Lok Sabha Election 2019
-
మోదీ 2.0
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్‌గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్‌కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది... బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్‌తో బదులిచి్చంది. పాక్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ స్థానాలు బీజేపీ 303 కాంగ్రెస్ 52 డీఎంకే 24 వైఎస్సార్సీపీ 22 టీఎంసీ 22 శివసేన 18 జేడీ(యూ) 16 బిజూ జనతాదళ్ 12 బీఎస్పీ 10 టీఆర్ఎస్ 9 స్వతంత్రులు 51 ఇతరులు 4 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: గిర్ సఫారీలో... మళ్లీ వార్ వన్‌సైడే!
ఏ ఆటగాడైనా సొంత పిచ్‌పై బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. మరి అలాంటిది దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో స్కెచ్ గీస్తే పరిస్థితి ఎలా ఉంటుంది! వార్ వన్‌సైడే! గుజరాత్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అక్షరాలా అదే జరిగింది. రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ 2014, 2019 ఎన్నికల్లో విపక్షాలకు ఒక్కటీ దక్కకుండా క్లీన్‌బౌల్డ్ చేశారు మోదీ, అమిత్ షా. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టున్న ఈ పశ్చిమ రాష్ట్రం మోదీ రాకతో పూర్తిగా కమలనాథుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఈసారీ క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కాషాయదళాన్ని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... స్టేట్స్కాన్గుజరాత్లో ఎన్నికలేవైనా బీజేపీ దెబ్బకు పారీ్టలన్నీ చుక్కలు లెక్కబెడుతున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మొత్తం సీట్లు తమ ఖాతాలో వేసేసుకుంది. 2009లో 11 సీట్లు గెలిచి బీజేపీకి గట్టి పోటీ ఇచి్చన హస్తానికి ఆ తర్వాత రాష్ట్రం నుంచి లోక్‌సభలో పదేళ్లుగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లోనైతే ఇరు పారీ్టల ఓట్ల శాతంలో ఏకంగా 30 శాతానికి పైగా అంతరముండటం విశేషం. బీజేపీకి 62.21 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 32.11 దక్కాయి మిగతా పారీ్టలేవీ ఇక్కడ పెద్దగా సోదిలో లేవు. గత ఎన్నికల్లో 25 చోట్ల పోటీ చేసిన బీఎస్పీకి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి!కాంగ్రెస్.. ‘ఇండియా’ పోటీనిచ్చేనా!గుజరాత్లో ఎంతో కొంత పుంజుకోవడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడుతూనే ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 60 సీట్లు కోల్పోయి 17కు పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 చోట్ల పోటీ చేస్తుండగా భావనగర్, బారుచ్ స్థానాల్లో ఆప్ బరిలో ఉంది. రైతులు, యువత, మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలపై ఇండియా కూటమి హామీల వర్షం కురిపిస్తోంది. వాటినే ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ వాటికే పెద్దపీట వేయడం తెలిసిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం చుక్కలనంటాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. పేదల పొట్టగొట్టి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం గుజరాత్లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విపక్షాలపై బీజేపీ కక్షగట్టి నేతలను వరుసగా జైలుపాలు చేస్తోందన్న ఇండియా కూటమి ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నుంచి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు గుజరాత్లో ప్రచారం చేస్తున్నారు. ఆప్ తరఫున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆప్ కీలక నేతలు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు కూడా రంగంలోకి దిగారు.కమలం బోణీ! గుజరాత్లో ఇంకా పోలింగైనా జరగకుండానే తొలి ‘కమలం’ విరబూసింది! కాషాయదళం బోణీ కొట్టేసింది. సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభనీని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో తేడా ఉండటంతో నామినేషన్ తిరస్కరణకు గురవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేశ్ పడ్సాలా నామినేషన్ కూడా పలు కారణాలతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే పోటీలో ఉన్న ఇతర పారీ్టల అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో ముకేశ్ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. సర్వేలన్నీ కమలం వైపే దాదాపు అన్ని సర్వేలూ బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా మొత్తం సీట్లను చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేయడం విశేషం.బీజేపీ సమరోత్సాహం...గుజరాత్లో రాజకీయం మోదీకి ముందు, తర్వాత అన్నట్టుగా మారిపోయింది. బీజేపీ దిగ్గజ నేత కేశూభాయ్ పటేల్ అనారోగ్యం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో 2001 అక్టోబర్‌లో మోదీ అనూహ్యంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఏడాదికే 2002 నాటి గోద్రా రైలు దహనంలో 60 మంది కరసేవకుల మరణం మతకల్లోలాలకు దారి తీసి రాష్ట్రాన్ని కుదిపేసింది. సీఎంగా వాటి అదుపులో మోదీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు చివరికి అసెంబ్లీ రద్దుకు దారితీశాయి. అయితే హిందుత్వ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు మోదీ. ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి కేంద్రంలో పదేళ్లు అధికారంలో కొనసాగినా గుజరాత్లో మోదీ పీఠాన్ని మాత్రం కదపలేకపోయింది. అద్వానీకి ప్రత్యామ్నాయంగా 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యరి్థగా మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరతో పాటు వ్యూహాత్మకంగా యూపీలోని వారణాసి నుంచీ పోటీ చేసి రెండింటా ఘనవిజయం సాధించారు. బీజేపీకి ఒంటి చేత్తో మెజారిటీ దక్కించి ప్రధాని పగ్గాలు చేపట్టారు.మోదీకి సేనాపతిగా పేరొందిన అమిత్ షా కూడా గుజరాత్లో బీజేపీ పాతుకుపోవడంలో కీలకంగా నిలిచారు. 2001 నుంచి 2014 దాకా గుజరాత్ సీఎంగా చక్రం తిప్పిన మోదీ ప్రధానిగా కూడా రాష్ట్రాభివృద్ధిపై బాగా దృష్టి పెట్టారు. దాంతో గుజరాత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసింది. అయినా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. కానీ 2022 ఎన్నికల్లో మళ్లీ చతికిలపడింది. 182 సీట్లకు బీజేపీ ఏకంగా 156 స్థానాలతో దుమ్మురేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలనాథులు అభివృద్ధి అజెండాతో పాటు అయోధ్య రామమందిర సాకారం తదితర అంశాలను బలంగా ప్రచారం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Telangana: బీజేపీ టార్గెట్ @8!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసిన బీజేపీ 4 సెగ్మెంట్లలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరి చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి 7% ఓట్లు సాధించిన పార్టీ, మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్‌ను పెంచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందడమే కాకుండా 18 శాతం ఓటింగ్‌ను నిలుపుకుంది. 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలవగా, 49 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 25శాతానికి ఓటింగ్ పెంచుకొని ఎనిమిది సీట్లు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సిట్టింగ్ స్థానాలపై స్పష్టత ! సిట్టింగ్ ఎంపీలైన కేంద్రమంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్) ఆయా స్థానాల నుంచే మళ్లీ పోటీకి ఇప్పటికే సిద్ధమయ్యారు. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపూరావుకు ఈసారి పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాథోడ్ బాపూరావును ఈసారి ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది. ఆయనతోపాటు ఈసారి ఖానాపూర్ నుంచి ఓడిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ గెలిచిన జోరు మీదున్న బీజేపీ ఎంపీ సీటును కచ్చితంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లలోనూ పార్టీ విజయం సాధించడం, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు హామీని నిలుపుకున్నందున నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన స్థానాల్లో ఇలా.... సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన 13 ఎంపీ సీట్లలో పోటీకి కొందరు ముఖ్యనేతలు గట్టిగానే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ► మల్కాజిగిరి నుంచి పోటీకి బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ పి.మురళీధర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణకు జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే మహబూబ్‌నగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన టి.ఆచారి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్‌లలో ఎక్కడో ఒకచోట నుంచి పార్టీ అగ్రనాయకత్వం అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమేనని సీనియర్‌నేత ఈటల రాజేందర్ తన సన్నిహితుల వద్ద సంకేతాలిచ్చి ఆ దిశలో ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ► చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎప్పటి నుంచో కసరత్తు కూడా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే దానికి సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టు పార్టీవర్గాల సమాచారం. ► భువనగిరి సీటు తనకు టికెట్ వస్తుందని మాజీ ఎంపీ డా. బూరనర్సయ్యగౌడ్ ఆ లోక్‌సభ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ► గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీకి గతం నుంచి ఉత్సాహం కనబరుస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వీరశైవ లింగాయత్ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ► పెద్దపల్లి నుంచి పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ► నాగర్‌కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతిని బరిలో దింపడం లేదా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది. ► వరంగల్ టికెట్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ గట్టిగా కోరుతున్నట్టు తెలిసింది. ► నల్లగొండ స్థానానికి గతంలో పోటీ చేసిన గార్ల జితేందర్ లేదా సూర్యాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సంకినేని వెంకటేశ్వర్రావుకు చాన్స్ దక్కుతుందా, ఇంకా ఎవరైనా కొత్తవారికి ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. ► హైదరాబాద్ స్థానం నుంచి భగవంత్‌రావుకు అవకాశం కల్పించవచ్చుననే ప్రచారం జరుగుతుండగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయించినా అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ నేతల్లో ఉంది. ► మహబూబాబాద్ నుంచి రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం. ► ఖమ్మం నుంచి పార్టీనేత, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా ఇంకా మరెవరికైనా టికెట్ ఇస్తారా చూడాలని పార్టీ నేతలు అంటున్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఖర్చు వైఎస్సార్సీపీదే
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిర్ణయించిన వ్యయం కన్నా తక్కువ ఖర్చు చేసిన ప్రధాన పార్టీల్లో వైఎస్సార్సీపీ తొలిస్థానంలో నిలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 543 మంది ఎంపీలకుగానూ 538 మంది అఫిడవిట్లలో పొందుపరిచిన వ్యయాలను ఎలక్షన్ వాచ్/ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. ఎన్నికల ఖర్చు వివరాలు ప్రకటించని ఐదుగురు ఎంపీల్లో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఉన్నారు. వీరి వ్యయం వివరాలు లభ్యం కాలేదని సంస్థ వెల్లడించింది. మాధవి ఖర్చు రూ.14.12 లక్షలు ఎన్నికల ఖర్చులో వైఎస్సార్ సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి 537వ స్థానం(రూ.14.12 లక్షలు), బల్లి దుర్గాప్రసాదరావు 535వ స్థానం (రూ.15.06 లక్షలు), బెల్లాన చంద్రశేఖర్ 533వ స్థానం (రూ. 15.83 లక్షలు), చింతా అనూరాధ 532వ స్థానం (రూ.16,74 లక్షలు), భీశెట్టి వెంకట సత్యవతి 531వ స్థానం(రూ.17.66 లక్షలు)లో ఉన్నారు. అనంత్‌నాగ్‌లో అత్యధికంగా.. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా కమిషన్ నిర్ణయించింది. అత్యధికంగా ఖర్చు (నిబంధనల కంటే ఎక్కువగా) చేసినవారిలో హస్నైన్ మసూది (అనంతనాగ్, జమ్మూ కశ్మీర్, జేకే నేషనల్ కాన్ఫరెన్స్) రూ.79,27,920తో తొలిస్థానంలో నిలవగా రూ.77,95,916తో గోరఖ్‌పూర్ బీజేపీ సభ్యుడు రవికిషన్ రెండో స్థానంలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. శివసేన తరువాత టీఆర్ఎస్... ఎన్నికల వ్యయం వివరాలను వెల్లడించిన 538 మంది ఎంపీల సరాసరి ఖర్చు రూ.50.84 లక్షలని కమిషన్ పేర్కొంది. ఎంపీ అభ్యర్థి ఖర్చు విషయంలో పార్టీల వారీగా చూస్తే శివసేన (18 మంది ఎంపీలు) రూ.59.26 లక్షల సరాసరి ఖర్చుతో తొలిస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ (9 మంది ఎంపీలు) రూ.57.85 లక్షల సరాసరి ఖర్చుతో ద్వితీయ స్థానంలో ఉంది. వైఎస్సార్ సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి ఎన్నికల వ్యయంలో సొంత డబ్బులు రూ.13,500 కాగా రూ.6,65,580 పార్టీ నుంచి అందించగా రూ.7,33,100 ఇతరత్రా విరాళాల రూపంలో సమకూరాయి. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వ్యక్తిగత డబ్బులు రూ.28,500 కాగా పార్టీ విరాళం రూ.49,99,693. -
దిశ నుంచి ఢిల్లీ వరకు సంచలనాలు
పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతి, అసమానతలపైనా... యువతరం పిడికిలి బిగించి కదం తొక్కింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి.. భారత్ నుంచి హాంకాంగ్ వరకు ఈ ఏడాది నిరసనలు మిన్నంటాయి. అలాగే దేశంలో సార్వత్రిక ఎన్నికలపై చర్చకు తెరలేపుతూ ప్రారంభమైన 2019వ ఏడాది అనేక సంచలన సంఘటనలకూ వేదికగా నిలిచింది. భారత ప్రజానికంతో పాటు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు దశాబ్దాల నుంచి ఎటూ తెగని వివాదంగా మిగిలిపోయిన అయోధ్య రామమందిర స్థల వివాదానికి కూడా ఈ ఏడాదిలో పూర్థిస్థాయి పరిష్కారం దొరికింది. కశ్మీర్ అంశంతో పాటు ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం వంటి పార్లమెంట్ చట్టాలకు 2019 చోటిచ్చింది. నిర్భయ ఉదంతాన్ని మరోసారి జ్ఞాపకం చేసేలా హైదరాబాద్‌లో అత్యంత దారుణంగా జరిగిన దిశ సంఘటన ఈ ఏడాదిలో అత్యంత సంచలనంగా మారింది. కేంద్రంలో రెండోసారి బీజేపీ ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధికంగా చర్చనీయాంశమైన అంశం సార్వత్రిక ఎన్నికలు. భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు సైతం భారత్ ఎన్నికలను ఆసక్తికరంగా గమనించాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన పత్రిపక్షం కాంగ్రెస్ కేవలం 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే.. డీఎంకే 23, వైఎస్సార్సీపీ, టీఎంసీ 22, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. అయోధ్య.. రాముడిదే దేశంలో సరికొత్త రాజకీయ చర్చకకు కేంద్రబిందువైన వివాదస్పద అయోధ్య రామమందిర, బాబ్రీ మసీదు స్థలంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని నవంబర్ 9న ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలో సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సహా, పలువురు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సీజే ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధార్మాసనం వాటన్నింటినీ కొట్టివేసింది. సుప్రీం తీర్పే అంతిమమైనదని స్పష్టంచేసింది. పుల్వామా ఉగ్రదాడి.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఫిబ్రవరి 14 న మధ్యాహాం 3.30 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో దేశం ఒక్ససారిగా ఉలిక్కిపడింది. జవాన్ల మృతికి కారణమైన పాక్‌కు తగిన బుద్ది చెప్పాలని యావత దేశం ముక్త కంఠంతో నినదించింది. విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో శ్రీనగర్‌కు బయలుదేరిన సమయంలో ఈదారుణ ఘటన చోటుచేసుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. దీనిపై దేశవ్యాప్తంగా భారత ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అజిత్ దోవల్‌కి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. ఎమ్మెల్యేనే ఉన్నావ్ దోషి.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవితఖైదు శిక్షను విధించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యంతో అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. మహారాష్ట్రలో సరికొత్త చరిత్ర.. దేశంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు మహారాష్ట్ర వేదికగా నిలిచింది. పార్టీలో చీలికలు, గవర్నర్ అర్థరాత్రి ప్రకటనలు, తెల్లవారుజామున ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారాలు, దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం వంటి ఆసక్తికర పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు సంచలనం సృష్టించాయి. బాలీవుడ్ సినిమా స్థాయి ట్విస్ట్‌లను ఛేదించుకుంటూ హిందుత్వ పార్టీగా పేరొందిన శివసేన.. లౌకిక భావాజాలం గల కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం పీఠం అధిరోహించిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్ చరిత్ర సృష్టించారు. అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. ఎన్నికల ముందు కూటమి కట్టిన బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలతో విభేదాలు ఏర్పాడ్డాయి. దీంతో తన దారి తనదంటూ 30 ఏళ్ల మిత్రబంధానికి ముగింపు పలికిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి పునాది వేసింది. కన్నడలో కూలిన కుమార సర్కార్.. దేశమంతా ఎంతో ఉత్కంఠరేపిన కర్ణాటక రాజకీయ సంక్షోభం ఈ ఏడాది రాజకీయపరంగా అత్యంత చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ బలపరీక్షలో జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలింది. జూలై 23న జరిగిన విశ్వాస పరీక్షలో 15 మంది రెబల్స్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి ఓటమిపాలైంది. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. 15 రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన ముగిసింది.ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రంతిప్పన 15 మంది రెబల్స్‌పై స్పీకర్ రమేష్ కుమార అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది. అనంతరం గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పును వెలువరించారు. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 12 స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకుంది. చంద్రయాన్-2 విఫలం చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు అక్కడికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్–2’ చివరి నిమిషంలో విఫలమైంది. జులై 22న జీఎస్ఎల్వీ మార్క్ III-M1 వాహక నౌక ద్వారా చంద్రుడిపై పంపారు... తర్వాత దీని కక్ష్యను ఐదుసార్లు పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కిలోమీటర్లకు చేర్చారు. తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది.. సెప్టెంబరు 7 అర్ధరాత్రి చంద్రుడి ఉపరితలంపై దిగుతూ 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పూర్తిగా సంబందాలు తెగిపోయాయి. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది. ఆర్టికల్ 370.. రద్దు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్ పరివార్ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. పౌరసత్వ ప్రకంపనలు.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ దేశ వ్యాప్తంగా నిరసలనకు కేంద్రబిందువుగా నిలిచింది. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి.. పోలీసుల తూటాలు ఆందోళనకారుల గుండెల్లో దిగాయి. పౌరుల ప్రాణాలు పోయినా.. జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఎక్కువగా కనిపించింది. ఆందోళన సందర్భంగా యూపీలో 16 మంది పౌరులు మరణించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు, సిక్కులకు, జైనులకు, బౌద్ధులకు, పార్శీలకు, క్రైస్తవులకు దేశంలో పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య సారాంశం. అస్సాం ఎన్నార్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రకటించిన ఎన్ఆర్సీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. తొలుత ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను విడుదల చేసింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. కాగా దేశ వ్యాప్తంగా కూడా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ పదేపదే ప్రకటిస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాఫీ డే వీజీ సిద్ధార్థ మృతి.. సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ మరణించారు. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆరంగంలో మేటిగా నిలిచారు. జూలై 29న సిద్ధార్థ అదృశ్యమయ్యారు. తాను కొద్దిదూరం నడిచి వస్తానని చెప్పి, డ్రైవర్‌ను బ్రిడ్జి సమీపంలో కారు ఆపమని చెప్పిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అరగంట గడిచినా సిద్ధార్థ కారు దగ్గరకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డ్రైవర్ బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం జూలై 31న నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. చిన్మయి శ్రీపాద (మీటూ) పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టయలు చేశారు. ఇండియాలో బాలీవుడ్ నటితనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపించారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హాంగ్.. కాగుతోంది.. ఒక దేశం రెండు వ్యవస్థలు ఉంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఏడాది హాంకాంగ్‌లో ఎగిసిన నిరసనలు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని హాంకాంగ్‌వాసులు సహించలేకపోతున్నారు. చైనాలో హాంకాంగ్ భాగమైనప్పటికీ అక్కడ ప్రజలు తమను చైనీయులు అనడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. అలాంటిది నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో నిరసనల అగ్గి రాజుకుంది. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్ వింగ్ యాక్టివిస్టులు భగ్గుమన్నారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. జూన్ నుంచి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రరూపం దాల్చాయి. మొత్తానికి బిల్లుపై చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఆ ఆందోళనలిప్పుడు హాంకాంగ్ స్వాతంత్య్ర పోరాటానికి దారి తీశాయి. అమెజాన్ ఆడవుల్లో కార్చిచ్చు అమెజాన్ అడవుల మంటలపై ప్రపంచస్థాయి ఆగ్రహం..! ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అగ్నికి ఆహుతి అవుతుండటంపై ప్రపంచ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అమెజాన్ అడవులు కాలిపోతున్నాయనే వార్తలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో అధిక భాగం అంటే 20 శాతం ఆక్సిజన్ మనకు అమెజాన్ అడవుల నుంచే లభిస్తోంది. అమెజాన్ అడవులు కాలిపోవడం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై కొత్త చర్చకు దారి తీసింది. పర్యావరణవేత్తలు, మేధావులు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అమెజాన్ అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు యుద్ద విమానాలను ఫ్రాన్స్ అధికారులు రంగంలోకి దించారు. శ్రీలంక మారణహోమం క్రెస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు ద్వీపదేశం శ్రీలంకలో నరహంతకులు మారణహోమం సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఏప్రిల్ 21న జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీయులు మరణించగా వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నామని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. దిశా.. తూటా చెప్పిన తీర్పు రేపిస్టులకు వ్యతిరేకంగా మన తెలుగు గడ్డపై జరిగిన ఉద్యమం యావత్ దేశానికి పాకింది. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఈ ఏడాది దేశంలో ప్రకంపనలు రేపింది. నవంబర్ 27 రాత్రి షాద్‌నగర్‌లో ఒక అమాయకురాలిపై వలపన్ని టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో నలుగురు మృగాళ్లు అత్యాచారం చేయడమే కాకుండా, బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టడం సామాన్యుల్ని దహించి వేసింది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపిస్టులకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలకు వ్యతిరేకంగా యువతరం స్వచ్ఛందంగా కదిలిరావడం ఇదే. దిశపై అఘాయిత్యం జరిగి వారం తిరక్కుండానే డిసెంబర్ 6న నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినిపించినప్పటికీ సామాన్యులు శభాష్ అన్నారు. మన న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలా మారడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి.. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష విధిస్తారు. తహసీల్దార్ సజీవ దహనం రాష్ట్ర రాజధాని శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు మూడు రోజులపాటు విధుల్లోకి రాకుండా నిరసనలు చేపట్టారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. రైతు కూర సురేశ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఆర్టీసీ సమ్మె.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ.. 2011లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకలజనుల సమ్మె తరువాత మరోసారి అంతటి మహా ఉద్యమాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత వారు చేపట్టిన తొలి సమ్మె ఇది. డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 52 రోజుల పాటు చేపట్టిన ఆర్టీసీ సమ్మె మహా ఉద్యమంగా సాగింది. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఏమాత్రం తగ్గకపోగా, విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు ఉద్యమం సందర్భంగా దాదాపు 30 మంది కార్మికులు వివిధ రూపాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. వారి విజ్ఞప్తి మేరకు కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కార్మికుల ఉద్యమం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం మొదలైంది. ‘ప్రజాసంకల్ప యాత్ర’ సుదీర్ఘ పాదయాత్ర అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో గెలిచి కొత్త చరిత్రను సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 30 గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. సంక్షేమ పథకాలే ప్రధానం ఎజెండాగా ప్రచారం చేసిన వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెల్లలోనే హామీలను అమలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. చరిత్ర ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 25 స్థానాల్లో 22 ఎంపీ సీట్లు కైవలం చేసుకుంది. టీడీపీ మూడు స్థానాలు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ డిసెంబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. -సురేష్ అల్లిక (వెబ్‌డెస్క్ ప్రత్యేకం) -
‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన క్రమంలో సోనియా గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 52 స్ధానాలకు పరిమితం కావడం, ఏకంగా పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ దుస్ధితికి అద్దం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాక్‌తో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం ఆ పార్టీ నేతలకు రుచించలేదు. ఇక పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ తరుణంలో తమ కుమారుడి నుంచి సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను తిరిగి అందుకోవాలని పలువురు పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2017 డిసెంబర్లో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే ముందు దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోయింది. మరోవైపు సోనియా గాంధీ తిరిగి పార్టీ బాధ్యతలు తీసుకుంటే వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ చెలరేగే అవకాశం ఉందని మరికొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీలో చేరిన గాయని సప్నా చౌదరి
సాక్షి, ఢిల్లీ: హరియాణా పాపులర్ సింగర్, డాన్సర్ సప్నా చౌదరి ఎట్టకేలకు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడియంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆమె పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... సప్నా చౌదరికి కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ రాంలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. సింగర్, డ్యాన్సర్‌గానే కాకుండా బిగ్ బాస్ 11 సీజన్లో పాల్గొన్న సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఊహాగానాలు వచ్చినా...అనూహ్యంగా బీజేపీకి చేరువ అయ్యారు. చదవండి: కాంగ్రెస్‌కు షాక్.. సప్నా చౌదరీ యూటర్న్..! ‘డ్యాన్స్ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్’ -
అసలు మీకేం కావాలి : సుప్రీం ఆగ్రహం!
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగాన్ని సవాలు చేస్తూ మనోహర్‌లాల్ శర్మ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రోహింటన్ నారీమన్ ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘ శర్మ అసలు మీరేం కావాలని అడుగుతున్నారు. మొత్తం లోక్‌సభ ఎన్నికలనే రద్దు చేయమంటున్నారా’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయంతో ప్రతిపక్షాలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. "What are you asking for Mr Sharma? You want us to set aside the entire Lok Sabha elections?" Justice Rohinton Nariman observed and refused to entertain ML Sharma's petition. https://t.co/B8JhjWn8FQ — ANI (@ANI) July 5, 2019 -
వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్ ఆనంద్, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
‘రాహుల్‌కు మాత్రమే అది సాధ్యం’
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. వర్కింగ్ కమిటీ వారించినా, పార్టీ శ్రేణులు వద్దని బతిమాలినా వినకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. ఇక రాహుల్ రాజీనామాపై చెల్లెలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రాహుల్ రాజీనామా నిర్ణయం సాహసోపేతమైంది. అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రాహుల్ లాంటి కొందరికే ధైర్యముంటుంది. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ నాలుగు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లేఖ ప్రతులను షేర్ చేయడంతో పాటు ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : ఓటమికి నాదే బాధ్యత) ట్విట్టర్లో హోదా తొలగింపు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ట్విటర్ ఖాతాలో ‘ఇది రాహుల్ గాంధీ అధికారిక ఖాతా/ఇండియన్ కాంగ్రెస్ సభ్యుడు/ పార్లమెంటు సభ్యుడు’ అని మాత్రమే దర్శనమిస్తోంది. Few have the courage that you do @rahulgandhi. Deepest respect for your decision. https://t.co/dh5JMSB63P — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 4, 2019 -
ఓటమికి నాదే బాధ్యత
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. వర్కింగ్ కమిటీ వారించినా, పార్టీ శ్రేణులు వద్దని బతిమాలినా వినకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానని 49 ఏళ్ల రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీల ఆ లేఖను ట్విట్టర్లో పెట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన రెండు రోజులకు తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన రాజీనామాను తిరస్కరించింది. పార్టీ శ్రేణులు రాజీనామా చేయవద్దని కోరాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ఓటమికి తాము నైతిక బాధ్యత వహిస్తామని చెప్పారు. తాను రాజీనామా చేసినందున కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీని వేయాలని రాహుల్ ఆ లేఖలో పార్టీ వర్కింగ్ కమిటీని కోరారు. కాంగ్రెస్ పార్టీకి సేవచేయడం తనకు గౌరవప్రదమన్నారు. విలువలు, ఆదర్శాలే జీవనాడులుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సేవ చేసిందని భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు. ఈ దేశానికి, పార్టీకి తాను ఎంతో కృతజ్ఞుడినన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేశా’అని రాహల్ తెలిపారు. పార్టీ పునర్నిర్మాణానికి కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. ఎన్నికల ఓటమికి అనేక మందిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని, అయితే, పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతను విస్మరించి ఇతరులను బాధ్యుల్ని చేయడం సరికాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను ప్రధాని మోదీతోనూ, ఆరెస్సెస్‌తోనూ, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతోనూ శక్తివంచన లేకుండా పోరాడానన్నారు. ‘భారత దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. అందుకే వారితో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా’అని రాహుల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ దేశాన్ని గుప్పిట్టో పెట్టుకోవాలన్న ఆరెస్సెస్ లక్ష్యం దీంతో పూర్తయిందన్నారు. బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం వల్ల దేశంలో ఊహించని స్థాయిలో హింస చెలరేగుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు జాతి మొత్తం ఏకం కావాలని, దీనికి కాంగ్రెస్ ఆయుధం అవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను పూర్తిగా సంస్కరించుకోవాలి. ప్రస్తుతం బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ప్రజల గొంతు నొక్కేస్తోంది. ప్రజావాణిని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. భారత దేశమెప్పుడూ ఒకే గొంతు కాదు..కాబోదు. అది అనేక గొంతుల సమాహారం. అదెప్పటికీ అలాగే ఉండాలి. అదే భారత మాత అసలు స్వరూపం’ అని రాహుల్ భావోద్వేగంతో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం తాను పోరాడుతూనే ఉంటానని, తన సేవలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని రాహల్ పార్టీ శ్రేణుల నుద్దేశించి అన్నారు. ‘నేను కాంగ్రెస్‌వాదిగా పుట్టాను. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం. అదెప్పటికీ నాతోనే ఉంటుంది’ అని ఉద్ఘాటించారు. ట్విట్టర్లో హోదా తొలగింపు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ట్విటర్ ఖాతాలో ‘ఇది రాహుల్ గాంధీ అధికారిక ఖాతా/ఇండియన్ కాంగ్రెస్ సభ్యుడు/ పార్లమెంటు సభ్యుడు’ అని మాత్రమే దర్శనమిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను రాజీనామా చేశా ఎన్నికల్లో మోదీతో, ఆరెస్సెస్‌తో, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా కొత్త అధ్యక్షుడిగా ఖర్గే లేదా షిండే! సుశీల్ కుమార్ షిండే (77) లేదా మల్లికార్జున ఖర్గే(76)ల్లో ఒకరు కొత్త అధ్యక్షుడయ్యే చాన్సుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన షిండే గతంలో ఓసారి కేంద్ర మంత్రిగా చేశారు. 2002లో కాంగ్రెస్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఈ ఏడాదే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనుండటం, ఆయనకు గాంధీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో షిండేను తదుపరి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు ఖర్గే కూడా పార్టీలో సీనియర్ నాయకుడే. ఆయనా గాంధీల కుటుంబానికి సన్నిహితుడే. గత లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేతగా ఆయన పనిచేశారు. ఖర్గే ప్రతిపక్షంలో ఉండి మోదీని సమర్థవంతంగా ఎదుర్కోగలడనే అభిప్రాయం ఉంది. గతంలో ఆయన ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఓ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆయనే మా నాయకుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా రాహులే మా నేత అని రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. పార్టీ కోసం ఆయన ఎంత శ్రమించారో మాకు తెలుసు. అందుకే రాజీనామాను వెనక్కు తీసుకోమని కోరుతున్నాం’ అని ఆయన అన్నారు. ‘ కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మేవారికి ఆయనే నాయకుడు. రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారు’ అని మరో నేత అజయ్ మాకెన్ అన్నారు. ఇదో కొత్త నాటకం రాహల్ గాంధీ రాజీనామా మరో కొత్త నాటకమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామాతో తమకే సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలా కాకుండా తమ పార్టీలో సంస్థాగత వ్యవస్థ పటిష్టంగా ఉందని, సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు వంటివి ఉన్నాయని మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. -
రాహుల్‌కు బుజ్జగింపులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్న రాహుల్ గాంధీని బుజ్జగించేందుకు సోమవారం కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా రంగంలోకి దిగారు. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల సీఎంలు వరుసగా అశోక్ గహ్లోత్, అమరీందర్ సింగ్, కమల్‌నాథ్, భూపేశ్ బఘేల్, వి.నారాయణస్వామిలు రాహుల్‌ను ఢిల్లీలో కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై వారు దాదాపు రెండు గంటలపాటు చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా రాహుల్‌ను వారంతా అభ్యర్థించారు. భేటీ అనంతరం గహ్లోత్ మాట్లాడుతూ ‘మేమంతా రాహుల్‌తో మనసువిప్పి మాట్లాడుకున్నాం. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల గురించి కూడా రాహుల్‌కు వివరించాం. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరాం. ఆయన మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ మాత్రమే పార్టీని నడిపించగలరని గట్టిగా నమ్ముతున్నాం’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని రాహుల్ చెప్పడం, అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. ఇటీవలే 150 మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామా చేయడం తెలిసిందే. -
విపక్షాలన్నీ కకావికలం
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ పార్టీ 303 సీట్లతో అఖండ విజయం సాధించడంతో షాక్‌కు గురైన ప్రతిపక్ష పార్టీలు ఈ పాటికి తేరుకొని పార్లమెంటులో నిర్ణయాత్మక పాత్రను పోషించాల్సిందిపోయి ఇంకా కకావికలం అవుతున్నాయి. ఇతర విపక్షాలను సమీకరించాల్సిన కాంగ్రెస్ పార్టీయే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. యూపీలో కలసికట్టుగా పోటీ చేసిన ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి బీఎస్పీ విడిపోయింది. ఒక్క ఎస్పీతోనేగాదని, ఏ పార్టీతోని భవిష్యత్తులో ఎలాంటి పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. పార్లమెంటులోనైనా బీజేపీని సమైక్యంగా ఎదుర్కొందాం, రారండోయ్ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్, వామపక్షాలు తిరస్కరించాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కుస్తీ పడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, అసహనంతో ఓటర్లను దూషిస్తున్నారు. ‘ఓట్లేమో బీజేపీకి వేస్తారు. పనులేమో నేను చేసిపెట్టాలా ?’ అంటూ ఇటీవల ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ‘మహాఘట్బంధన్’కు నాయకత్వం వహించిన తేజశ్వి యాదవ్ ఫలితాల అనంతరం పత్తాలేకుండాపోయి శనివారం నాడు ట్విటర్ ద్వారా జనంలోకి వచ్చారు. బిహార్‌లో ఎన్సెఫలైటిస్ వల్ల 150 మంది పిల్లలు మరణించడం వల్ల రాలేకపోవడం ఒక కారణమైతే కాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సిరావడం మరో కారణమని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకే కొమ్ముకాస్తోంది. గత కొంతకాలంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ సహా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. జూలై 5వ తేదీ నుంచి జరుగనున్న బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అలా జరక్కపోతే 12 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు, 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు మొన్నటికంటే చేదు ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది. -
రాహుల్ పాదయాత్ర.. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. గత నెలరోజులుగా నిస్తేజంగా మారిన పార్టీ శ్రేణుల్లో పార్టీ భవితవ్యంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగనని తేల్చి చెప్పేయడం, ఆయన స్థానంలో ఎవరు వస్తారోనన్న గందరగోళం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పదవులకు సీనియర్ నేతల మూకుమ్మడి రాజీనామాలు ఇవన్నీ ఓ రకమైన సంక్షోభానికి దారి తీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు దశలవారీగా పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీరి ముందు ఇప్పుడు మూడు ఎజెండాలే ఉన్నాయి. అవే కాంగ్రెస్ జెండాని తిరిగి ఎగురవేస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. రాహుల్ పాదయాత్ర ఏసీ గదుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్నాళ్లు మేధోమథనం జరిపినా ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. జనంలోకి వెళ్లిన వాడే నాయకుడిగా అవతరిస్తాడని, ప్రజా సమస్యలు కళ్లారా చూసినప్పుడే రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలు చేయగలరని చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అందుకే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే బాగుంటుందని ప్రతిపాదనలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాహుల్ ఎంతవరకు జయప్రకాశ్ నారాయణ, వీపీ సింగ్, చంద్రశేఖర్ మాదిరిగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలరా అన్న అనుమానాలూ ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇక రాహుల్ గాంధీ స్థానంలో అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేయాలన్నది అతి పెద్ద సమస్య. ఇప్పుడు అందరి కళ్లు రాజస్థాన్పైనే ఉన్నాయి. ఇన్నాళూ అశోక్ గహ్లోత్æ కాంగ్రెస్ పార్టీ కాబోయే అధ్యక్షుడని ప్రచారం సాగింది. ఇప్పుడు హఠాత్తుగా సచిన్ పైలెట్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఎవరికీ అప్పగించినా పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఎన్ని అసమ్మతి జ్వాలలు రేగుతాయన్న ఆందోళనలు ఉన్నాయి. పార్టీ పగ్గాలను అనుభవజ్ఞుడికి అప్పగించాలా, యువతరం చేతుల్లో పెట్టాలా అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి తగాదాను రాహుల్ ఎంతవరకు సమర్థవంతగా ఎదుర్కోగలరో చెప్పలేని స్థితి. తమిళ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఫార్ములా తరహాలో రాహుల్ గాంధీ మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని తలపోసినా అది కూడా సరిగ్గా నడిచేటట్టుగా అనిపించడం లేదు. మే 25న రాహుల్ తన పదవికి రాజీనామా చేసినా అయిదు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందుకు సిద్ధంగాలేరు. అందుకే అధ్యక్షుడి విషయంలో పార్టీ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. 2024 ప్రధాని ఫేస్‌గా ప్రియాంక ఇక ఆఖరి అంకం అంటే కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప్రియాంకమే. 2024 ఎన్నికల్ని రాహుల్ పెద్ద దిక్కుగా ఉండి నడిపించి, ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఉంది. ఈ అంశంలో ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోంది. అయితే పెద్ద దిక్కుగా రాహుల్, కొత్త అధ్యక్షుడి పనితీరు, ప్రియాంక ఎలా జనాన్ని మెప్పించగలరు అన్న అంశాలపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదనలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీపై సానుభూతి, విశ్వాసం పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం కంటే ఈ నిస్తేజ పరిస్థితులే పార్టీకి ఎక్కువ చేటు కలిగిస్తాయని సీనియర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితికి సోనియా, రాహుల్లదే బాధ్యతని, వారి అంగీకారం లేకుండా ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాటు సాధ్యం కాదని అంటున్నారు. లోలోపల ఏదో కుట్ర, డ్రామా నడుస్తోందని నేతల అనుమానం. సిసలైన నాయకుడెవరూ కూడా సంక్షోభ సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోరని తెలుగు రాజ్యసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్ ముందుగా సీడబ్ల్యూసీతోపాటు రాష్ట్ర శాఖలు, ఏఐసీసీ విభాగాలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్నారు. భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుగా ఏఐసీసీ సమావేవం ఏర్పాటు చేసి రానున్న రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని అన్నారు. ఇలా ఉండగా, రాహుల్ గాంధీయే చీఫ్‌గా కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. రాహుల్ వైదొలుగుతున్నట్లు ప్రకటించినందుకు నిరసనగానే పార్టీ నేతలంతా రాజీనామాలు చేస్తున్నారన్నారు. రాహుల్ పార్టీ చీఫ్‌గా కొనసాగాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ తీర్మానించిందని గుర్తు చేశారు. -
కాంగ్రెస్ పగ్గాలు గహ్లోత్‌కు?
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినదగ్గర నుంచి కొత్త అధ్యక్షుడెవరన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినా, పదవిలో కొనసాగాల్సిందిగా పలువురు సీనియర్లు బతిమాలినా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. దాంతో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాట మొదలు పెట్టింది. ఈ ప్రక్రియలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం ఉన్న గహ్లోత్ అధ్యక్ష పదవికి సరైన వారని నాయకత్వం భావిస్తోందని తెలిసింది. గెహ్లాట్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందన్న విపక్షాల విమర్శకు తెరదించవచ్చని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. అందుకు గహ్లోత్‌ను ఒప్పించిందని సీనియర్ నాయకుడొకరు ధ్రువీకరించారు. గహ్లోత్‌కు అధ్యక్ష పదవి ఖరారయిందని నవభారత్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న గహ్లోత్ కొద్దిసేపు రాహుల్‌తో ఏకాంతంగా సమావేశమవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగేలా చూసేందుకు నేతలు విఫలయత్నం చేశారు. రాహుల్ నిర్ణయాన్ని సోనియా వ్యతిరేకించారు. రాజీనామా చేస్తే దక్షిణాదిన పార్టీ దెబ్బతింటుందని చిదంబరం హెచ్చరించారు. అయినా రాహుల్ పట్టు వీడలేదు. పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ప్రియాంక కూడా సుముఖంగా లేరు. దాంతో కొత్త నేత ఎంపిక అనివార్యమయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న 68 ఏళ్ల గహ్లోత్‌కు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో రెండు సార్లు సీఎంగా పని చేసిన ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గహ్లోత్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసి సీఎం పదవిని సచిన్ పైలట్‌కు ఇవ్వాలని తద్వారా ఆ ఇద్దరి మధ్య విభేదాలకు తెరదించాలని అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. గహ్లోత్ ఒప్పుకోకపోతే ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీ, శశి థరూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది. కాగా, ఈ వార్తలను గహ్లోత్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, పార్టీకి నలుగురు వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. -
లోక్‌సభ స్పీకర్: ఎవరీ ఓం బిర్లా..
ఓం బిర్లా.. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశమైంది. కేవలం రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయిన బిర్లా బుధవారం 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పేరును బీజేపీ ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా సీనియర్ నేతలను స్పీకర్ పదవికి పరిగణలోకి తీసుకుంటారు. గత లోక్‌సభ స్పీకర్‌గా ఎనిమిది పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇకపై పార్టీలోనూ, చట్టసభల్లోనూ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలను బిర్లాను ఎంపిక చేయడం ద్వారా ప్రధాని మోదీ పంపారనే తెలుస్తోంది. ఎవరీ ఓం బిర్లా.. ఓం బిర్లా 1969 నవంబర్ 23న రాజస్తాన్‌లోని కోటాలో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిర్లా, తల్లి శకుంతల దేవి. బిర్లా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన వారు. ఓం బిర్లా తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా రాజస్తాన్‌లోనే పూర్తి చేశారు. 12వ తరగతి అనంతరం బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కోటాలోని కామర్స్ కాలేజీలో, అజ్మీర్‌లోని మహర్షి దయానంద సరస్వతి విశ్వవిద్యాలయంలో ఆయన చదివారు. 1991లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అమితా బిడాలీని వివాహం చేసుకున్నారు. కాలేజీలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బిర్లా భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరుకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1997 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. 2003లో కోటా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత శాంతి ధారీవాల్‌ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2008లో కోటా నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్ నేత రామ్ కిషన్ వర్మను 24 వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన మొత్తం మూడు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కోటా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సునాయాసంగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కోట నుంచి పోటీ చేసిన ఆయనను స్పీకర్ పదవి వరించింది. చురుకైన నేతగా, అప్పగించిన పనికంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద బిర్లాకు మంచి గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియయనిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న బిర్లా స్పీకర్ పదవికి అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపించడంతో ఆయనను సభాపతి పదవి వరించినట్టు తెలుస్తోంది. బిర్లాను స్పీకర్‌గా బీజేపీ ప్రతిపాదించగా ఎన్డీయే వర్గాలతోపాటు ఏఐఏడీఎంకే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్పీకర్‌గా బిర్లాకు మద్దతునిస్తున్నట్లు లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ చౌదరి తెలిపారు. స్పీకర్‌గా ఎన్నికయిన బిర్లాను ప్రధాని మోదీ సాదరంగా తీసుకువెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. మొదటిసారి లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భరాలు గతంలోనూ ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైన మురళీ మనోహర్ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తరువాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 16వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్ ఎనిమిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. -
‘ఈవీఎంల్లో గోల్మాల్ ’
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు మోసపూరితమైనవని, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల్లో 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పనిచేయని ఈవీఎంల స్ధానంలో మార్చిన ఈవీఎంలను ఏ ఒక్కరూ పరీక్షించలేదని అన్నారు. ఆ ఈవీఎంల్లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించకపోవడంతో ఈవీఎంల్లో ఓట్లు ముందస్తుంగా నిక్షిప్తం కాలేదని చెప్పేందుకు ఆధారాలు ఏంటని ఆమె ప్రశ్నించారు. తాము ఈసీని కలిసి పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని కోరతామని దీదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చాలనే ప్రయత్నాలను నిలువరిస్తామని, ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
నమ్మకంగా ముంచేశారా?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నమ్మకస్తులే మోసం చేశారన్న వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, పార్టీ వ్యూహకర్తల బృందం అసలు విషయాన్ని దాచిపెట్టి, అంతా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందంటూ రాహుల్ గాంధీని నమ్మించారని, ఫలితాలు వెలువడ్డాకా వారంతా అందుబాటులో లేకుండాపోయారని జాతీయ వార్తా పత్రిక ‘ద గార్డియన్’లో ఒక కథనం వచ్చింది. దీని ఆధారంగా ఇతర పత్రికలు,వెబ్సైట్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. అయితే, ఈ కథనం నిరాధారమని కాంగ్రెస్ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 164 నుంచి 184 సీట్లు కచ్చితంగా వస్తాయని, ప్రధాని పదవి రాహుల్ గాంధీదేనని వారు గట్టిగా చెప్పడంతో రాహుల్ నమ్మేశారని ఆ కథనం పేర్కొంది. వారి మాటలు పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ సన్నాహాలు చేసుకున్నట్టు తెలిసింది. అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, శరద్‌పవార్ తదితర నేతలకు రాహుల్ ఫోన్లు చేసి మంత్రివర్గంలో వారికి చోటు కల్పించే విషయమై చర్చలు జరిపారని తెలిసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ సీనియర్ న్యాయవాదుల తో రెండు లేఖలు రాయించుకున్నారట. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు దాదాపు పదివేల మందితో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు ఆ కథనం పేర్కొంది. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తారుమారైంది. కేంద్రంలో అధికారం చేపట్టే మాట అటుంచి కనీసం ప్రతిపక్షం హోదా దక్కడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో హతాశుడైన రాహుల్ అధ్యక్ష పదవికి రాజనామా చేస్తానని పట్టుబట్టారు. పార్టీ వ్యూహకర్తలు రాహుల్నేకాకుండా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలనూ నమ్మించారని తెలిసింది. దీనికి కారకులైన, ఎన్నికల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి, దివ్య స్పందన ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరికీ కనబడటం లేదట. దివ్య అయితే తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను మూసేశారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శక్తి యాప్‌ను నిర్వహించే చక్రవర్తి డేటా విశ్లేషకుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉందో సర్వే చేసి చెబుతానని ఆయన 24 కోట్లు తీసుకున్నారని, అయితే, దానికి సంబంధించి కనీసం ఒక్క నివేదిక ఇవ్వలేదని తెలిసింది. చక్రవర్తి తమ దగ్గర ఉంటూ బీజేపీ ఏజెంటుగా పని చేశాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ తరఫున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని చెప్పి దివ్య రూ.8 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అభూత కల్పన ఎన్నికల విషయంలో తమ విభాగం రాహుల్ గాంధీని మోసగించిందంటూ వచ్చిన కథనాలను కాంగ్రెస్ పార్టీ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి ఖండించారు. అవన్నీ అభూతకల్పనలని, నిరాధారమైనవని సోమవారం న్యూఢిల్లీలో ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. -
కాంగ్రెస్‌లో.. ‘కోమటిరెడ్డి’ కలకలం !
కాంగ్రెస్ పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి కూడా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో.. ఆయన కూడా పార్టీ వీడుతారనే చర్చ సాగుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న ఆనందం కాంగ్రెస్‌లో ఆవిరి అవుతున్నట్లే కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చిన విజయం అందించిన ఉత్సాహం పట్టుమని నెల రోజులు కూడా నిలబడలేదని సగటు కాంగ్రెస్ కార్యకర్త ఉసూరుమంటున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అపజయాన్ని దిగమింగుకుంటున్న తరుణంలోనే ఆ పార్టీ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఆయన ప్రకటన దుమారం కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం కావడం లేదు. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాజగోపాల్‌రెడ్డి అడుగులు కమలం గూటివైపు వడివడిగా పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరాలన్న నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నా.. అంతిమంగా తీసుకోబోయే నిర్ణయం మాత్రం అదే అయివుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైన తరుణంలో ఇక టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉత్తమ్, కుంతియాపై.. విమర్శలు.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకత్వమంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో సీనియర్, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి వంటి నేతలున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో, ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాగా ఉమ్మడి నల్లగొండకు పేరుంది. దానికి తగినట్లే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రెండుకు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితం అయినా.. రాష్ట్రంలో వీచిన టీఆర్ఎస్ గాలిని తట్టుకుని సాధించిన విజయం కావడంతో ఆ పార్టీ వర్గాలు కొంత సంతృప్తిగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాకే చెందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజగోపాల్‌రెడ్డి ఇటు ఉత్తమ్‌పైనా, అటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సి.కుంతియాపైనా త్రీవస్థా యిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు సరిగ్గా అదే ఇద్దరు నేతల వైఫలమ్యే రాష్ట్ర కాంగ్రెస్ దుస్థితికి కారణమని వేలెత్తి చూపారు. పీసీసీ పీఠం దక్కదని తెలిసే.. తిరుగుబాటు చేశారా? రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యం కోసం ఎప్పటి నుంచే కోమటిరెడ్డి సోదరులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆ పీఠంపై రాజగోపాల్‌రెడ్డికి ఆశ ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందని అప్పట్లో జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చిందని, కానీ, మార్పు మాత్రం జరగలేదన్న అసంతృప్తి వీరిలో ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎంపీ టికెట్ దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి జిల్లా నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ కోమటిరెడ్డి సోదరులే ముందుకు వచ్చి, రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని పోటీకి నిలబెట్టి, విజయం కోసం బాగానే ఖర్చుపెట్టారు. ఈ ఎన్నికల్లో జిల్లా సీనియర్లుగానీ, టీపీసీసీ చీఫ్‌గానీ సీరియస్‌గా తీసుకుని పనిచేయలేదన్నది రాజగోపాల్‌రెడ్డి అభియోగం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోని 31 మండలాలకు గాను 23 మండలాల్లో, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ బాధ్యతలు మీదేసుకుని పనిచేశారు. ఇంత చేసినా.. జాతీయ నాయకత్వం గుర్తించకపోవడం, పీసీసీ పదవికి సోదరుల పేర్లను పరిశీలించకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారని విశ్లేషిస్తున్నారు. అడుగులు.. కమలం గూటివైపేనా..? కాంగ్రెస్ నాయకత్వాన్ని తూర్పారా బట్టిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. అదేస్థాయిలో బీజేపీని పొగిడిన వైనం చూస్తే.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటనపై, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించ లేదు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే పార్టీ మారుతారా? అయితే, వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? లేక ఆయనా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల మదిని తొలుస్తున్నాయి. -
తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణలో బీజేపీ 20 శాతం ఓట్లు సాధించి నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో రాష్ట్రంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిం దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. పశ్చిమబెంగాల్, తెలంగాణలో పార్టీ ఆశాజనకమైన ఫలితాలు సాధించడంపై అధిష్టానం హర్షం వ్యక్తం చేసిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం గురువా రం ఢిల్లీలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించడంపై అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటిసారి జరిగిన పదాధి కారుల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలవడంతో వాటి పరిధుల్లోని 22 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించగలిగిందని వివరించారు. ఉత్తర తెలంగాణలో పుంజుకున్న పార్టీని దక్షిణ తెలంగాణకు విస్తరిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామని, దానికి ముందుగా ఈ నెల 21న రాష్ట్రస్థాయి నేతల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని అన్నారు. దేశవ్యాప్తంగా గల్లంతైన కాంగ్రెస్.. రాష్ట్రంలో కూడా కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగే స్థితి లేకుండా స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం టీఆర్ఎస్ జెండా మోస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా భావించి లోక్‌సభ ఎన్నికల్లో పట్టంకట్టారన్నారు. -
ఓటర్లకు సోనియా కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆమె రాయ్‌బరేలీ వెళ్లారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తనను ఎన్నుకున్న ప్రజలకు సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రానున్న ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని కార్యకర్తలు సోనియాను కోరినట్లు కాంగ్రెస్ నేత సంజయ్ సిన్హ్ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సొంత నియోజకవర్గంలో సోనియా పర్యటించడం ఇదే ప్రథమం. -
మెల్బోర్న్లో బీజేపీ విజయోత్సవం
మెల్బోర్న్ : లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీ అఖండమెజారిటీతో రెండోసారి విజయం సాధించడం సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఆపార్టీ మద్దతుదారులు విజయోత్సవ సభ నిర్వహించారు. వైందమ్ కౌన్సిల్ మాజీ డిప్యూటీ మేయర్ గౌతమ్ గుప్తా ఆధ్యర్యంలో మెల్బోర్న్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బీజేపీ మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. మొదటగా వందేమాతరం ఆలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఇటీవల కేరళ, కర్ణాటక, తెలంగాణలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్తలకు అంజలి ఘటించారు. అనంతరం కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అమరెందర్‌రెడ్డి కోత, మహేశ్ బద్దం, శ్రీపాల్ బొక్క, రామ్ నీత, వంశీ కొత్తల, దీపక్ గడ్డె, విశ్వంత్ కపిల ఇతర బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు. -
కుటుంబ కథా చిత్రం!
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే విశేషమే. బిహార్‌లోని లోక్‌జన్ శక్తి పార్టీ (ఎల్జీపీ) నేత రాంవిలాస్ పాశ్వాన్(73) ఈ ఘనత సాధించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే పొత్తుల్లో భాగంగా ఎల్జేపీకి ఆరు సీట్లు దక్కాయి. వాటిలో మూడు చోట్ల.. పాశ్వాన్ కుమారుడు చిరాగ్, సోదరులు పశుపతి, రామచంద్రలు పోటీ చేసి నెగ్గారు. ఈ ఎన్నికల్లో పాశ్వాన్ పోటీ చేయలేదు. అయితే, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఎన్డీయేలో ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం ఆయన రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో పాశ్వాన్‌తో కలిపి ఆయన కుటుంబంలో నలుగురు ఒకేసారి ఎంపీలుగా ఉన్నట్లవుతుంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఏకకాలంలో ఎంపీలు కానుండటం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ కెక్కడం సహా పాశ్వాన్ రాజకీయంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు నెగ్గారు. 1977 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. -
ఒక్కో ఓటుపై రూ.700
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన వ్యయం, తాయిలాలను ఇందులో లెక్కించినట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 10 నుంచి చివరి విడత ఎన్నికలు జరిగిన మే 19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర రూపాల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇందులో కలిపినట్లు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి రూ.100 కోట్లను ఖర్చు పెట్టినట్లు తేల్చింది. అంటే ఒక్కో ఓటు కోసం సగటున రూ.700 ఖర్చు పెట్టారన్నమాట. ఒకవేళ ఈసీ ఎన్నికల నిర్వహణ ఖర్చులను, ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగిస్తే ఒక్కో ఓటుపై రాజకీయ పార్టీలు రూ.583 ఖర్చుపెట్టినట్లు అవుతుంది. పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం.. మనదేశంలో రాష్ట్రాలను బట్టి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అదే అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 8,049 అభ్యర్థులు బరిలో నిలవగా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3,589 మంది పోటీ చేశారు. నిజానికి ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు చేసిన వ్యయం రూ.6,639.22 కోట్లు దాటకూడదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఖర్చు రూ.24,000 కోట్లు దాటిపోయిందని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, విలువైన లోహాలతో పాటు మత్తుపదార్థాలను సైతం తాయిలాలుగా అందించినట్లు వెల్లడైంది. కేవలం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనే రూ.1,280 కోట్ల డ్రగ్స్‌ను సీజ్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3 రెట్లు అధికంగా నగదును ఈసీ జప్తు చేసింది. ఎన్నికల రారాజు బీజేపీ.. ఈ సార్వత్రిక ఎన్నికల ఖర్చులో సింహభాగం బీజేపీదే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రూ.24,750 కోట్ల నుంచి రూ.30,250 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం. మొత్తం ఎన్నికల ప్రచార వ్యయంలో బీజేపీ వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 నుంచి 20 శాతానికి పరిమితమైంది. ధనప్రవాహం ఎక్కడిది? సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి రాకపోవడం రాజకీయ పార్టీల పాలిట వరంగా మారుతోంది. దీంతో తమకు విరాళాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పార్టీలు బయటపెట్టకపోవడంతో పారదర్శకత అన్నది కొరవడింది. దీనికితోడు ఎలక్టోరల్ బాండ్లు కూడా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాతరేశాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల చివరివరకూ 4,794 ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రియల్ఎస్టేట్, మైనింగ్, టెలికం, రవాణా రంగాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది. వీటికితోడు పలు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లు, ఎన్జీవో సంస్థలు కూడా తమ ప్రయోజనాల రీత్యా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయని చెప్పింది. ఎన్నికల వ్యయ నియంత్రణ, పారదర్శకత విషయమై 54 దేశాల్లో తాము జరిపిన అధ్యయనంలో భారత్ 31 పాయింట్లు సాధించినట్లు సెంటర్ ఫర్ స్టడీస్ తెలిపింది. అంటే భారత్ ఈ జాబితాలో దిగువ నుంచి 12వ స్థానంలో ఉందని పేర్కొంది. -
వీరి ఓటు విలువ ఇంతింత కాదయా!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికలు నిర్వహించడమంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఈ ఖర్చు 1998 నాటి నుంచి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 55 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింటుందని ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అనే స్వతంత్య్ర పరిశోధనా సంస్థ అంచనా వేసింది. 50 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఎన్నికల కమిషన్ ముందుగానే అంచనా వేసింది. ఈ మొత్తాన్ని విభజిస్తే ఒక్కో నియోజక వర్గానికి వంద కోట్ల రూపాయలు, ఒక్క ఓటుకు 700 రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి లోక్‌సభ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్నిబట్టి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు, ప్రతి అసెంబ్లీ 20 నుంచి 28 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు అర్హుడు. ఈసారి లోక్‌సభకు 8, 049 అభ్యర్థులు, అసెంబ్లీలకు 3,589 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరంతా కలిసి అధికారికంగా 6,639.22 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతి అభ్యర్థి పరిమితికి మించే ఖర్చు చేస్తారని, పరిమితంగానే ఖర్చు చేసినట్లు దొంగ లెక్కలు చూపిస్తారని అందరికి తెల్సిందే. అందుకనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఓ సందర్భంలో ‘కొందరి లోక్‌సభ జీవితం పెద్ద అబద్ధంతోనే ప్రారంభమవుతోంది’ అని చమత్కరించారు. ఈసారి అభ్యర్థులందరూ కలిసి 24వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అంచనా వేసింది. రాజకీయ పార్టీలు మరో 18 వేల కోట్లు, ఎన్నికల కమిషన్ లేదా ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలు, మీడియా–దాతలు మూడు రెండు కోట్లు, రాజకీయేతరులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు. దీనికి అదనంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ వర్గాలు మద్యం, డ్రగ్స్, ఆభరణాలు, నగదు రూపేనా అక్రమంగా రవాణా అవుతున్న రూ. 3, 475 కోట్లను పట్టుకున్నారు. 2014 ఎన్నికలకన్నా ఇది నాలుగింతలు ఎక్కువ. ఈ మొత్తంలో పాలకపక్ష బీజేపీ 45 నుంచి 50 శాతం అంటే 24 వేల కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగా, కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 శాతం వరకు డబ్బు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడానికి కారణం అంతగా డబ్బులు అందుబాటులో లేకపోవడమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకే అధిక నిధులు వచ్చిన విషయం తెల్సిందే.