delhi assembly
-
Delhi: ఈడీకి కేజ్రీవాల్ ఎనిమిదో ‘సారీ’
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఎనిమిదోసారి హ్యాండిచ్చారు. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇటీవలే ఎనిమిదవసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. ఈ విచారణకు సోమవారం ఈడీ ఎదుటకు రావాల్సి ఉండగా కేజ్రీవాల్ రాలేదు. సోమవారం(మార్చి 4) తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందునే విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఈడీకి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. మార్చ్ 12వ తేదీన ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, 2024, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 26, మార్చ్ 4వ తేదీల్లో ఇప్పటికి ఎనిమిదిసార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఇదీ చదవండి.. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం -
రేపు ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశం
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ రేపు(సోమవారం) అత్యవసరంగా సమావేశం కానుంది. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు కాలపరిమితి విధించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలని ఎలా పక్కదోవ పట్టిస్తుందో అనే అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు ఢిల్లీ అసెంబ్లీ సెక్రటీ రాజ్ కుమార్ తెలిపారు. -
షాకింగ్.. అసెంబ్లీలో లంచం డబ్బు.. నోట్ల కట్టలతో ఆప్ ఎమ్మెల్యే ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఒక కాంట్రాక్టర్ లంచం ఆశజూపి తన నోరు మూయించజూశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మొహీందర్ గోయల్ ఆరోపించారు. ఆ డబ్బు ఇదేనంటూ బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో కరెన్సీ కట్టలను చూపించారు. ‘‘ఓ ప్రభుత్వాస్పత్రికి సంబంధించి కొత్త కాంట్రాక్టర్ వచ్చాక 80 శాతం పాత కాంట్రాక్ట్ సిబ్బందిని తీసేసి లంచాలు తీసుకుని కొత్తవారిని నియమిస్తున్నాడు. దీనిపై నోరు మెదపకుండా ఉండేందుకు నాకు లంచం ఇవ్వబోయాడు. ఇది 2022 ఫిబ్రవరిలో జరిగింది. వెంటనే ఢిల్లీ పోలీసులకు, ఏసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు’’ అని ఆరోపించారు. ‘‘నాకు వారి నుంచి ప్రాణ హాని ఉంది. కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌చేశారు. ఇది ఉన్నతస్థాయి కుట్ర అని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, తీవ్రమైన అంశమని స్పీకర్ రాంనివాస్ అన్నారు. ఇది నిజమే అయితే లంచమిచ్చేటపుడే రెడ్ హ్యాండెడ్‌గా ఎందుకు పట్టుకోలేదని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. చదవండి: బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత -
ఆపరేషన్ లోటస్ విఫలమైంది: కేజ్రీవాల్
-
ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్
న్యూఢిల్లీ: ‘‘మిగతా రాష్ట్రాల్లో సఫలమైన బీజేపీ ఆపరేషన్ కమలం ఢిల్లీలో పూర్తిగా విఫలమైంది. ఒక్క ఆప్ ఎమ్మెల్యేను కూడా లాగలేకపోయింది’’ అని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం ఆప్ సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలు పార్టీకి విశ్వాసపాత్రులని చాటి చెప్పేందుకే విశ్వాస పరీక్ష పెట్టామన్నారు. గుజరాత్లో ఆప్ ఓటు శాతం పెరిగింది గుజరాత్లో ఆప్‌కు ఆదరణ పెరుగుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ అక్రమ దాడుల తర్వాత అక్కడ ఆప్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగిందన్నారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్‌చేస్తే మరో రెండు శాతం ఓటు శాతం ఎగబాకుతుందన్నారు. ‘‘సిసోడియా సొంతూర్లోనూ సోదాలు చేశారు. బ్యాంక్ లాకర్ తెరిపించారు. అయినా ఏమీ దొరకలేదు. ఈ దాడుల ద్వారా ఆప్‌కు, సిసోడియా నిజాయతీకి ప్రధాని మోదీనే స్వయంగా నిజాయతీ సర్టిఫికెట్ ఇచ్చేశారు’’ అన్నారు. మరోవైపు ఢిల్లీలో మళ్లీ పాత మద్యం విధానం అమల్లోకి వచ్చింది. ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్ చైర్మన్‌గా తాను పాల్పడిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలన్న ఆప్ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ మండిపడ్డారు. చదవండి: శాఖ మార్చిన కాసేపటికే.. బిహార్ మంత్రి రాజీనామా -
ఢిల్లీ అసెంబ్లీలో రగడ.. ఆప్, బీజేపీ నేతల మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం రాత్రి హైడ్రామా నెలకొంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా రాత్రంతా ఆందోళనలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటా మంగళవారం ఉదయం వరకు అసెంబ్లీ ఆవరణలో గడిపారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాలేదని నిరూపించేందుకు తాను బలపరీక్ష ఎదుర్కొంటానని కేజ్రీవాల్ ప్రకటించిన వెంటనే అసెంబ్లీలో రగడ మొదలైంది. ఆప్ ఆరోపణలు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా 2016లో రూ.1400కోట్ల అవినీతికి పాల్పడ్డరని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆయన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని చెప్పారు. దీనిపై సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. బీజేపీ ధర్నా.. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ విగ్రహాల ముందు ధర్నాకు దిగారు. ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20కోట్లు ఆశచుపారని ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని నిరూపించేందుకు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. విశ్వాస పరీక్షపై అసెంబ్లీలో మంగళవారమే ఓటింగ్ జరగనుంది. ఒక్క ఆప్ ఎమ్మెల్యే కుడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని నిరూపితమవుతుందని కేజ్రీవాల్ అన్నారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా? -
బీజేపీ ఆపరేషన్ కమలం విఫలం.. అందుకే విశ్వాస తీర్మానం: సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే సీఎం కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. అయితే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఆప్ విశ్వాస తీర్మానం పెట్టిందని సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సభ్యలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు. చదవండి: రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్.. అందుకే కాంగ్రెస్‌ను వీడానంటూ.. విశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విషయాలు చర్చకు రాకుండా.. రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే సభకు వస్తున్నారని ఆరోపించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరితో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ కమలం విఫలమైందని రుజువు చేసేందుకే సభలో విశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని.. ఢిల్లీలోని అలాంటి ప్రయత్రాలు చేసిందని విమర్శించారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. -
Delhi Assembly: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలపై చర్చించేందుకు, తాము సాధించిన విజయాలను వివరించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. అయితే, బీజేపీ తమ వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంటూ ఆప్ సభ్యులు డబ్బు–డబ్బు(ఖోకా–ఖోకా) అంటూ నినాదాలు ప్రారంభించారు. పోటీగా బీజేపీ సభ్యులు కేజ్రీవాల్ సర్కార్ లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ మోసం–మోసం (ధోఖా–ధోఖా) అంటూ ప్రతినినాదాలకు దిగారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా వారిని సముదాయించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సభా కార్యక్రమాలను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంలో తన ప్రశ్నకు జవాబివ్వకుండా, కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ బీజేపీకి చెందిన మొత్తం 8 మందినీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా మార్షల్స్‌తో బయటకు గెంటించి వేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అభద్రతాభావంలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేజ్రీవాల్, మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లలేదని నిరూపించేందుకు ఈ నెల 29న అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ బురద జల్లుడుగా మారిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ సీరియల్ కిల్లర్ మాదిరిగా కాచుక్కూర్చుందన్నారు. ప్రధాని మోదీలో అభద్రతాభావం పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం సిసోడియా పేర్కొన్నారు. -
పిల్లల దుస్తులు కూడా వెతికారు.. అక్కడేముంది, ఏమీ లేదు!: మనీశ్ సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు కమలం పార్టీ నేతలు సీరియల్ కిల్లర్లలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు. సీబీఐ తన నివాసంలో 14 గంటల పాటు సోదాలు చేసినప్పుడు అధికారులు తన దుస్తులు, పిల్లల దుస్తులు కూడా వెతికారని సిసోడియా తెలిపారు. తనిఖీల్లో వాళ్లకు ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐర్ మొత్తం ఫేక్ అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సభాముఖంగా తెలిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలను ఖూనీ చేసేందుకు బీజేపీ నేతలు చాలా శ్రమిస్తున్నారని, ఆ శ్రద్ధ ఏదో స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణంపై పెట్టాల్సిందని సిసోడియా హితవుపలికారు. ఇతరులు మంచి పనులు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ అభద్రతాభావానికి లోనవుతున్నారని సిసోడియా విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని తాను చూడలేదన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయి ఉంటే మోదీలా చేసేవారు కాదని సిసోడియా అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకున్న ఎక్సైజ్ పాలసీని సిసోడియా సమర్థించారు. దాని వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడలేదని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందని సిసోడియా పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా దాంట్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. వీడియో రికార్డు అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో ఫోన్‌తో వీడియో రికార్డు చేశారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్ మహావర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా.. సభ నియమాలను ఉల్లంఘించి వీడియో తీసినందుకు మీ ఫోన్ ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పండి అని ప్రశ్నించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేశారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. డిసెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఓ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. సిక్కు మతస్థులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా కంగన అభివర్ణించినట్లు ఫిర్యాదుదారులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి పోస్టులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓ వర్గం ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తాయని రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. -
సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఢిల్లీ శాసనసభ పునరుద్ఘాటించింది. ఈ మేరకు శుక్రవారం సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా దీనికి మద్దతు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా, ప్రస్తుతం ఆప్‌నకు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రైతన్నలు శాంతియుతంగా పోరాటం సా గిస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని శాసనసభ విమర్శించింది. రైతుల డిమాండ్లను కేంద్రం అంగీరించాలని డిమాండ్ చేసింది. వారితో చర్చించాలని, సమస్యలను పరి ష్కరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరింది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొనేలా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న ఆన్నదాతల మద్దతు సంపాదించేందుకు ఢిల్లీలో శాసనసభలో తాజాగా తీర్మానం చేసినట్లు స్పష్టమవుతోంది. -
ఆస్తానా నియామకం రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్తానాను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఆయన నియామకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అధికార పక్షం ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. వివాదాస్పదుడైన ఓ అధికారిని దేశ రాజధానిలోని పోలీసు బలగాలకు అధిపతి కారాదని తీర్మానం పేర్కొంది. ఆస్తానా నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నా రు. నిబంధనలకు లోబడి కేంద్రం నియామకాలు చేపట్టాలన్నారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసున్న ఏ అధికారిని కూడా దేశంలో పోలీసు విభాగాధిపతిగా నియమించరాదంటూ 2019 మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాజాగా హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా ఆస్తానాను నియమిస్తున్నట్లు మంగళవారం తెలిపిన కేంద్రం..ఆయన సర్వీసును ఏడాది కాలం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ‘పదవీకాలం రీత్యా ఆయన అనర్హుడు కాబట్టే సీబీఐ డైరెక్టర్‌గా పరిగణనలోకి తీసుకోలేదు. మరి అదే నిబంధన ఢిల్లీ పోలీసు కమిషనర్ నియామకానికి కూడా వర్తించాలి కదా.. అని కేజ్రీవాల్ అన్నారు. -
‘అసెంబ్లీలో కలకలం: ఆత్మహత్యకు యత్నం’
న్యూఢిల్లీ: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఓ ప్రజాప్రతినిధి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె అధికార పార్టీకి చెందిన నాయకురాలే కావడం గమనార్హం. ఆమె చర్యతో ఆ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు అందరూ కల్పించుకుని ఆమెతో ఆ ప్రయత్నం విరమింపజేశారు. అనంతరం ఆ సమస్యపై ఆమె ప్రభుత్వ పెద్దలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలోని మల్కాగంజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ గుడి దేవి మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి హాజరైంది. అయితే సమావేశానికి కిరోసిన్ బాటిల్‌తో వచ్చింది. తన ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కార్మికులను తొలగించారని ఆమె ఆందోళన చేసింది. 206 మంది ఉండాల్సిన కార్మికుల్లో 115 మందిని తొలగించడంతో ప్రస్తుతం 85 మంది ఉన్నారని తెలిపింది. దీంతో తన ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయింది. సమస్య పరిష్కరిస్తారా లేదా అని కిరోసిన్ బాటిల్‌తో గుడి దేవి హల్చల్ చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమె చేతిలో నుంచి కిరోసిన్ డబ్బాను తీసుకుని శాంతపరిచారు. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. -
కేంద్రానికి కేజ్రీవాల్ ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిల్లుపై మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని అన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 7గురికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కేరళ తొలుత తీర్మానం చేసింది. -
అసెంబ్లీలో అధ్యయన కేంద్రం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ రీసెర్చ్ సెంటర్ (డీఏఆర్‌సీ)ని ఏర్పాటు చేయనుంది. ఇందులో యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టనుంది. ఇందులో అప్రెంటిస్‌గా చేరిన విద్యార్థులు ఎమ్మెల్యేలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల యువతకు శాసనసభ కార్యకలాపాల నిర్వహణపై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వీరు శాసనసభ్యులకు ఆయా రోజుల్లో చర్చించే అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఎమ్మెల్యేలకు తాజా సమాచారం అందుతుంది. తత్ఫలితంగా వారికి కూడా ఆయా అంశాల విషయంలో నిష్ణాతులుగా మారుతారు. ఇలా ఇరువైపులా ప్రయోజకనకరమైన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం త్వరలో కార్యరూపంలోకి తీసుకురానుంది. అసెంబ్లీ సచివాలయం ఈ డీఏఆర్సీని ఏర్పాటు చేస్తుంది. 50 మందికి ఫెలోషిప్‌తోపాటు మరో 90 మందికి అసిస్టెంట్ ఫెలోషిప్ ఇవ్వనుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఏడాది కాలానికి ఇస్తారు. ఎవరైనా పూర్తిస్థాయిలో నేర్చుకోలేదని అనిపిస్తే మరో ఏడాదికాలం పొడిగిస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి ఏడాదిన్నర క్రితం ఈ అంశాన్ని సభ ముందుంచారు. తమకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తగినంత వ్యవధి దొరకకపోతుండడంతో సోమ్‌నాథ్ ఈ ఆలోచనను సీఎం ముందుంచారు. ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించే బాధ్యతను స్పీకర్ రాంనివాస్ గొయల్ అప్పట్లో జనరల్ పర్పస్ కమిటీ (జీపీసీ)కి అప్పగించారు. ఏడాదిలోగా తనకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. ఔత్సాహికులు ఈ నెల 25వ తేదీలోగా డీఏఆర్‌సీ.డీటీయూ.ఏసీ.ఇన్’కు పంపాల్సి ఉంటుంది. డీఏఆర్సీలో విలువైన, నాణ్యతా ప్రమాణాలతో కూడిన అధ్యయనం జరుగుతుందని, ఇది శాసనసభ్యులకు ఉపయుక్తంగా ఉంటుందని, వారికి అవసరమైన సమాచారం అందేందుకు దోహదం చేస్తుందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో శాసనసభ సచివాలయం పేర్కొంది. ఎంపిౖకైన యువకులు...శాసనసభ్యులు, అసెంబ్లీ సెక్రటరియేట్, ఆయా ప్రభుత్వ విభాగాలతో చక్కని సమన్వయంతో కలసిమెలసి పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. -
ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ‘ఉగ్ర’ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో కలకలం రేపాయి. సోమవారం అసెంబ్లీలో మంచినీటి సమస్యపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో నీటి సమస్యకు అధికారులే కారణమని ఆరోపించారు. దీనిపై ఆప్ సభ్యుడు అమానతుల్లా ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఓపీ శర్మ అనుచితంగా మాట్లాడారు. ‘తప్పు చేస్తే ఉగ్రవాదుల మాదిరిగా నువ్వూ జైలుకు పోతావ్. ఉగ్రవాదిలా ఎందుకు మాట్లాడుతున్నావ్? ఉగ్రవాదిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్? నాతో పెట్టుకోకు. ఫన్నీఖాన్‌లాగా ఉండకు. కూర్చో’ అంటూ దూషించారు. ఈ వ్యాఖ్యలు శాసనసభ ప్రతిష్టకు భంగకరమంటూ ఆప్ సభ్యులు ఆందోళనకు దిగారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. -
విజిటర్స్‌గా వెళ్లి ఆప్ అసెంబ్లీని వణికించారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ఇద్దరు వ్యక్తులు నానా రచ్చ చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా లేచి మంత్రి సత్యేంద్ర జైన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో సభలో ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. కాసేపట్లోనే గందరగోళ వాతావరణం నెలకొంది. నినాదాలు చేసినవరు వారు తాము ఆమ్ఆద్మీపార్టీ కార్యకర్తలం అని చెప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ జరుగుతుండగా విజిటర్లుగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అనూహ్యంగా అక్కడి నుంచి లోపలికి దూసుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జైన్‌కు వ్యతిరేకంగా నినాదులు చేస్తూ ఆయన ఓ అవినీతిపరుడని గట్టిగా అరుస్తూ ఏవో కాగితపు ముక్కలను అక్కడ కూర్చున్న చట్ట సభ ప్రతినిధులపైకి విసిరారు. దీంతో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు వారితో గొడపడ్డారు. చేయికూడా చేసుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ప ఆ సమయంలోనే స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ వారిని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై దాడి
-
ఢిల్లీ అసెంబ్లీలో మిశ్రాపై దాడి
ఆప్ ఎమ్మెల్యేల దుశ్చర్య న్యూఢిల్లీ: ఆప్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై నిండు సభలో దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఆప్ ఎమ్మెల్యేలు బుధవారం ఆయనపై భౌతిక దాడికి పాల్పడి, మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఓ ఎమ్మెల్యే ఆయన గొంతు నులిమేంత పనిచేశాడు. మరొకరు పిడిగుద్దులు గుద్దాడు. సీఎం కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌లపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యేలు ఈ చర్యకు పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో మార్షల్స్ మిశ్రాను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. మిశ్రా మాట్లాడుతూ కేజ్రీవాల్ అవినీతిపై చర్చించేందుకు రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని సభలో డిమాండ్ చేయడంతో తనపై ఆప్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. జీఎస్టీ బిల్లుపై చర్చ అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా సభకు హాజరైన మిశ్రా రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని రాసి ఉన్న బ్యానర్‌ను సభలో ప్రదర్శించారు. స్పీకర్ ఆయనను వారించారు. ఈ సందర్భంగానే మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు భౌతిక దాడికి పాల్పడ్డారు. -
‘ముఖ్యమంత్రి బండారం బయటపెడతా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే, మాజీమంత్రి కపిల్ మిశ్రాకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లో ఆరోపణలు చేసినందుకు ఆప్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్ మిశ్రాపై దాడి చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కపిల్ మిశ్రాను మార్షల్స్ బలవంతంగా సభనుంచి బయటకు తీసుకువెళ్లారు. అనంతరం కపిల్ మిశ్రా మాట్లాడుతూ ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని, కేజ్రీవాల్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై తాను మాట్లాడుతుండగానే ఆప్ ఎమ్మెల్యేలు దూసుకు వచ్చి, దాడి చేయడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దారన్నారు. తనపై దాడి చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇస్తున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. కాగా గత నెలలో కూడా ఆప్ మద్దతుదారులు కపిల్ మిశ్రాపై దాడికి యత్నించారు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు విశ్వాసపాత్రుడుగా ఉన్న కపిల్ మిశ్రా... ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్లు ఇస్తుండగా తాను చూశానని, మందుల కొనుగోలు విషయంలోనూ ఆరోగ్య శాఖ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే హడావుడి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసినదంతా చివరకు ఓ ప్రహసనంలా మారింది. తాను ఒక మాజీ కంప్యూటర్ ఇంజనీర్‌నని, పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. తాను ఇప్పుడు ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో చూపిస్తానని వెల్లడించారు. ఇందుకోసం ఒక డమ్మీ ఈవీఎంను ఆయన తయారుచేయించి తీసుకొచ్చారు. ఎన్నికలలో పోలింగ్ ప్రారంభం అయినప్పుడు అంతా మామూలుగానే ఉంటుందని, రెండు మూడు గంటల తర్వాత నుంచి దానికి ఒక సీక్రెట్ కోడ్ యాక్టివేట్ చేస్తారని ఆయన అన్నారు. ఆ కోడ్ యాక్టివేట్ అయిన తర్వాత ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా అన్నీ ఒక పార్టీకే వెళ్తాయని చెప్పారు. ఇందుకోసం ఒక బొమ్మలాంటి ఈవీఎంను తీసుకొచ్చి, అందులో ఓట్లు వేసి, వాస్తవంగా పోలైన ఓట్లు, తుది ఫలితాలు ఇవంటూ ఆయన చూపించారు. అయితే ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న ఈవీఎంలు కాకుండా.. తాను సొంతంగా తయారు చేయించుకుని వచ్చినవి కావడంతో వాటిని ఎంతవరకు నమ్మొచ్చని వచ్చిన ప్రశ్నలకు అటు భరద్వాజ్ గానీ, ఇటు అరవింద్ కేజ్రీవాల్ గానీ సమాధానం ఇవ్వలేకపోయారు. అలాగే, సీక్రెట్ కోడ్‌ను ఈవీఎంలో ఎలా యాక్టివేట్ చేస్తారన్న ప్రశ్నలకు కూడా జవాబులు రాలేదు. వేళ్లలోనే తప్పుందని అంటారు ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బహిష్కృత ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా పాల్గొన్నారు. సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత అటు నుంచి నేరుగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రేపు వీళ్లు ఓటర్లనే తప్పుపడతారని, వాళ్ల వేళ్లలోనే తప్పుందని చెప్పినా చెబుతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ సవాలు మీరు సొంతంగా తీసుకొచ్చిన ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కాదని, ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న అసలు ఈవీఎంలను ఎవరైనా తాము త్వరలో నిర్వహించే హాకథాన్‌లో ట్యాంపర్ చేసి చూపించాలని ఎన్నికల కమిషన్ సవాలు చేసింది. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా రావొచ్చని, అక్కడ చేసి చూపించాలని అన్నారు. -
‘మోదీ రూ. 25 కోట్ల లంచం తీసుకున్నారు’
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పేర్కొన్నట్టు పెద్దనోట్ల రద్దు పేదలకు కడఖ్ చాయ్ కాదని, అది వారికి విషప్రాయమని చెప్పుకొచ్చారు. మోదీ పేదలను దోచుకొని, తన కార్పొరేట్ స్నేహితులను కాపాడుకుంటున్నారని, వ్యాపారవేత్తలు ఆయనకు ముడుపులు ఇస్తుండగా.. వారి ఇళ్లమీద ఐటీదాడులు జరగకుండా మోదీ చూస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంగళవారం నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రీవాల్ మాట్లాడారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘2013 అక్టోబర్‌లో అప్పటి ఆదిత్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడిగా ఉన్న శుబేందు అమితాబ్‌పై ఐటీ దాడులు నిర్వహించింది. ఆయన లాప్‌టాప్‌లు, బ్లాక్‌బెర్రీ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించగా 2012 నవంబర్ 16న గుజరాత్ సీఎంకు రూ. 25 కోట్లు చెల్లించినట్టు ల్యాప్‌టాప్‌లో వివరాలు ఉన్నాయి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
అతి పెద్ద కుట్రను బయటపెడతా: సీఎం
తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు తనపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని, దీని వెనక ఉన్న అతిపెద్ద కుట్రను అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం బయట పెడతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం శుక్రవారం నాడు అసెంబ్లీని ప్రత్యేకంగా ఒకరోజు సమావేశపరుస్తున్నారు. తద్వారా.. కేంద్రంతో మరో పోరాటానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ మీద, మంత్రుల మీద, ఆప్ ఎమ్మెల్యేల మీద తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై అసెంబ్లీని ఒకరోజు ప్రత్యేకంగా సమావేశపచరాలని ఢిల్లీ మంత్రివర్గం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా చెప్పారు. తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, తన కార్యాలయంపై సీబీఐ దాడులు చేయించారని.. ఇదంతా చాలా పెద్ద కుట్రలో భాగమని, దాన్ని శుక్రవారం నాడు ఢిల్లీ అసెంబ్లీలో బయటపెడతానని కేజ్రీవాల్ ట్వీట్ కూడా చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లో అక్రమ నియామకాలపై ఏసీబీ మొదలుపెట్టిన విచారణలో భాగంగా ముఖ్యమంత్రి పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ఢిల్లీ సర్కారు అగ్గిమీద గుగ్గిలం అయింది. కేజ్రీవాల్‌ను తాము ప్రశ్నించబోమని ఏసీబీ చెప్పినా ఆగ్రహం మాత్రం తగ్గలేదు. ఇక తాను సత్యేంద్ర జైన్‌ను పిలిపించి పత్రాలన్నీ చూశానని, ఆయన నిర్దోషి అని కూడా అరవింద్ కేజ్రీవాల్ మరో ట్వీట్లో చెప్పారు. ఆయన తప్పు చేసి ఉంటే ఎప్పుడో బయటకు పంపేసేవాళ్లమని, ఇప్పుడు మాత్రం ఆయనకు అండగా ఉంటామని అన్నారు. ఎఫ్ఐఆర్ పెట్టడానికి ప్రధానమంత్రి అంగీకరించిన విషయం స్పష్టంగా తెలుస్తోందని, దీనివెనక ఉన్న కుట్రను తాము బయటపెడతామని కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో డెంగ్యూ, చికన్ గున్యాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వైఫల్యంపై కూడా ఆప్ ఎమ్మెల్యేలు గట్టిగా తమ వాణిని వినిపించనున్నారు. ఢిల్లీ మునిసిపాలిటీలు మూడూ బీజేపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే డెంగ్యూ, చికన్ గున్యా ప్రబలిన సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి.. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ ఢిల్లీలో లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దాన్ని ఖండించడానికి ఆ బాధ్యత మొత్తం మునిసిపాలిటీదేనని ఆప్ మొదటినుంచి చెబుతున్న విషయం తెలిసిందే. False cases against AAP MLAs n ministers, FIR against me, CBI raid on me - why? A v big conspiracy. Will expose in Del Assembly on Fri — Arvind Kejriwal (@ArvindKejriwal) 27 September 2016 I summoned Satinder this morning. Saw all papers. He innocent, being framed. If he were guilty, we wud have thrown him out. We stand by him — Arvind Kejriwal (@ArvindKejriwal) 27 September 2016 -
'మా సీఎం సరే.. మీ పీఎం దేశంలోనే ఉండరేం?'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సభకు హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీజేపీపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ముఖ్యమంత్రి సంగతి సరే ప్రధాని నరేంద్రమోదీ సంగతేమిటి.. ఆయన చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారు కదా అంటూ నిలదీశారు. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. అయితే, ఇందులో ముగ్గురే కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. మిగితావారెవ్వరూ కూడా సభలో కనిపించలేదు. దీంతో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు విజేంద్ర గుప్తా మాట్లాడుతూ 'ప్రత్యేక సమావేశం అంటూ పిలిచారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కనిపించడం లేదు. కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. మిగితా వారెవ్వరూ లేరు' అని అంటుండగానే ఆయన మైకును కట్ చేశారు. పంజాబ్ భారత దేశంలో భాగం కాదని మీరు అనుకుంటున్నారా అంటూ స్పీకర్ ప్రశ్నించారు. వెంటనే సీట్లో కూర్చొండని ఆదేశించారు. అయితే మాట్లాడుతుంటే మైకు కట్ చేయడం ప్రజాస్వామ్యం అంటారా అని గుప్తా ప్రశ్నించారు. దీంతో ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి విషయం అట్లుంచితే.. ప్రధాని నరేంద్రమోదీ చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారుగా.. ఆయన సంగతేమిటి? ఆయన ఎందుకు దేశంలో కలియతిరగరు' అని ప్రశ్నించారు. -
ఈసారి తప్పించుకోలేవని బెదిరించాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుప్తా పీఏ ఆశీష్ కట్యల్ ఫోన్‌కు ఆగంతకుడు కాల్ కేసి ఈ మేరకు హెచ్చరించాడు. ఆశీష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం గుర్తుతెలియనివ్యక్తి తనకు ఫోన్ చేసి గుప్తాను చంపుతానని బెదిరించాడని, గతంలో రెండుసార్లు తమదాడి నుంచి తప్పించుకున్నాడని, ఈ సారి సెక్యూరిటీ ఉన్నా తమ నుంచి తప్పించుకోలేడని హెచ్చరించాడని ఆశీష్ చెప్పారు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తనకు గత నెల 9వ తేదీన ఇదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుప్తా చెప్పారు. ఏడాదిన్నర క్రితం కూడా బెదిరింపులు వచ్చాయని, వీటి వెనుక ఆప్ లీడర్ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, వీటి వెనుక వందశాతం ఆప్ నేతల హస్తముందని భావిస్తున్నట్టు గుప్తా చెప్పారు. అయితే గుప్తా ఆరోపణలు ఆప్ నేతలు ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి వాస్తవాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.