Department of Finance
-
వామ్మో.. 61 ఏళ్లు.. సర్కారు బెంబేలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఏకంగా 44 వేల మంది ప్రభుత్వ ఉద్యో గులు రిటైర్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద సగటున రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారనుంది..’ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలోని ఓ ప్రధాన అంశం. ఆర్థిక శాఖ లెక్క ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఖజానాపై దాదాపు రూ.20 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అంటే సరాసరి నెలకు రూ.350 కోట్ల పైచిలుకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ రిటైర్మెంట్లు ప్రారంభం కావడం, అప్పటి నుంచి ఉన్న భారం ఒక్కసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకురావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పదవీ విరమణ వయసు పెంపుతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగలేదు. దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించే అవసరం పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్లు మొదలవగా ఈ ఏడాది డిసెంబర్ వరకు మొత్తం 7,995 మంది రిటైరవుతారని చెబుతున్నారు. వీరికి తక్షణ బెనిఫిట్ల కోసం రూ.3,200 కోట్ల వరకు అవసరం కాగా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఉంది. పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి యేటా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కనీసం నెలకు రూ.350 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,800 కోట్లు అవసరం అవుతాయని, రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. ఏమేమి చెల్లించాలి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైరైన తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్లు చాలానే ఉంటాయి. వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలను కలుపుకొని లెక్కించిన వేతనానికి 10 రెట్లు ఆర్జిత సెలవుల (లీవ్ శాలరీ) రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమ్యుటేషన్ రూపంలో మరో రూ.20 లక్షలు చెల్లించాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే కనీసం రూ.40 లక్షలు ఒక్కో ఉద్యోగికి చెల్లించాలన్న మాట. రానున ఐదేళ్లలో అంటే 2028 నాటికి రిటైర్ అయ్యే సంఖ్య నెలకు 10 వేలకు చేరుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అప్పుడు నెలకు కనీసం రూ.400 కోట్లు (అప్పటికి) అవసరమని అంచనా. గడ్డు పరిస్థితుల్లో ఖజానా రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి ప్రకారం మార్చి నెల నుంచి రిటైరైన వారికి బెనిఫిట్లు చెల్లించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. సరెండర్ లీవ్స్ లాంటి చెల్లింపులు కూడా గగనమవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. 2022 జూలై డీఏ ప్రకటించినా మరో నాలుగు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఐతో పాటు జీపీఎఫ్లపై వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ తలలు పట్టుకుంటోంది. తమ బిల్లుల కోసం ఉద్యోగులు రోజూ సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. రిటైర్మెంట్కు మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళతాయని, ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వ వీలును బట్టి ఆర్థిక అంశాలను సర్దుబాటు చేసుకుని ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్
సాక్షి, అమరావతి: అత్యధికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లను చేయి పట్టి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలన్నింటినీ గుర్తించి ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలందించడం, అవకాశాలను అంది పుచ్చుకుంటూ విస్తరించే విధంగా అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయించడం, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది. ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదుకు చర్యలు ఇప్పటికీ ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్ఎంఈలు 45 లక్షలకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని త్వరతగతిన గుర్తించి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేయించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎంఎస్ఎంఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 7.52 లక్షలు కాగా.. వీటిలో 1.6 లక్షల పరిశ్రమలు తయారీ రంగానికి చెందినవి కాగా 5.7 లక్షల యూనిట్లు సేవా రంగానికి చెందినవి. వీటిలో 96 శాతం యూనిట్లు అత్యధికంగా సూక్ష్మ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోళ్లు తప్పనిసరి రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విభాగాలు ఏటా చేసే కొనుగోళ్లలో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ యూనిట్ల నుంచే ఉండాలంటూ జీవోను జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలు మూతపడకుండా చేయూతనిచ్చే విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. అయినా.. కొన్ని ప్రభుత్వ విభాగాలు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నట్టు ప్రభుత్వ దృష్టికి రావడంతో రాష్ట్ర ఎంఎస్ఎంఈలను కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తే అటువంటి బిల్లులకు ఆమోదం తెలపవద్దంటూ ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు చాలా ప్రోత్సాహం లభిస్తుందని ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ సెక్షన్ అధికారి
సాక్షి, అమరావతి/నగరంపాలెం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ(సంక్షేమ విభాగం–2) సెక్షన్ అధికారి ఒంటెద్దు నాగభూషణ్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు నగరం కొరిటెపాడులోని గౌతమినగర్ 4వ వీధికి చెందిన ఒంటెద్దు నాగభూషణరెడ్డి వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ భవనం–2 (సంక్షేమం–2)లో సెక్షన్ అధికారిగా ఉన్నారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకానికి కర్నూలులోని బాలాజీనగర్‌కు చెందిన మహమ్మద్ నదీమ్ హుస్సేన్ తన కుమారుడు అజంతుల్లా షరీఫ్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో అజంతుల్లా షరీఫ్‌కు సుమారు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన ఉపకార వేతనం విడుదల చేసేందుకు సెక్షన్ అధికారి నాగభూషణరెడ్డి దరఖాస్తుదారు మహమ్మద్ నదీమ్ హుస్సేన్‌ను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కర్నూలు జిల్లాలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. వారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదును బదలాయించారు. ఈ క్రమంలో మహమ్మద్ నదీమ్ హుస్సేన్ శుక్రవారం ఉదయం 10.10 గంటలకు నాగభూషణరెడ్డికి సచివాలయ ఆవరణలోని పార్కింగ్ ప్రదేశంలో రూ.40 వేలు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్యాంట్ జేబులోని డబ్బులను స్వా«దీనం చేసుకున్నారు. నాగభూషణ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు తొలుత రూ.10 వేలు ఫోన్ పే చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర మత్తే, అధికారులు పాల్గొన్నారు. -
Telangana: మనకొచ్చేది ఎంత?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల, ఎఫ్ఆర్బీఎం పరిమితి, అమల్లోకి రాని నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాల సిఫారసుల విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదాతోపాటు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం ఈ ఏడాదైనా సానుకూలంగా స్పందిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అప్పులపై పరిమితులు, గ్రాంట్ల బకాయిలు, పన్నుల్లో వాటాల తగ్గింపు, సిఫారసులు అమలుకాని కారణంగా రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వివిధ అంచనాల్లో ఆర్థికశాఖ.. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎలా ఉంటుందోనని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడమే కాకుండా అప్పులు తెచ్చుకునే పరిమితుల కారణంగా రాష్ట్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లకుపైగా లోటు వచి్చందని.. ప్రత్యేక గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాది దాదాపు రూ.30వేల కోట్ల వరకు నష్టపోయామని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కార్పొరేషన్లకు పూచీకత్తు ఇచ్చి తీసుకునే రుణాలను రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురాకుండా వెసులుబాటు కల్పి స్తుందా? పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు ఎంత ప్రతిపాదిస్తుంది? కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో నిర్మలా సీతారామన్ పెద్ద మనసు చూపుతారా? ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, ఉపాధి హామీ, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, మహిళాశిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా’అన్న కేంద్ర బడ్జెట్లో తేలిపోనుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మేరకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర నష్టాలు ►పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రెవెన్యూ నష్టం: రూ.33,712 కోట్లు ►నీతి ఆయోగ్ మిషన్ భగీరథ సిఫారసులు: రూ.19,205 కోట్లు ►నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ సిఫారసులు: రూ.5 వేల కోట్లు ►ఏపీ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్ బకాయిలు: రూ.17,828 కోట్లు ►ఎఫ్ఆర్బీఎం పరిమితుల కారణంగా 2022–23లో అప్పుల నష్టం: రూ.15,303 కోట్లు ►ఆంక్షలు అమలు చేయలేదంటూ జీఎస్డీపీలో 5 శాతం రుణ పరిమితితో నష్టం: రూ.6,104 కోట్లు ►15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లు: రూ.5,374 కోట్లు ►వెనుకబడిన జిల్లాలకు నిధుల బకాయిలు: రూ.1,350 కోట్లు ►14వ ఆర్థిక సంఘం సిఫారసుల బకాయిలు: రూ.817 కోట్లు ►15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక నిధులు: రూ.723 కోట్లు ►ఏపీకి పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్ పథకాల నిధులు: రూ.495 కోట్లు ►2020–21లో పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు: రూ.171 కోట్లు -
మరో రూ.1,000 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం సమకూర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా తీసుకున్న ఈ అప్పును 21, 22 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించనుంది. మంగళవారం ఈ వేలం జరిగింది. రూ.1,000 కోట్లతో ఈ ఏడాది అప్పుల మొత్తం రూ.27,500 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.47,500 కోట్లు రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏడాది మధ్యలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన మేరకు ఆ రుణం రూ.39 వేల కోట్లకు తగ్గింది. ఇప్పటికి రూ.27వేల కోట్లకు పైగా రుణాలు సమకూరిన నేపథ్యంలో మిగిలిన సుమారు రూ.12 వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. డిసెంబర్లో మిగతా రుణాలు..! కాగ్ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి తగ్గట్టుగానే ప్రతి నెలా ఖర్చులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తలపెట్టిన పలు కార్యక్రమాల అమలుకు అదనపు నిధులు అవసరమవుతున్నాయి. వచ్చే నెలలో ఇవ్వాల్సిన రైతుబంధుతో పాటు దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్ల లాంటి కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు అవసరం కానున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబర్లోనే తమకు మిగిలిన రుణాలు సమకూర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆర్థిక శాఖ వర్గాలు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఆర్బీఐ అనుమతినిస్తే వచ్చే నెలలోనే ఆ మేరకు రుణాలు తీసుకునే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. తమపై కక్ష సాధింపులో భాగంగా ఇప్పటికే రుణాల్లో కోత విధించారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థికశాఖ పెట్టిన ఈ ప్రతిపాదన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే. -
ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల.. అప్పుల్లో.. అడుగునే
సాక్షి, అమరావతి: ఒకసారి శ్రీలంకతో పోలుస్తూ.. మరోసారి రూ.పది లక్షల కోట్లంటూ రాష్ట్ర అప్పులపై తమకు నచ్చినట్లు పుంఖాను పుంఖాలుగా ఓ వర్గం మీడియా ప్రచురిస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆర్బీఐ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. 2021–22 ఆర్థిక ఏడాది మార్చి నాటికి వివిధ రాష్ట్రాల అప్పులపై ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇన్స్టిట్యూషన్లతో పాటు స్టేట్ డెవలప్మెంట్ రుణాలు (మార్కెట్ బారోయింగ్), విద్యుత్ బాండ్లు, నాబార్డు, ఇతర బాండ్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కేంద్రం నుంచి రుణాలు, అడ్వాన్స్‌లు, నేషనల్ సెక్యూరిటీ ఫండ్, నేషనల్ కో–ఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్స్ ద్వారా తీసుకున్న మొత్తం రుణాలను రాష్ట్రాల వారీగా ఆర్బీఐ వెల్లడించింది. అన్ని రకాల రుణాలు కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి రూ.3,98,903 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2019 మార్చి నెలాఖరు నాటికి అంటే చంద్రబాబు పాలన చివరి దశలో రాష్ట్రం అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు సర్కారు ఏప్రిల్ 4వతేదీన ఒకేసారి రూ.4,000 కోట్లు, మే 2వ తేదీన రూ.500 కోట్లు, మే 7వతేదీన 500 కోట్లు, మే 14వ తేదీన రూ.1,000 కోట్లు అప్పులు చేసింది. దీంతో మరో రూ.ఆరు వేల కోట్ల మేర చంద్రబాబు సర్కారు అప్పు చేసినట్లైంది. దీంతో చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ.2,70,451 కోట్లకు చేరుకున్నాయి. ఇంతకంటే ప్రామాణికం ఇంకేముంది? అప్పులపై ఆర్బీఐ నివేదిక కంటే ప్రామాణికం ఏదీ ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ ఓ వర్గం మీడియా బురద చల్లుతోందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అప్పులు ఎన్ని ఉన్నాయో ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా చెప్పినందున ఇకనైనా తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆర్థిక శాఖ వర్గాలు సూచిస్తున్నాయి. ఆ రెండు పత్రికలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్నాయని పేర్కొంటున్నాయి. నిపుణుల పేరుతో ఓ వర్గం మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పుల వివరాలను ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ పత్రంలో స్పష్టంగా పేర్కొన్నప్పటి ఆ పత్రికలు పట్టించుకోకుండా కథనాలు అల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏడు రాష్ట్రాల తరువాతే ఏపీ.. దేశంలో ఏడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే అధికంగా అప్పులు చేశాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రానికి అప్పులున్నాయని తెలిపింది, అత్యధిక అప్పుల్లో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో మహారాష్ట్ర, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్, ఐదో స్థానంలో రాజస్థాన్, ఆరో స్థానంలో కర్నాటక, ఏడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలున్నాయి. ఆ తరువాత.. అంటే 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. -
మరో 2,440 సర్కారీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: విద్య, పురావస్తు శాఖల్లో మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ విద్య, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత విభాగాలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ విద్యలో.. అరబిక్–02, వృక్షశాస్త్రం–113, వృక్షశాస్త్రం (ఉర్దూ)–15, రసాయన శాస్త్రం–113, కెమిస్ట్రీ (ఉర్దూ)–19, పౌరశాస్త్రం–56, పౌరశాస్త్రం (ఉర్దూ)–16, సివిక్స్ (మల్టీమీడియం)–1, కామర్స్–50, కామర్స్ (ఉర్దూ)–7, ఎకనామిక్స్–81, ఎకనామిక్స్ (ఉర్దూ)–15, ఇంగ్లిష్–153, ఫ్రెంచ్–2, హిందీ–117, హిస్టరీ–60, హిస్టరీ (ఉర్దూ)–12, హిస్టరీ/సివిక్స్–17, హిస్టరీ/సివిక్స్ (ఉర్దూ)–5, హిస్టరీ/సివిక్స్ (మల్టీమీడియం)–1, గణితం–154, గణితం (ఉర్దూ)–09, భౌతికశాస్త్రం–112, భౌతికశాస్త్రం (ఉర్దూ)–18, సంస్కృతం–10, తెలుగు–60, ఉర్దూ–28, జంతుశాస్త్రం–128 జంతుశాస్త్రం (ఉర్దూ)–18 కలిపి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు. మరో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక విద్యలో 359 పోస్టులు.. సాంకేతిక విద్యలో 359 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్–4, ఆటోమొబైల్ ఇంజనీరింగ్–15, బయోమెడికల్ ఇంజనీరింగ్–3, కెమికల్ ఇంజనీరింగ్–1, కెమిస్ట్రీ–8, సివిల్ ఇంజనీరింగ్–82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్–24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్–41, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–1, ఫుట్‌వేర్ టెక్నాలజీ–5, జియోలజీ–1, లెటర్ ప్రెస్–5, మెకానికల్ ఇంజనీరింగ్ 36, మెటలర్జీ–5, ప్యాకింగ్ టెక్నాలజీ–3, ఫార్మసీ–4, ఫిజిక్స్–5, ట్యానరీ–3, టెక్స్టైల్ టెక్నాలజీ–1 పోస్టులు కలిపి 247 పోస్టుల్ని లెక్చరర్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇవికాక జూనియర్ ఇన్స్ట్రక్టర్–14, లైబ్రేరియన్–31, మ్యాట్రన్–5, ఫిజికల్ డైరెక్టర్–37, ఎలక్టీష్రియన్–25 పోస్టుల్నీ భర్తీ చేస్తారు. ఉన్నత విద్యలో.. కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్ విభాగంలో ఇంగ్లిష్–23, తెలుగు–27, ఉర్దూ–2, సంస్కృతం–5, స్టాటిస్టిక్స్–23, మెక్రోబయోలజీ–5, బయోటెక్నాలజీ–9 అప్లయ్డ్ న్యూట్రిషియన్–5, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్–39, కామర్స్–బిజినెస్ అనలటిక్స్(స్పెషలైజేషన్)–8, డెయిరీ సైన్స్–8, క్రాప్ ప్రొడక్షన్–4, డేటా సైన్స్–12, ఫిషరీస్–3, కామర్స్–ఫారిన్ ట్రేడ్ (స్పెషలైజేషన్)–1, ఆర్కివ్స్, డిస్ట్రిక్ట్ గెజిటర్స్ విభాగంలో 6 రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవికాక లైబ్రేరియన్–24, ఫిజికల్ డైరెక్టర్–29 పోస్టులున్నాయి. పాలనాపరమైన అనుమతి లభించడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఆర్కివ్స్‌లో 8 పోస్టులు.. డైరెక్టర్ స్టేట్ ఆర్కివ్స్ విభాగంలో 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ లైబ్రేరియన్–1, జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్(ఉర్వూ, పర్షియన్)–1, రిసెర్చ్ అసిస్టెంట్–1, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ (ఉర్దూ, పర్షియన్)–1 పోస్టులున్నాయి. -
50 వేల ఉద్యోగాల భర్తీపై.. నేడే కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై.. గతంలో ఇచ్చిన ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. ఈనెల 13న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో, 12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై నివేదికలు ఇవ్వనున్నారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా.. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే ఈ కసరత్తు జరిగినా.. కోవిడ్ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవలే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుంటోంది. -
ఆర్థిక క్రమశిక్షణ వైపే అడుగులు
సాక్షి, అమరావతి: ఆర్థిక నిర్వహణలో మరింత పొదుపు పాటించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో) నిర్ణయించింది. చౌక విద్యుత్ కొనుగోళ్లు, వృధా వ్యయాన్ని తగ్గించడంపైనే రాబోయే కాలంలో దృష్టి పెట్టాలని తీర్మానించింది. ఏపీ ట్రాన్స్‌కో బోర్డు సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వృధాను అరికట్టడంలో గత ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయమైందని, ముందస్తు వ్యూహంతో చౌక విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రూ.700 కోట్లు మిగిల్చినట్టు పేర్కొన్నారు. ► తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, యూపీ వంటి రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఈ విషయౖ మె ఆయా రాష్ట్రాలు సంప్రదించినట్టు వివరించారు. ► గడచిన ఏడాదిలోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.4,783.23 కోట్లు ఆదా చేయగలిగాయని శ్రీకాంత్ ప్రస్తావించారు. 2018–19లో రూ. 48,110.79 కోట్లున్న విద్యుత్ సంస్థల వ్యయాన్ని 2019–20 నాటికి రూ.43,437.56 కోట్లకు తగ్గించినట్టు తెలిపారు. ► విద్యుత్ కొనుగోలుకు ముందే ప్రణాళిక రూపొందించడం వల్ల యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80 మధ్యే లభించిందని, ఇది విద్యుత్ సంస్థల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిందని సమావేశం అభిప్రాయపడింది. ► విద్యుత్ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును బోర్డు ప్రశంసించింది. గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సబ్సిడీలకు ఈ ఏడాది రూ.11,311.70 కోట్లు విడుదల చేయడం, రూ.8,353.58 కోట్లు వ్యవసాయ సబ్సిడీ ఇవ్వడంపై ట్రాన్స్‌కో బోర్డు హర్షం వ్యక్తం చేసింది. ► విద్యుత్ సంస్థల ఆర్థిక నిర్వహణ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును బోర్డు ప్రత్యేకంగా అభినందించింది. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ గుర్తు చేశారు. -
కోవిడ్–19 నియంత్రణకు రూ.374 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ 19 నియంత్రణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా వివిధ పద్దులు కింద అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి టీఆర్ 27, గ్రీన్ ఛానెల్ పీడీ ఖాతాలు, జిల్లా మినరల్ ఫండ్ కింద మొత్తం రూ.373.76 కోట్లు అందుబాటులో ఉంచినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిధులను.. క్వారంటైన్లో ఉన్నవారికి తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణకు,స్క్రీనింగ్, కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించడానికి, కోవిడ్ 19 నియంత్రణ, చికిత్సలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు, కోవిడ్ నియంత్రణలో భాగంగా సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య, పురపాలక, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి సంక్షేమానికి చర్యలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి చెందినవారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కోవిడ్–19 నియంత్రణ చర్యల రాష్ట్ర స్థాయి సమన్వయాధికారి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. లాక్డౌన్ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై త్వరలో ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌పై ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నదానిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నేతృత్వంలో టాస్క్ఫోర్సు కమిటీ పనిచేస్తోందన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబులతో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 53 వేల మంది కూలీలకు రాష్ట్ర వ్యాప్తంగా 326 షెల్టర్లు ఏర్పాటు చేసి ఆహార వసతి కల్పించాం. ► పరిశ్రమల్లో పనిచేస్తున్న మరో 50 వేల మంది కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు మరో 208 షెల్టర్లు ఏర్పాటు చేశాయి. ► పది రాష్ట్రాల్లో చిక్కుకున్న 8 వేల మంది ఏపీకి చెందిన వారి క్షేమం కోసం చర్యలు. -
డబ్బు.. జాగ్రత్త!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో 2020–21 ఆర్ధిక ఏడాదికి సంబంధించి మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులను జాగ్రత్తగా వ్యయం చేయాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. అనవసర రంగాలకు కాకుండా చాలా జాగ్రత్తగా అవసరమైన రంగాలకు మాత్రమే నిధులను వ్యయం చేయాలని పేర్కొంది. కేటాయింపులకు మించి పైసా కూడా శాఖలు వ్యయం చేయరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులను సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆయా శాఖలకు పంపిణీ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించినందున రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో శాఖాధిపతులు, డీడీవోలు గ్రాంట్లను స్తంభింప చేయకుండా ఆ నిధులను ఖజానాకు సరెండర్ చేయాలి. ► పలుశాఖలు, రంగాలకు మూడు నెలలకు అనుమతించిన మేరకే వ్యయం చేయాలి. అంతకు మించి వ్యయం చేయకూడదు. ► సంబంధిత పనులకు నిధులుంటేనే శాఖాధిపతులు బిల్లులను ప్రాసెస్ చేయాలి. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండా శిక్షణ (వైద్యం మినహా), ఫర్నీచర్ కొనుగోళ్లు, ప్రకటనల జారీ లాంటివి చేయకూడదు. ఇన్స్టిట్యూషన్లకు ఎటువంటి గ్రాంట్లను మంజూరు చేయకూడదు. ► కేంద్ర సహాయ, రాష్ట్ర అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత ఏజెన్సీ నుంచి నిధులు వచ్చిన తరువాత రాష్ట్ర వాటా నిధులను ఇవ్వాలి. ► ఓటాన్ అకౌంట్ మూడు నెలల బడ్జెట్లో కొత్త పథకాలకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చిన తరువాతే నిధులు విడుదల చేయాలి. ► వేతనాలు, పెన్షన్లు, సహాయ పునరావాసం తదితర అత్యవసర రంగాలకు బడ్జెట్ కంట్రోల్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులో పేర్కొంది. -
సాగు నీరు..రుణాల జోరు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు ఆశించిన మాదిరి లేకున్నా ఉపశమనం కలిగించేలా ఉంది. 2020–21 వార్షిక బడ్జెట్లో సాగునీటి రంగానికి మొత్తంగా రూ. 11,053.55 కోట్లు కేటాయించగా అందులో నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 3,606.58 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధులకన్నారూ. 2,577.38 కోట్లు మేర కేటాయింపులు పెంచింది. గతంకన్నా భిన్నంగా ప్రాజెక్టుల పంపుల నిర్వహణ భారీగా ఉండనుండటంతో దానికింద నిర్వహణ పద్దు నిధులను పెంచారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల ప్రాజెక్టులకు అధిక కేటా యింపులు చేశారు. అయినప్పటికీ ఈ నిధులతో ప్రాజెక్టులు పూర్తికాకుంటే ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాల ద్వారానే వాటిని పూర్తి చేయనున్నారు. అడిగింది కొండంత.. ఇచ్చింది కొంతే.. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన కేటాయింపుల నేపథ్యంలో గతేడాది సాగునీటికి కేవలం రూ. 8,476.17 కోట్లే కేటాయించారు. ఈ ఏడాది కూడా మాంద్యం పరిస్థితులున్నా గతేడాదికన్నా రూ. 2,57 7,38 కోట్ల మేర పెంచి మొత్తంగా రూ.11,0 53.55 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం రూ. 21 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖకు సాగునీటిశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో కాళేశ్వరానికి రాష్ట్ర బడ్జెట్కింద రూ. 7 వేల కోట్లు కోరింది. కానీ ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ. 805.47 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు కు రూ. 3,500 కోట్లు, దేవాదులకు రూ. 500 కోట్లు, తుపాకులగూడేనికి రూ. 500 కోట్లు కేటాయించాలన్న సాగునీటిశాఖ విజ్ఞప్తిని సర్కా రు పెద్దగా పట్టించుకోలేదు. పాలమూరుకు రూ. 368.58 కోట్లు, దేవాదులకు రూ. 292.38 కోట్లు, తుపాకులగూడేనికి రూ.73.83 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా,నెట్టెంపాడు,కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,200 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు రూ. 50 కోట్లకే పరిమితమయ్యాయి. బకాయిలూ భారీగానే... సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భారీగానే పెండింగ్ బకాయిలున్నాయి. రూ. 11,965.23 కోట్ల బకాయిలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ప్రధాన పనులకు సంబంధిం చి బకాయిలు రూ. 5,550 కోట్లు ఉండగా రుణాల కోసం కార్పొరేషన్లకు మార్జిన్ మనీ కింద ఇవ్వాల్సినవి రూ. 1,695 కోట్లు, భూసేకరణ బకాయిలు రూ. 1,585 కోట్లు, విద్యుత్ బకాయిలు రూ. 3,072 కోట్ల మేర ఉన్నాయి. పాలమూరు పరిధిలో రూ. వెయ్యి కోట్లు, కాళేశ్వరం పరిధిలో రూ. 1,500 కోట్లు, ఎల్లంపల్లిలో రూ. 350 కోట్ల మేర ఉన్నాయి. ఇక ఈ ఏడాది మైనర్ ఇరిగేషన్‌కు కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే రూ. 42 కోట్లు తగ్గించి రూ. 602.45 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ. 402 కోట్లు కేటాయించారు. అయితే దీని బకాయిలే రూ. 550 కోట్ల మేర ఉన్నాయి. ఆదుకునేది అప్పులే ప్రధాన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్, రబీ నాటికి భారీ ఆయకట్టు లక్ష్యాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటితో 360 టీఎంసీలను ఎత్తిపోయా లని ప్రణాళిక వేశారు. దీంతోపాటే సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా దేవాదులలో 100% పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రాష్ట్ర నిధులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ. 61,500 కోట్ల రుణ సేకరణ చేపట్టగా అందులో రూ. 38 వేల కోట్ల రుణాల ద్వారానే ఖర్చు జరిగింది. ఇక సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 17 వేల కోట్ల రుణ సమీకరణ చేయగా అందులో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019–20 వార్షిక బడ్జెట్ నిధుల ద్వారా రూ. 8 వేల కోట్లు ఖర్చు జరగ్గా రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ. 14 వేల కోట్లుగా ఉంది. ఈ ఏడాది సైతం రూ. 20 వేల కోట్ల రుణాల ద్వారా ఖర్చు చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. అందులో కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ. 13 వేల నుంచి రూ. 15 వేల కోట్లు ఖర్చు జరిగే అవకాశం ఉండగా మిగతా ప్రాజెక్టులకు మరో రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. డబుల్ రోడ్లకు బ్యాంకు రుణాలే దిక్కు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నిర్మించే డబుల్ రోడ్లకు ఈసారి బ్యాంకు రుణాలే ఆధారం కానున్నాయి. ఈ రోడ్లకు ప్రణాళికలు రూపొందించిన కొత్తలో విరివిగా నిధులు అందగా, గత రెండు మూడేళ్లుగా చాలినన్ని విడుదల కావడం లేదు. ఈసారి కూడా బడ్జెట్ కేటాయింపులు దాదాపు అలాగే ఉన్నాయి. డబుల్ రోడ్లకు తాజా బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించగా.. అందులో ప్రగతి పద్దు కింద రూ.655 కోట్లు చూపారు. గత బడ్జెట్లో దీనికి కేవలం రూ.187 కోట్లు కేటాయించారు. అంతకు ముందు బడ్జెట్లో అది రూ.460 కోట్లుగా చూపారు. 2017–18లో రూ.2,500 కోట్లు వచ్చాయి. ఆ సంవత్సరం పనులు ఊపుగా జరిగాయి. ఆ తర్వాత నుంచి నిధులు తక్కువగా రావడంతో కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో బిల్లులు పేరుకుపోయాయి. ఇటీవల బ్యాంకు లోన్ ద్వారా ఆ బకాయిలు తీర్చారు. ఇప్పుడు కూడా చాలినన్ని నిధులు వచ్చే అవకాశం లేనందున మళ్లీ బ్యాంకు రుణంపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రంలో 65% పనులు పూర్తయ్యాయి. మరో 35% పనులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు.. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నగరంలో పోలీసు కమాం డ్ కంట్రోల్ భవనం తదితరాల కోసం రూ.550 కోట్లు కేటాయించారు. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు కేటాయించారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. బియ్యం సబ్సిడీకి రూ.2,362 కోట్లు రాష్ట్రంలో ప్రజా పంపి ణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం బడ్జెట్లో రూ.2,362 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బి య్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధి్ధదారులకు సబ్సిడీ బియ్యం సరఫరాకు వీలుగా ఈ నిధుల కేటాయింపు జరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.7 కోట్లు అదనంగా కేటాయించారు. -
మాంద్యాన్ని అధిగమించి.. జాతీయ సగటు మించి...
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యంతో ప్రపంచ, జాతీయ వృద్ధి రేటు భారీగా పతనమైన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వృద్ధి రేటు చెక్కు చెదరకుండా దృఢంగా నిలబడింది. 2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.4 శాతానికి పతనమైందని, ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యల్పమని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అవకాశాల నివేదిక పేర్కొంటోంది. 2019–20లో జాతీయ వృద్ధిరేటు సైతం 5 శాతానికి పడిపోనుందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు కానుందని అంచనా. అయితే, గత కొన్నేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు గణాంకాలతో పోలిస్తే ఈసారి కొంతమేర తగ్గుదల కనిపిస్తోంది. అయినా జాతీయ వృద్ధిరేటు సగటును మించిన వృద్ధి రేటును రాష్ట్రం సాధించనుంది. ఇలా అధిగమించడం 2015–16 నుంచి ఇది వరుసగా ఐదోసారి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. 2018–19లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.8.61 లక్షల కోట్లతో 14.3 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా, 2019–20 నాటికి రూ.9.7 లక్షల కోట్లకు పెరిగి 12.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. 2018–19లో స్థిర ధరల వద్ద 6.13 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2019–20లో 8.2 శాతం వృద్ధి రేటుతో రూ.6.63 లక్షల కోట్లకు పెరగనుందని అంచనా. ప్రథమ, తృతీయ రంగాల హవా.. రంగాల వారీగా పరిశీలిస్తే.. 15.8 శాతం వృద్ధి రేటుతో ప్రాథమిక, 14.1 శాతం వృద్ధి రేటుతో తృతీయ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడుతున్నాయి. ద్వితీయ రంగం 5.3 శాతం వృద్ధి రేటును సాధించింది. ప్రాథమిక రంగం పరిధిలోని వ్యవసాయం, పశు, అటవీ, మత్స్య పరిశ్రమలు, మైనింగ్, క్వారీయింగ్, ద్వితీయ రంగం పరిధిలో తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర పౌరసేవలు, నిర్మాణ రంగ పరిశ్రమలు, తృతీయ రంగం పరిధిలో వాణిజ్య, రిపేర్ సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, స్టోరేజీ, ప్రసార సేవలు, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, నివాస గృహాల యాజమాన్య హక్కులు, వృత్తి సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు వస్తాయి. మొత్తానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి 65.2 శాతం చేయూత (గ్రాస్ వాల్యూ యాడెడ్/ జీవీఏ) తృతీయ రంగమే అందిస్తోంది. జాతీయ సగటు కన్నా అధిక తలసరి ఆదాయాన్ని రాష్ట్రం నిలబెట్టుకుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయ తలసరి ఆదాయం సగటు వృద్ధి రేటు 6.3 శాతం కాగా, రాష్ట్రం 11.6 శాతాన్ని సాధించింది. చివరగా, జాతీయ స్థాయిలో 8.08 ద్రవ్యోల్బణం నమోదు కాగా, రాష్ట్రంలో సైతం 7.46 నమోదైంది. పారిశ్రామిక కార్మికుల కోసం రూపొంచిన వినియోగదారుడి ధరల సూచిక (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. చర్యలు సఫలీకృతం.. వ్యవసాయం, పశుపోషణ, విద్యుత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. జాతీయ సగటుకు మించిన వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలని ప్రభుత్వం విశ్లేషిస్తోంది. 32 అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ధి తెలంగాణకు హరితహారంలో భాగంగా 2019లో మొత్తం 38.18 కోట్ల మొక్కలు నాటగా, వాటిలో 31.79 కోట్ల మేర జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఫారెస్ట్రీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు, ఇతర జిల్లాల్లో కలిపి 32 అర్బన్ ఫారెస్ట్ పార్కులు పూర్తి చేశారు. మరో 46 ప్రాంతాల్లో ఈ పార్కుల ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణలోని వివిధ అడవుల పరిధిలోని జీవవైవిధ్యం కాపాడేందుకు 12 రక్షిత ప్రాంతాల పరిధిలోని 9 వన్యప్రాణి అభయారణ్యాలను, 3 జాతీయపార్కులను (జాతీయపార్కుల వరకు 5,692.48 చదరపు కి.మీ) నెట్‌వర్క్‌ను ప్రకటించింది. తెలంగాణలో 2,939 చెట్ల రకాలు, 365 పక్షుల జాతులు, 103 క్షీరదాలు, 28 రకాల సరీసృపాలున్నాయి. రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,969.48 లక్షల చ.కి.మీ.గా విస్తరించి ఉంది. మొత్తం అటవీ విస్తీర్ణంలో మూడో వంతు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోఉండగా, నాలుగు జిల్లాల్లో అంటే ఈ రెండు జిల్లాలతో సహా నాగర్‌కర్నూల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 50 శాతం అటవీ ప్రాంతముంది. మొత్తం కలిపి రాష్ట్రంలోని అటవీప్రాంతమున్న 24 శాతం అటవీ శాఖ నిర్వహణ పరిధిలో ఉన్నా దాదాపు 15 శాతంలో మాత్రమే గణనీయమైన పచ్చదనం, అడవులున్నాయి. 2020–21 సంవత్సరానికి సంబంధించి హరితహారంలో 68 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 1994 నుంచే అటవీ శాఖ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ల సాంకేతికను వినియోగిస్తోంది. రిమోట్ సెన్సింట్ శాటిలైట్ ఇమేజరీ సాంకేతికను ఉపయోగించి అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. ఎకో టూరిజంలో భాగంగా బొగతా, కుంతాల, పొథెరా, మల్లెలతీర్థం జలపాతాలు, అనంతగిరి హిల్స్, మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, లక్నవరం చెరువు, మల్లారం ఫారెస్ట్, పాకాల చెరువు, టైగర్ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తోంది. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్‌హౌస్ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్‌లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌హౌస్ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. -
పన్నుల వాటాలో ‘మొండిచేయే’!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రావడం లేదు. ఈ ఏడాది కేంద్ర పన్నుల వాటా కింద రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనాలో రాష్ట్ర ప్రభుత్వం ఉండగా అందులో జనవరి ముగిసే నాటికి 66 శాతమే వచ్చాయి. వాస్తవానికి 2019–20 బడ్జెట్లో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను దాదాపు 18 శాతంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనా ఉండగా చివరి త్రైమాసికం ప్రారంభమయ్యే జనవరి ప్రారంభానికి రూ. 8,449.85 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఇక చివరి త్రైమాసికంలో మిగిలిన రూ. 6 వేల కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉంది. అంటే కనీసం నెలకు రూ. 2 వేల కోట్లయినా పన్నుల వాటా కింద రావాలి. కానీ జనవరిలో కేంద్ర పన్నుల వాటాలో కేవలం రూ. వెయ్యి కోట్లే మంజూరు చేసింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి ఇంకో రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈ రెండు నెలల్లో కేంద్రం నుంచి ఆ స్థాయిలో నిధులు రావడం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
సీఎం రివ్యూకే తప్పుడు సమాచారం..
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమీక్ష కోసం జిల్లా విద్యాశాఖాధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. జాగ్రత్తలు చూసుకోకుండానే తమ జిల్లాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించి తప్పుడు వివరాలు సమర్పించారు. వాస్తవంగా జీతాలు తీసుకుంటున్న టీచర్లు, ఉద్యోగులు, సిబ్బంది కంటే తక్కువ ఉన్నట్లుగా లెక్కలు చూపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి శాఖల వారీగా ఆర్థికశాఖ కేడర్ స్ట్రెన్త్ వివరాలను సేకరించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో డీఈవోల నుంచి విద్యాశాఖకు సంబంధించిన వివరాలను తీసుకుంది. వాటిపై సీఎం సమీక్ష చేయనున్న నేపథ్యంలో ఆ సమాచారా న్ని మరోసారి పరిశీలించింది. అయితే అందులో తప్పుడు సమాచారం ఉన్నట్లు గుర్తించింది. ట్రెజరీల నుంచి వేతనాలు తీసుకుంటున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులు, టీచర్లు, సిబ్బంది కంటే తమ వద్ద ఉన్న వారి సంఖ్యను తక్కువగా ఇచ్చినట్లు తేల్చింది. సీఎం సమీక్ష కోసం సిబ్బంది లెక్కలు అడిగితే తప్పుడు లెక్కలు ఇస్తారా? అని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ఈనెల 2లోగా సరైన లెక్కలు ఇవ్వాలని ఆదేశించింది. కేడర్ స్ట్రెన్త్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను tg.dse.ao@gmail.comకి పంపించాలని డీఈవోలను ఆదేశించారు. -
పన్ను ఎగవేతదారులను పట్టుకోండి: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు. -
3.144 % డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మూల వేతనంపై కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెరిగింది. 2019, జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. వచ్చే డిసెంబర్లో చెల్లించనున్న ప్రస్తుత నవంబర్ వేతనంతో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.డీఏ బకాయిల చెల్లింపు ఇలా..: 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2020, ఫిబ్రవరి 29కి ముందు పదవీ వివరణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 2004, సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్ 2019లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్ ఖాతాలకు అనర్హులైన ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్లో నగదు రూపంలో చెల్లించనుంది. 2015, పీఆర్సీ ఉద్యోగులకు..: 2015, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెంపు వర్తించనుంది. 2010, పీఆర్సీ ఉద్యోగులకు ..: జీవో 36 ఆధారంగా 2010, పీఆర్సీ వేతనాలు అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 112.992 శాతం నుంచి 118.128 శాతానికి పెరిగింది. అదే విధంగా 2010, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం 112.992 శాతం నుంచి 118.128 శాతం డీఏ పెంపు వర్తించనుంది. జీవో నం.171 ప్రకారం.. వేతనం రూ.3850 నుంచి రూ.6700కు పెరిగిన ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులకు సైతం ఇదే పెంపు వర్తిస్తుంది. 2006 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 148 శాతం నుంచి 154 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది.2016 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 9 శాతం నుంచి 12 శాతానికి ప్రభుత్వం పెంచింది. యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్తోపాటుఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఇది వర్తిస్తుంది. వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందు తున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 112.992 శాతం నుంచి 118.128 శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్ట్ టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ.100 వేతనం పెరిగింది. పెన్షనర్ల డీఏపై గురువారం ఉత్తర్వులిచ్చే అవకాశముంది. -
ప్రభుత్వ పథకాల డబ్బు లబ్ధిదారులకే
సాక్షి, అమరావతి: ప్రభుత్వం పలు పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఇస్తున్న డబ్బులు నేరుగా లబ్ధిదారులకు చేరాల్సిందేనని, బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించు కోకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లకు స్పష్టం చేశారు. ఇలా మినహాయించు కోలేని రీతిలో అన్ ఇన్ కంబర్డ్ (నిర్దేశిత) బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి లక్ష్యాలను బ్యాంకర్లకు వివరించారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే విశ్వసనీయత నిలబడుతుందని అన్నారు. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని, ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలని సూచించారు. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని, అందుకు సంబంధించిన రశీదును గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ అందిస్తారని చెప్పారు. సున్నా వడ్డీ కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు ఎంత చెల్లించాలో జాబితా ఇస్తే, ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. గతంలో (గత ప్రభుత్వంలో) కొన్ని చెప్పి వాటిని అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని, ఇప్పుడు అలా కాదని.. తాము చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ముద్ర రుణాల పంపిణీపై దృష్టి సారించాలి ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని, చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ఒక పథకాన్ని అమలు చేస్తుందని, దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని కోరారు. ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వం ముందుకు వస్తుందని, దానిని సానుకూలంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువగా (85 శాతం) ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాలు బాగా పడినందున రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉన్నాయని, రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. సచివాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి రెండు వేల జనాభాకో గ్రామ సచివాలయం త్వరలో ప్రారంభం అవుతుందని, వారి సేవలను బ్యాంకర్లు వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. రైతులు, కౌలు రైతులకు రుణాల పంపిణీలో వీరి సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల షాపు ఉంటుందని, అక్కడే రైతులకు వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. వర్క్‌షాపు ద్వారా వ్యవసాయంలో అత్యుత్తమ విధానాలను రైతులకు తెలియజేస్తామని, ప్రకృతి వ్యవసాయంపై కూడా వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. కరువు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చిరుధాన్యాలను బాగా ప్రోత్సహిస్తామని తెలిపారు. వీరికి రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లకు తగిన రుణ సహాయం చేస్తే, ఔత్సాహిక యువకులు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉందని సీఎం సూచించారు. ఔత్సాహికులకు చేయూత ఇవ్వండి.. ఆర్థిక రంగం మందగమనం సూచనలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఔత్సాహికులు ఎంతో మంది కంపెనీలు పెడుతున్నారని, వారికి బ్యాంకర్లు చేయూత నివ్వాలని కోరారు. బ్యాంకర్లు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సమన్వయం ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు. వైఎస్సార్ నవోదయం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, బ్యాంకర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాలన్నారు. చిన్న మొత్తాలకు ఇంకా భారీ వడ్డీలను వసూలు చేస్తున్నారని, ఐదు వేలు, పది వేలకు కూడా పెద్ద ఎత్తున వడ్డీలు వసూలు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి చిన్న రుణాల విషయంలో సామాన్యులను ఆదుకోవడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని బుగ్గన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పొగాకు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలన్నారు. సీఎం ఆరుతడి పంటలను, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నందున ఆ రైతులకు రుణాలు అందించాలని కోరారు. 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సదుపాయం ప్రతి 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సుదుపాయం ఉండాల్సిందేనని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వర్షాలు బాగా కురుస్తున్నందున వ్యవసాయ రంగం ఊపందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగాలకు ఆశించిన రీతిలో రుణాలు అందుతున్నాయన్నారు. కౌలు రైతుల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ ప్రశంసించారు. దీని వల్ల వ్యవస్థీకృత ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు అందుతాయని అన్నారు. కేవలం పంట రుణాలే కాకుండా ఇతరత్రా రుణాలు కూడా కౌలు రైతులకు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాలనలో సమూల మార్పులు ప్రభుత్వ పరిపాలన దృక్పథంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ అన్నారు. పరిపాలనలో ప్రభుత్వం నిర్మాణాత్మక మార్పులను తీసుకువస్తోందని.. వలంటీర్లు, గ్రామ సచివాలయాల వల్ల క్షేత్ర స్థాయిలో చివరి వరకూ అనుసంధానం ఉంటుందని చెప్పారు. దీన్ని బ్యాంకులు బలంగా వినియోగించుకోవాలన్నారు. సీఎం అనేక వర్గాల వారికి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని, వివిధ పథకాల లబ్ధిదారులు, వారి బ్యాంకు ఖాతాలను ఎస్ఎల్బీసీకి అందిస్తామని, నేరుగా లబ్ధిదారులకే నగదు అందేలా చూడాలని కోరారు. -
పనులకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: రూ.పది కోట్ల లోపు ఒప్పంద విలువ కలిగి ఇప్పటికే మొదలైన పనులన్నింటినీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులకు బిల్లులు చెల్లించేందుకు కూడా అనుమతిస్తూ ఆర్ధికశాఖ ఇటీవల మెమో జారీ చేసింది. ఈమేరకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించి ఈ ఏడాది మే 29వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మెమో జారీ చేశారు. ఒప్పందం కుదిరి, ప్రారంభం కాని రూ.పది కోట్ల లోపు విలువగల నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) పనులను కూడా కొనసాగించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సహాయ పునరావాస, భూసేకరణ బిల్లుల చెల్లింపునకు కూడా ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో రూ.పది కోట్ల లోపు విలువగల పనులన్నీ ప్రారంభం కానున్నాయి. తాగునీరు, రహదారులు, ఇతర అన్ని రకాల పనులు ఇందులో ఉన్నాయి. ఈ విషయంలో అన్ని శాఖలు ద్రవ్యజవాబుదారీ బడ్జెట్ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ సూచించింది. పురోగతి ఆధారంగా నిర్ణయం.. సంబంధిత శాఖలు పనుల పురోగతితోపాటు అగ్రిమెంట్ విలువను పరిగణనలోకి తీసుకుని ఎంత పని పూర్తయిందనే అంశం ఆధారంగా పనులు కొనసాగించడమా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని మెమోలో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 29 నాటికి చేసిన పనుల పురోగతి ఆధారంగా బిల్లుల చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. సహాయ పునరావాస ప్యాకేజీ, భూసేకరణ విషయంలో బిల్లుల చెల్లింపునకు మిన హాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమీక్షించనున్న మంత్రులు.. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నాటికి విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహా మిగిలిన పనులు మంజూరై ఉంటే ప్రారంభించని వాటిని రద్దు చేయాలని మెమోలో పేర్కొన్నారు. రూ.పది కోట్లకుపైగా విలువగల విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో మంజూరై ప్రారంభించని పనులపై సంబంధిత శాఖ మంత్రులు సమీక్షించాలి. విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో రూ.పది కోట్లకు పైగా విలువగల పనులు ప్రారంభమై అగ్రిమెంట్ విలువలో 25 శాతం తక్కువ వ్యయం అయిన పనులను కూడా సంబంధిత శాఖల మంత్రులు సమీక్షించాలని ఆర్థిక శాఖ సూచించింది. సమీక్ష సమయంలో అంచనాల వ్యయ ప్రతిపాదనలు సక్రమంగా ఉన్నాయా? సింగిల్ బిడ్లు ఏమైనా దాఖలయ్యాయా? అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ కోట్ చేశారా? టెండర్లతో నిమిత్తం లేకుండా పనులేమైనా ఇచ్చారా? అనే అంశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పనుల అవసరం ఉందా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అనంతరం అనుమతి కోసం ఆర్థికశాఖ మంత్రికి పంపాలని మెమోలో సూచించారు. -
మాంద్యంలోనూ సం'క్షేమమే'
చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మనకంటే మరింత అధ్వానంగా ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కర్ణాటక, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల వృద్ధి మైనస్‌లోకి వెళ్లగా తెలంగాణ పరిస్థితి కొంత నయంగా ఉంది. స్థిరమైన ఆర్థిక ప్రగతి, ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పరపతితో ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకోగలుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి, కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరి çస్తున్నాం. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆర్థిక సంస్థలు, మూలధన వాటాను కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యథాతథంగా కొనసాగుతుంది. సాక్షి, హైదరాబాద్: ‘‘ఏడాదిన్నరగా ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 5%గా నమోదై కనిష్ట స్థాయికి చేరుకుంది. రాష్ట్రంపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. జీఎస్టీ పరిహారం అవసరం లేదనుకున్న తెలంగాణ కూడా తప్పనిసరి పరిస్థితిలో కేంద్రం నుంచి దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్థిక వృద్ధి తీవ్రంగా దిగజారుతున్న ఇలాంటి పరిస్థితిలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి రావడానికి చింతిస్తున్నా. అయినా గుడ్డిలో మెల్లలా మనం చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. ఇంతటి తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్నా అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి, ప్రజాసంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించాం. పేదలు, రైతుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలన్న చిత్తశుద్ధిని మరోసారి ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. పూర్తి ఆశావహ దృక్పథంతో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల హామీలను నెరవేరుస్తూ 2019–20 బడ్జెట్‌ను రూపొందించాం. అన్ని రంగాల్లో శీఘ్రగతి అభివృద్ధి సాధించే దిశలో ఈ బడ్జెట్ దోహదపడుతుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది’’అని ’సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం 2019–20 ఆర్థిక ఏడాదికిగాను మిగిలిన కాలానికి రూ. 1,46,492.3 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి పద్దు మొత్తాన్ని భారీగా కుదించడానికి మాంద్యం ప్రభావమే కారణమంటూ సీఎం సోదాహరణం గా వివరించారు. సీఎం బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దేశంలోనే అగ్రగామిగా నిలిచాం.. అవతరించిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆకర్షించాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన మొద టి ఏడాది నెలకు రూ. 6,247 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితి. ఐదేళ్ల తర్వాత నెలకు రూ. 11,305 కోట్లు ఖర్చుపెట్టే స్థాయికి చేరింది. 2014కు ముందు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) సగటు వృద్ధిరేటు కేవలం 4.2%. 2018–19లో రెండున్నర రెట్లకుపైగా పెరిగి 10.5% నమోదైంది. మూలధన వ్యయంలో అట్టడుగున ఉండే తెలంగాణ, నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఐదేళ్లలో 11.2%నుంచి గత ఆర్థిక ఏడాదిలో 16.9 శాతానికి చేరుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం రూ. 1,65,167 కోట్లు. అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతి ఫలితంగా గత ఐదేళ్లలో రాష్ట్రం 21.49% సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఈ గణాంకాలన్నీ కాగ్ నిర్ధారించి అధికారికంగా ప్రకటించినవే. ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం.. ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. 2018–19 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8% నమోదైనా మూడో త్రైమాసికానికి 6.6 శాతానికి, చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ట వృద్ధిని నమోదు చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యు ఫాక్చరర్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33% తగ్గింది. వాహన విక్రయాలు 10.65% క్షీణించాయి. ఫలితంగా ప్రముఖ కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి వ్యాట్ తగ్గిపోయింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. గతేడాది విమాన ప్రయాణికుల వృద్ధి 11.6% ఉంటే ఈ ఏడాది మెనస్ 0.3 % నమోదైంది. సరుకు రవాణా వృద్ధి ఏకంగా 10.6% తగ్గింది. రైల్వే గూడ్సు వ్యాగన్ల బుకింగుల వృద్ధిరేటు 4.1% నుంచి 1.6 శాతానికి పడిపోయింది. చాలా పరిశ్రమలు మూతపడడంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి శాతం 10.6 నుంచి మైనస్ 5.1 శాతానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టంగా రూ.72.43కి పడిపోయింది. మాంద్యం వల్ల ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం నుంచి రూ. 175 కోట్లు, జూన్, జూలై నెలల్లో రూ. 700 కోట్లను జీఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవిక దృక్పథంతోనే బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థికశాఖ తీవ్ర మేథోమధనం చేసి అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి నిర్ధారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో 2019–20 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే 2019–20 తొలి త్రైమాసికంలో 1.36% మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలో 15 % ఆదాయాభివృద్ధిని ఆశిస్తే కేవలం 5.46 శాతమే సాధ్యమైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం వాణిజ్య పన్నుల విభాగంలో 13.6% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఆర్థిక ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 6.61 శాతమే సాధించగలిగింది. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 2.59 శాతమే వృద్ధిరేటు సాధ్యమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది వరకు 19.8% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి 4 నెలలు 17.5 శాతమే వృద్ధిరేటు నమోదైంది. మోటార్ వాహనాల పన్ను రూపంలో ఆదాయం దారుణంగా పడిపోయింది. గత ఐదేళ్లలో 19% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయింది. పన్నేతర ఆదాయం లోనూ గత ఆర్థిక సంవత్సరం వరకు 14.9% నమోదైన సగటు వార్షిక వృద్ధిరేటు... ఈ ఏడాది గడిచిన 4 నెలల్లో మైనస్ 14.16 శాతానికి పడిపోయింది. దీనికితోడు2019–20 ఆర్థిక ఏడాదికి పన్నుల్లో వాటా కింద రాష్ట్రా నికి రావాల్సిన నిధు ల్లో కేంద్రం 4.19% కోత పెట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహకారం.. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఇప్పటివరకు రూ. 20, 925 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాం. ఉదయ్ పథకం ద్వారా డిస్కమ్‌లకు ఉన్న రూ. 9,695 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వమే భరించింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన రూ. 5,772 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ. 42,632 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు.. ఉన్నది ఉన్నట్లు చెప్పేందుకు, వాస్తవాలను జనం ముందు ఉంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం, రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం. ఈ వాస్తవాల ఆధారంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసింది. అన్ని శాఖల్లోనూ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాం. దీనికి అనుగుణంగానే ఆయా శాఖలు ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధులు ఖర్చు చేయాలని మంత్రులు, కార్యదర్శులకు ఆర్థికశాఖ సూచనలు చేసింది. భవిష్యత్తులో అంచనాలు సవరించొచ్చు మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు మనకు ఉంది. కేంద్రం నిధులు అంతంతే.. ప్రభుత్వ పన్నుల ద్వారా రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు అందగా ఈ నిధుల్లో తెలంగాణ వాటాగా మనకు రూ. 31,802 కోట్లు వచ్చాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తెలంగాణకు ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నా ఓ ఏడాది నిధులను కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కోసం గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 5,37,373 కోట్లు ఖర్చు పెడితే అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్రానికి అందిన నిధులు రూ.31,802 కోట్లు మాత్రమే. ఐటీ ఎగుమతుల్లో మేటిగా.. ప్రభుత్వ ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గత ఐదేళ్లలో 6.3% అదనపు వృద్ధితో 2018–19 ఆర్థిక ఏడాది నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు నమోదు చేయగలిగింది. పారిశ్రామిక రంగం అదనంగా 5.4% అదనపు వృద్ధి సాధించి 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8% నమోదు చేసింది. 2014–15లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లయితే 2018–19 నాటికి రూ. 1.10 లక్షల కోట్లకు చేరుకుంది. ‘ఆయుష్మాన్’కన్నా ఆరోగ్యశ్రీ మెరుగు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రజాధనాన్ని వృథా చేయదలచుకోలేదు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ కంటే మనం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైంది, ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు ఖర్చు చేస్తే ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ. 250 కోట్ల విలువైన వైద్య సేవలే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకే మేలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు. ఆయుష్మాన్ భారత్‌కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నోరెట్లు మెరుగైనది కాబట్టి మనం కేంద్ర పథకాన్ని వద్దనుకున్నాం. పట్టణాలు, గ్రామాలకు మంచి రోజులు.. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు సమానంగా నిధులు జమచేస్తాం. ఈ రెండింటినీ కలిపి గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 339 కోట్లను అందించాలని నిర్ణయించాం. ఈ నెల నిధులను ఇప్పటికే గ్రామ పంచాయతీలకు విడుదల చేశాం. ఇదే తరహాలో పట్టణాలకూ నిధుల ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు, పన్నులతోపాటు వివిధ రకాలుగా గ్రామ పంచా యతీలకు సమకూరే ఆదాయం కూడా స్థానిక సంస్థలకు ఉంటుంది. గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. సంక్షోభంలోనూ సాగుకు ఉచిత విద్యుత్.. ఆర్థిక సంక్షోభం ఉన్నా వ్యవసాయానికి ఉచిత కరెంటు యథాతథంగా కొనసాగుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికయ్యే కరెంటు బిల్లుల భారం రైతులపై వేయ కుండా మేమే చెల్లించాలని నిర్ణయించాం. ఎన్నడూ లేనట్లు విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, 6 కిలోల బియ్యం పథకం లాంటి వాటికి నిధుల కొరత రానీయం. రైతుబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపులకు రూ. 1,137 కోట్లు, పంట రుణాల మాఫీకి రూ. 6 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించాం. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో రూ. 9,402 కోట్లను ప్రతిపాదించాం. -
మాటిచ్చామంటే.. నెరవేర్చాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే వాటిని అధిగమించి ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 12వతేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండాలి? ఏ రంగాలకు ప్రాధాన్యం కల్పించాలి? కేటాయింపులు ఎలా ఉండాలనే అంశాలపై ముఖ్యమంత్రి గురువారం ఆర్థికశాఖకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి దిగజార్చిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఐదు నెలల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను సీఎం సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అప్పులు తీసుకుని మళ్లించిన టీడీపీ సర్కారు... టీడీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్లో రూ.2.48 లక్షల కోట్ల మేరకు అప్పులు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.64 వేల కోట్ల వరకు అప్పులు చేశారని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను వాటికోసం వెచ్చించకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో నిధుల కొరతతో సతమతమవుతున్నాయని వివరించారు. వివిధ రకాల పెండింగ్ బిల్లులు మొత్తం రూ.48 వేల కోట్ల వరకు ఉన్నట్లు ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. -
ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకిస్తే బెటర్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకటించారు. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలు... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, థోరట్ కమిటీ 18%గా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. -
వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. 11వ తేదీ దశమి మంచి రోజు కావడంతో ఆ రోజు సమావేశాలను ప్రారంభించాలని, 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్లో నవరత్నాల అమలుకే పెట్టపీట వేయనున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని 60 శాతంపైగా అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నవరత్నాల్లోని అంశాలన్నింటికీ బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయనున్నారు. ఎన్నికల ప్రణాళికలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం రెండో ఏడాది నుంచి అందిస్తామని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది రబీ నుంచే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే బడ్జెట్లో రైతులకు సున్నా వడ్డీకే రుణాలకు, అలాగే పంటల బీమా కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా బడ్జెట్లో కేటాయింపులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా బడ్జెట్‌పై వచ్చే నెల 1, 2వ తేదీల్లో అన్ని శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశం కానున్నారు. -
పల్లె.. డిజిటల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతాన్ని డిజిటల్ పుంతలు తొక్కించేందుకు ఎన్డీయే సర్కారు తన తుదిబడ్జెట్‌లో గట్టి ప్రయత్నమే మొదలు పెట్టింది. భారత్ నెట్ పథకం కింద అనుసంధా నించే 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో తెలపడమే ఇందుకు తార్కాణం. అంతేకాదు..వేర్వేరు ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని విశ్లేషించి వనరులను మరింత సమర్థంగా వినియోగించు కునే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లోనూ కృత్రిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కృత్రిమ మేథ టెక్నాలజీలు మరింత కచ్చితంగా వాతావరణ అంచనాలు కట్టేందుకు మాత్రమే కాకుండా.. అనేక ఇతర రంగాల్లోనూ ఉపయోగపడతాయని వాహనాల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ, ఫొటోలు, వీడియోల విశ్లేషణ వంటివి వీటిల్లో ఉన్నాయని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా డిజిటల్ గ్రామాలు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ గ్రామాల వ్యవస్థ మొత్తం కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా నడుస్తాయి. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా లక్ష వరకూ గ్రామాల్లో ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చాలన్నది లక్ష్యం. గ్రామాల్లో డిజిటల్ టెక్నాల జీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కామన్ సర్వీసెస్ సెం టర్లపైనే ఉంచనున్నారు. దేశంలో ఇప్ప టికే దాదాపు మూడు లక్షల కామన్ సర్వీ సెస్ సెంటర్లు పని చేస్తున్నా యనీ, వీటి ద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రభుత్వ సర్వీసులను, విధానాలను డిజిటల్ రూపంలోకి మార్చేసిందని.. వీటన్నింటి ఆధారంగా 2030 నాటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తామని వివరించారు. దేశ యువత సృష్టించే అనేక స్టార్టప్ కంపెనీలు సృష్టించే డిజిటల్ ఇండియా కారణంగా లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మొబైల్ డేటా 50 రెట్లు ఎక్కువైందని, ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితమిదని మంత్రి వ్యాఖ్యానించారు. డిజిటల్ గ్రామాల వంటి వాటి వల్ల మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని చెప్పారు. కృత్రిమ మేథతో అనేక లాభాలు.. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కృత్రిమ మేథ వినియోగం సర్వత్రా పెరగనుందని.. ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేథ సర్వీసుల కోసం ఓ జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, సేవలు, కేంద్రాలకు ఈ పోర్టల్ ద్వారా సేవలు అందిస్తామని.. ఆసక్తికర ప్రైవేట్ వ్యాపార సంస్థలు కూడా ఈ పోర్టల్ సేవలు వినియోగిం చుకోవచ్చునని మంత్రి వివరించారు. త్వరలో సిద్ధం కానున్న నేషనల్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఈ కృత్రిమ మేథ సర్వీసులు చాలా కీలకం కానున్నాయని మంత్రి చెప్పారు. దేశం ఇప్పటికే స్టార్టప్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని.. దీంతోపాటు కృత్రిమ మేథ తాలూకూ లాభాలను ప్రజల చెంతకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో ఓ విస్తృత స్థాయి కార్యక్రమం చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా.. ఇతర అత్యున్నత నైపుణ్య కేంద్రాలు కూడా ఏర్పాటు కావడం ద్వారా ఈ కార్యక్రమానికి ఊపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేథ సర్వీసులను ఉపయోగించు కునేందుకు ఇప్పటికే తొమ్మిది రంగాలను గుర్తించామని మంత్రి అన్నారు. -
జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు..!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వచ్చే నెలలో రూ.లక్ష కోట్లను మించిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వరుసగా నవంబర్, డిసెంబర్ నెలల్లో జీఎస్టీ ఆదాయం లక్ష కోట్ల మార్కును దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. పండుగల సీజన్ కావడం వల్ల ఈ రెండు నెలల్లో వస్తు, సేవల డిమాండ్ పెరిగి వసూళ్లు ఊపందుకోనున్నాయని భావిస్తోన్న ఆర్థిక శాఖ.. ఇదే సమయంలో పన్ను ఎగవేతలకు ఉన్నటువంటి అవకాశాలను అరికట్టడం ద్వారా రూ.లక్ష కోట్ల వసూళ్లను సునాయాసంగా అందుకోవచ్చని ప్రణాళిక వేసినట్లు వెల్లడైంది. సెప్టెంబర్ వసూళ్లు రూ.94,442 కోట్లు ఉండటం కూడా ప్రభుత్వ అంచనాలకు బలాన్ని స్తోంది. ‘రానున్నది పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడం.. వర్తకులు భారీ డిస్కౌంట్లను ప్రకటిం చనుండడం ఆధారంగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటేందుకు అవకాశం ఉంది.’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సంస్థ చార్టర్డ్ అకౌంటెంట్ రజత్ మోహన్ అన్నారు.