Kidnapping case
-
అంజుమ్ కేసులో.. పోలీసుల వైఫల్యం
పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక అశి్వయ అంజుమ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటముంచి హత్యచేసిన కేసును ఛేదించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు పార్టీ నేతలతో కలిసి శనివారం అశి్వయ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాగితాలు కాలిపోతే తమపై ఆరోపణలు చేస్తూ హెలికాప్టర్లో డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఉన్నపళంగా పంపిన సీఎంచంద్రబాబు.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు.న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ఉద్యమిస్తామన్నారు. హత్య కేసులో సీసీటీవీ పుటేజ్ కానీ, ఆధారాలు కానీ లేవని.. పోస్టుమార్టంలో ఏం వచ్చిందన్న విషయాలు కూడా వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విషయంలో ఏం చేస్తున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు రానున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. పోలీసులు స్పందించడంలేదు : మిథున్‌రెడ్డి గత కొద్దిరోజుల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురైన సంఘటనలో నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదని, దీని వెనుక ఉన్న లోగుట్టు వెల్లడించాలని ఎంపీ మిధున్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారి అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వారం రోజులుగా బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. పట్టణ ప్రజలు నిద్రహారాలు మాని ఆందోళనలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని విమర్శించారు. ఈనెల 9న బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉన్నపళంగా పుంగనూరు పర్యటనకు రావడం విస్మయానికి గురిచేస్తోందని.. వారం రోజులుగా స్పందనలేని ముఖ్యమంత్రికి, మంత్రులకు జగనన్న వస్తున్నారనే వార్త స్పందన కలిగించిందని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని
క్రియా హెల్త్‌కేర్ వివాదంలో బలవంతపు షేర్లు, యాజమాన్య బదిలీ వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని పేరు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితుల జాబితాలో ఆయన కూడా ఉన్నారని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, వ్యాపారుల పట్ల బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌పై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం విషయాన్ని తెలుసుకున్న క్రియా హెల్త్‌కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను కొద్దిరోజుల క్రితం సంప్రదించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌లో చిక్కుకున్న వారిలో కొందరు గతంలో తనను కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తాజాగా ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న నిర్మాత నవీన్ యర్నేని, గోపాలకృష్ణ సూరెడ్డి,రాజ్ తలసిల, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్రావులను నిందితుల జాబితాలో తాజాగా చేర్చారు. దీంతో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. -
TG: ఎవరా పెద్ద సారు?
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్ ఆఫీస్) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్ అప్) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది. కృష్ణారావు ద్వారా హయ్యర్ అప్ వద్దకు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్ అప్’కూడా ఒకరని సమాచారం. వేణు మాధవ్‌ను కిడ్నాప్ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్ కేర్ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్ డైరెక్టర్లు గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి... గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్ అప్ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్ చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్ సిట్ సమాచారం మేరకు.. 2018 నవంబర్ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్ దక్కించుకున్న వేణుమాధవ్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు. తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్ చేయించారు. ఆ కాల్ అందుకున్న రాధాకిషన్ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు. ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్ అప్ విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది. సిట్ అదుపులో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు, సిట్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఎస్ఐబీ) ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
కిడ్నాప్ చేసి.. బెదిరించి
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. క్రియా హెల్త్‌కేర్ వివాదంలో తలదూర్చి దాని డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటిని కిడ్నాప్ చేసి, షేర్లు, యాజమాన్య బదిలీ చేయించడంతో పాటు రూ.10 లక్షలు వసూలు చేసిన ఆరోపణలపై దీన్ని రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ సైతం నిందితులుగా ఉన్నారు. ఇది సోమవారమే రిజిస్టర్ కాగా... బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాధాకిషన్‌రావుపై కూకట్పల్లి ఠాణాలో బెదిరింపుల కేసు నమోదైన విషయం విదితమే. మరోపక్క అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. వారం రోజుల పాటు ఆయ న్ను వివిధ కోణాల్లో ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్త వేణును ఎలా ట్రాప్ చేశారంటే.. నగరానికి చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 165 పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, టెలి మెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వాహనాలతో సహా ప్రధాన ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించేది. 2016 నాటికి క్రియా హెల్త్‌కేర్ మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను చేజి క్కించుకుని ఐదేళ్లల్లో తమ ప్రాజెక్టు విలువను రూ.250 కోట్లకు పెంచుకుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు గోపాల్, రాజ్, నవీన్, రవి క్రియాలో పార్ట్ టైమ్ డైరెక్టర్లుగా చేరారు. 2015లో బాలాజీ ఈ సంస్థకు సీఈఓగా నియమితులయ్యారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి క్రియా హెల్త్‌కేర్‌లో ఆరుగురు డైరెక్టర్లు ఉండగా... వేణు 60, బాలాజీ 20, గోపాల్ 10, రాజ్ 10 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారు. వీరిలో వేణు, బాలాజీ మాత్రమే ఫుల్‌టైమ్ డైరెక్టర్లు. 2018లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాన్ ఎమర్జెన్సీ మొబైల్ హెల్త్‌కేర్ క్లినిక్‌ల ఏర్పాటుకు బిడ్డింగ్‌కు పిలిచింది. అందులో పాల్గొన్న క్రియా హెల్త్‌కేర్ 1500 మొబైల్ అంబులెన్స్ హెల్త్ క్లినిక్‌లను నడిపే ప్రాజెక్టును తీసుకునే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ పార్ట్‌టైమ్ డైరెక్టర్లు నలుగురూ వేణుకు ఉన్న 60 శాతం షేర్లను తక్కువ విలువకు విక్రయించాలని పట్టుబట్టారు. సీఈఓ బాలాజీని కూడా వారి వైపు తిప్పుకున్నారు. రాధాకిషన్‌రావు తనదైన శైలిలో బెదిరించి.. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్బలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన క్రియా హెల్త్‌కేర్ కంపెనీలోని షేర్లు, యాజమాన్యం వదులుకోవాలని హెచ్చరించారు. రాధాకిషన్‌రావుతో పాటు ఇతర నిందితుల సమక్షంలో నాటకీయ పరిణామాల మధ్య తుపాకులు, కర్రలతో బెదిరించడంతో గత్యంతరం లేక వేణు సెటిల్మెంట్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. వేణు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి గట్టుమల్లు, మల్లికార్జున్‌తో కూడిన బృందం ఈ విషయాన్ని పోలీసులు, మీడియా, కోర్టుల్లో ఎవరి దృష్టికి తీసుకువెళ్లినా ప్రాణహాని ఉంటుందని హెచ్చరించి పంపింది. తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాధాకిషన్‌రావుపై కోర్టు ద్వారా పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గట్టుమల్లు రాచకొండ ఐటీ సెల్లో, మల్లికార్జున్ ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. మల్లికార్జున్ సుదీర్ఘకాలం వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్‌లో ఎస్సైగా పని చేశారు. పదోన్నతి తర్వాత రాధాకిషన్‌రావు సిఫార్సుతోనే ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. రూ.40కోట్ల షేర్లను రూ.40 లక్షలకే బదిలీ చేయించుకుని .. ♦ ఇదిలా ఉండగా.. గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేగే చంద్రశేఖర్ తన కంపెనీలో పెట్టుబడి కోసం 2018 మార్చిలో వేణుమాధవ్‌ను సంప్రదించారు. ఆ సందర్భంలోనే క్రియా హెల్త్‌కేర్ వివాదాలు తెలుసుకుని, పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో మాట్లాడి విషయం సెటిల్ చేస్తానని చెప్పారు. ఇలా మార్కెట్లో రూ.40 కోట్ల విలువైన షేర్లను కేవలం రూ.40 లక్షలకే వేణు నుంచి బదిలీ చేయించుకున్నారు. నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో అతడు మరో రహస్య ఒప్పందం కేసుకుని తనను మోసం చేసినట్లు వేణుకు తర్వాత తెలిసింది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రాజెక్టు ప్రారంభించడానికి గడువు సమీపిస్తుండటంతో 2018 నవంబర్‌లో చంద్రశేఖర్ వేగే, గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి అప్పటి టాస్‌్కఫోర్స్ డీసీపీ పి.రాధా కిషన్ రావును ఆశ్రయించారు. కంపెనీకి సంబంధించిన మిగిలిన షేర్లనూ తమకు ఇప్పించమని వీళ్లు కోరా రు. దీంతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్్క ఫోర్స్ ఎస్సై మల్లికార్జున్ అదే నెల 22న ఉద యం 5.30 గంటలకు వేణును తమ సిబ్బందితో కలిసి కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. -
ఇల్లెందులో వీగిన అవిశ్వాసం
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. సమావేశానికి త గిన కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా ఎన్నిక ల అధికారిగా వ్యవహరించిన కొత్తగూడెం ఆర్డీఓ శిరీష ప్రక టించారు. కౌన్సిలర్ల అవిశ్వాసం నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సి లర్లకు గాను కోరం సరిపోవాలంటే 17 మంది హాజరు కావా ల్సి ఉంది. అయితే సమావేశ సమయానికి ఇద్దరు తక్కువగా 15 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కొంత సమయం ఇస్తూ సమావేశం వాయిదా వేశారు. తర్వాత 12 గంటలకు మరోమారు సమావేశపర్చగా అప్పటికీ 15 మంది మాత్రమే ఉండడంతో కోరం లేదని ఈవో ప్రకటించారు.17 మంది రాత్రికే చేరుకున్నా..: అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పెన్షనర్ భవన్ లోకి ఆదివారం రాత్రికే 17 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వారంతా మున్సిపల్ కార్యాలయంలోకి పరుగులు తీశారు. అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట వేచి ఉన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని గమనించారు. కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్‌ను కాంగ్రెస్ శ్రేణులు ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి, వెనుక నుంచి రోడ్డుపైకి తీసుకెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ కారులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదే క్రమంలో పెన్షనర్ భవన్లో దాక్కుని ఉన్న సీపీఐ కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ బయటకు రాగానే కాంగ్రెస్, దాని మిత్రపక్ష సీపీఐ శ్రేణులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని విడిపించారు. అయితే అప్పటికే మున్సిపాలిటీలో తమ సభ్యుడి కోసం కాచుకుని కూర్చున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా రవీందర్‌తో మాట్లాడటంతో ఆయన కార్యాలయం వెనుక గోడ దూకి పారిపోయారు. ఇలా ఇద్దరు సభ్యులు తక్కువ కావడంతో కోరం చాలక అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు వాగ్వాదానికి దిగారు. గంట పాటు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ వెంకటేశ్వరావుపై ఫిర్యాదు చేశారు. కోరం కనకయ్యపై కేసు నమోదు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు సతీమణి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు 17 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఎంపీపీ నాగరత్నమ్మ, ఆమె భర్త జానీ తదితరులపై కేసు నమోదైందని వివరించారు. -
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
పుట్టపర్తి టౌన్: చిన్నారి కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. వివరాలను ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. శనివారం రాత్రి పుట్టపర్తిలోని మోర్ సూపర్ బజార్ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల వయసున్న బాలిక లక్షిత (5)ను చాక్లెట్లు, టపాసులు కొనిస్తానంటూ ఓ యువకుడు నమ్మించి అపహరించుకెళ్లాడు. పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు గిరినాయక్, అరుణబాయి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ వాసుదేవన్, సీఐ కొండారెడ్డి నేతృత్వంలో పోలీసులు బృందాలుగా సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా విడిపోయి స్థానిక యువకుల సాయంతో గాలింపు చేపట్టారు. పోలీసులు అప్రమత్తమైన విషయం తెలుసుకున్న యువకుడు చిన్నారిని ప్రశాంతి నిలయం సమీపంలో వదిలి ఉడాయించాడు. ఆదివారం తెల్లవారుజామున చిన్నారిని గుర్తించిన పోలీసులు సురక్షితంగా ఎస్పీ సమక్షంలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన విద్యార్థులు.. తప్పిపోయిన విద్యార్థులను ఆదివారం ఉదయం ఎస్పీ సమక్షంలో తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. వివరాలను ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. కదిరి, ఓడీచెరువు మండలం దిగువ గంగంపల్లి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు ఓడీచెరువులోని ఓ ప్రైవేట్ పాఠశాల వసతి గృహంలో ఉంటూ అక్కడే పదో తరగతి చదువుకుంటున్నారు. ఈ నెల 6న కటింగ్ చేయించుకుని వస్తామంటూ వార్డెన్‌తో అనుమతి తీసుకుని బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు సాయంత్రమైనా హాస్టల్‌కు చేరుకోలేదు. దీంతో అనుమానం వచ్చి పాఠశాల హెచ్ఎం రామకృష్ణ వెంటనే ఓడీచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వాసుదేవన్, సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. విద్యార్థులు బెంగుళూరులోని శివాజీనగర్‌లో ఉన్నట్లు గుర్తించి, అక్కడకెళ్లి పిలుచుకొచ్చారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి సమక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. -
కిడ్నాప్ కేసులో దస్తగిరి అరెస్ట్
ఎర్రగుంట్ల: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు ఓ కిడ్నాప్ కేసు వ్యవహారంలో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిపై కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు. వేర్వేరు కులాలకు చెందిన ఇమాంబీ, లక్ష్మీనారాయణ డిగ్రీ చదువుతోన్న సమయంలో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో లక్ష్మీనారాయణతో కలిసి ఇమాంబీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి «విచారణ చేపట్టిన అనంతరం ఇమాంబీని సీఐ ఈశ్వరయ్య తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టారు. ఇమాంబీ వయసు 18, లక్ష్మీనారాయణ వయసు 21 కావడంతో ఇమాంబీని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇమాంబీ తల్లిదండ్రులు వద్దంటూ సుందరయ్య కాలనీలోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇమాంబీ తల్లిదండ్రులు దస్తగిరి, మరికొందరితో కలసి ఈ నెల 30న లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చారు. అక్కడ ఉన్న ఇమాంబీని బలవంతంగా ఈడ్చుకుని వెళ్లారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణను దస్తగిరి కులం పేరుతో దూషించాడు. అతడి వెంట ఉండే ఎస్కార్ట్ పోలీసులను ప్రొద్దుటూరుకు పోవాలంటూ తప్పుదోవ పట్టించి కడప వైపునకు బయలుదేరాడు. ఎస్కార్ట్ పోలీసులు యర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యకు సమాచారమిచ్చారు. చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో దస్తగిరి వెళుతోన్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో ఇమాంబీ ఉంది. ఘటనాస్థలికి వెళ్లి చుట్టు పక్కల వారిని విచారించగా ఇమాంబీని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి, లక్ష్మీనారాయణను కులం పేరుతో దూషించినట్లు స్పష్టమైంది. దీంతో ఈ విషయంపై 2 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దస్తగిరి (పులివెందుల), ఎస్ ఇమ్రాన్ (వేముల) బాష, ఎస్ రమీజా(యర్రగుంట్ల), ఎస్.అశి్వన్(పులివెందుల), ఎస్ హైదర్బీ (తొండూరు)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. -
తీరంలో యువతి నరకయాతన.. యువతితో వచ్చిన యువకుడి పరారీ
కూర్మన్నపాలెం: అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరకయాతన అనుభవించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతానికి చెందిన డి.కావ్యప్రియ (18), భీమవరం ప్రాంతానికి చెందిన ఫణీంద్ర అనే యువకుడితో కలిసి ఈ నెల 2వ తేదీ నుంచి అప్పికొండ శివాలయ పరిసర ప్రాంతంలో ఉంటుంది. ఆదివారం సాయంత్రం తీరం వద్ద రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటుండగా, ఎత్తు ప్రదేశం నుంచి జారి పడి రాళ్ల గుట్టల మధ్య ఉండిపోయింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను వదిలేసి యువకుడు పరారయ్యాడు. చిమ్మ చీకటి, జనసంచారం లేని ప్రదేశంలో రాత్రంతా మృత్యువుతో పోరాడిన ఆమెను సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు గుర్తించి గజఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. కాలు జారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏమీ అనవద్దని ఆమె ప్రాథేయపడింది. యువతి తల్లికి అంబులెన్స్ సిబ్బంది సమాచారమివ్వగా, తాము విశాఖ వస్తున్నామని చెప్పారు. తమ కుమార్తె కనిపించడంలేదని యలమకుదురు పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లి చెప్పింది. కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు బందరు పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గాజువాక ఏసీపీ త్రినాఽథ్, దువ్వాడ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేజీహెచ్‌కు చేరుకొని యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి పడిందా... లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే, అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్‌పేట్‌లో నివసించే బాలిక మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రాగా, ఓ ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి బైక్ మీద .. ఔటర్ రింగు రోడ్డు దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించటంతో.. ప్రతిఘటించి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ హిజ్రాను సాయం అడగటంతో.. ఆమె ఆ బాలిక కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇది.. నిన్నటి వరకు తెలిసిన కిడ్నాప్ కథ. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ బాలిక చెప్పిందంతా కేవలం కట్టు కథగా పోలీసులు తేల్చేశారు. అతనితో కలిసి వెళ్లి.. బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. స్నాప్ చాట్‌లో ఇరువురు ఫొటోలు కూడా పంపించుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడంతో బయట కలుసుకోవాలనుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఆ బాలిక బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకడు బైక్ మీద రాగా.. అతనితో కలిసి వెళ్లింది. చదవండి: నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి.. ఏడుస్తున్నట్టు నటిస్తూ.. అసలు నాటకం అక్కడే మొదలైంది.. ఆ బాలిక పరిగెత్తుకుంటూ వెళ్లి.. తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని, పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నిస్తే.. తప్పించుకుని వచ్చానని తనకు సాయం చేయమని ఏడుస్తున్నట్టు నటిస్తూ అక్కడ ఉన్న హిజ్రాను అడిగింది. దీంతో.. ఇదంతా నిజమేనని నమ్మిన హిజ్రా.. వెంటనే ఆ బాలికకు ధైర్యం చెప్పి.. పోలీసులకు సమాచారం అందించింది. కాగా.. పోలీసులు కూడా ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మేశారు. కానీ.. విచారణలో అసలు నాటకం బయటపడింది. చదవండి: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్! -
కిడ్నాప్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరొకరితో వివాహం
హైదరాబాద్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో డబ్బులిచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కేసులో నింధితులను c పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘట్కేసర్ పీఎస్‌లో మల్కాజ్గిరి డీసీపీ జానకీ, ఏసీపీ నరేశ్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మేడిపల్లి, బుద్దానగర్కు చెందిన అవినాశ్‌రెడ్డికి అదే ప్రాంతంలో ఉంటున్న అరోషికారెడ్డితో 2015 నుంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు ఆమె అతడి నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి కోరగా పెళ్లి చేసుకుంటానని చెప్పిన అరోషికారెడ్డి ఈ విషయమై అతడి కుటుంబ సభ్యులతో కూడా చర్చించింది. అయితే 2018లో ఆమె పొరుగున ఉన్న చక్రధర్‌గౌడ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే అవినాశ్‌రెడ్డి వద్ద రూ. 25 లక్షలు చేతిరుణం తీసుకున్న ఆమె 2023లో రూ. 9 లక్షలు తిరిగి ఇచ్చేసింది. 20 రోజులుగా మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో తన భార్య తీసుకున్న డబ్బును ఇచ్చేస్తానని చక్రధర్‌గౌడ్ అవినాశ్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఘట్కేసర్ బైపాస్ రోడ్డులో జాతీయ రహదారి సమీపంలోని వందన హోటల్ వద్దకు రావాలని సూచించాడు. మేడ్చల్ ఇందిరానగర్‌కు చెందిన ఎలిగేటి నర్సింగ్‌రావ్, సికింద్రాబాద్‌కు చెందిన బౌత్ వినోద్, అడిక్మెట్కు చెందిన మామిళ్ల గౌతమ్‌రాజ్ కూడా అక్కడికి వచ్చారు. చక్రధర్ గౌడ్, అవినాశ్ రెడ్డి కారులో కూర్చుని మాట్లాడుకుంటుండగా కారులోకి వచ్చిన మిగతా ముగ్గురు అవినాశ్‌రెడ్డిపై దాడి చేసి అతడి మొబైల్ లాక్కొని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న అవినాశ్‌రెడ్డి ఘట్‌కేస్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ప్రధాన నిందితుడు చక్రధర్‌గౌడ్‌కు చెర్లపల్లి జైలులో నర్సింగరావుతో పరిచయం ఏర్పడింది. నర్సింగరావును బెయిల్‌పై బయటికి తీసుకువచ్చేందుకు చక్రధర్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. చక్రధర్‌గౌడ్‌పై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనేరేట్లలో 9 కేసులు ఉండగా, నర్సింగ్‌రావు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గంటల వ్యవధిలో కేసును చేధించిన సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు సుధాకర్, అశోక్, శ్రీకాంత్, ఇతర సిబ్బందిని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు. నిందితుల అరెస్ట్ -
టీడీపీ నాయకుడి దాష్టీకం
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నానిపై కిడ్నాప్ కేసు నమోదైంది. వడ్డీ చెల్లించడం లేదంటూ అప్పు తీసుకున్న వ్యక్తిని బంధించగా.. తప్పించుకున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నాని వద్ద వర్రేగూడెంకు చెందిన ఎస్కే అమీన్ అలియాస్ మున్నా కుటుంబ సభ్యులు ఆర్థిక అవసరాల నిమిత్తం 2014లో రూ.4 లక్షల అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోకపోవడంతో అమీన్ కుటుంబం కొన్ని నెలలుగా వడ్డీ చెలించడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుంచే నాని.. తాతా సురేష్ అనే వ్యక్తి సహాయంతో బుధవారం అమీన్ ఇంటికి వెళ్లి అందరూ చూస్తుండగా అతన్ని దుర్భాషలాడి బలవంతంగా బైక్ ఎక్కించుకొని బైపాస్‌రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో అమీన్‌ను బంధించి, అప్పు కట్టే వరకు వదిలేది లేదంటూ భీష్మించాడు. అతనిపై కర్రలతో దాడి చేశారు. జేబులో నగదు బలవంతంగా తీసుకుని సుమారు రెండు గంటల పాటు హింసించి వదిలారు. అక్కడి నుంచి బయట పడిన అమీన్ నేరుగా ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుంచే నాని, తాతా సురేష్‌పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కుంచే నాని, తాతా సురేష్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మొదటి నుంచీ ఇదే తీరు.. గత ప్రభుత్వంలో వడ్డీ వ్యాపారం పేరుతో అనేక మందిని హింసించిన కుంచె నాని.. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ పేదల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వడ్డీలు కట్టలేని వారిని బంధించి హింసిస్తున్నారు. ఇప్పుడు అమీన్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పరారీలో కుంచే.. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కుంచే నాని అతని అనుచరుడు సురేష్‌లపై కిడ్నాప్ కేసు నమోదు కాగా విషయం తెలుసుకున్న ఇరువురు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నారు. అయితే పోలీసులు ఇరువురిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మూడు బృందాలుగా ఏర్పడి కుంచే నాని, సురేష్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. -
క్రిమినల్ కథా చిత్రమ్.. అత్యంత కరడుగట్టిన నేరగాడు అతీక్ అహ్మద్
మాఫియా డాన్, గ్యాంగ్ లీడర్, హిస్టరీ షీటర్, రౌడీ షీటర్, మాఫియా–బాహుబలి, దబాంగ్, పొలిటి కల్ లీడర్.. ఇవన్నీ ఒకే వ్యక్తికి పర్యాయపదాలు. ఆ ఒక్కడే అతీక్ అహ్మద్. ఉత్తరప్రదేశ్‌లో అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అతడి తండ్రి అతీక్ అహ్మద్ పేరు మళ్లీ ప్రముఖంగా చర్చల్లోకి వచ్చింది. నిరుపేద టాంగావాలా కుమారుడైన అతీక్ అహ్మద్ రౌడీయిజంలో, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. రూ.వందల కోట్ల విలువైన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మించిన అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)ను అతీక్ అహ్మద్ సొంత జాగీరుగా మార్చేసుకొని, సమాంతర పాలన సాగించాడంటే అతడి హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వందకుపైగా కేసులు నమోదైనప్పటికీ.. ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు మినహా ఏ కేసులోనూ అతీక్‌కు శిక్ష పడలేదు. వ్యవస్థ మొత్తం అతడికి దాసోహమైందని, నిస్సిగ్గుగా ఊడిగం చేసిందని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. నేరాల నుంచి వ్యాపారాలు, వ్యాపారాల నుంచి రాజకీయాలు.. ఇలా సాగింది అతీక్ ప్రస్థానం. నేరాలను, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, శిక్షల నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలను రక్షణ కవచంగా వాడుకున్నాడు. 18 ఏళ్ల వయసులో తొలి ఎఫ్ఐఆర్ ► అతీక్ అహ్మద్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించాడు. టాంగా నడిపే అతడి తండ్రి హజీ ఫిరోజ్ నేరస్వభావం ఉన్నవాడే. అతీక్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో నేరమార్గం ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లతో చెలరేగిపోయాడు. 1983లో 18 ఏళ్ల వయసున్నప్పుడు అతీక్‌పై మొదటి ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అతడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు విసిరిన వల నుంచి చాలాసార్లు తప్పించుకున్నాడు. అతీక్‌పై నమోదైన కేసులను విచారించాలంటే న్యాయమూర్తులు వెనుకంజ వేసేవారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన 10 మంది జడ్జీ్జలు తమంతట తామే ఈ కేసుల విచారణ నుంచి తప్పుకున్నారు. అతీక్ చంపేస్తాడన్న భయమే ఇందుకు కారణం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక కూడా ప్రత్యర్థులను కిడ్నాప్ చేసి, తానున్న జైలుకు రప్పించి, తీవ్రంగా హింసించాడు. అతడిని ఉత్తరప్రదేశ్ జైళ్లలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉంచాలని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. కుటుంబం.. నేరమయం ► ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతీక్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్కౌంటర్లో హతం కావడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. కరడుగట్టిన నేరగాడైన అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు సైతం నేరాలబాట పట్టినవారే కావడం గమనార్హం. కొందరు ఇప్పటికే వేర్వేరు కేసుల్లో జైలుపాలయ్యారు. అతడి భార్య మాత్రం పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ► నేర సామ్రాజ్యాధినేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ కన్ను 1980వ దశకంలో రాజకీయాలపై పడింది. 1989లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. మతం కార్డు వాడుకున్నాడు. తన ప్రత్యర్థి చాంద్బాబాను హత్య చేశాడు. సులువుగా విజయం సాధించాడు. తొలిసారి ఎమ్మెల్యే హోదా సంపాదించాడు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1991, 1993లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. 1996లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌తో, 2002 ఆప్నా దళ్ టికెట్‌తో గెలిచాడు. 2002లో ఆప్నా దళ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడయ్యాడు. హెలికాప్టర్లలో తిరుగుతూ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశాడు. 2004లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరపున ఫూల్పూర్ ఎంపీగా ఘన విజయం సాధించాడు. పార్లమెంట్లో అడుగుపెట్టాడు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా నేరాలు ఆపలేదు. మరింత రాటుదేలాడు. బినామీల పేరిట కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇతర కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేసేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేశాడు. భారీగా ఆస్తులు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా పదికిపైగా రాష్ట్రాలకు అతీక్ నేరసామ్రాజ్యం విస్తరించింది. అచ్ఛంగా సినిమాల్లో చూపించే డాన్ల తరహాలోనే అతడి వ్యవహార శైలి, ప్రవర్తన ఉండేవి. తరచుగా గుర్రంపై వీధుల్లో తిరిగేవాడు. కొన్నిసార్లు ఖరీదైన కార్ల కాన్వాయ్ వెంటరాగా పాదయాత్ర చేస్తుండేవాడు. రాజుపాల్ హత్య కేసు ► 2005 జనవరి 25న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఎమ్మెల్యే రాజుపాల్ హత్యతో అతీక్ పతనం ప్రారంభమైంది. ఈ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశాడు. కానీ, ఓటమే ఎదురయ్యింది. 2004లో ఎంపీగా గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఉప ఎన్నికల్లో తన సోదరుడు అజీమ్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించుకున్నాడు. ఈ స్థానంలో నేరచరిత్ర ఉన్న రాజుపాల్కు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో అజీమ్ ఓడిపోయాడు. రాజుపాల్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో అతీక్, అజీమ్ నిందితులు. రాజుపాల్ హత్యతో మళ్లీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై అజీమ్ గెలిచాడు. అతీక్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయాడు. అసద్ అహ్మద్ ► ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో అసద్ అహ్మద్ నిందితుడు. చాలా రోజులు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. ► అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ► గురువారం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు గులామ్తోపాటు మరణించాడు. ► అతీక్ అహ్మద్ మరో ఇద్దరు కుమారులైన అజాన్, అబాన్ మైనర్లు. వారు ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ హోంలో ఉన్నారు. అతీక్ అహ్మద్ ► గత 43 ఏళ్లుగా పోలీసు రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ► ఉమేశ్‌పాల్ అపహరణ కేసులో అతీక్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ► ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. ► అతీక్ అహ్మద్ 1996లో షాయిస్తా పర్వీన్‌ను వివాహం చేసుకున్నాడు. ► వారికి ఐదుగురు కుమారులు.. అలీ అహ్మద్, ఉమర్ అహ్మద్, అసద్ అహ్మద్, అజాన్ అహ్మద్, అబాన్ అహ్మద్ ఉన్నారు. ► పాకిస్తాన్ ఉగ్రవాదులతో, అక్కడి నిఘా సంస్థ ఐఎస్ఐతో అతీక్ అహ్మద్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. అష్రాఫ్ అలియాస్ అజీమ్ అహ్మద్ ► అతీక్ అహ్మద్ సోదరుడే అష్రాఫ్/అజీమ్ అహ్మద్. ► ఇతడిపై మొత్తం 52 కేసులు ఉన్నాయి. ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ► 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో ఇతడిని ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషిగా తేల్చింది. ► యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. షాయిస్తా పర్వీన్ ► ఉమేశ్ పాల్ హత్య వ్యవహారంలో అతీక్ అహ్మద్, ఆష్రాఫ్ అహ్మద్‌తోపాటు షాయిస్తా పర్వీన్‌పై కేసు నమోదయ్యింది. ► పరారీలో ఉన్న పర్వీన్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ► ఆమె ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో రివార్డు మొత్తాన్ని రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచారు. అలీ అహ్మద్ ► బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడిన కేసులో 2021లో అలీ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. ► ఉమేశ్‌పాల్ హత్య కేసులోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది. ► అలీ అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది మార్చి 3న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు లక్నో జైలులో ఉన్నాడు. ► అలీ అహ్మద్ లాంటి నేరగాళ్లు బయట ఉంటే కేవలం సాక్షులకే కాదు, సమాజానికి సైతం ముప్పేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఉమర్ అహ్మద్ ► లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైస్వాల్ కిడ్నాప్, దాడి కేసులో అతీక్ అహ్మద్‌తోపాటు ఉమర్ అహ్మద్‌పై 2018 ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ► అదే కేసులో ఉమర్ అహ్మద్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ సెంట్రల్ జైలులో ఉన్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
ప్రయాగ్‌రాజ్(యూపీ): 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్–రాజకీయ నేత అతీక్ అహ్మద్, మరో ఇద్దరికి కఠిన జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తలా రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. అతీక్‌పై నమోదైన 100కు పైగా కేసుల్లో శిక్ష పడిన మొట్టమొదటి కేసు ఇదే. ఇదే కేసులో అతీక్ సోదరుడు ఖాలిద్ అజీం అలియాస్ అష్రఫ్, మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళతామని అతీక్ పోలీస్ వ్యాన్ నుంచి విలేకరులతో అన్నాడు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురినీ వేర్వేరు వ్యాన్లలో నైని జైలుకు తరలించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు హత్య కేసులో అహ్మద్ తదితరులు నిందితులు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను అతీక్ కిడ్నాప్ చేసి, బెదిరించాడు. ఈ కేసులో అతీక్ జైలుపాలయ్యాడు. -
Umesh Pal kidnapping case: గ్యాంగ్‌స్టర్ అతిక్‌ని దోషిగా తేల్చిన కోర్టు!
2006 ఉమేష్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అతిక్‌తోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులుగా ఉన్న అతిక్, అతని సోదరుడిని నేడు ప్రయాగ్‌రాజ్ కోర్టు ముందు హజరు పరిచారు. కాగా యూపీ పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఇది ఈ కోర్టు జోక్యం చేసుకునే కేసు కాదని తేల్చి చెప్పింది. దీనికోసం కావాలంటే హైకోర్టుని ఆశ్రయించమని చెప్పింది. ఈ మేరకు అతిక్ అహ్మద్, అతని సోదరుడిని భారీ భద్రత మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు యూపీ పోలీసులు. భారీ బందోబస్తు నడుమ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు తానే సాక్షినని ఉమేష్‌పాల్ పోలీసులను ఆశ్రయించాడు. 2006లో ఉమేష్ పాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోమంటూ అతిక్ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉమేష్. ఐతే అతను కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఈ కేసు విషయమై అతిక్ అహ్మద్, అతని సోదరుడి తోసహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి) -
ఆదిబట్ల కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న విచారణ
-
మరోసారి వైశాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు
-
ఏపీలో నవీన్‌రెడ్డి?
ఇబ్రహీంపట్నం రూరల్: వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా పరారీలో ఉన్న మరో ముగ్గురి నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అతనితో పాటు మిగిలిన ముగ్గురు వాడిన కారు కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. నిందితులు సెల్ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవీన్‌రెడ్డి, పంజాబ్ ప్రాంతాల్లో రుమెన్, చందు, సిద్ధు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నిందితులున్న ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. నవీన్‌రెడ్డి మొదటి నుంచీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దిట్ట అని తెలుస్తోంది. ఎప్పుడు ఫోన్లు వాడినా వాట్సాప్ ద్వారానే మాట్లాడే నవీన్‌రెడ్డి ఒకటి రెండు రోజుల్లో చిక్కే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ►ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడలో నివసించే దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతుల కూతురుపై దాడికి పాల్పడి, ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి, దాడికి పాల్పడిన 32 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్ కథ çసుఖాంతం అయినప్పటికీ ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మాత్రం నేటికీ పోలీసులకు చిక్కలేదు. దీంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న చోట జల్లెడ పట్టారు. నవీన్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కాగా, నవీన్‌రెడ్డిపై అతని స్వగ్రామంలో చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర సరిహద్దులు దాటిన నిందితులు వైద్య విద్యార్థిని కిడ్నాప్ చేసిన రోజు నవీన్ కుటుంబ సభ్యులను పోలీసులు గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. కనిపిస్తే ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో నిందితుడు మాల్ నుంచి హాలియా మధ్యలో వైద్య విద్యార్థిని వదిలేసి వెళ్లాడు. నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో 9న కారును స్నేహితులకు వదిలేసి ద్విచక్ర వాహనం లిఫ్ట్ అడిగి పారిపోయినట్లు సమాచారం. నవీన్‌తో ఉన్న చందు, సిద్ధు, రుమెన్ కారుతో ఉడాయించినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్టు
ఇబ్రహీంపట్నం రూరల్: సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ ఘటనలో మొత్తం 36 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో 32 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సంపద హోమ్స్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన దుండగులు సినీఫక్కీలో వైద్య విద్య అభ్యసిస్తున్న యువతిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆదిభట్ల పోలీసుల విస్తృత గాలింపు నేపథ్యంలో కిడ్నాపర్లు వదిలి పెట్టడంతో, శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా రంగంలోకి దిగారు. శనివారం 32 మంది నిందితులను అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వారందరూ మిస్టర్ టీ పాయింట్లలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. నాగారం భాను ప్రకాశ్, రాథోడ్ సాయినాథ్, నాగారం కార్తీక్, గానోజీ ప్రసాద్, కొత్తి హరి, రాథోడ్ అవినాష్, అరిగేల రాజు, సోనుకుమార్ పాశ్వాన్, ఇర్ఫాన్, నీలేశ్‌కుమార్, బిట్టుకుమార్ పాశ్వాన్, పున్నా నిఖిల్, ఇస్లావత్ అనిల్, మహేశ్‌కుమార్ యాదవ్, రిజ్వాన్, ఇబారహార్, జావెద్ హుస్సేన్, బొడ్డుపల్లి సతీశ్, ముక్రమ్, బిశ్వజిత్ , అంగోతు యోగిందర్, నర్ర గోపీచంద్, బట్టు యశ్వంత్‌రెడ్డి, ముప్పాల మహేశ్, వంకాయలపాటి మణిదీప్, బోని విశ్వేశ్వర్రావు, శివరాల రమేశ్, మలిగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, జాదవ్ రాజేందర్, మిరాసాని సాయినాథ్, దామరగిద్ద శశికుమార్, గాదె కార్తీక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని వైద్య పరీక్షల అనంతరం శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం 15వ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. పరారీలోనే ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డితో పాటు వాజిద్, సిద్దు, చందు పరారీలో ఉన్నారని ఆదిబట్ల సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. 36 మంది నిందితుల్లో ముగ్గురు అయ్యప్ప మాల ధరించిన వారు ఉండటం గమనార్హం. కాగా ఈ కేసులో రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రెండేళ్లు కలిసి తిరిగారు..దాడి తప్పే ఆ అమ్మాయి నా కొడుకు ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా కలిసి తిరిగారు. మా ఇంటికి కూడా అమ్మాయి చాలా సార్లు వచ్చింది. కరోనా సమయంలో ఆమె ను రోజూ కారులో కళాశాల వద్ద దింపి వచ్చేవాడు. పెళ్లి చేసుకున్నట్లు కూడా చెప్పాడు. తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా అమ్మాయి తండ్రి దామోదర్‌రెడ్డికి ఇచ్చేవాడు. వాళ్ల కోసం కారు కూడా తీసుకున్నాడు. వాడిని అన్ని విధాలుగా వాడుకున్నారు. నిన్న అమ్మాయి ఇంటిపై జరిగిన దాడి తప్పే. కానీ అంతకుముందు జరిగిన విషయా లు కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి. కష్టపడి ఎదిగిన నా కుమారుడిని అమ్మాయి ఇష్టపడింది. గొడవలకు కారణం తెలియదు. ఆ అమ్మా యిని వదిలేయమని నవీన్‌కు చాలాసార్లు చెప్పాను. మంచి సంబంధాలు వస్తున్నాయని చెప్పినా వినిపించుకోలేదు. – నారాయణమ్మ, నవీన్‌రెడ్డి తల్లి ‘టీ టైమ్’తో సంబంధం లేదు బంజారాహిల్స్: మన్నెగూడకు చెందిన యువతి వైశాలిని కిడ్నాప్ చేసిన కేసులో ప్రధా న నిందితుడు నవీన్‌రెడ్డికి ‘టీ టైమ్’తో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్ అర్జున్ గణేష్ స్పష్టం చేశారు. నవీన్‌రెడ్డి టీ టైమ్ సంస్థ ఓనర్ అంటూ కొన్ని మీడియా సంస్థల్లో (సాక్షి కాదు) వార్తలు ప్రసారం అయ్యాయని, అయితే టీ టైమ్ సంస్థకు నవీన్‌రెడ్డితో ఎలాంటి సంబంధాలు, ఒప్పందాలు లేవని, అలాగే అతనికి తమ ఫ్రాంచైజీలు కూడా లేవని తెలిపారు. నవీన్‌రెడ్డికి చెందిన సంస్థ పేరు ‘మిస్టర్ టీ టైమ్’ అని శనివారం విలేకరులకు వివరించారు. -
మన్నెగూడ కిడ్నాప్ ఘటన షాక్‌కు గురిచేసింది: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ ఘటన తనను షాక్‌కు గురి చేసిందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. యువతి భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. యువతి కుటుంబానికి భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని కోరారు తమిళిసై. Shocked to see the incidence.Concerned about the safety of the women kidnapped Assure her family that the culprits will booked as per law.Request @TelanganaDGP for necessary action to safeguard the family & girl https://t.co/VziafBZQud — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 9, 2022 యువతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అపహరణకు గురైన వైద్య విద్యార్థిని వైశాలి కుటుంబ సభ్యులను మన్నెగూడకు వెళ్లి పరామర్శించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా.. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇదీ చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
మామయ్య ఇంటికి వచ్చిన ఖమ్మం యువతి.. షాపింగ్ చేస్తుండగా యువకుడు షాకింగ్ ట్విస్ట్..
పెనమలూరు(విజయవాడ): పోరంకిలో యువతిని కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతి (18) పోరంకిలో ఉంటున్న మామయ్య ఇంటికి గత నెలలో వచ్చింది. చదవండి: ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్.. ఆమె గత నెల 5వ తేదీన కుటుంబ సభ్యులతో పోరంకిలో షాపింగ్ చేస్తున్న సమయంలో పరిచయం ఉన్న ఎం.శ్రీనివాసరావు అనే యువకుడు వచ్చి ఆమెను బలవంతంగా బైక్ పై తీసుకు వెళ్లాడు. ఆమెను సబ్బవరం తీసుకు వెళ్లి వదిలేశాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలిపింది. ఈ ఘటన పై కుటుంబ సభ్యులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. -
ట్విస్టులే ట్విస్టులు.. కిడ్నాపర్‌ను పట్టించిన స్టిక్కర్.. ఆపరేషన్ ‘నిమ్రా’ సక్సెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కరీంనగర్‌క్రైం: నగరంలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నాలుగు గంటల్లోనే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బాలికను తల్లిఒడికి చేర్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం కరీంనగర్ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన మహమ్మద్ కుత్బుద్దీన్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కూతురు నిమ్రా ఉంది. చదవండి: పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైంది. స్థానికం గా గాలించినా ఆచూకీ తెలియలేదు. పాప ఆటోలో వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుత్బుద్దీన్ రాత్రి 9.30 గంటలకు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రంయించాడు. ఏసీపీ తుల శ్రీనివాస్ నేతృత్వంలో ఐదు సివిల్, ఒక టాస్క్‌ఫోర్స్ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ, స్థానికుల సమాచారంతో గంట వ్యవధిలోనే పాపను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ సంతోశ్ ఇంటిని గుర్తించారు. అతని ద్వారా నిమ్రా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమద్ది రాములు ఇంట్లో ఉంచాడని తెలుసుకున్నారు. అతని ఇంటికి వెళ్లి పాపను అర్ధరాత్రి దాదాపు 12.45 గంటలకు సురక్షితంగా కాపాడారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు నటేశ్, దామోదర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, రహీంపాషా, టీ.మహేశ్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్,లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, దేవేందర్, కానిస్టేబుళ్లు బషీర్ అహ్మద్ ఖాన్, రవీందర్, మల్లయ్య, రాజ్‌కిరణ్, బద్రుద్దీన్, మనోహర్‌లను సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. నిమ్రాను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు మేనమామ అనుకుని ఎక్కిన నిమ్రా సోమవారం రాత్రి 7 గంటలకు అశోక్‌నగర్ ఉండే ఆటోడ్రైవర్ సంతోశ్ వద్దకు ఇద్దరుమహిళలు వచ్చి బీబీఆర్ ఆసుపత్రి వెళ్లేందుకు కిరాయి మాట్లాడుకున్నారు. వారిది చిన్నగల్లీ కావడంతో ఆటో వెళ్లలేదు. రాత్రి 7.25కి ఆటో(టీఎస్ 02యూసీ 3079)ను కుత్బుద్దీన్ ఇంటి ఎదుట నిలిపాడు. బయట ఆడుకుంటున్న నిమ్రా తన మేనమామ ఆటో అనుకుని ఎక్కింది. సంతోశ్ పక్కనే కూర్చుంది. మద్యంమత్తు లో ఉన్న అతనూ చిన్నారి నిమ్రాను వారించలేదు. ఈలోపు మహిళలురాగానే వారిని బీబీఆర్ ఆసుపత్రి వద్ద దించాడు. తరువాత అతనిలో పాపను అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమ ద్ది రాములుకు పాపను అప్పగించాడు. తెల్లవారి పాపను ఎంతోకొంతకు విక్రయించాలని ఇద్దరూ కలిసి అనుకున్నారుు. ఏమీ తెలియనట్లుగా రాత్రి 11.30 గంటలకు సంతోశ్ తిరిగి ఇల్లు చేరాడు. అప్పటికే కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మొత్తం విషయం కక్కేశాడు. వన్‌టౌన్ పోలీసులు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేరాత్రి ఖాజీపూర్‌లోని రాములు ఇంటిని చుట్టుముట్టారు. రాత్రి 12.45 గంటలకు ఏసీపీ తుల శ్రీనివాస్, సీఐ నటేశ్, ఎస్సై శ్రీనివాస్‌లు పాపను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. స్టిక్కర్ పీకేసిన సంతోశ్ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నగరంలో ఆటోలపై స్టిక్కర్లు వేశారు. బీబీఆర్ ఆస్పత్రి వద్ద మహిళలను దించిన సమయంలోనూ సంతోశ్ ఆటోపై స్టిక్కర్ ఉంది. పాపను రాములుకు అప్పగించిన తరువాత స్టిక్కర్‌ను తొలగించాడు. ఆటో నంబరు సరిపోలినా.. వెనక స్టిక్కర్ లేదు. కానీ, స్టిక్కర్ తీసేసిన ప్రాంతం జిగటగా ఉండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదే ఆటో అని నిర్ధారించుకుని సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిమ్రా అదృశ్యమవగానే.. పాప చిత్రం, వివరాలతో పలు మెసేజ్‌లు నగరంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరలయ్యాయి. దీంతో పలువురు యువకులు స్వచ్ఛందంగా గాలించారు. పాప ఆచూకీ చిక్కిన సమయంలోనూ వీరంతా పోలీసుల వెంటే ఉండటం గమనార్హం -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
గుంతకల్లు: తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఠా కొంతకాలంగా కిడ్నాప్లతో హల్చల్ చేస్తోంది. స్థానిక యువతను ముఠాలో చేర్చుకోవడం, వారికి సమాచారం, సహకారం అందించడం, కిడ్నాప్‌లు, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఈ ముఠా లక్ష్యం. దీనికి నాయకుడు సుంకర ప్రసాద్‌నాయుడు. ఎవరీ సుంకర ప్రసాద్? ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు. క్రిమినల్ చరిత్ర చాలా పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 33 హత్య కేసుల్లో నిందితుడు. జైళ్లు, పోలీసులు, కేసులంటే లెక్కలేదు ఇతనికి. తాను చేసిన హత్యల గురించి ఒక్కొక్కటిగా విడమరిచి మరీ మీడియాకు వెల్లడించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇతని భార్య ఓ మాజీ నక్సలైట్. ప్రసాద్‌కు సుమారు రెండు దశాబ్దాల క్రిమినల్ చరిత్ర ఉంది. ఇంతటి నేర చరిత్ర కల్గిన ఇతని కన్ను ఇటీవల గుంతకల్లు ప్రాంతంపై పడింది. గుంతకల్లు వాసులతో కలసి.. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు, నలుగురు వ్యక్తులతో సుంకర ప్రసాద్ జతకట్టాడు. వీరిలో ముఖ్యుడు జి.కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అతను ఇచ్చిన సమాచారం మేరకు జి.కొట్టాలకు చెందిన ఓ స్వామీజీని గత నెల 29న కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి రూ.26 లక్షల వరకు దండుకున్నట్లు సమాచారం. ఇందులో రూ.10 లక్షలు వాటాగా జి.కొట్టాలకు చెందిన వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. ఈ దందా బాగుందని భావించిన జి.కొట్టాల వాసి తన గ్రామానికే చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ వివరాలను సుంకర ప్రసాద్ ముఠాకు చేరవేశాడు. దీంతో సుంకర ప్రసాద్ ముఠా ఈ నెల 20న ఆకుల వ్యాపారిని కిడ్నాప్ చేసింది. అతని కుమారుడు సాయికుమార్‌కు ఫోన్‌చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసింది. సాయంత్రంలోగా సమకూర్చకపోతే వెంకటేష్‌ను చంపుతామని బెదిరించింది. బెంబేలెత్తిన అతను గ్రామస్తుల సహకారంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇంటర్వ్యూలు చూసి.. ఇక సుంకర ప్రసాద్ ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో చూసి జి.కొట్టాలకు చెందిన వ్యక్తి అతన్ని సంప్రదించినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడిన ఆ వ్యక్తికి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సుంకర ప్రసాద్ సహకారంతో తొలుత స్వామీజీని కిడ్నాప్‌చేసి విజయవంతమయ్యారు. ఇదే క్రమంలో రెండో కిడ్నాప్‌కు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. ముఠా ఆటకట్టు ఇలా.. పోలీసుల సూచన మేరకు కిడ్నాపర్లకు సాయికుమార్ ఫోన్‌చేసి డబ్బులు సిద్ధం చేశానని, తమ గ్రామానికి వచ్చి తీసుకువెళ్లాలని కోరాడు. దీంతో గ్రామానికి చేరుకున్న కిడ్నాపర్లు ఒక కారు ఏర్పాటుచేశామని, అందులో డబ్బు పెట్టాలని సాయికుమార్‌కు చెప్పారు. అదే సమయంలో పోలీసులను గమనించిన కిడ్నాపర్లు కారు వదిలేసి పరారయ్యారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ వద్ద వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెర నుంచి విడుదల చేయించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో జి.కొట్టాల వాసితోపాటు సుంకర ప్రసాద్, మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. -
Raghurama Krishnam Raju: ఎంపీ రఘురామపై క్రిమినల్ కేసు
సాక్షి, అమరావతి/గచ్చిబౌలి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాను కిడ్నాప్ చేసి, తీవ్రంగా హింసించిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్‌పై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా (ఎ1గా) ఎంపీ రఘురామకృష్ణరాజు, ఏ 2గా ఆయన కుమారుడు భరత్, ఏ 3 గా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎన్.సందీప్ సాధు, ఏ 4 గా సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె. గంగారామ్, ఏ 5గా ఎంపీ పీఏ శాస్త్రి, మరికొందరిపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 365, 332, 384, 323, 324, 342, 504, 506, 294(బి) రెడ్ విత్ 34, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ షేక్ ఫరూక్ బాషా విధులకు ఆటంకం కలిగించడం, కిడ్నాప్ చేసి నిర్బంధించడం, దాడి చేసి బెదిరించడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. ఇందులో రఘురామ వద్ద భద్రత విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందినీ నిందితులుగా చేర్చారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ఆందోళనలు చేసేందుకు కొన్ని పార్టీలు, సంఘాలు నిర్ణయించాయని ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఏపీ నుంచి కూడా కొందరు హైదరాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. దాంతో భద్రత ఏర్పాట్లలో భాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు తమ సిబ్బందిని హైదరాబాద్ పంపించారు. అందులో భాగంగా సోమవారం ఐఎస్బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించారు. అనుమానిత వ్యక్తులు, వారి కదలికల్ని గుర్తించడం ఇతడి విధి. విధి నిర్వహణలో ఉన్న ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు, ఆయన భద్రతకు నియమితులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కొందరు దాడిచేశారు. నడిరోడ్డుపైనే దాడి చేయ డం, సెల్‌ఫోన్, పర్సు, ఐడీ కార్డు లాక్కోవడం, కారులో కిడ్నాప్ చేయడం తదితరాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సమయంలో అక్కడున్నవారు కూడా ఈ దృశ్యాల ను సెల్ఫోన్లలో రికార్డు చేశారు. ఫరూక్ తమపై నిఘాకు వచ్చినట్లుగా ఎంపీ వర్గీయులు ఆరోపిస్తు న్నారు. అది అవాస్తవమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఫరూక్ విధులు నిర్వర్తిస్తున్న ఐఎస్బీ గేట్ ప్రాంతానికి, ఎంపీ రఘురామ ఇంటికి సంబం ధం లేదు. రఘురామ ఇల్లు అక్కడికి 1.3 కిలోమీ టర్ల దూరంలోని బౌల్డర్ హిల్స్‌లో ఉంది. ఫరూక్‌ను నడిరోడ్డుపై కొట్టుకుంటూ బౌల్డర్ హిల్స్‌లోని ఎంపీ విల్లా ఎ–74కు తీసుకువెళ్లారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎంపీ ఇంట్లో చిత్ర హింసలకు గురిచేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్ కూడా ఫరూక్‌పై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముందుగా భరత్, శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్ సందీప్‌తోపాటు మరికొందరు సీఆర్పీఎఫ్ సిబ్బం ది ఫరూక్‌పై దాడిచేశారు. సీఆర్పీఎఫ్ ఏఎస్సై, కానిస్టేబుల్ సందీప్ ఆయన కాళ్లు, చేతులపై లాఠీలతో కొట్టారు. భరత్, శాస్త్రి కానిస్టేబుల్ ఫరూక్ మెడ, కడుపుపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్లూ చేతులు విరగ్గొట్టండి.. షాక్ ఇవ్వండి అంతవరకు ఇంటి లోపల ఉన్న ఎంపీ రఘురామరాజు బయటకు వచ్చి ఫరూక్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నీ కాళ్లు చేతులు విరగ్గొట్టిస్తా’ అంటూ బూతులు తిడుతూ విరుచుకుపడ్డా రు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్ వద్ద ఫైబర్ లాఠీ తీసుకుని స్వయంగా ఫరూక్ బాషాపై దాడి చేశారు. జుట్టుపట్టుకుని గోడకేసి తోసివేశారు. అ నంతరం భరత్, శాస్త్రి, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్‌లను ఉద్దేశిస్తూ ‘నేను ఢిల్లీ వెళ్తున్నా. వీడికి కరెంట్‌షాక్ ఇవ్వండి’ అని చెప్పారు. ఐడీ కార్డు, ప ర్స్, బంగారు ఉంగరం తీసుకోండి అని చెప్పారు. సీఆర్పీఎఫ్ ఏఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్ విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడిని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దాడిలో పాల్గొన్న సీఆర్పీఎఫ్ ఏఎస్సై కె.గంగారామ్, కానిస్టేబుల్ ఎన్.సందీప్ సాధును సస్పెండ్ చేస్తూ సీఆర్పీఎఫ్ కమాండెంట్ మహేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లపై కూడా ఉన్నతాధికారులు విచారి స్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా ఎందరు నిందితులున్నారో తెలియాల్సి ఉంద ని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. -
Kidnap Case: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు..
మండపేట(తూర్పుగోదావరి): నమ్మిన పాలేరే నయవంచన చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై, చేసిన అప్పులు తీర్చేందుకు మరో నలుగురితో కలిసి పథకం ప్రకారం యజమానిని కిడ్నాప్ చేయించాడు. వచ్చిన రూ.10 లక్షలు పంచుకుని అంతా సద్దుమణిగిపోయిందని అందరూ ఆనందపడ్డారు. కానీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు మాత్రం అంత తేలిగ్గా వదల్లేదు. చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఎటువంటి ఫిర్యాదూ రానప్పటికీ స్పందించారు. తమంత తామే ఫిర్యాదు తీసుకుని మరీ విచారణ చేపట్టారు. చివరకు కారు నంబరు ఆధారంగా కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. అయిదుగురు నిందితులకు అరదండాలు వేశారు. వీరిలో ఒకరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఈ కేసు వివరాలను సోమవారం విలేకర్లకు వివరించారు. ఆయన కథనం ప్రకారం.. అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ద్వారంపూడి కృష్ణారెడ్డి ఈ నెల 5వ తేదీ ఉదయం మండపేట మండలం వేములపల్లిలోని పొలం వద్దకు వెళ్లారు. ఆయనను అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలోను, మీడియాలోను విస్తృతంగా ప్రచారం జరిగింది. కిడ్నాపర్ల డిమాండ్ మేరకు బంధువులు రూ.10 లక్షలు చెల్లించి, కృష్ణారెడ్డిని విడిపించారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు దీనిపై విచారణ జరపాల్సిందిగా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సై బి.శివకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రూరల్ సీఐ పి.శివగణేష్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డి బంధువులను అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆయనను కారులో ఎక్కించుకుని రాజానగరం మండలం తుంగపాడు, గోకవరం, రంపచోడవరం మీదుగా సీతపల్లి వరకూ తీసుకువెళ్లారు. ఆయనను వదలాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని పాలేరు బక్కి జయరాజు ద్వారా తమకు అందజేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు జయరాజుకు రూ.10 లక్షల నగదు ఇచ్చి పంపగా.. కడియం మండలం బుర్రిలంక వద్ద హైవేపై నగదు తీసుకుని, కృష్ణారెడ్డిని అప్పగించి పరారయ్యారు. ‘జయరాజుకు ఇచ్చి పంపాలి’ అని చెప్పడంతో పోలీసులు తొలుత జయరాజును అనుమానించారు. అతడి కాల్ డేటా సేకరించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించి, కేసును ఛేదించారు. రాజానగరం మండలం ముక్కినాడపాకలుకు చెందిన జయరాజు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులు పాకా శ్రీను, పాకా సతీష్‌కుమార్, మండేల ప్రవీణ్, వారి స్నేహితుడు ద్వారంపూడి శ్రీనివాసరెడ్డితో కలిసి కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు పథక రచన చేశాడు. వీరిలో సతీష్‌కుమార్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నిందితులు వచ్చిన సొమ్మును పంచుకుని సోమవారం వేములపల్లిలో పార్టీ చేసుకుంటుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షల నగదు, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివకృష్ణలను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. -
నవ వధువును కిడ్నాప్ చేసిన టీడీపీ నేత
విడవలూరు: నూతనంగా వివాహం చేసుకున్న వధువు కత్తి ఉమామహేశ్వరిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన టీడీపీ నాయకుడు సత్యవోలు సత్యంరెడ్డి కిడ్నాప్ చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విడవలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మహేంద్ర కథనం మేరకు.. విడవలూరులోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కత్తి ఉమామహేశ్వరి, అన్నారెడ్డిపాళెం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నలబాయి హరి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు మేజర్లు కావడంతో శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పెంచలకోనలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆదివారం అన్నారెడ్డిపాళెంలోని హరి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి విడవలూరుకు చెందిన టీడీపీ నాయకుడు సత్యవోలు సత్యంరెడ్డి దాదాపు 30 మందితో కలిసి ఆటోల్లో అన్నారెడ్డిపాళెంలోని హరి ఇంటికి వెళ్లి వధువు కత్తి ఉమామహేశ్వరిని బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆమె భర్త హరి అడ్డుపడగా అతన్ని కులం పేరుతో దూషించి పక్కకు తోసి వధువును బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారని తెలిపారు. నలబాయి హరి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వధువు తల్లిదండ్రులకు ఈ ప్రేమపెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతో పాటు వీరు టీడీపీ సానుభూతిపరులు కావడంతో సత్యంరెడ్డిని సంప్రదించారని, దీంతో వధువును సత్యంరెడ్డి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వధువు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.