IIT Kanpur
-
గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్
లక్నో: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్‌గా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న సమీర్ ఖండేకర్(53)ని ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రసంగించే క్రమంలోనే ఆయన వేదికపై కుప్పకూలారని ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపారు. అత్యుత్తమ పరిశోధకుడిగా పేరుగాంచిన సమీర్ ఖండేకర్ ఆకస్మిక మరణం పట్ల ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ అభయ్ కరాండికర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖండేకర్‌కు ఐదు సంవత్సరాల క్రితం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఒక ప్రొఫెసర్ చెప్పారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఖండేకర్ ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
ఢిల్లీ కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షం?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత అడుగంటిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు విషమంగానే కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణ ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది. ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. "కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కృత్రిమ వర్షం ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే అధ్యయనాన్ని నిర్వహిస్తాం' అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు. దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది. కృత్రిమ వర్షం అంటే? కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి సాధారణంగా ఉపయోగించే కృత్రిమ పద్ధతి. వివిధ రసాయనిక పదార్థాలను మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షపాతాన్ని కలిగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..? -
Sudha Bharadwaj: పోరాటమే ఆమె జెండా
అమెరికాలో పుట్టి పెరిగింది సుధా భరద్వాజ్ అమ్మతో పాటు స్వదేశానికి వచ్చి కాన్పూర్ ఐఐటీలో చదువు పూర్తి చేసింది. కార్మికులు, గిరిజన మహిళల వెతలు తెలుసుకొని అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకుని న్యాయవాద వృత్తిని చేపట్టింది. మహిళా ఖైదీల సమస్యలపై పోరాడింది. సాధారణ జీవనం నుంచి సామాజిక కార్యకర్తగా బలహీనులకు న్యాయం చేయడానికి సమస్యలపై పోరాడుతూనే ఉంది. సుధా భరద్వాజ్ జీవితం తెలుసుకుంటే స్త్రీ శక్తి మరో కోణంలో పరిచయం అవకుండా ఉండదు. ఈ విషయాలను ఆమె ప్రస్తావిస్తూ... అరవై ఏళ్ల క్రితం నవంబర్ 1న అమెరికాలో పుట్టాను. అమ్మనాన్నలు ఇద్దరూ పేరొందిన ఆర్థిక వేత్తలు. సామాజికంగానూ చాలా చురుకుగా ఉండేవారు. నేను పుట్టిన ఏడాదికి వారిద్దరూ భారతదేశం వచ్చారు. నాకు నాలుగేళ్ల వయసులో అమ్మానాన్నలు విడిపోయారు. అమ్మ ఒంటరిగా ఉంటూ నన్ను పెంచి, పెద్దచేసింది. అమ్మకు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఫెలోషిప్ రావడంతో విదేశాలకు వెళ్లిపోయాం. ఆ తర్వాత కొన్నేళ్లకు రాజస్థాన్‌లోని జెఎన్యూలో టీచింగ్ చేయడానికి అమ్మ స్వదేశానికి వచ్చింది. అలా అమ్మతోపాటు నేనూ వచ్చేశాను.‘సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్’ని స్థాపించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. గొప్ప గొప్ప ఆర్థిక వేత్తలతో కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై లోతయిన అధ్యయనాలు చేసింది. జేఎన్యులో చదువుతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై కూడా విద్యార్థులు చురుకుగా ఉండేవారు. నేను అలాంటి వాతావరణంలో పెరిగాను. సాహిత్య, సామాజిక కార్యక్రమాలంటే ఇష్టంగా ఉండేది. గణితంలో కూడా మంచి ఆసక్తి ఉండటంతో ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ తీసుకున్నాను. ► చదువుతూ కూలీలతో.. ఐఐటీలో కొంతమంది విద్యార్థులతో ఒక చిన్న రీసెర్చ్ టీమ్ ఏర్పడింది. కోర్సుతో పాటు పబ్లిక్ సెక్టార్, సైన్ ్స అండ్ టెక్నాలజీ వరకు చదివేవాళ్లం. సామాజిక సమస్యలనూ చర్చించేవాళ్లం. అప్పుడే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తేనే నా చదువుకు సార్థకత అనుకునేదానిని. కొంతమంది తోటివిద్యార్థులతో కలిసి కూలీల మధ్య పనిచేయడం ప్రారంభించాం. ఓసారి ఉన్నావ్‌లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన చోటుచేసుకుంది. మా టీమ్‌తో కలిసి నిజనిర్ధారణ కోసం వెళ్లాం. కష్టపడి పనిచేసే వారితో అనుబంధం అలా మొదలైంది. అక్కడ కార్మికులతో కలిసి వారి పాటలు, సంగీతం ఆస్వాదించేదాన్ని. కాన్పురియా యాసలో మాట్లాడటం, పాడడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ విధంగా కార్మికుల ఉద్యమంతో చాలా ప్రభావితమయ్యాను. 1982లో ఆసియా క్రీడలు జరగడానికి ముందు ఢిల్లీలో ఫ్లై ఓవర్లు, స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ పనులకోసం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల నుంచి పేద కూలీలను రప్పించి, వారిని శిబిరాల్లో ఉంచారు. అయితే, వారు తమ ఇంటికి వెళ్ళడానికి టికెట్లు కూడా కొనలేని విధంగా చాలా తక్కువ కూలీ ఇచ్చేవారు. నాకెందుకో వారిని క్యాంపులో బంధించినట్లు అనిపించింది. ఆ తర్వాత 1984లో సిక్కుల ఊచకోత, భోపాల్ గ్యాస్ విషాదం దిగ్భ్రాంతికి గురిచేశాయి. సమాజంలో మార్పు తీసుకు రావాలనే సంకల్పం అప్పుడే నా మనసులో బలంగా మారింది. ► నా దేశం కోసం అమెరికా పౌరసత్వం వదులుకున్నా నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు, నేను పుట్టుకతో పొందిన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవాలని అమ్మతో కలిసి అమెరికన్ ఎంబసీకి వెళ్లాను. నేను పౌరసత్వాన్ని వదులుకుంటున్నానని చెబితే ఆశ్చర్యపోయారు. అందుకు తగిన ఫారమ్ కోసం వెతికితే, దొరకలేదు. ‘వారం తర్వాత రండి. ఈ నిర్ణయం తీసుకునేముందు మీ ఇంట్లో ఎవరినైనా అడిగారా...?’ వంటి ప్రశ్నలు వేశారు. అంటే ఇంట్లో మగవారికి తెలియకుండా అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవడానికి వచ్చామని వారు అనుకున్నారు. యుఎస్ పౌరసత్వాన్ని వదులుకున్న తర్వాత, హోం మంత్రిత్వ శాఖలో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాను. ► కార్మిక ఉద్యమాల్లో భాగంగా.. మరోవైపు దేశంలో అలజడి కొనసాగుతోంది. మిల్లు కార్మికుల ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాల్లోనే అద్భుతమైన కార్మిక నాయకుడు శంకర్ గుహ నియోగి పేరు మొదటిసారిగా తెలిసింది. ’ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా’ ద్వారా కార్మికుల ఆర్థిక అవసరాలను పెంచడంతోపాటు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులను నడుపుతూ వారి మధ్య ఉంటూ వ్యసనాల నుండి బయటపడటానికి సహాయం చేస్తున్నాడు. జాతీయ భద్రతాచట్టం కింద అతణ్ణి అరెస్టు చేసినప్పుడు, అతని విడుదల కోసం విద్యార్థులుగా మేం పోరాడాం. విడుదలైన తర్వాత ఆయనను కలిశాం. 1986 నాటికి, నేను ’ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా’తో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. భిలాయ్ సమీపంలోని రాజహారా గనులలో పనిచేసే పిల్లలకు చదువు నేర్పించడం ప్రారంభించాను. కొంతకాలం తర్వాత, భిలాయ్‌లో కార్మిక చట్టాలను అమలు చేయడానికి భీకర పోరాటం ప్రారంభమైంది. 16 పెద్ద కంపెనీలు 4,200 మంది కార్మికులను తొలగించాయి. కార్మికులను తిరిగి పనిలో చేర్చడానికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. కొంతమంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలతో కలిసి ఎండవానలు లెక్కచేయకుండా గడిపాం. ► న్యాయం కోసం పోరాటం ... కార్మికుల అభ్యర్థన మేరకు, నేను 2000 సంవత్సరంలో నా న్యాయవిద్యను పూర్తి చేసి వారి కోసం న్యాయపోరాటం ప్రారంభించాను. కూలీలు, గిరిజనులు, మహిళలు అనే తేడా లేకుండా వారి కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం చూశాను. నిరసన తెలిపితే వారిపై కేసులు పెడతారు. ఆ తర్వాత కొంతమంది తోటి లాయర్లతో కలిసి జన్–హిత్ పేరుతో గ్రూప్‌ని ప్రారంభించాను. ఆ తర్వాత భూసేకరణ, అటవీ హక్కులు, పర్యావరణ సంబంధిత సమస్యలకు సంబంధించిన అనేక కేసులను వాదించడం ప్రారంభించాం. కేసులన్నీ కార్పొరేట్లపైనే ఉన్నాయి. అప్పటికి చాలామంది శత్రువులను కూడగట్టుకున్నానని గ్రహించాను. కానీ, ఏ మాత్రం భయపడకుండా బలహీనుల కోసం నా గొంతు పెంచుతూనే ఉన్నాను. ► ఆశ సన్నగిల్లిన సందర్భాలు.. 2006లో దంతెవాడలో ఐదుగురు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళల కేసుపై పోరాడేందుకు న్యాయవాది ఎవరూ సిద్ధంగా లేరు, నేను నా సహోద్యోగులతో కలిసి వారికి న్యాయం చేసే బాధ్యతను తీసుకున్నాను. బాధితుల వాంగ్మూలం నమోదు చేసేందుకు దంతెవాడకు 150 కి.మీ దూరంలోని కొంటకు వెళ్లాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ భాషలో, కొంట అంటే మూల అని అర్థం, ఆ ప్రదేశం నిజానికి ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మూల. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రారంభమవుతుంది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్యూన్ సైకిల్‌పై ఎక్కి వస్తారంటే అక్కడి పరిస్థితిని అంచనా వేయవచ్చు. బాధితులు గోండీ భాషలో తమ బాధలను వివరిస్తుంటే అక్కడ ఉన్న ప్యూన్ అనువాదకుడిగా మారాడు. అప్పుడే అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దంతెవాడకు బదిలీ అయింది. ఆ తర్వాత మహిళలపై ఒత్తిడి తెచ్చి కేసులు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడు న్యాయంపై ఆశ చచ్చిపోయిందనిపించింది. ► గర్భస్రావం తర్వాత దత్తత కుమార్తె రాజహారలో ఉన్నప్పుడు 8 నెలల గర్భిణిని. ఆ రోజు చాలా వర్షం, మెరుపులు, కడుపునొప్పితో బాధపడుతున్నాను. మా యూనియన్ చెందిన షాహీద్ హాస్పిటల్ కి నడుచుకుంటూ వెళుతుండగా రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఎలాగోలా ఆసుపత్రికి చేరుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆపరేషన్ అయింది. స్పృహ వచ్చాక గర్భస్రావం అయిందని తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత, మళ్లీ గర్భం ప్రమాదకరమనుకున్నాను. అందుకే ఒకమ్మాయిని దత్తత తీసుకున్నాను. కూతురు డిగ్రీ చదువు కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వచ్చి 58 ఏళ్ల వయసులో నేషనల్ లా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా తొలిసారి రెగ్యులర్ ఉద్యోగంలో చేరాను. ఏడాది సాఫీగానే గడిచింది. కానీ, ఉద్యమకారిణిగా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. చాలా పోరాటం తర్వాత తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జైలులో ఉన్నప్పుడు కూతురిని కలవాలని చాలా తపించేదాన్ని. నెలకు ఒకసారి ఉత్తరానికి సమాధానం వచ్చేది. కలవడానికి వీలయ్యేది కాదు. జైలులో ఉన్న మూడేళ్లు మహిళా ఖైదీల సమస్యలను వింటూ, వారి కోసం వర్క్ చేశాను. సామాజిక కార్యకర్తలకు వ్యక్తిగత జీవితం లేదన్నది నిజం. వారు ఇంటికీ, సామాజిక జీవితానికీ మధ్య సమన్వయం చేసుకోలేరు. దీపం కింద చీకటి అనే సామెత నిజం అవుతుంది. ముఖ్యంగా మహిళా సామాజిక కార్యకర్తలు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా జైలు డైరీ ’ఫ్రం ఫాన్సీ యార్డ్’లో నేను అలాంటి చాలామంది మహిళల కథలను పంచుకున్నాను. సమాజంలోని ఈ దురాచారాలకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాను’’ అని వివరిస్తారు ఈ సామాజిక కార్యకర్త. -
అదిరిపోయే ఫీచర్లతో.. వారి కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్!
అంధుల కోసం ఓ ప్రత్యేక స్మార్ట్ వాచ్(Smart Watch)ను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక టెక్నాలజీతో ఓ స్మార్ట్ వాచ్‌ను కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. వీటిని పెద్ద మొత్తంలో తయారీతో పాటు విక్రయించేందుకు యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఐఐటీ కాన్పూర్ జతకట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లలో లోపాలను సరిచేసి యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు హాప్టిక్ వాచ్‌ను రూపొందించినట్లు ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాక్టిల్, టాకింగ్, వైబ్రేషన్, బ్రెయిలీ ఆధారిత వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఈ స్మార్ట్ వాచ్ రాబోతోంది. యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి త్వరలో ఈ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరందికర్ తెలిపారు. ఇందులో ఏ ఫీచర్లు ఉన్నాయంటే! ఈ హాప్టిక్ స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో డయల్ఫ్రీ ఆప్షన్‌తోపాటు 12 టచ్-సెన్సిటివ్ హవర్ మార్కర్స్ ఉంటాయి. వాచ్‌ను ధరించిన వారు ఈ మార్కర్స్పై ఫింగర్‌ను స్కాన్ చేయడం ద్వారా టైమ్ తెలుసుకోవచ్చు. ఈ వాచ్.. టాక్టిల్, వైబ్రేషన్ వాచ్‌ల సమ్మిళతంగా ఉంటుంది. అయితే వైబ్రేషన్ వాచ్‌లలో 20పైగా ఉండే వైబ్రేషన్ పల్సెస్‌ను ఈ వాచ్‌లో 2 పల్సెస్‌కు తగ్గించారు. టాక్టిల్ వాచ్‌కు ఉండే సులువుగా విరిగిపోయే స్వభావం ఇందులో ఉండదు. వీటితోపాటు హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, హైడ్రేషన్ రిమైండర్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంధుల కోసం ప్రస్తుతం ఉన్న స్మార్ట్ వాచ్‌లు ఆడియో ఆధారిత అవుట్‌పుట్‌తో పనిచేసేవి కావడం వల్ల వాటిని ధరించిన వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఐఐటీ కాన్పూర్ ఈ హాప్టిక్ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
చదివిన కాలేజీకి చేయూత.. రూ.100 కోట్ల విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త
చదివిన కాలేజీకి అండగా నిలిచేందుకు ఓ వ్యాపారవేత్త ముందుకు వచ్చారు. కాలేజీలో కొత్త కోర్సు ప్రారంభించేందుకు భారీ విరాళం ఇచ్చారు. ఏకంగా వంద కోట్ల రూపాయలను అందించేందుకు ముందుకు వచ్చారు. ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ తోటి వ్యాపారవేత్తలకు ఆదర్శనంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. తాను చదివిన ఐఐటీ కాన్పూరు కాలేజీకి రూ. 100 కోట్ల భూరి విరాళం ప్రకటించారు. ఈ డబ్బుతో ఐఐటీ కాన్పూరులో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు. ఐఐటీ కాన్పూరుకి ఆ కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థులు ఎప్పుడూ అండగా ఉంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వసతులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల రీత్యా మెడికల్ ఇంజనీరింగ్‌పై ఈ కాలేజీ దృష్టి సారించింది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు అందడానికంటే ముందే ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. వీరిలో రికార్డు స్థాయిలో రాకేశ్ గంగ్వాల్ ఏకంగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. రాకేశ్ గంగ్వాల్ అందించిన నిధులతో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీనికి గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీగా పేరు పెట్టనున్నారు. మూడేళ్లలో భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా We are grateful to Mr Rakesh Gangwal, Mrs Shobha Gangwal and his daughter Ms Parul Gangwal who could take time and be present in person for the agreement signing in Mumbai today. @DoRA_IITK @IITKanpur @paniitindia pic.twitter.com/b0Umzdvv7E — Abhay Karandikar (@karandi65) April 4, 2022 -
Coronavirus: జూన్‌లో నాలుగో వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ సుమారుగా జూన్ 22న ప్రారంభమై ఆగస్ట్ చివరికల్లా తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్ నాలుగు నెలలపాటు ఉండేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకనుబట్టి నాలుగో వేవ్ తీవ్రత ఉంటుందని కాన్పూర్ ఐఐటీ మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు చెందిన శబరప్రసాద్ రాజేశ్ భాయ్, సుభ్ర శంకర్ ధార్, శలభ్ తమ పరిశోధన పత్రంలో తెలిపారు. నాలుగో వేవ్ జూన్ 22న మొదలై ఆగస్ట్ 23 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుని, అక్టోబర్ 24వ తేదీ నాటికి ఆగిపోతుందని వెల్లడించారు. అయితే, కొత్త వేరియంట్‌ను బట్టే తమ విశ్లేషణ పూర్తిగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త కేసులు 8,013 దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 10వేల లోపునకు పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరినట్లు వెల్లడించింది. అదేసమయంలో, మరో 119 మంది కరోనా బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,13,843కు పెరిగాయని తెలిపింది. -
నవ భారత నిర్మాణానికి నడుం బిగించండి
కాన్పూర్: యువత తాము కలలుకనే భారతం కోసం ఇప్పటినుంచి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత సుఖాల కన్నా సవాళ్లను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిందని, విద్యార్థిలోకం తక్షణం నడుం బిగించి పనిచేస్తే వచ్చే 25ఏళ్లలో వాళ్లు కలలు గనే భారత్‌ను చూడవచ్చని ఉద్భోదించారు. భారత స్వావలంబనకు తోడ్పడాలని నూతన గ్రాడ్యుయేట్లను ఆయన కోరారు. స్వాతంత్య్రానంతరం భారత్ నూతన పయనం ఆరంభమైందని, నిజానికి 25ఏళ్లు పూర్తయ్యేసరికి ఎంతో అభివృద్ధి జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ సమయం వృథా చేయడం వల్ల దాదాపు రెండు తరాలు గడిచిపోయాయన్నారు. అందుకే ఇకపై ఎంతమాత్రం జాప్యం కూడదని హెచ్చరించారు. అనంతరం కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి మోదీ ఝీల్ వరకు 9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు 356 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని మోదీ కాన్పూర్ నుంచి లక్నోకు 80 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది. దారిపొడవునా తనిఖీలు చేసి, తగిన బందోబస్తును ఏర్పాటు చేశాక మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఐదేళ్లు దోచుకోవచ్చనుకున్నారు సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తన కాన్పూర్ పర్యటనలో నిప్పులు చెరిగారు. గతంలో యూపీలో అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, ఎదురులేకుండా ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకునే లాటరీ దొరికినట్లు భావించిందని దుయ్యబట్టారు. అనంతరం ఏర్పడిన తమ ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో పనిచేస్తోందన్నారు. ఇటీవల కాన్పూర్‌కు చెందిన సుగంధద్రవ్యాల వ్యాపారి వద్ద కోట్ల రూపాయల నగదు దొరకడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది ప్రతిపక్షం సాధించిన విజయమని ఎద్దేవా చేశారు. 2017కు పూర్వం అవినీతి దుర్గంధం రాష్ట్రమంతా వ్యాపించిందని, కట్టలు బయటపడగానే ఎస్పీ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. కాన్పూర్, యూపీ ప్రజలకు మొత్తం అర్థమవుతోందన్నారు. యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు. -
90 సెకన్లలో భూసార పరీక్ష
కాన్పూర్: భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకొనేందుకు రోజుల తరబడి వేచి ఉండనక్కర్లేదు. కేవలం 90 సెకన్లలో ఫలితం తెల్సుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకమైన పోర్టబుల్ టెస్టింగ్ పరికరాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ–కాన్పూర్ అభివృద్ధి చేసింది. ఈ పరీక్ష కోసం ఐదు గ్రాముల మట్టి చాలు. మొబైల్ యాప్ ద్వారా భూసారం తెలిసిపోతుంది. ‘భూ పరీక్షక్’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని ఐఐటీ–కాన్పూర్ తెలిపింది. పోర్టబుల్, వైర్లెస్ సాయిల్ టెస్టింగ్ పరికరం మట్టిలోని పోషకాలను కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ పరికరంలో 5 సెంటీమీటర్ల పొడవైన స్తూపాకర పాత్ర ఉంటుంది. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’ ఇందులో 5 గ్రాముల పొడి మట్టిని ఉంచి, బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేయాలి. ఈ మట్టి నమూనాను పరికరం వేగంగా విశ్లేషిస్తుంది. అందులోని నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, కార్బన్ తదితర పోషకాలను గుర్తిస్తుంది. 90 సెకన్లలో సాయిల్ హెల్త్ రిపోర్టు స్క్రీన్‌పై కనిపిస్తుంది. సదరు భూమిలో ఏయే ఎరువులు ఎంత పరిమాణంలో చల్లాలో కూడా సూచిస్తుంది. ఈ పరికరం రైతులకు చక్కగా ఉపయోగపడుతుందని ఐఐటీ–కాన్పూర్ ప్రతినిధులు తెలిపారు. ఒక్క పరికరంతో లక్ష దాకా నమూనాలను పరీక్షించవచ్చని అన్నారు. ఐఐటీ–కాన్పూర్‌లోని డిపార్ట్మెంట్ కెమికల్ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్ జయంత్‌కుమార్ సింగ్, పల్లవ్ ప్రిన్స్, అషర్ అహ్మద్, యశస్వి ఖేమాని, మొహమ్మద్ అమిర్‌ఖాన్‌తో కూడిన బృందం ఈ ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ డివైన్‌ను అభివృద్ధి చేసింది. రైతులు భూసార పరీక్ష చేయించాలంటే నమూనాను సేకరించి, జిల్లా కేంద్రాల్లో ఉండే ల్యాబ్‌లకు పంపించాల్సి వస్తోంది. సాయిల్ హెల్త్ కార్డు కోసం కనీసం 15 రోజులపాటు ఎదురు చూడాల్సి వస్తోంది. -
హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు
తిరువనంతపురం: రైతు బిడ్డ రైతే అవుతాడు.. రాజు బిడ్డ రాజు అవుతాడు.. ఇది జమానా మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా డైలాగ్ ప్రకారం విజయం ఎవడబ్బ సొత్తు కాదు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు.. విజయం మన సొంతం అవుతుంది. ఈ మాటలు నిజం చేసి చూపారు ఆర్య రాజగోపాల్ అనే యువతి. పెట్రోల్ బంక్‌లో పని చేసే ఓ ఉద్యోగి కుమార్తె అయిన ఆర్య.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్‌లో పీజీ అడ్మిషన్ సాధించారు. ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. ఏంటంటే ఆర్య తండ్రి పెట్రోల్ బంక్‌లో సాధారణ ఉద్యోగి అని చెప్పుకున్నాం కాదా. ఇప్పుడు ఆర్య పీజీ అడ్మిషన్ పొందిన కోర్సు పెట్రోలియమ్ ఇంజనీరింగ్ కావడం విశేషం. ఆర్య కథ కేవలం ఆమె చదవులో చూపిన ప్రతిభ గురించి మాత్రమే కాదు.. ఆమె పట్టుదల, సంకల్పం గురించి కూడా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఈ స్ఫూర్తిదాయక కథనం వివరాలు ఇలా ఉన్నాయి.. (చదవండి: Sarah: అదంతా సరే.. మరి.. ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’) కేరళ పయ్యనూర్‌కు చెందిన ఆర్య తండ్రి రాజగోపాల్ గత 20 ఏళ్లుగా పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్. కూతురు భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకునేవాడు రాజగోపాల్. కూతురుకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంతో కష్టపడ్డాడు. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. ఆర్య చదువుకు మాత్రం అడ్డంకులు ఎదురు కానీవ్వలేదు. తల్లిదండ్రుల కష్టాన్ని, కలలను అర్థం చేసుకున్న ఆర్య చదువులో ముందుండేది. మంచి మార్కులు తెచ్చుకుని పేరున్న విద్యాసంస్థల్లో సీటు సంపాదించుకుంది. దానిలో భాగంగానే ఆర్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి తన బ్యాచిలర్ పూర్తి చేసింది. ఇప్పుడు పీజీ చేయడం కోసం ఐఐటీ కాన్పుర్‌లో సీటు సాధించి.. తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చింది. (చదవండి: వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే) ఆర్య కుటుంబ నేపథ్యం... ఆమె ప్రయాణం.. ఇప్పుడు సాధించిన విజయం తదితర అంశాల గురించి అశ్విన్ నందకుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలయ్యింది. ఆర్య కథ చదివిన వారు తండ్రికూతుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్య విజయం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలిసింది. ఈ క్రమంలో ఆయన ఆర్యను ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘ఆర్య విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆర్య రాజగోపాల్, ఆమె తండ్రి రాజగోపాల్ల విజయం పట్ల దేశ ఇంధన రంగంతో సంబంధం ఉన్న మనమందరం నిజంగా ఎంతో గర్వపడుతున్నాము. ఈ ఆదర్శవంతమైన తండ్రి-కుమార్తెల ద్వయం ఎందరికో స్ఫూర్తి.. కొత్త భారతదేశానికి స్ఫూర్తి, మార్గదర్శకులు. వారిరువురికి నా శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ Heartwarming indeed. Arya Rajagopal has done her father Sh Rajagopal Ji & indeed all of us associated with the country’s energy sector immensely proud. This exemplary father-daughter duo are an inspiration & role models for Aspirational New India. My best wishes.@IndianOilcl https://t.co/eiU3U5q5Mj pic.twitter.com/eDTGFhFTcS — Hardeep Singh Puri (@HardeepSPuri) October 6, 2021 చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు -
భారత్‌లో కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్‌వేవ్!
న్యూఢిల్లీ: ఇప్పుడున్న కరోనా వేరియంట్ల కన్నా డేంజర్ వేరియంట్ సెప్టెంబర్‌లో బయటపడితే దేశంలో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందని ఐఐటీ కాన్పూర్ సైంటిస్టు మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే రాబోయే అక్టోబర్– నవంబర్ మధ్య కాలంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కనిపిస్తుందని అంచనా వేశారు. అయితే ఎంత ప్రమాదకరమైన వేరియంట్‌తో థర్డ్‌వేవ్ వచ్చినా, దాని తీవ్రత సెకండ్ వేవ్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మేథమేటికల్ మోడలింగ్‌లో ఆయన నిపుణుడు. దేశంలో ఇన్ఫెక్షన్ల పెరుగుదలను అంచనా వేసే ముగ్గురు సభ్యుల బృందంలో ఆయన ఒకరు. సెప్టెంబర్ నాటికి కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే మాత్రం ఎలాంటి థర్డ్ వేవ్ రాదని ఆయన వెల్లడించారు. థర్డ్‌వేవ్ ఉధృత దశలో దేశీయంగా రోజుకు లక్ష కేసులు బయటపడవచ్చని అంచనా వేశారు. సెకండ్‌వేవ్ ప్రబలిన సమయంలో దేశీయంగా రోజుకు 4 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే! ‘‘న్యూ మ్యూటెంట్ రాకున్నా, కొత్త వేరియంట్ కనిపించకున్నా యథాతథ స్థితి ఉంటుంది. కొత్త వేరియంట్ సెప్టెంబర్ నాటికి బయటపడితే థర్డ్‌వేవ్ అవకాశాలుంటాయి.’’అని అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్, తద్వారా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు 1/33 వంతులని అంచనా వేశారు. ఇప్పటివరకు డెల్టాను మించిన ప్రమాదకరమైన వేరియంట్ ఇంకా బయటపడలేదు. డెల్టా కారణంగా థర్డ్‌వేవ్ ఆరంభమైనా, కొత్త వేరియంట్ పుట్టకపోవడంతో ఉధృతి కొనసాగడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా నమోదైతున్న కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి. -
కొత్త వేరియంట్ వస్తే ముందుగానే మూడో వేవ్
సెప్టెంబర్ నెల మధ్య నాటికే కరోనా మూడో వేవ్ పతాక స్థాయికి చేరొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్త ట్రెండ్స్‌ను బట్టి చూస్తే.. రెండో వేవ్ కన్నా మూడో వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు రావొచ్చని పేర్కొంది. అంటే రోజువారీ కేసులు 6 లక్షల వరకూ వెళ్లొచ్చని తెలిపింది. ఆగస్టు మధ్యలోనే మూడో వేవ్ మొదలై.. అక్టోబర్–నవంబర్ నెలల్లో కేసులు పతాక స్థాయికి చేరొచ్చని కాన్పూర్ ఐఐటీ అంచనా వేసింది. కొత్తగా వచ్చే వేరియంట్ల సామర్థ్యాన్ని బట్టి.. రోజువారీ కేసులు రెండు లక్షలకుపైగా నమోదుకావొచ్చని తెలిపింది. కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే ఆగస్టు చివరినాటికి కరోనా నియంత్రణలోకి వచ్చేస్తుందని పేర్కొంది. ఎస్బీఐ, కాన్పూర్ ఐఐటీ మోడళ్లు రెండూ కూడా మూడో వేవ్‌లో కరోనా ప్రమాదకరంగా మారకపోవచ్చని పేర్కొన్నాయి. ఒకవేళ కేసులు భారీగా పెరిగినా ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటుందని అంచనా వేశాయి. సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా రెండో వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. 2 నెలల కింద రోజుకు 4 లక్షల దాకా వెళ్లిన కేసులు.. ఇప్పుడు 30–40 వేల మధ్య నమోదవుతున్నాయి. ఇలాగే మరో 3, 4 వారాలు తగ్గుతాయని.. ఆ వెంటనే మూడో వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాన్పూర్ ఐఐటీల అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. లాక్డౌన్లు, ఆంక్షలు సడలించడంతో జనం బయటికి రావడం పెరిగిందని.. వారు కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే ఆగస్టు మధ్యలోనే మూడో వేవ్ మొదలవుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు నివేదికలు విడుదల చేశాయి. రెండో వేవ్ పూర్తిగా తగ్గకముందే.. గత ఏడాది జనవరిలో కరోనా పంజా విసరడం మొదలైంది. తొలిదశలో మెల్లమెల్లగా కేసులు పెరిగాయి. అక్టోబర్ నాటికి పతాక స్థాయికి చేరి.. తర్వాత తగ్గిపోయాయి. ఇక రెండో వేవ్ ఈ ఏడాది మార్చిలో మొదలుకాగా.. మే ఏడో తేదీన ఏకంగా 4.14 లక్షల కేసులతో గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం కేసులు తగ్గుతూ వస్తున్నాయి. రెండో వేవ్‌లో కేసులు భారీగా పెరగడం, లక్షలకొద్దీ యాక్టివ్ కేసులు ఉండటంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కోసం తీవ్ర సమస్య ఎదురైంది. రోజూ 3, 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే త్వరలోనే మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో వేవ్ ఎప్పుడు రావొచ్చు, పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. ఇదే తరహాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటీ కాన్పూర్ వేర్వేరుగా అధ్యయనం చేసి నివేదికలు విడుదల చేశాయి. రెండూ కూడా ఆగస్టు మధ్యలో కరోనా మూడో వేవ్ ప్రారంభం కావొచ్చని పేర్కొన్నాయి. నెల రోజుల్లోనే గరిష్ట స్థాయికి.. దేశంలో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘కోవిడ్ 19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరిట సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలిస్తున్న వేళ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరం పాటించడం వంటివి కచ్చితంగా పాటించకపోతే.. ఆగస్టు రెండో వారంలోనే మూడో వేవ్ మొదలవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. కేవలం నెల రోజుల్లోనే అంటే సెప్టెంబర్ మధ్య నాటికే కేసులు పతాక స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం కేసులు తగ్గుతూ వెళ్తాయని, ఈ నెల మూడో వారానికి రోజుకు పది వేలకు పడిపోతాయని పేర్కొంది. ఆ తర్వాత కేసులు పెరగడం మొదలవుతుందని.. మూడు, నాలుగు వారాల్లోనే గరిష్ట స్థాయికి చేరుతాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేవ్‌లు, నమోదైన కేసులను బట్టి.. రెండో వేవ్ కంటే మూడో వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు నమోదు కావొచ్చని పేర్కొంది. వ్యాక్సిన్‌తోపాటు జాగ్రత్తలూ తప్పనిసరి కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక మార్గమని, కానీ అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి అని స్టేట్ బ్యాంక్ రీసెర్చ్ నివేదికలో ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం 4.6 శాతం మందికి రెండు డోసులు, 20.8 శాతం మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని.. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. 59.8 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేసిన ఇజ్రాయెల్, 48.7 శాతం వ్యాక్సినేషన్ చేసిన బ్రిటన్ దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్త వేరియంట్ల సామర్థ్యాన్ని బట్టి.. ఐఐటీ కాన్పూర్ కూడా తాము రూపొందించిన ‘సూత్ర’ మోడల్‌తో దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేసింది. రెండో దశలో దేశాన్ని వణికించిన డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపించగల కొత్త వేరియంట్ వస్తే మూడో దశలోనూ కోవిడ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం.. కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే ఆగస్టు చివరికల్లా రెండో దశ పూర్తి నియంత్రణలోకి చేరుకుంటుంది. ఒక వేళ కొత్త వేరియంట్ వస్తే.. ఆగస్టు మధ్యలోనే మూడోదశ మొదలై.. అక్టోబర్, నవంబర్ నెలల మధ్య పతాక స్థాయికి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో రోజువారీ కేసులు యాభై వేల నుంచి లక్ష వరకూ ఉండొచ్చు. ఒకవేళ డెల్టా కంటే 25 శాతం వేగంగా వ్యాప్తి చెందగల కొత్త వేరియంట్ పుట్టుకొస్తే.. రోజువారీ కేసులు 1.5 లక్షల నుంచి రెండు లక్షలకుపైగా నమోదయ్యే అవకాశం ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. జనం రోగ నిరోధక శక్తిని కోల్పోవడం, టీకాల ప్రభావం, తీవ్రమైన కొత్త వేరియంట్ వచ్చే అవకాశాలను ఈ అంచనాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నామని ఐఐటీ కాన్పూర్ అధ్యాపకుడు మణిందర్ అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఏమవుతుంది?, డెల్టా వైరస్ కంటే పాతికశాతం ఎక్కువ వేగంగా (డెల్టా ప్లస్ వ్యాపించే వేగం డెల్టా కంటే తక్కువని అంచనా) వ్యాప్తి చెందగల వేరియంట్ వస్తే జరిగే పరిణామాలను పరిశీలించామన్నారు. డెల్టా వైరస్ అప్పటికే ఇతర వేరియంట్లతో జబ్బుపడ్డ వారిపై ఎక్కువగా దాడి చేస్తోందని, ఈ లెక్కన చూస్తే మూడో దశలో కేసులు మునుపటి స్థాయిలో ఉండవని అగర్వాల్ వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 4.6 శాతం మందికి రెండు దశల టీకాలు ఇవ్వడం, మరో 20.3 శాతం మంది కనీసం ఒక్క డోసుతో రక్షణ కలిగి ఉండటం వల్ల.. మూడు, నాలుగో దశల తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. మూడో వేవ్‌లో ఆస్పత్రిలో చేరే కోవిడ్ బాధితుల సంఖ్య తక్కువగా ఉంటుందని వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ ఏడాది జనవరిలో రోజుకు అరవై వేల కేసులు, 1,200 మరణాలు నమోదు కాగా.. తర్వాతి దశలో గరిష్ట కేసులు 21 వేలకు, మరణాలు 14కు పడిపోయాయని సూత్ర మోడల్ తయారీలో పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ గణిత శాస్త్రవేత్త ఎం.విద్యాసాగర్ తెలిపారు. -
ఆందోళన అవసరం లేదు.. నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదు
న్యూఢిల్లీ: బిహార్‌లోని గంగా నదిలో భారీ సంఖ్యలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగా పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్షలాది మందికి గంగా నదే జీవనాధారం. ఈ నది నీటిని ఉపయోగిస్తే కరోనా వైరస్ సోకుతుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యమునా నదిలో కూడా కరోనా బాధితుల శవాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆందోళన అవసరం లేదని, నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఐఐటీ–కాన్పూర్ ప్రొఫెసర్ సతీష్ తారే బుధవారం చెప్పారు. కరోనా సోకిన వారి మృతదేహాలను నదిలో వదిలేస్తే నీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనడానికి గట్టి ఆధారాల్లేవని గుర్తుచేశారు. గంగా, దాని ఉప నదుల్లో శవాలను వదిలేయడం కొత్తేమీ కాదని, 10–15 ఏళ్లలో ఇది గణనీయంగా తగ్గిందని అన్నారు. నదిలో శవాలను వదిలేస్తే నదీ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. నది నీటి ఉపయోగించుకునేవారు శుద్ధి చేసుకొని వాడుకోవాలని సూచించారు. నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన అవసరం లేదని నీతి ఆయోగ్ (హెల్త్) వి.కె.పాల్, ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కె.విజయ రాఘవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి: ('సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది') -
కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..?
సాక్షి, హైదరాబాద్: కేసులు, మరణాలు, ఆక్సిజన్ కొరత, ఆరోగ్య సమస్యల గురించి వార్తలు వినీవినీ విసిగిపోయాం. ఈ కోవిడ్ మహమ్మారి పీడ విరగడయ్యేది ఎప్పుడన్న ప్రశ్న అందరి మనసులను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు వేర్వేరుగానైనా ఏకాభిప్రాయంతో మే చివరికి కరోనా పీడ విరగడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతుండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఆ వివరాలేంటో చూసేద్దాం. దేశంలో రెండో దశ కరోనా కేసుల సంఖ్య మే నెల 14 నుంచి 18వ తేదీ మధ్య కాలంలో శిఖర స్థాయికి చేరుకుంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ అధ్యాపకులు రూపొందించిన మోడల్లో తెలిపారు. ‘ససెప్టబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్) అండ్ రిమూవ్డ్ అప్రోచ్ (సూత్ర)’మోడల్‌ను వీరు తయారు చేశారు. ఇప్పటికే భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షల కన్నా ఎక్కువై 4 రోజులు అవుతోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల వరకు ఉండగా, మే నెల మధ్య కాలానికి 38 నుంచి 48 లక్షలకు చేరుకోవచ్చని, అదే నెలాఖరుకు కేసుల సంఖ్య రోజుకు 4.4 లక్షలకు చేరుతాయని ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్‌లతో పాటు తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి 30 మధ్యకాలంలో కేసుల సంఖ్య పెరిగి శిఖర స్థాయికి చేరుకుంటాయని, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే ఆ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని వివరిస్తున్నారు. కాగా, అంచనా వేసేందుకు వినియోగించిన సమాచారం ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో తుది ఫలితాలపై కొంత అసందిగ్ధత ఉందని ఈ మోడలింగ్‌కు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మణినీంద్ర అగ్రవాల్ ట్విట్టర్‡ ద్వారా తెలిపారు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య కూడా మే నెల 4–8వ తేదీ మధ్య కాలంలో శిఖరస్థాయికి చేరుతాయని సూత్రా మోడల్ అంచనా వేసింది. కాగా, కొద్ది రోజుల కింద కరోనా ఏప్రిల్ 15 –20 మధ్యకాలంలో శిఖర స్థాయికి చేరుతుందని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా విడుదల చేసినా.. కానీ ఇది వాస్తవం కాలేదు. ఇతరులదీ అదేమాట.. ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్ శాస్త్రవేత్తల ‘సూత్రా’మోడల్ దేశీయంగా, విదేశాల్లో సిద్ధం చేసిన ఇతర మోడళ్ల ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం కరోనా పీడ విరగడయ్యేందుకు ఎక్కువ సమయం లేదన్న భరోసా కల్పిస్తోంది. హరియాణాలో అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ వేసిన అంచనా ప్రకారం కరోనా వైరస్ కేసులు ఏప్రిల్ 15–మే 15 మధ్యకాలంలో అత్యధిక స్థాయికి చేరనున్నాయి. మరోవైపు అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ అంచనా కూడా మే 15కు కేసులు శిఖరస్థాయికి ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని చెప్పడం విశేషం. భ్రమర్ ముఖర్జీ అంచనాల ప్రకారం మే నెల మధ్యకు దేశంలో కేసుల సంఖ్య రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. సియాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’(ఐహెచ్ఎంఈ) కూడా దాదాపు ఇదే అంచనా వేసింది. నమోదైన కేసుల ఆధారంగా భ్రమర్ ముఖర్జీ, ఐహెచ్‌ఎంఈలు అంచనాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే మే నెల మొదటి వారంలో కేసుల సంఖ్య రోజుకు 5 లక్షలకు చేరుకుంటుందని, రోజువారీ మరణాలు 3 వేల కంటే ఎక్కువ నమోదు కావొచ్చని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. మరణాలు పెరుగుతాయా? ఐహెచ్ఎంఈ లెక్కల ప్రకారం.. ఆగస్టు ఒకటి నాటికి భారత్‌లో కోవిడ్ కారణంగా సంభవించే మరణాల సంఖ్య కనిష్టంగా 9.59 లక్షలు గరిష్టంగా 10.45 లక్షలుగా ఉండొచ్చని అంచనా వేశారు. ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు ధరిస్తే మరణాల సంఖ్య 8.8 లక్షలకు పరిమితం చేయొచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేంద్రం విడుదల చేసిన సీరో సర్వే ప్రకారం అసలు కేసుల కంటే నమోదైన కేసుల దాదాపు 27 రెట్లు తక్కువ. ఈ తేడాల మేరకు లెక్కలు 10 నుంచి 20 రెట్లు తక్కువ చూపుతారని పరిగణించి అంచనా వేశామని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. చదవండి: (దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం) -
మే 15 కల్లా పతాక స్థాయికి కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. కొత్త కేసుల విషయంలో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కొత్తగా 3.32 లక్షల కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ విలయానికి తోడు ఆక్సిజన్ కొరత అందరినీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కరోనా మహమ్మరీ ఇలాగే కొనసాగితే దేశంలో మరో మూడు వారాల తర్వాత పతాక స్థాయికి చేరుకొనున్నట్లు ఐఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే స్థాయిలో కొనసాగితే మే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరే అవకాశాలున్నాయని, అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు చేరుకుంటాయని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, ఏప్రిల్ 25-30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రాల్లో కొత్త కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే మే నెలాఖరు కల్లా ఈ రాష్ట్రాలలో కేసులు తగ్గవచ్చు అని శాస్త్రవేత్తల అంచనా. మే నెలాఖరు వరకు గణనీయంగా తగ్గుతాయి అని ఐఐటీ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ శాఖ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. చదవండి: కోవిడ్ టీకా పాలసీపై సోనియా గాంధీ ఆగ్రహం -
11 రోజుల్లో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: దేశంలో రెండోసారి పైకి ఎగబాకుతున్న కరోనా కేసుల సంఖ్య ఈ నెల మధ్యలోనే శిఖర స్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఆ తర్వాత మే నెల చివరికల్లా ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని గణితశాస్త్ర నమూనాల ఆధారంగా వేసిన లెక్కలు చెబుతున్నాయి. ‘సూత్రా’ అన్న సంక్షిప్త నామం కలిగిన ఈ గణితశాస్త్ర మోడల్.. కరోనా తొలిదశ అంకెల విషయంలోనూ కచ్చితమైన అంచనాలు వెలువరించింది. అప్పట్లో ‘సూత్రా’ ప్రకారం కరోనా కేసులు ఆగస్టులో ఎక్కువ కావడం మొదలుపెట్టి సెప్టెంబర్ నాటికి శిఖర స్థాయికి చేరి ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ 2021 ఫిబ్రవరికి అత్యల్ప స్థాయికి చేరుతాయని లెక్కలేసింది. అచ్చు అలాగే జరిగింది కూడా.. మళ్లీ నిజమయ్యేనా? ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలైన నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణింద్ర అగర్వాల్ తదితరులు ఈ సూత్రా ఆధారంగా కరోనా కేసులపై అంచనా వేశారు. దాని ప్రకారం ఏప్రిల్ మధ్యకల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని తేలింది. ‘ఇటీవల కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే అత్యధిక కేసులు నమోదయ్యే సమయం ఏప్రిల్ 15–20 తేదీల మధ్య ఉంటుందని చెప్పొచ్చు. తక్కువ కాలంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నా.. తర్వాతి కాలంలో కేసులు తగ్గే వేగం కూడా అదే స్థాయిలో ఉండొచ్చు. మే నెల చివరికి కేసుల సంఖ్య అత్యల్పమవుతుంది’అని మణింద్ర అగర్వాల్ తెలిపారు. మూడు అంశాల ఆధారంగా.. కరోనా కేసులు పతాక స్థాయికి చేరేదెప్పుడన్న అంశాన్ని లెక్కకట్టేందుకు సూత్రా గణితశాస్త్ర మోడలింగ్‌లో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వ్యాధిబారిన పడ్డ ఒక్కో వ్యక్తి ఎంత మంది ఇతరులకు వ్యాధి సోకేలా చేయగలడన్నది ఒకటి. గుర్తించిన కేసులతో పోలిస్తే గుర్తించని కేసులెన్ని అన్నవి మిగిలిన రెండు అంశాలు. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ గుర్తించని కేసులూ ఎక్కువవుతాయి. మార్చిలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 50 శాతం వరకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇందుకు ప్రజల ఉదాసీనత, రూపాంతరిత వైరస్లు కారణాలు కావొచ్చని చెప్పారు. దేశంలో సెకండ్ వేవ్ ఉండదని సూత్రా మోడల్ గతేడాది వేసిన లెక్కల్లో పేర్కొంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో కొన్ని అంశాల్లో వచ్చిన మార్పులు కేసుల సంఖ్య మళ్లీ పెరిగిందుకు కారణమై ఉండొచ్చని వివరించారు. ఈ కారణంగానే తాము కొంచెం సమయం తీసుకుని కొత్త అంచనాలు రూపొందించామని చెప్పారు. ఇకపై పంజాబ్ వంతు? ప్రస్తుతం దేశం మొత్తమ్మీద రోజువారీగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. మరికొన్ని రోజుల్లో పంజాబ్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా ఎక్కువ కావడం మొదలవుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘అతి తక్కువ కాలంలోనే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు ఎప్పుడు చేరతాయన్నది అంచనా వేయడం కొంచెం కష్టమైన విషయమే. ఆ తర్వాత నుంచి మాత్రం కేసులు ఎక్కువ కావొచ్చు.. తక్కువయ్యేందుకూ అవకాశం ఉంది. అయితే ఇదంతా ఏప్రిల్ 15–20 మధ్యలోనే జరుగుతుందని భావిస్తున్నాం’అని వివరించారు. అశోక యూనివర్సిటీ శాస్త్రవేత్త గౌతమ్ మీనన్ వేసిన లెక్కల్లోనూ కేసుల సంఖ్య ఏప్రిల్ 15–మే 15 మధ్యకాలంలోనే పతాక స్థాయికి చేరుతుందని తేలింది. చదవండి: వారంపాటు లాక్డౌన్.. కుటుంబాలు రోడ్డున పడతాయి -
కరోనా కట్టడి : పోర్టబుల్ వెంటిలేటర్లు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందుతుండటంతో ప్రతిష్టాత్మక సంస్థ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఐఐటీ కాన్పూర్ అతితక్కువ ధరకే లభ్యమయ్యే పోర్టబుల్ వెంటిలేటర్లను అభివృద్ధి చేస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం లభ్యమయ్యే ఇన్వేజివ్ వెంటిలేటర్ల ధర ఒక్కోటి రూ 4 లక్షలు కాగా, తాము అభివృద్ధి చేసే వెంటిలేటర్ రూ 70,000కే అందుబాటులో ఉంటుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు వెల్లడించారు. తాము తయారుచేసే వెంటిలేటర్లలో విడిభాగాలన్నీ భారత్ నుంచే లభ్యమవుతాయని వారు చెప్పారు. ఈ పోర్టబుల్ వెంటిలేటర్ ప్రోటోటైప్‌ను ఐఐటీ కాన్పూర్ ఇంక్యుబేటర్‌లో నిఖిల్ కురూలే, హర్షిత్ రాధోర్లకు చెందిన స్టార్టప్ నొక్కా రోబోటిక్స్ అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రొటోటైప్‌ను అత్యున్నత వైద్య నిపుణులతో కూడిన కమిటీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే నెలలో దాదాపు 1000 పోర్టబుల్ వెంటిలేటర్లను ఈ స్టార్టప్ సిద్ధం చేయనుంది. మొబైల్ ఫోన్‌కు శాశ్వతంగా కనెక్ట్ చేయబడి ఉండే ఈ వెంటిలేటర్‌ను ఫోన్ ద్వారానే నియంత్రిస్తూ కీలక సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చని కాన్పూర్ ఐఐటీ బృందం వెల్లడించింది. అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్‌ను దీనికి అటాచ్ చేసే వెసులుబాటు ఉందని తెలిపింది. చదవండి : కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి! -
పుల్లెల గోపీచంద్‌కు డాక్టరేట్
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. శుక్రవారం విద్యా సంస్థ 52వ స్నాతకోత్సవంలో... గోపీకి ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె.రాధాకృష్ణన్ రజత ఫలకం అందివ్వగా, ఐఐటీ డైరెక్టర్ ప్రొ. అభయ్ కరన్‌దికర్ డాక్టరేట్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు. -
హక్కుల కార్యకర్తలను విడుదల చేయండి
లక్నో: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సుధా భరద్వాజ్ సహా పలువురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా రచయితలు, మేధావులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు కొనసాగింపుగానే ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. భరద్వాజ్‌కు బెయిల్ రాకుండా చేసేందుకే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు ఆమెపై కేసు నమో దు చేశారన్నారు. భరద్వాజ్ పేరును చెడగొట్టేలా అధికారులు తప్పుడు కథనాలను కొన్ని టీవీ చానల్స్ ద్వారా ప్రసారం అయ్యేలా చేశారన్నారు. సుధా భరద్వాజ్ సహా పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల కార్యకర్తలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులపై జాతీయ మానవహక్కుల కమిషన్‌తో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. -
అడ్వాన్స్‌డ్‌లో మరో 13,850 మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్‌ను ఐఐటీ కాన్పూర్ మరింత తగ్గించింది. ఈ నెల 10న ప్రకటించిన ఫలితాల్లో 18,138 మందే అర్హత సాధించడంతో తాజాగా కటాఫ్ మార్కులను తగ్గించి అర్హుల సంఖ్యను పెంచింది. మొదట ఓపెన్ కేటగిరీలో కటాఫ్ 126 మార్కులు ఉండగా, తాజాగా దానిని 90 మార్కులకు తగ్గి ంచింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనూ కటాఫ్‌ను తగ్గించింది. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య 31,988కి పెరిగింది. తాజా తగ్గింపుతో 13,850 మంది విద్యార్థులకు అర్హత లభించింది. గత నెల 20న జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు 2.31 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా, 1,65,656 మంది దరఖాస్తు చేసుకోగా, 1,55,158 మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. కటాఫ్ మార్కులను తగ్గించడంతో అర్హత సాధించిన బాలికల సంఖ్య రెట్టింపైంది. ఇంతకుముందు ప్రకటించిన ఫలితాల్లో 2,076 మంది బాలికలే అర్హత సాధించగా.. ప్రస్తుతం వారి సంఖ్య 4,179కి పెరిగింది. తాజా తగ్గింపుతో అదనంగా 2,013 మంది బాలికలకు అర్హత లభించింది. 1:2 రేషియో ఉండాలనే.. ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హుల సంఖ్య తగ్గడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సమీక్షించింది. గత సంవత్సరాల కంటే ఈసారి అ ర్హుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించింది. అందుబాటులో ఉన్న సీట్లకు కనీసం 1:2 నిష్పత్తిలో అర్హులుండాలని ఐఐటీ కాన్పూర్‌కు తెలిపింది. దీంతో కటాఫ్ మార్కులను తగ్గించి, అర్హుల సంఖ్యను పెంచింది. తగ్గిన కటాఫ్ మార్కుల ప్రకారం అర్హత సాధించిన వారి ఫలితాలను వెబ్సైట్లో ఉంచింది. నేటి నుంచి కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడు దశల్లో ఈ కౌన్సె లింగ్‌ను నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు 25వ తేదీ వరకు అవకాశం కల్పించి, 27న మొదటి దశ సీట్లను కేటాయించనుంది. జూలై 3న రెండో దశ, 6న మూడో దశ, 9న నాలుగో దశ, 12న ఐదో దశ, 15న 6వ దశ, 18న చివరి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కటాఫ్ మార్కుల వివరాలు ఇవీ.. కేటగిరీ ఇదివరకు తాజాగా ఓపెన్ 126 90 ఓబీసీ నాన్ క్రీమీలేయర్ 114 81 ఎస్సీ 63 45 ఎస్టీ 63 45 వికలాంగులు 63 45 -
జేఈఈ అడ్వాన్స్డ్: సప్లిమెంటరీ మెరిట్ జాబితా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2018 అర్హుల సంఖ్య పెరిగింది. తొలుత ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాలకు అదనంగా మరికొంత మంది అర్హుల జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం విడుదలైన ఫలితాల్లో 18,138 మంది అర్హత సాధించారు. తాజాగా అనుబంధ(సప్లిమెంటరీ) మెరిట్ జాబితాలో 13,842 మంది అదనంగా అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. అంటే మొత్తం 31,980 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు పొందనున్నారు. గత ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడాదే తక్కువ మంది అర్హత సాధించడంతో కేంద్ర మానవ వనరులు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారీగా ఐఐటీ సీట్లు ఉండటం, ఒక్కో సీటుపై కేంద్ర ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుండటంతో.. కొత్త మెరిట్ లిస్ట్‌ను రూపొందించాల్సిందిగా ఐఐటీ కాన్పూర్‌కు సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఐఐటీ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదన్నారు.. ప్రభుత్వం ఐఐటీల కోసం భారీగా ఖర్చు చేస్తుందని గుర్తుచేశారు. దీంతో కట్ ఆఫ్ తగ్గించిన ఐఐటీ కాన్పూర్ కొత్త జాబితాను రూపొందించింది. అయిన్పటికీ గతేడాదితో పోల్చితే ఇది తక్కవే అని చెప్పాలి. 2017లో 50,455 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది మే 20న నిర్వహించిన ఈ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలను ఐఐటీ కాన్పూర్ యూనివర్సిటీ మే 20న నిర్వహించింది. ఫలితాలు జేఈఈ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో అందుబాటులో ఉన్నాయి. ‘సాక్షి’ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనూ ఫలితాలు చూడవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ 2018 పరీక్షకు 1,55,158 మంది హాజరవగా 18,138 మంది ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. వీరిలో 16,062 మంది పురుషులు, 2076 మహిళలు ఉన్నారు. రూర్కి ఐఐటీకి చెందిన ప్రణవ్ గోయల్ ఆలిండియా టాప్ ర్యాంకు సాధించారు. ప్రణవ్ 360 మార్కులకు గాను 337 మార్కులు పొందారు. ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకు, ఢిల్లీ ఐఐటీకి చెందిన కాలాష్ గుప్తా మూడో ర్యాంకు పొందారు. మహిళల క్యాటగిరిలో మీనాల్ ప్రకాశ్ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. మీనాల్ 318 మార్కులు పొంది సీఆర్ఎల్లో ఆరో ర్యాంకు సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో.. విశాఖపట్నంకు చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ చోడిపిల్లి ఆలిండియా ఏడో ర్యాంకు సాధించడంతో పాటు కాన్పూర్ ఐఐటీ పరిధిలో టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ క్యాటగిరిలో హైదరాబాద్ విద్యార్థి శివతరుణ్ మొదటి ర్యాంకు సాధించారు. కాన్పూర్ ఐఐటీ పరిధిలో మహిళల విభాగంలో వినీత వెన్నెల 261మార్కులు సాధించి టాప్‌లో నిలిచారు. -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రవేశాలకు షెడ్యూలును విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. అందులో టాప్ 2.31 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా ప్రకటించింది. గత నెల 20న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1.64 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వాటి ఫలితాలను ఈనెల 10న ప్రకటించేందుకు ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది. దీంతో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు జోసా బుధవారం కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది. 7 దశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టింది. కౌన్సెలింగ్‌ను జూలై 19 నాటికి పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కాగా, విద్యా సంస్థలు, బ్రాంచీల వారీగా అందుబాటులో ఉండే సీట్ల వివరాలు, బిజినెస్ రూల్స్‌ను తర్వాత జారీ చేస్తామని జోసా వెల్లడించింది. గతేడాది మొత్తం 37 వేల వరకు సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా ఈసారి కూడా అంత మొత్తం సీట్లు అందుబాటులో ఉండే అవకాశముంది. ఐఐటీల్లో దాదాపు 11 వేలు, ఎన్ఐటీల్లో 18 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 3,343 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ► జూన్ 10: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ► 15న ఉదయం 10 గంటల నుంచి: ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు రాసిన వారు జూన్ 18 తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ► జూన్ 19న ఉదయం 10 గంటలకు: మాక్ సీట్ అలొకేషన్–1 డిస్ప్లే (జూన్ 18న ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా). ► 24న ఉదయం 10 గంటలకు: మాక్ సీట్ అలొకేషన్ 2 డిస్ప్లే (జూన్ 23 వరకు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా). ►25న సాయంత్రం 5 గంటలకు: విద్యార్థులు రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ముగింపు. ► 26న: డేటా పరిశీలన, సీట్ అలొకేషన్ పరిశీలన. ► 27న ఉదయం 10 గంటలకు: మొదటి దశ సీట్ల కేటాయింపు. ► జూన్ 28 నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. ► జూలై 3న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయం త్రం 5 గంటలకు: రెండో దశ సీట్ల కేటాయింపు. ► 4, 5 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 6న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్లు కేటాయింపు. ► 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 9న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాల ప్రకటన. సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు. ► 10, 11 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 12న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు. ► 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 15న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఆరో దశ సీట్ల కేటాయింపు. ► 16, 17 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. సీట్ల ఉపసంహరణకు ఇదే చివరి అవకాశం. ► 18న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ సీట్ల కేటాయింపు. ► 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. కాలేజీల్లో చేరడం. -
వి‘జేఈఈ’భవ!
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈనెల 20న నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలని పేర్కొంది. అభ్యర్థులు ఉదయం 7:30 గంటలకే పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించింది. నిర్ణీత సమయం తర్వా త నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు 2,31,024 మందికి అర్హత కల్పిస్తే.. 1,64,822 మందే పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 18 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అంచనా. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇవి తీసుకెళ్లవద్దు.. బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్, చైన్, నెక్లెస్ వంటి ఆభరణాలు, హెయిర్‌పిన్, హెయిర్ బ్యాండ్ వంటివి ధరించకూడదు. పర్సులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, హ్యాండ్ బ్యాగులు, వాచీలు, క్యాలికులేటర్, అద్దాలు, సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదు. విద్యార్థులు పాటించాల్సినవి.. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ జిరాక్స్, ఫొటో, ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, కాలేజీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, పాన్‌కార్డు) వెంట తెచ్చుకోవాలి. ఉదయం 7:30 నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లాక బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్/వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత 7:45 గంటలకు పేపర్–1 పరీక్షకు, మధ్యాహ్నం 12:45 గంటలకు పేపర్–2 పరీక్ష కోసం విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. తొలుత కంప్యూటర్ స్క్రీన్‌పై పేరు, ఫొటో, రోల్‌నంబర్ కనిపిస్తుంది. అభ్యర్థులు లాగిన్ అయ్యాక ముందుగా సూచనలు చదువుకోవాలి జోన్ల వారీగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థులు జోన్ విద్యార్థుల సంఖ్య ఐఐటీ బాంబే 28,813 ఐఐటీ ఢిల్లీ 31,884 ఐఐటీ గౌహతి 11,907 ఐఐటీ కాన్పూర్ 20,428 ఐఐటీ ఖరగ్‌పూర్ 19,145 ఐఐటీ మద్రాసు 38,231 ఐఐటీ రూర్కీ 14,414 మొత్తం 1,64,822 -
హాస్టల్లోనే ఎన్నోసార్లు నాపై దారుణం!
సాక్షి, కాన్పూర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కల్యాన్పూర్ సీఐ నవీన్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐఐటీ కాన్పూర్ విద్యార్థినికి ఐఏఎఫ్ అధికారి సితాన్షుతో సోషల్ మీడియాలో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అతడు తరచుగా గర్ల్స్ క్యాంపస్‌కు వచ్చేవాడు. పరిచయంతో లొంగదీసుకున్న అధికారి పెళ్లి చేసుకుంటానని విద్యార్థినిని నమ్మించాడు. కొన్నిసార్లు హాస్టల్లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలిపారు. బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన సితాన్షు తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడని బాధితురాలు చెబుతోంది. ఆపై పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఆ విద్యార్థిని వాపోయింది. నిందితుడితో పాటు అతడి సోదరి, బామ్మర్ది, ఓ స్నేహితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.