐర్లాండ్) చేతిలో సాక్షి... చెంగ్యూ యాంగ్ (చైనా) చేతిలో బాసుమతారి ఓడిపోయారు. పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్ (60 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. -
సెమీస్‌లో నిఖత్
న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు పతకం ఖాయమైంది. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్‌తోపాటు అమిత్ ఫంగల్ (49 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), నీరజ్ (60 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో బుర్యామ్ యానా (బెలారస్)పై... మంజు రాణి 5–0తో బొనాటి రొబెర్టా (ఇటలీ)పై... లవ్లీనా 5–0తో సోరెజ్ బీట్రిజ్ (బ్రెజిల్)పై... అమిత్ 3–2తో నజర్ కురోత్‌చిన్ (ఉక్రెయిన్)పై గెలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్
న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. బల్గేరియాలోని సోఫియాలో శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో నిఖత్ ఇటలీకి చెందిన మార్చిస్ గియోవానాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రెండు రౌండ్లలో నిఖత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. చివరిదైన మూడో రౌండ్ ఆరంభంలో నిఖత్ పంచ్‌ల ధాటికి గియోవానా ఎదురు నిలువ లేకపోయింది. దాంతో రిఫరీ బౌట్‌ను మధ్యలో నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా లాథెర్ (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), ప్విలావో బాసుమతారి (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సోనియా 5–0తో జెలెనా జెకిచ్ (సెర్బియా)పై... జెస్సికా మెసినా (ఆస్ట్రేలియా)పై లవ్లీనా... బాసుమతారి 3–2తో మెలిస్ (బల్గేరియా)పై గెలిచారు. పురుషుల విభాగంలో మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), హర్‡్ష లాక్రా (81 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
స్వర్ణం నెగ్గిన సవీటి
న్యూఢిల్లీ: ఉమాఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు సవీటి బూరా ఏకైక స్వర్ణాన్ని అందించింది. రష్యాలో మంగళవారం ముగిసిన టోర్నీలో హరియాణాకు చెందిన 25 ఏళ్ల సవీటి... మహిళల 75 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె అన్‌ఫినోజెనోవా(రష్యా)పై విజయం సాధించింది. శశి చోప్రా (57 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు), పవిత్ర (60 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు), వీరేందర్ కుమార్ (91 కేజీలు) రజతాలతో సంతృప్తిపడ్డారు. రబదనోవ్ (రష్యా) చేతిలో బ్రిజేశ్... ఎమ్‌వాల్‌బేల్ (స్వీడన్) చేతిలో వీరేందర్ ఓడిపోయారు. 56 కేజీల విభాగంలో గౌరవ్ బిధురి సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకున్నాడు. -
‘బెస్ట్ బాక్సర్’గా వికాస్ కృషన్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని పొందాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత బాక్సర్‌కు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. పురుషుల 75 కేజీల విభాగంలో వికాస్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో వికాస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ట్రాయ్ ఇస్లే (అమెరికా)ను ఓడించాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాక వికాస్ ఖాతాలో చేరిన మరో పతకం ఇదే. ‘నాకిది గొప్ప పునరాగమనం. గతంలో నా కచ్చితమైన బరువును నియంత్రించుకునేందుకు ఇబ్బంది పడేవాణ్ని. ప్రస్తుతం ఆ సమస్య లేదు. నా టెక్నిక్ కూడా మెరుగయింది. మానసికంగా కూడా నేను దృఢంగా మారాను’ అని వికాస్ తెలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను గెల్చుకున్నారు. -
తొలి భారత బాక్సర్‌గా...
సోఫియా(బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లోభారత బాక్సర్ వికాస్ క్రిషన్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన తర్వాత బెస్ట్ బాక్సర్ అవార్డును వికాస్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ బాక్సింగ్ టోర్నమెంట్లో బెస్ట్ బాక్సర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారత బాక్సర్‌గా వికాస్ నిలిచాడు. సోఫియా వేదికగా 75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన తుది పోరులో వికాస్ విజయ సాధించి పసిడిని సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బాక్సర్ అవార్డును సైతం సొంతం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఫైనల్ పోరులో వరల్డ్ చాంపియన్స్ కాంస్య పతక విజేత ట్రో ఇస్లే(అమెరికా)పై గెలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఫలితంగా గతేడాది ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత తొలి పతకాన్ని అందుకున్నాడు. మరొకవైపు మరో భారత బాక్సర్ అమిత్ పంగల్ కూడా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 49 కేజీల విభాగంలో అమిత్ స్వర్ణాన్ని సాధించాడు. ఇక మహిళల తుది పోరులో మేరీకోమ్ రజతంతో సరిపెట్టుకుంది. దాంతో ఇక్కడ వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని సాధించాలనుకున్న మేరీకోమ్‌కు నిరాశే ఎదురైంది. 48 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన సెవదా అసెనోవా చేతిలో మేరీకోమ్ ఓటమి పాలై రజత పతకానికే పరిమితమయ్యారు. స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జట్టు 11 పతకాలతో పోరును ముగించింది. ఇందులో ఐదు పతకాలు పురుషులు సాధించగా, ఆరు పతకాల్ని మహిళలు సొంతం చేసుకున్నారు. ఇక్కడ రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరడం విశేషం. -
హుస్సాముద్దీన్‌కు కాంస్యం
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో షక్రియర్ అహ్మదోవ్ (రష్యా) చేతిలో హుస్సాముద్దీన్ ఓడిపోయాడు. మరోవైపు వికాస్ (75 కేజీలు), అమిత్ (49 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. -
పసిడి పోరుకు మేరీకోమ్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ స్వర్ణ పతకానికి మరో విజయం దూరంలో ఉంది. శుక్రవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగం సెమీఫైనల్లో యె జియాలీ (చైనా)పై మేరీకోమ్ గెలిచింది. పురుషుల విభాగంలో తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్ (56 కేజీలు), అమిత్ (49 కేజీలు), వికాస్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు), గౌరవ్ (52 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. -
క్వార్టర్స్‌లో వికాస్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ పంఘల్ (49 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ బౌట్లలో అమీర్ గినిఫిడ్ (మొరాకో)పై వికాస్... శర్విన్ (మారిషస్)పై అమిత్... ఆమిన్ (మొరాకో)పై మనీశ్ గెలుపొందారు. మరోవైపు మనోజ్ (69 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో అబ్దుల్ కబీర్ (మొరాకో) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సరితా దేవి
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ లైష్రామ్ సరితా దేవి శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల 60 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సరితా దేవి 4–2తో మాంచెస్ కాన్కెహా (ఇటలీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్లస్ 81 కేజీల విభాగంలో సీమా పూనియాకు నేరుగా సెమీఫైనల్‌కు ‘బై’ లభించడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. పురుషుల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (56 కేజీలు) తొలి రౌండ్లో జు బోజియాంగ్ (చైనా)తో తలపడతాడు. గతేడాది ఈ టోర్నీలో హుస్సాముద్దీన్ రజత పతకం సాధించాడు. -
ఫైనల్లో శ్యామ్‌కుమార్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) ఫైనల్లో ప్రవేశించాడు. వైజాగ్‌కు చెందిన శ్యామ్ బుధవారం సెమీ ఫైనల్లో థానీ నారిన్రామ్ (థాయ్‌లాండ్) పై గెలుపొందాడు. ప్రత్యర్థి నుంచి వాకోవర్ లభించడంతో శ్యామ్ కుమార్ సునాయాసంగా ఫైనల్‌కు చేరాడు. మరో సెమీస్‌లో అమిత్ (భారత్) 4–1తో నట్లాయి లాల్బియాకిమా (భారత్)పై గెలుపొంది తుదిపోరుకు చేరాడు. శ్యామ్‌కుమార్ ఫైనల్లో అమిత్ (భారత్)తో తలపడనున్నాడు. సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ (60 కేజీలు), సంజీత్ (91 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మీనాకుమారి (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), పూజా (69 కేజీలు), సవితి బోరా (75 కేజీలు) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. -
క్వార్టర్ ఫైనల్లో శ్యామ్ కుమార్
ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 5–0తో భారత్‌కే చెందిన నీరజ్ స్వామిని ఓడించాడు. మరో బౌట్లో ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ థాయ్‌లాండ్ బాక్సర్ థాని నరీన్రామ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్లు సర్జూబాలా దేవి, పింకీ జాంగ్రా సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. చెక్ రిపబ్లిక్లో ముగిసిన ఉస్తీ నాద్ లాబెమ్ గ్రాండ్‌ప్రి బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఎనిమిది పతకాలను సొంతం చేసుకున్నారు. ఇందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం విశేషం. ఢిలీ కామన్వల్త్ గేమ్స్ చాంపియన్ మనోజ్ కుమార్ (69 కేజీలు), ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత శివ థాపా (60 కేజీలు), అమిత్ ఫంగల్ (52 కేజీలు), గౌరవ్ బిధురి (56 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) పసిడి పతకాలను సాధించారు. కవీందర్ బిష్త్ (52 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) రజతాలు నెగ్గగా... సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) కాంస్య పతకం గెలిచాడు. ఫైనల్స్‌లో అమిత్ 3–2తో కవీందర్‌పై, గౌరవ్ 5–0తో ఇవనోవ్ జరోస్లావ్ (పోలాండ్)పై, శివ థాపా 5–0తో ఫిలిప్ మెస్జరోస్ (స్లొవేకియా)పై, మనోజ్ 5–0తో డేవిడ్ కొటార్సి (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా... మాక్స్ కెల్లర్ (జర్మనీ)పై సతీశ్ విజయం సాధించాడు. మరో ఫైనల్లో బజుయేవ్ (జర్మనీ) చేతిలో మనీశ్ ఓడిపోయాడు. -
హుస్సాముద్దీన్‌కు రజత పతకం
న్యూఢిల్లీ: స్ట్రాన్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ రజత పతకంతో మెరిశాడు. బల్గేరియాలోని సోఫియా లో ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో అతను 56 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఉక్రెయిన్‌కు చెం దిన మికోలా బుత్సెంకోతో జరిగిన టైటిల్ బౌట్లో హుస్సాముద్దీన్ 2–3 పాయింట్ల తేడాతో ఓడిపో యాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... మరో ఇద్దరు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల 49 కేజీ లైట్ ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో అమిత్ ఫంగల్, మహిళల 54 కేజీ కేటగిరీలో మీనా కుమారి మైస్నమ్ సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో తృప్తిపడ్డారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు మహిళలు సహా 15 మందితో కూడిన భారత బృందం పోటీపడగా మూడు పతకాలు లభించాయి. 31 దేశాల నుంచి 200 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. -
ఓడినా ‘కప్’ ఇచ్చారు!
ఏడు పదుల వయసులో ఏ ఆర్టిస్ట్ అయినా శరీరాన్ని కష్టపెట్టుకునే పాత్రలు చేయడానికి వెనకాడతారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి కొంతమంది తారలు రిస్క్‌లు తీసుకోవడానికి రెడీ అయిపోతారు. ప్రస్తుతం నటిస్తున్న ఓ చిత్రంలో ఈ బిగ్ బి బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్లతో తలపడుతున్నారు. వాళ్ల ఉత్సాహం, ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేసిందనీ, వాళ్లతో బాక్సింగ్ రింగ్‌లో తలపడటం సవాల్‌గా అనిపించిందనీ అమితాబ్ అన్నారు. ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా చిన్ననాటి విశేషాలు గుర్తొచ్చాయని అమితాబ్ చెబుతూ - ‘‘ఇష్టం ఉన్నా లేకపోయినా మా స్కూల్లో బాక్సింగ్ నేర్చుకోవాల్సిందే. పోటీల్లో ఒకే ఒక్క పాయింట్‌తో గెలుపోటములు ఆధారపడి ఉన్నప్పుడు భలే మజాగా ఉండేది. ఆ ఒక్క పాయింట్ దక్కించుకుని, ఆనందపడేవాణ్ణి. ఓసారి మాత్రం బాక్సింగ్ టోర్నమెంట్లో ఓడిపోయాను. అయినా కప్ ఇచ్చారు. గెలుపు కోసం ధైర్యసాహసాలను మెండుగా ప్రదర్శించినందుకుగాను ఆ కప్ గెల్చుకున్నా. వాస్తవానికి నా ఎత్తు నాకు మైనస్ అయ్యింది. నా బరువేమో లోయర్ కేటగిరీ వాళ్లకు సమానంగా ఉండేది. ఎత్తు మాత్రం హయర్ కేటగిరీకి సమానంగా ఉండేది. దాంతో నన్ను హయర్ కేటగిరీకే ఎంపిక చేసేవాళ్లు. వాళ్లేమో ‘ఆలోచించుకో. విరమించుకుంటేనే నీకు మంచిది. లేకపోతే దెబ్బలు తగలడం ఖాయం’ అని హెచ్చరించేవాళ్లు. కానీ, నేను మాత్రం ఆ హెచ్చరికను ఖాతరు చేసేవాణ్ణి కాదు. మొండిగా తలపడేవాణ్ణి. ఇప్పడు సినిమా కోసం బాక్సింగ్ చేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి’’ అని చెప్పారు. -
క్వార్టర్ ఫైనల్లో వికాస్
బాకు (అజర్బైజాన్): ఆసియా క్రీడల మాజీ విజేత వికాస్ కృషన్ యాదవ్ ప్రపంచ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో వికాస్ 3-0తో క్వాచటాద్జె జాల్ (జార్జియా)పై గెలుపొందాడు. వికాస్‌తోపాటు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి చేరగా... దేవేంద్రో సింగ్ (49 కేజీలు) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిస్తే మనోజ్, వికాస్, సుమిత్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. దేవేంద్రో సింగ్‌కు మాత్రం ఫైనల్‌కు చేరితేనే రియో బెర్త్ ఖాయమవుతుంది. -
క్వార్టర్స్‌లో దేవేంద్రో సింగ్
రెండో సీడ్‌పై మనోజ్ గెలుపు బాకు (అజర్బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ లైష్రామ్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. మరోవైపు మనోజ్ కుమార్ (64 కేజీలు) రెండో సీడ్‌పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల తొలి రౌండ్లో ‘బై’ లభించిన దేవేంద్రో రెండో రౌండ్లో 3-0తో లియాండ్రో బ్లాంక్ (అర్జెంటీనా)ను ఓడిం చాడు. ఒలింపిక్ బెర్త్ దక్కించుకోవాలంటే అతను ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. అటు మనోజ్ అద్భుత ప్రదర్శనతో రెండో సీడ్ మొహమ్మద్ ఇస్లాం అహ్మద్ అలీ (ఈజిప్టు)పై 3-0తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీ నుంచి దక్కే 39 ఒలింపిక్ బెర్త్‌ల కోసం 400 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.